కోవిడ్ 19 కారణంగా ఆన్‌లైన్‌కే పరిమితమైన దసరా 'రామ్‌లీల'

రాముడి పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్న మిథిలేష్ పాండే
ఫొటో క్యాప్షన్, రాముడి పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్న మిథిలేష్ పాండే
    • రచయిత, అపర్ణ అల్లూరి, బీబీసీ ప్రతినిధి
    • హోదా, ఫొటోలు: అంకిత్ శ్రీనివాస్

దసరా హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. దసరానాడు ఉత్తర భారతదేశంలో అనేకచోట్ల రామ్‌లీల పేరుతో రామాయణాన్ని నాటకంగా ప్రదర్శిస్తూ, చివర్లో పది తలల రావణాసురుడిని దగ్ధం చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయం 16 శతాబ్దంలో వారణాసి(కాశీ) లో మొదలైందని చెబుతారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘనంగా జరుపుకునే ఈ ఉత్సవంలో 22 ఏళ్ల మిథిలేష్ పాండే రామాయణంలో రాముడి పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబరంగానే ఉంది కానీ కరోనావైరస్ కారణంగా ఈ ఉత్సవాన్ని చూడ్డానికి ఎక్కువమంది రాకపోవచ్చని పాండే అంటున్నారు.

"రాముడి పాత్ర పోషిస్తున్నందుకు ఓ పక్క చాలా ఆనందంగా ఉంది, కానీ మరో పక్క ఈ నాటకాన్ని చూడ్డానికి ఎక్కువమంది ప్రేక్షకులు రారనే నిరాశ కూడా ఉంది. ఈ ఏడాది నాటకం రిహార్సల్స్ కూడా ఎప్పుడూ జరిగినట్టు జరగలేదు. భౌతిక దూరం పాటిస్తూ, అనేకమార్లు కోవిడ్ 19 పరీక్షలు చేసుకుంటూ ప్రాక్టీస్ చెయ్యాల్సి వచ్చింది" అని పాండే తెలిపారు.

ప్రతీ ఏడాదీ దిల్లీల్లో అత్యంత ఘనంగా జరిపే రామ్‌లీల ఉత్సవాన్ని ఈ ఏడాది కోవిడ్ 19 కారణంగా రద్దు చేసారు.

గతేడాది రామ్‌లీల ప్రదర్శన

మిథిలేష్ పాండే, అలహాబాద్‌లో కట్ర రామలీలా కమిటీ నిర్వహిస్తున్న నాటకంలో రాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని జరపడానికి అనుమతి పొందిన అతి కొద్ది కమిటీల్లో ఇదీ ఒకటి. వీరు గత 20 యేళ్లుగా రామ్‌లీల ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతున్నారు.

ప్రతీ ఏడాదీ ఈ నాటకాన్ని చూడ్డానికి వందలకొద్దీ ప్రేక్షకులు వస్తారు. కానీ ఈ ఏడాది 200 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ప్రసారంకోసం ప్రత్యేకంగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. కానీ అవేమంత ఉత్సాహాన్నివ్వట్లేదు అంటున్నారు మిథిలేష్ పాండే.

"ఎదురుగా వందలమంది ప్రేక్షకులు కూర్చుని చప్పట్లు కొడుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు. ఇంకా బాగా నటించాలన్న ఉత్సాహం వస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అవేమీ ఉండవు" అని పాండే అన్నారు.

రామ్‌లీల నాటక ప్రదర్శన 3 రోజులనుంచీ 30 రోజులవరకూ ఉంటుంది. మొత్తం రామాయణం అంతా ప్రదర్శించాలంటే ఎక్కువరోజులు పడుతుంది. కొన్ని ఘట్టాలు మాత్రమే ఉంటే తక్కువ రోజులు పడుతుంది. ఊర్లోవాళ్లందరూ ఈ నాటకాన్ని చూడ్డానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ప్రదర్శనకు వెళ్లగలిగే వెసులుబాటు కల్పించుకుంటారు.

గతేడాది రామ్‌లీల ప్రదర్శన

ఉత్తర ప్రదేశ్‌లోని రామనగర్‌లో జరిపే రామ్‌లీల ఉత్సవం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవం కోసం మొత్తం పట్టణాన్నే సెట్‌గా మార్చేస్తారు. రామాయణ కాలాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తారు.

ఇవే కాకుండా, ఊరూరా తిరుగుతూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే ప్రదర్శించే బృందాలు కొన్ని ఉంటాయి. కోవిడ్ 19 కారణంగా వీరంతా కూడా తమ ఉపాధి కోల్పోయారు.

28 యేళ్ల శుభం కుమార్, గత ఐదేళ్లుగా అలహాబాద్‌లో పలుచోట్ల నిర్వహించే రామలీల నాటకాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 1500 రూపాయలు సంపాదించేవారు. ఈ సంవత్సరం ఆయనకు పని లేకుండా పోయింది. సంపాదన లేకపోవడమొక్కటే బాధ కాదు అంటున్నారు శుభం కుమార్.

"ఈ పండుగ ఉత్సవాలకోసం ఎంతో ఎదురుచూసాను. ఈ ఉత్సవాల వలన నాలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎంతో భక్తితో రామ్‌లీల నాటకంలో పాత్రలు పోషిస్తాను. నాటకాల్లో నన్ను నిజంగానే దేవుడిలాగ చూస్తారు. కొందరైతే నా కాళ్లకు దండం పెడతారు. భగవంతునికి చేరువైన అనుభూతి పొందుతాను" అని శుభం కుమార్ తెలిపారు.

గతేడాది రామ్‌లీల ప్రదర్శన

దసరా ఉత్సవాల్లో భాగంగా జరిపే రామ్‌లీల నాటక ప్రదర్శనల్లో పాల్గొనే ఎంతోమంది కళాకారులు, మేకప్ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు ఈ ఏడాది తమ సంపాదన కోల్పోయారు. కొంతమందికి ఇది పార్ట్ టైం ఉద్యోగం కావొచ్చు. కొంతమంది భక్తితో, ఇష్టంతో చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా, వీళ్లంతా ఈ సంవత్సరం ఇష్టంగా, భక్తిశ్రద్ధలతో చేస్తున్న పని కోల్పోయారు. ఈ పరిశ్రమ అసంఘటిత రంగం కాబట్టి ఎంతమంది నిరుద్యోగులయ్యాలు, ఎంత నష్టం వచ్చింది అనేది లెక్కించడం కష్టమే.

రామ్‌లీల నాటకంలో మిథిలేష్ పాండే రాముడి పాత్ర పోషిస్తుంటే ఆయన పక్కన లక్షణుడి పాత్రను చుంకీ పాండే పోషిస్తున్నారు. చుంకీ పాండే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

"ఇంతకుముందు చిన్నా చితకా వేషాలేసేవాడిని. ఇప్పుడు లక్షణుడి పాత్ర వెయ్యడం నాకు ప్రమోషన్ కింద లెక్క. అధికసంఖ్యలో ప్రేక్షకులు లేకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమేకానీ ఆన్‌లైన్‌లో ఎక్కువమంది చూస్తారని ఆశిస్తున్నాం. స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నాం" అని చుంకీ పాండే తెలిపారు.

చుంకీ పాండే

అయితే, ఆన్‌లైన్‌లో ఎక్కువమంది చూస్తారని మిథిలేష్ పాండే భావించట్లేదు. ఈ ప్రదర్శన చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాలనుంచీ అనేకమంది ప్రజలు తరలివస్తారు. వారిలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయో తెలీదు. ఎంతమంది ఆన్‌లైన్‌లో చూడగలరో తెలీదు అని పాండే అంటున్నారు.

"మా కుటుంబం కూడా ఈ ఏడాది ఈ నాటక ప్రదర్శన చూడలేరు. మా ఇంట్లో పెద్దవాళ్లున్నారు. కోవిడ్ 19 కారణంగా నాటకం చూడ్డానికి వాళ్లు బయటకి రావడం రిస్కే" అని మిథిలేష్ అన్నారు.

అయితే, ఈ సంవత్సరం కరోనావైరస్ కారణంగా నాటక ప్రదర్శనలో అనుభవజ్ఞులు దూరంగా ఉండిపోవడంతోనూ, అలహాబాద్‌కు బయట ఉండడంతోనూ మిథిలేష్ పాండే, చుంకీ పాండేలాంటి యువకులకు రామ్‌లీల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం వచ్చింది.

మల్లయ్ మిశ్రా

"ఈసారి యువకులకు అవకాశం వచ్చింది. ఇదొక సానుకూల అంశంగా పరిగణించాలి" అని 45 ఏళ్ల మల్లయ్ మిశ్రా అన్నారు. ఈయన గత పదేళ్లుగా రామలీల నాటకంలో వివిధ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు.

"అయితే, ఏదీ సాధారణంగా ఉన్నట్టు అనిపించడం లేదు. అందరూ భయం భయంగా ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తునప్పుడు అది స్పష్టంగా తెలుస్తోంది" అని మల్లయ్ మిశ్రా తెలిపారు.

"కానీ, ఒకసారి పాత్రలో లీనమైపోయాక మరేదీ గుర్తు రావట్లేదు. నేరుగా వీక్షించే ప్రేక్షకులకు, ఆన్‌లైన్‌లో చూసేవారికీ కూడా మంచి అనుభూతినే ఇవ్వగలమని ఆశిస్తున్నాం" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

వీడియో క్యాప్షన్, ‘రామ్‌లీల’ చూద్దాం రండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)