రావణుడు, సీత పాత్రధారులు ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది? రావణ్‌లీల ఉరఫ్ భవయ్ ట్రైలర్‌పై వివాదం

ఫొటో సోర్స్, T - SERIES/YT GRAB
'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన నటుడు ప్రతీక్ గాంధీ కొత్త హిందీ సినిమా 'భవయ్'పై వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు.
మొదట ఈ సినిమాకు 'రావణ్ లీలా' అని పేరు పెట్టారు. దానిపై నిరసనలు వెల్లువెత్తడంతో పేరు మార్చారు.
అయినప్పటికీ, వివాదాలకు తెర పడలేదు. భవయ్ ట్రైలర్‌పై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ రావణుడిని కీర్తిస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో పలువురు ఆరోపించారు.
ఇందులో రాముడిని అవమానించారని, హిందువుల మతవిశ్వాసాలను దెబ్బ తీశారని ఒక వర్గం విమర్శిస్తోంది.
దాంతో ఆదివారం ట్విట్టర్‌లో #arrestpratikgandhi, #BanRavanleela_Bhavani హ్యాష్‌ట్యాగులు ట్రెండ్ అయ్యాయి.
ఈ కథను గుజరాత్ నేపథ్యంలో చిత్రీకరించారు. అక్కడ దసరాకు పలు గ్రామాల్లో 'రామలీల' నాటకం ప్రదర్శించడం ఆనవాయితీ. ఒక్కొక్క గ్రామంలో ఈ నాటకం వెనుక కథ ఎలా ఉంటుందనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్‌కు ఇదే తొలి సినిమా.
ఇక ట్రైలర్ విషయానికొస్తే, ప్రతీక్ గాంధీ రామలీల నాటకంలో రావణుడి పాత్ర పోషిస్తూ కనిపించారు. అందులో సీత పాత్ర పోషించిన అమ్మాయితో ప్రేమలో పడతారు.

ఫొటో సోర్స్, T- SERIES/YT GRAB
డైలాగులు, చిత్రీకరణపై రేగిన వివాదం
ట్రైలర్‌లో రావణుడు, హిందూ దేవతల మధ్య సంవాదం జరిగినట్లు చూపించారు. ఈ సన్నివేశం చిత్రీకరణ, డైలాగులపై విమర్శలు వెల్లువెత్తాయి.
ట్రైలర్ చివర్లో రావణుడికి, రాముడికి మధ్య సంవాదం జరిగినట్లు చూపించారు. అందులో రావణాసురుడు, రాముడితో ఇలా అంటాడు.. "నువ్వు నా చెల్లెలిని అగౌరవపరిచావు. నేను నీ భార్యను అగౌరవపరిచాను. కానీ, మీరంతా కలిసి నా చెల్లి ముక్కు కోశారు. అయినా మీకే ఎందుకు జయజయధ్వానాలు పలుకుతున్నారు?"
దానికి జవాబుగా రాముడు "నేను దేవుడిని కాబట్టి" అని జవాబిస్తాడు.
అలాగే ట్రైలర్‌లో మరోచోట రావణుడి పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీ, సీత పాత్ర పోషించిన అమ్మాయితో "మనిద్దరి మధ్య ఏదో జరుగుతోంది" అంటాడు.
ఈ డైలాగులన్నిటి మీద వివాదాలు చెలరేగాయి.

ఫొటో సోర్స్, T - SERIES/YT GRAB
బాలీవుడ్‌లో హిందూ మతవిశ్వాసాలను కించపరుస్తున్నారనే ఆరోపణలు
రాముడిని ధర్మానికి, సత్యానికి ప్రతీకగా హిందువులు భావిస్తారు.
అయితే, ట్రైలర్‌లో రావణుడి చర్యలను సమర్థిస్తున్నట్లు ఉందని, అది హిందూ విశ్వాసాలను దెబ్బతీయడమేనని పలువురు విమర్శించారు.
బాలీవుడ్ ఎప్పుడూ హిందూమతాన్ని కించపరుస్తూనే ఉందని ఆరోపించారు.
ట్విటర్‌లో అసభ్య పదజాలం వాడుతూ అనేకమంది విమర్శించారు. వాటిని పరిశీలిస్తే ట్రోలింగ్ కోసమే ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది.
సినిమా పేరు మార్చడంపై ప్రతీక్ ఏమన్నారు?
ఈ సినిమా పేరును 'రావణలీల' నుంచి 'భవయ్'గా మారుస్తున్నప్పుడు ప్రతీక్ మాట్లాడుతూ.. "ఏ కథ అయినా నాకు ప్రేక్షకుల హృదయాలతో ముడిపడేందుకు ఒక సాధనం. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. మా టీమంతా కలిసి సినిమా పేరు మార్చాలని నిర్ణయించుకున్నాం" అని అన్నారు.
అయితే, సినిమా పేరు మారిస్తే, కొన్ని సన్నివేశాలు తొలగిస్తే సమస్య పరిష్కారం అయిపోదని విమర్శకులు అంటున్నారు.
కాగా, మరెంతోమంది ఈ సినిమా ట్రైలర్‌ను ప్రశంసిస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook/PratikGandhiOfficial
పేరు మారిస్తే పరిస్థితులు మారుతాయా?
"ఈ సినిమాలో మేం రాముడిని, రావణుడిని విశ్లేషించట్లేదు. సినిమా కథ అది కాదు. ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయంటే పేరు మార్చడానికి అభ్యంతరం లేదు" అని ప్రతీక్ పీటీఐతో అన్నారు.
"అయితే, ఇది ఒక విస్తృత సమస్యకు పరిష్కారం కాదని మాత్రం చెప్పగలను. మేం సినిమా పేరు మార్చాం. దానివలన ఇంకేమైనా మార్పులు వస్తాయా?" అని ప్రతీక్ ప్రశ్నించారు.
సినిమాకు, వాస్తవికతకు మధ్య వ్యత్యాసాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని కోరారు.
"హనుమంతుడి పాత్ర పోషించిన వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ఉంటారా? సినిమా తెరపై కథ చెప్పడమే కళాకారుడి పని. నటులకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. ప్రేక్షకులు అది మర్చిపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇదే ఈ సినిమా కథ" అని ప్రతీక్ వివరించారు.
ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర దర్శకుడు గజ్జర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, VIACOM18MOTIONPICTURES
ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదం వచ్చింది
సంజయ్ లీలా భన్సాలీ తీసిన 'రామ్ లీలా' సినిమా పేరుపై కూడా గతంలో వివాదాలు చెలరేగాయి.
రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన ఈ సినిమా పేరును వివాదాల కారణంగా 'గోలియోన్ కీ రాస్‌లీలా-రామ్‌లీలా అని మార్చారు.
ఇదే దర్శకుడు తీసిన 'పద్మావత్' సినిమా పేరుపై కూడా విమర్శలు వచ్చాయి. తొలుత పద్మావతి అని పెట్టిన పేరుని 'పద్మావత్'గా మర్చారు.
ఈ చిత్రంలో పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య కొన్ని సన్నివేశాలపై భారీ వివాదం రేగింది. తరువాత వాటిని తొలగించారు. అలాగే, ఒక పాటలో పద్మావతి పాత్రధారి దీపిక నడుం కనిపించని ఆరోపణలు వచ్చాయి. తరువాత గ్రాఫిక్స్‌తో నడుం కనిపించకుండా కవర్ చేశారు.
ఈ సినిమాపై ఎన్ని వివాదాలు వచ్చాయంటే, విడుదలకు ముందు చిత్ర దర్శకుడు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చింది.
"ఏ వర్గం మనోభావలూ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదంటూ" ప్రకటనలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: రామ మందిర వివాదం మోదీకి లాభమా? నష్టమా? - అభిప్రాయం
- ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు 40 శాతానికి పెంపు, మగవాళ్ల అవకాశాలపై ఇదెంత ప్రభావం చూపిస్తుంది?
- MPTC, ZPTC: చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ ఓటమి.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- విశాఖ ఎర్రమట్టి దిబ్బలు: వేల సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడ్డాయి, ఇప్పుడెందుకు తరిగిపోతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













