ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా

ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇప్పటివరకు ఏం జరిగింది?

ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న రద్దు చేసింది.

పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని, ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని సింగిల్ జడ్జి బెంచ్ తన తీర్పులో పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టంచేసింది.

అయితే, సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు.

వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

తాజాగా ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ ఈరోజు తీర్పును వెల్లడించింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఎన్నికల ఓటింగ్

ఫొటో సోర్స్, I&PR VisakhaPatnam

డివిజన్ బెంచ్ తీర్పుతో పోలింగ్‌కు మార్గం సుగమం

పోలింగ్‌కు ముందు రోజు వరకు ఈ ఎన్నికలపై సందిగ్థం నెలకొంది. ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసులు ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

అయితే, ఎన్నికలను నిలిపేస్తూ అంతకుముందు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

28 రోజుల కోడ్ ఉండాలనేది సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని, ఈ ఎన్నికలకు కోడ్ నిబంధన వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్‍ఈసీ వాదించింది. రిట్ పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, టీడీపీ తరఫున పిటిషన్ వేయలేదని ఎస్‍ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

ఎన్నికల కోడ్‌కి కనీసం, గరిష్ట ఎన్నికల కోడ్ నిబంధన లేదన్న ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు అంగీకరించింది. మొత్తానికి పరిషత్ ఎన్నికల నిర్వహణకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దాంతో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.

మొత్త 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

ఓటేసేందుకు వస్తున్న వృద్ధురాలు

ఫలితాలు నిలిపివేత

ఆ తరువాత విచారణను కోర్టు ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడి ఎన్నికల నిర్వహణ జరగాలని కోర్టు ఆదేశించింది.

తాజాగా తుది తీర్పు వెలువడడంతో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేయబోతున్నారు.

జెడ్పీటీసీ బరిలో నిలిచిన 2092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో 19002 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)