విశాఖ ఎర్రమట్టి దిబ్బలు: వేల సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడ్డాయి, ఇప్పుడెందుకు తరిగిపోతున్నాయి?

విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు వేలయేళ్ల కిందట ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.
ఫొటో క్యాప్షన్, విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

''బంగాళాఖాతంలో కొన్ని వేల సంవత్సరాల కిందట నీరు గడ్డకట్టుకుపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కరగడం ప్రారంభమైంది. ఆ సమయంలోనే సముద్రం మీదుగా వీచిన గాలులకు ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున ఎగిరి ఇసుక మేటలు వేసింది. అవే చివరకు విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలుగా ఏర్పడ్డాయి''

''ఎర్రమట్టి దిబ్బలు స్థానిక పరిస్థితుల వల్ల కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడ్డాయి. ఇటువంటివి దక్షిణాసియాలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో రెండు భారతదేశంలో ఉన్నాయి. తమిళనాడులోని టెరీ దిబ్బలు, విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు అవే. మరొకటి శ్రీలంకలో ఉంది'' అని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర రెడ్డి బీబీసీతో చెప్పారు.

భీమిలికి సమీపంలో ఉండే ఈ ఎర్రమట్టి దిబ్బల వయసు 18వేల నుంచి 20వేల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా.

భూఉపరితలంపైకి పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఈ దిబ్బలకు అడుగున బేస్‌మెంట్ ఉంటుంది.

వాటి వయసు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని జియాలజీ నిపుణులు చెబుతున్నారు.

గాలికి ఎగిరి వచ్చిన సముద్రపు ఇసుక ఎర్రమట్టి దిబ్బలుగా పరిణామం చెందాయని జియాలజిస్టులు చెప్పారు.
ఫొటో క్యాప్షన్, గాలికి ఎగిరి వచ్చిన సముద్రపు ఇసుక ఎర్రమట్టి దిబ్బలుగా పరిణామం చెందాయని జియాలజిస్టులు చెప్పారు.

మట్టి దిబ్బలా, ఇసుక దిబ్బలా?

దాదాపు 18వేల సంవత్సరాల కిందటి అంటే చివరి గ్లేసియర్ పీరియడ్ (భూతలం మంచుతో కప్పి ఉన్న సమయం)లో ఏర్పడినవే ఈ ఎర్రమట్టి దిబ్బలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటున్నా, నిజానికి ఇవి ఇసుక దిబ్బలు. సముద్రం పై నుంచి వీచిన గాలితో తీరం వద్ద మేటలు వేసిన ఇసుక దిబ్బలే ఇవి.

''జియలాజికల్‌గా ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా...మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ దిబ్బల్లోని ఇసుక మట్టి రంగులో ఉండటం వల్ల వీటిని మట్టి దిబ్బలు అనడం అలవాటైపోయింది'' అని మాజీ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

'A MONOGRAPH ON POTENTIAL GEOPARKS OF INDIA' అనే పుస్తకాన్ని రాజశేఖర్ రాశారు. అలాగే ఎర్ర మట్టిదిబ్బలపై పరిశోధనలు చేశారు.

వీడియో క్యాప్షన్, విశాఖ నగరం మధ్యలో ఓ అడవి... ఆ అడవి లోపల ఓ గిరిజన గ్రామం

ఇసుక దిబ్బలకు ఎర్ర రంగు ఎక్కడిది?

ఇసుక మేట వేసి దిబ్బలుగా ఏర్పడింది సరే, దానికి ఎరుపు రంగు ఎక్కడిది? దీనికీ శాస్త్రీయమైన కారణాలు చూపుతున్నారు భూభౌతిక నిపుణులు.

ఇసుక మేటలు వేసిన తర్వాత... సముద్రపు గాలి వీచే దిశ కారణంగా అవి దిబ్బలు (DUNES)గా రూపొందుతాయి. ఇవి ఏర్పడినప్పుడు ఇప్పుడు సముద్రపు ఇసుక ఏ రంగులో ఉందో ఆ రంగులోనే ఉండేవి.

అయితే సముద్రపు గాలి తీసుకొచ్చిన ఇసుకలో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా క్వార్ట్జ్ (quartz,) గార్నెట్ (garnet), సిల్లిమనైట్ (sillimanite), మొనజైట్ (monazite), జిర్కోన్ (zircon), హెమటైట్ (Hematite) మొదలైనవి. ఇవన్నీ కూడా ఖోండలైట్ (khondalite) ఖనిజం నుంచి వచ్చినవి. ఇవి చర్య పొందినప్పుడు ఎరువు రంగుని ఇచ్చే మినరల్స్.

''ప్రధానంగా హెమటైట్‌లో ఐరన్ ఎక్కువ ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఈ ఇసుక దిబ్బల్లోని హెమటైట్‌తో పాటు ఇతర మినరల్స్‌తో నీరు చర్యపొంది ఐరన్ కలర్ (రెడ్ కలర్) విడుదల చేస్తాయి. దాంతో ఆ ఇసుక క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది. అందుకే వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటారు" అని రాజశేఖర్ రెడ్డి వివరించారు.

ఎర్రని రంగులో విస్తరించిన దిబ్బలు
ఫొటో క్యాప్షన్, ఎర్రని రంగులో విస్తరించిన దిబ్బలు

సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ దిబ్బలు కింద నుంచి పైకి వివిధ రంగుల్లో ఉంటాయి.

''పై భాగం సముద్రపు ఇసుక రంగు, మధ్యలో లైట్ రెడ్, దిగువన మట్టి రంగు ఉంటాయి. ఇవి ఏర్పడిన కాలాన్ని(వయసును) బట్టి ఈ రంగులు వచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం ఐరన్‌కు సంబంధించిన మినరల్స్ ఉండటంతో ఎరుపు రంగు అధికంగా కనిపిస్తుంది" అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ దిబ్బలపై వర్షాలు కురవడంతో అక్కడ కార్బొనేట్ ఏర్పడి, అది దిబ్బలు వివిధ రూపాల్లోకి మారేలా చర్యలు జరుపుతుందని ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

భారీ తుపానులు, సునామీలు, సముద్రం అమాంతం ముందుకు రావడం వంటి పరిణామాలతో భారీగా చేరిన నీరు, తిరిగి వెనక్కి వెళ్లే క్రమంలో దిబ్బల మధ్య చిన్నదారులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో అవే నీటికి దారులుగా మారి ప్రస్తుతం దిబ్బల మధ్య సందులు(గల్లీలు)గా మారాయని ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

ఎర్రమట్టి దిబ్బల్లో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి.
ఫొటో క్యాప్షన్, ఎర్రమట్టి దిబ్బల్లో అనేక ఖనిజాలు ఉంటాయి.

ఎర్రమట్టి దిబ్బల వయసెంత...?

దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఎర్రమట్టి దిబ్బలున్నాయి. అయితే తమిళనాడులోని టెరీ దిబ్బలు తీరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇవి అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు.

విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు మాత్రం నగర సమీపంలో ఉండటంతో పాటు దాదాపు తీరానికి అనుకుని ఉండటంతో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దేశంలో ఉన్న 32 నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ సైట్లలో ఇది కూడా ఒకటి. దీనిని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2012లో గుర్తించింది.

ఎర్రమట్టి దిబ్బలను బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా చూస్తాం కానీ ఇవి అపురూప సంపద. వీటి భౌగోళిక చరిత్ర ద్వారా వేల సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణ మార్పులు, గాలి దిశలు, సముద్ర మట్టాల వ్యత్యాసం, వర్షపాతం వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

''నిజానికి ఎర్రమట్టి దిబ్బలపై ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. వీటిని చరిత్ర చెప్పే చిహ్నలుగా చూడాలి. ఉపరితలంపై కనిపిస్తున్న దిబ్బల కింద భాగం (బేస్ మెంట్) వయసు 18 వేల నుంచి 20 వేల సంవత్సరాలు. అదే మధ్య భాగం 6 వేలు, పై భాగం 3వేల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక భూమిలోకి చొచ్చుకుపోయిన భాగం వయసు కూడా లెక్కకట్టాల్సిన అవసరం ఉంది" అని ఆంధ్రా యూనివర్సిటీ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ సత్యపాల్ బీబీసీతో అన్నారు.

ఎర్రమట్టి దిబ్బల్ని కొందరు తవ్వి తరలించుకు పోతున్నారు.
ఫొటో క్యాప్షన్, ఎర్రమట్టి దిబ్బల్ని కొందరు తవ్వి తరలించుకు పోతున్నారు.

తగ్గిన ఆదరణ

ఇంతటి చరిత్ర ఉన్న ఎర్రమట్టి దిబ్బలు పర్యటకుల్ని, సినీ రంగాన్ని ఎంతగానో ఆకర్షించేవి. 1980, 90లలో ఇక్కడ సినిమా షూటింగులు జరగని రోజే ఉండేది కాదు. దీంతో భీమిలి బీచ్ రోడ్డు పర్యటకులు, సినీ షూటింగులతో ఎంతో సందడిగా ఉండేది. అయితే ప్రస్తుతం అది గత చరిత్రగా మారింది.

ఇక్కడున్న మట్టిని, ఇసుకను తవ్వి తీసుకుపోతున్నారు. వీటిపై కనిపిస్తున్న గునపాల దెబ్బలే దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

ఎర్రమట్టి దిబ్బలు సుమారు 12 వందల ఎకరాల్లో విస్తరించి ఉండగా, వీటిలో 292 ఎకరాలను జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. అయినా కూడా ఇక్కడ ఎటువంటి రక్షణ కనిపించదు.

పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయన్న మాట వినిపిస్తోంది.

గతంలో సినిమా షూటింగులతో సందడిగా కనిపించిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు స్తబ్ధుగా ఉన్నాయి.

ఒకప్పుడు ఎర్రమట్టి దిబ్బలను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, ఒడిశా, భోజ్‌పురి, బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన కెమెరాలు నిత్యం ఫోకస్ చేసేవి. ప్రస్తుతం కనీసం షార్ట్ ఫిల్మ్ షూటింగులు కూడా జరగడం లేదు.

చుట్టూ చెట్లు, మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎర్రమట్టి దిబ్బలు చూద్దామని వెళ్తే అవి కనిపించడం లేదు.

మట్టి దిబ్బలన్నీ ఇప్పుడు చెట్లతో నిండిపోయాయి.
ఫొటో క్యాప్షన్, మట్టి దిబ్బలన్నీ ఇప్పుడు చెట్లతో నిండిపోయాయి.

‘తొలగించారు అనుకున్నాం’

భీమిలికి వెళ్లే రోడ్డు పక్కనే ఎర్రమట్టి దిబ్బలు కనిపిస్తాయి. రోడ్డుకు అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయి. విశాఖ వచ్చే పర్యటకులు వీటిని చూడకుండా వెళ్లలేరు. అలా వెళ్తే ఆ టూర్ అసంపూర్తిగా ముగిసినట్టేనని ఫీలవుతారు. కానీ ఇప్పుడు వాటిని చూసినా కూడా అదే పరిస్థితి.

''నా చిన్నతనానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అప్పుడు రోడ్డుపై నుంచే ఎర్రమట్టి దిబ్బలు కనిపించేవి. ఇప్పుడు అవన్ని తవ్వేసిట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు చూసిన వెంటనే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలను మొత్తం తీసేశారా అనే అనుమానం వచ్చింది'' అని తూర్పు గోదావరి నుంచి వచ్చిన సందర్శకురాలు నీలిమ చెప్పారు.

ఎర్రమట్టి దిబ్బలను సంరక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
ఫొటో క్యాప్షన్, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

'సినిమా షూటింగులకు 5 ఎకరాలు'

విశాఖలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను పర్యటక రంగానికే తలమానికమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు. ఇటీవల తాను ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించానని... సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

''ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ ఈ దిబ్బలు చెట్లు, మొక్కలతో నిండిపోయాయి. అయితే వీటిని తొలగించడం కష్టమైన పనే. సినిమా షూటింగులు, పర్యాటకుల సందర్శన కోసం ఐదెకరాలను గుర్తించి అభివృద్ధి చేస్తాం. పర్యాటకులకు అనువుగా రెండు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తాం'' అని మంత్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)