చరణ్‌జీత్ సింగ్ చన్నీ: పంజాబ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతకు కాంగ్రెస్ పరిష్కారం చూపినట్లేనా

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అతుల్ సంగర్
- హోదా, ఎడిటర్, బీబీసీ పంజాబీ
చరణ్‌జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. పంజాబ్‌లోని అత్యధిక జనాభా (32 శాతం) కలిగిన దళిత వర్గానికి చన్నీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దాదాపు అన్ని ప్రధాన పార్టీలు పంజాబ్ కాంగ్రెస్ నిర్ణయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవిని వదిలిపెట్టేలా ఒత్తిడి తీసుకువచ్చారనే విమర్శలు ఒకవైపు.. అమరీందర్ తర్వాత ఈ పదవిని చేపట్టబోయేవారి విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు మరోవైపు కాంగ్రెస్‌ను చుట్టుముట్టాయి.
ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో చన్నీని తెరపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపక్షాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఫొటో సోర్స్, ANI
రాష్ట్రంలో వెలుగుచూసిన సామాజిక ఉద్యమాలు, స్వాతంత్ర్య సంగ్రామాల గురించి పంజాబీలు గొప్పగా చెబుతుంటారు.
అయితే, స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్నా దళితుల నుంచి ఒక్క వ్యక్తి కూడా సీఎం కాలేదు.
అద్-ధర్మ్ ఉద్యమం పేరుతో 1932 నుంచే దళితులు గుర్తింపు కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. అయితే, స్వాతంత్ర్యం తర్వాత హిందూ అగ్రవర్ణ కులాలు, సిక్కు ఆధిపత్య వర్గాల(జాట్ సిక్కులు)తోపాటు వెనుకబడిన వర్గాల నుంచి కూడా వచ్చిన వ్యక్తులు సీఎంలు అయ్యారు. కానీ దళితులు మాత్రం ఇక్కడ సీఎం పదవిని చేపట్టలేకపోయారు.
పంజాబ్‌లోని దళిత వర్గాలకు ఇది సంబరాలు చేసుకునే పరిణామమని చెప్పడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.
త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే, దళితుణ్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీ దళ్ ప్రకటించింది.
దీని కోసం బహుజన్ సమాజ్ పార్టీతో అకాలీ దళ్ జట్టు కట్టింది. అయితే, దళిత ముఖ్యమంత్రిగా చన్నీ మారడంతో.. నేడు అకాలీ దళ్ కొత్త మార్గాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా మారిన ఆప్ కూడా ఇలాంటి సవాల్‌నే ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, ANI
2022 పంజాబ్ ఎన్నికల్లో దళితుల కోణం..
చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో దళితులంతా గంపగుత్తంగా కాంగ్రెస్‌కు ఓటేస్తారని మనం భావించకూడదు. పంజాబ్‌లో దళిత జనాభా వాటా 32 శాతం వరకు ఉంటుంది. 117 నియోజకవర్గాల్లో 30 సీట్లను ఇక్కడ దళితులకు కేటాయించారు.
ఈ రిజర్వుడు నియోజకవర్గాల్లో కొన్నింట్లో ఎస్సీల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని చోట్ల వారి జనాభా ఒక మోస్తరు స్థాయిలో ఉంటుంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఎస్సీల జనాభా గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది.
ఈ దళిత ఓట్లను సంపాదించడమే లక్ష్యంగా దళితులకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయిస్తామని తాజాగా అకాలీ దళ్ ప్రకటించింది. అయితే, 2017 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి మొత్తం ఓట్లలో 1.59 శాతం ఓట్లే వచ్చాయి.
నిజానికి పంజాబ్‌లో దళితుల ఓటు బ్యాంకు వర్గాలుగా చీలిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన దళితులు ఒక వర్గానికి అంటూ పరిమితం కారు. స్థానిక పరిస్థితులు, అభీష్టాలు, సిద్ధాంతాలు ఆధారంగా వారు ఓటు వేస్తుంటారు. అందుకే కాన్షీరామ్, మాయావతిలు నిలబెట్టిన అభ్యర్థులు వరుసగా ఓడిపోతూ వచ్చారు. 1996లో కాన్షీరామ్ ఇక్కడ గెలిచినప్పుడు కూడా, అకాలీ దళ్‌తో బీఎస్పీ జట్టుకట్టింది.

ఫొటో సోర్స్, ANI
దళితయేతర, జాట్ సిక్కు ఓట్లు..
కులాల మధ్య ఆధిపత్య పోరు ప్రధానంగా కనిపించే ఇక్కడ చన్నీనీ ముఖ్యమంత్రిగా నియమించడంతో తమను నిర్లక్ష్యం చేసినట్లు సిక్కు జాట్లు భావిస్తారు. పంజాబ్ పవర్ పిరమిడ్‌లో గత 55ఏళ్లలో దాదాపుగా జాట్ సిక్కుల ఆధిపత్యమే కొనసాగుతోంది.
ఇక్కడి జనాభాలో జాట్ సిక్కుల వాటా 20 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. వీరిలో చాలా మంది హరిత విప్లవం నుంచి భారీగా లబ్ధిపొందారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరమైన విషయాల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతుంటుంది.
1966లో పంజాబ్ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం, జాట్ సిక్కులు.. ‘‘ఫస్ట్ ఎమాంగెస్ట్ ఈక్వెల్స్’’అనే స్థాయికి వెళ్లారు. తాజాగా మారుతున్న సమీకరణాలు, కొన్ని నెలలకే అయినా, చన్నీ ప్రభుత్వానికి సవాళ్లు విసరబోతున్నాయి. ముఖ్యంగా ఉన్నత, దిగువ మధ్య స్థాయిల్లో వీరి ప్రణాళికల అమలులో అడ్డంకులు ఎదురుకావొచ్చు.
ఇన్నాళ్లు ప్రధాన పదవుల్లో కనిపించిన తమ నాయకులు కాస్త కిందకు దిగడంతో పంజాబ్‌లోని కొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తంచేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌కు జాట్ సిక్కులు, హిందువుల్లోని అగ్రవర్ణ కులాలు దూరమయ్యే అవకాశముందని వివరిస్తున్నారు. అయితే, దీని వల్ల లబ్ధి పొందేది అకాలీ దళ్ లేదా ఆప్ లేదా ఇతర పార్టీలా? అనే విషయాన్నిఇప్పుడే చెప్పడం కష్టం.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వ వ్యతిరేకత తగ్గినట్లేనా?
అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులు చన్నీ హయాంలోనూ పనిచేయబోతున్నారు. గత కొన్ని నెలలుగా అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన వారికి నేడు చన్నీ వర్గంలో చోటు ఇస్తున్నారు.
చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా అమరీందర్ సింగ్‌తోపాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేసింది. అయితే, కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నాలుగున్నరేళ్లుగా కలిసి పనిచేసిన మంత్రులు, నాయకులపై వ్యతిరేతకను పూర్తిగా తొలగించడం అంత తేలికకాదు. వారు చేసిన ప్రజాకార్యక్రమాలకు రుజువులు, సాక్ష్యాలు చూపించడమని ప్రజలు అడుగుతారు.
మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వస్తున్న చన్నీపై కూడా ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వీరు అంచనాలు అందుకోకపోతే, ‘‘కొత్త సీసాలో పాత మద్యం’’ పోసినట్లు అవుతుంది. ఇదివరకటి పాలక వర్గంలోనూ చన్నీ ఉన్నారు. దీంతో ఆ పాలక వర్గం కంటే తమ వర్గం ఎంత భిన్నమైనదో ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆయనకు అంత సమయం అందుబాటులో లేదు.
చన్నీతోపాటు ఆయన సహచరుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఎదుట నేడు నెరవేరకుండా మిగిలిన 18 హామీల జాబితా ఉంది. ఇది కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం సిద్ధంచేశారు. అయితే, ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో.. ఈ 18 హామీలను నెరవేర్చే బాధ్యత చన్నీ, సిద్ధూలపై పడింది.
మాదక ద్రవ్యాలపై నిషేదం, ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం, ఇసుక మాఫియాకు కళ్లెం, 2014-15ల్లో పోలీసుల కాల్పుల్లో మరణించినవారికి న్యాయం తదితర అంశాలు జాబితాలో ఉన్నాయి.
ఈ అంశాలపై పనిచేస్తున్నట్లు చన్నీ ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలపై ముందుకు వెళ్తూ చన్నీ, సిద్ధూలు.. 2022 ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లగలుగుతారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- బాలాపూర్ అంటే లడ్డూయే కాదు, అక్కడ ఈ ప్రసాదాలు కూడా ప్రత్యేకమే
- వీడియో: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి, గణేశ్ నిమజ్జనం
- పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








