Gender Pay Gap: 'భార్యల సంపాదన, భర్తల సంపాదన కన్నా ఎందుకు తక్కువ'.. కొత్త అధ్యయనం ఏం తేల్చింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ భర్తకు వచ్చినంత జీతం మీకొస్తోందా? దీనికి "లేదు" అన్నది ఎక్కువమంది మహిళల దగ్గర నుంచి వచ్చిన జవాబని ఇటీవల విడుదలైన అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది.
ఒకే కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండే వేతన అసమానతలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఇందుకోసం 45 దేశాల్లో 1973 నుంచి 2016 వరకు అందుబాటులో ఉన్న డాటాను సేకరించారు. ఈ అంశంలో అంతర్జాతీయ స్థాయిలో జరిపిన తొలి అధ్యయనం ఇదే.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో పబ్లిక్ పాలసీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ హేమ స్వామినాథన్, ప్రొఫెసర్ దీపక్ మల్ఘన్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనంలో, 28.5 లక్షల కుటుంబాల్లో 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు జంటల వేతన సమాచారాన్ని ఉపయోగించారు. ఈ డాటా మొత్తాన్ని లక్సెంబర్గ్ ఇన్‌కం స్టడీ (ఎల్ఐఎస్) సేకరించింది.
"సాధారణంగా పేదరికానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు, మొత్తం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాయి. కుటుంబంలో అందరి సంపాదనా ఒకచోట చేర్చి, సమానంగా ఖర్చుపెడతారన్నది మన భావన. అయితే, వాస్తవంలో కుటుంబంలోని వ్యక్తుల మధ్య అసమానతలు ఉంటాయి. వాటిని ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం" అని ప్రొఫెసర్ స్వామినాథన్ వివరించారు.
ఈ అధ్యయన నివేదికలో కుటుంబాన్ని "ఒక నల్ల పెట్టె" (బ్లాక్ బాక్స్)గా అభివర్ణించారు.
"మనం పెట్టెను బయట నుంచే చూస్తున్నాం. లోపలికి తొంగి చూడట్లేదు. ఒకవేళ, అలా చూసి పరిశీలిస్తే, పరిస్థితి భిన్నంగా కనిపిస్తుందా?"

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రపంచవ్యాప్తంగా వేతనాల్లో జెండర్ అసమానతలు
భారతదేశంలో లేబర్ ఫోర్స్‌లో జెండర్ అసమానతలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య తక్కువే. వారిలో ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఇంకా తక్కువ.
ఈ అంశంలో మిగతా దేశాల్లో అసమానతలు ఎలా ఉన్నాయన్నది కూడా పరిశీలించాలనుకున్నారు ఈ అధ్యయన పరిశోధకులు.
"ఉదాహరణకు నార్డిక్ దేశాల్లో (ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ దేశాలు) జెండర్ సమానత్వానికి పెద్దపీట వేస్తారు. ఆ దేశాల్లో కుటుంబాల్లోని అసమానతలు ఎలా ఉన్నాయి? భార్యాభర్తల మధ్య పని, సంపాదన సమానంగా ఉన్నాయా? వీటిని పరిశీలించాలనుకున్నాం" అని ప్రొఫెసర్ స్వామినాథన్ చెప్పారు.
మొత్తంగా అసమానతలు, కుటుంబంలో అసమానతల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.
అన్ని దేశాల్లోనూ, కాలానికి అతీతంగా, ధనిక, పేద కుటుంబాల్లో కూడా జెండర్ అసమానతలు కొనసాగుతున్నయని ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.
"ఇటీవలి డాటాను పరిశీలిస్తే, ఏ దేశంలో కూడా..అంటే చాలా అభివృధి చెందిన దేశాల్లో, అత్యంత ధనిక వర్గాల్లో కూడా భార్యల సంపాదన, భర్తల సంపాదన కన్నా ఎక్కువగా ఉన్న దాఖలాలు లేవు" అని ప్రొఫెసర్ మల్ఘన్ చెప్పారు.
"అతి తక్కువ జెండర్ అసమానతలు ఉన్న నార్డిక్ దేశాల్లో కూడా సంపాదనలో మహిళల వాటా 50% కన్నా తక్కువగా ఉందని మా పరిశోధనలో తేలింది" అని మల్ఘన్ వెల్లడించారు.
భార్యల సంపాదన తక్కువగా ఉండడానికి కారణాలు?
మహిళల సంపాదన తక్కువగా ఉండడానికి కారణాలు సార్వత్రికంగా ఉన్నాయి. పురుషులే ప్రధానంగా ఉద్యోగం చేసి సంపాదించేవాళ్లు, మహిళలు ఇంటిపట్టున ఉండి కుటుంబాన్ని చూసుకునేవారు అన్నది సంప్రదాయంగా వస్తున్న భావన.
ఒకవేళ మహిళలు ఉద్యోగం చేసినా, పిల్లలు పుట్టిన తరువాత ఉద్యోగానికి స్వస్తి చెప్పడమో లేదా కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవడమో చేస్తుంటారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వేతనాల్లో జెండర్ అసమానతలు ఉన్నాయన్నది వాస్తవం. ఇంట్లో పనులు, కుటుంబాన్ని సంరక్షించడం మొదలైనవాటిని బాధ్యతగా చూస్తారే తప్ప వాటికి జీతం ఇవ్వరు.
మహిళలు, మొత్తం సమయంలో 76.2 శాతాన్ని ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలకు కేటాయిస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) 2018లో విడుదల చేసిన ఒక రిపోర్ట్ తెలిపింది.
ఇది, పురుషులు ఇంటి పనులకు కేటాయించిన సమయం కన్నా మూడు రెట్లు అధికం.
"మహిళలు ఉద్యోగాల్లోకి ప్రవేశించి, రాణించలేకపోవడానికి ప్రధాన కారణం జీతం లేకుండా చేస్తున్న ఇంటి పనులు, కుటుంబ సంరక్షణ" అని ఈ రిపోర్ట్ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పర్యవసానాలు ఏమిటి?
మహిళలు తక్కువ వేతనం పొందడం అనేది ఆర్థికపరంగానే కాకుండా, కుటుంబంలో ఇతర అసమానతలు పెరగడానికీ దోహదం చేస్తుందని, దీనివల్ల, ఎప్పుడూ మహిళలపై చిన్నచూపే ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
"ఇంటి బాధ్యతల్లో మహిళ పోషిస్తున్న పాత్ర కంటికి కనిపించదు. డబ్బులు కంటికి కనిపిస్తాయి. కాబట్టి, కుటుంబంలో భార్య డబ్బు సంపాదించి తెచ్చి పెడితే, ఆమెకు ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. కుటుంబంలో ఆమె విలువ పెరుగుతుంది. ఆమె మాటకు గౌరవం ఉంటుంది" అని ప్రొఫెసర్ స్వామినాథన్ అన్నారు.
"సంపాదన మెరుగ్గా ఉంటే ఆమె మాట చెల్లే పరిస్థితి ఉంటుంది. గృహ హింస కేసుల్లో, ఆ బంధంలోంచి బయటకు రాగలిగే ధైర్యం వస్తుంది" అన్నారామె.
అంతే కాకుండా, మహిళలకు తక్కువ సంపాదన ఉండడం, దీర్ఘకాలంలో వారి ఆర్థిక భద్రతపై ప్రభావం చూపిస్తుంది. తక్కువ వేతనం వస్తే తక్కువే పొదుపు చేస్తారు. కూడబెట్టుకునే ఆస్తి పెద్దగా ఏమీ ఉండదు.
అలాగే పెన్షన్ పాలసీలు ఆదాయంతో ముడిపడి ఉంటాయి కాబట్టి వృద్ధాప్యంలో అవీ తక్కువగానే వస్తాయని మల్ఘన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
దశాబ్దాల్లో పరిస్థితి కాస్త మెరుగుపడింది
పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, ఈ అధ్యయన ఫలితాల్లో ఓ ఆశాకిరణం కూడా కనబడింది. 1973 నుంచి 2016 మధ్యలో కుటుంబాల్లోని అసమానతలు 20 శాతం తగ్గాయని తేలింది.
"ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు లేబర్ ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం కూడా పెరిగింది. చాలా దేశాల్లో మహిళల పురోగతికి దోహదపడే విధానాలను అమలు చేయడం కూడా అసమానతలు తగ్గడానికి కారణం. సమాన వేతనం, సమాన విధులు కోరుతూ ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా నాలుగు దశాబ్దాల్లో వేతన అసమానతలు తగ్గడానికి దోహదపడ్డాయి" అని మల్ఘన్ తెలిపారు.
అయితే, దశాబ్దాలుగా వేతన అసమానతల్లో తరుగుదల ఉన్నప్పటికీ, ప్రస్తుత స్థాయిలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని, ఈ అంతరాలు ఇంకా చాలా తగ్గాలని ఆమె అన్నారు.
"ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. జీతం లేకుండా ఇంటి పని చేస్తూ, కెరీర్ కొంత నష్టపోయిన మహిళలకు కంపెనీలు తగినన్ని ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కాబట్టి మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే.. మహిళలు చేస్తున్న పనికి గుర్తింపు ఉందా? కుటుంబానికి, పిల్లలకు అనుకూలమైన విధానాలు ఉన్నాయా? అలాగే, ఇంటి పనుల్లో సమానంగా పాలుపంచుకునేలా మగపిల్లలను పెంచాలి"
"ప్రభుత్వాలు, సమాజాలు చేయాల్సింది చాలా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండాల్సిన అవసరం లేదు" అని మల్ఘన్ అభిప్రాయపడ్దారు.
ఇవి కూడా చదవండి:
- 100 మంది మహిళలు: కంపెనీ లాభాలకూ ఆడవాళ్లకూ ఏంటి సంబంధం?
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు
- నాగచైతన్యతో విడాకులు.. సమంతపైనే రూమర్లు, విమర్శలు ఎందుకు? వివాహ బంధాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళదేనా?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
- సౌదీ అరేబియా: మహిళలకు స్వతంత్రంగా ప్రయాణించే హక్కు కల్పిస్తూ ఆదేశాలు
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- ‘రాజకీయ నాయకులూ ‘కళా పోషకులే’.. కానీ వారి సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు’
- సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
- ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
- ఏది అశ్లీలత? ఏది లైంగిక స్వేచ్ఛ?
- ఈ ఎనిమిది అద్భుత ఆవిష్కరణలు మహిళలు అందించినవే..
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
- పిల్లల మీద లైంగిక అకృత్యాలను ప్రేరేపించే వెబ్ సైట్లను హోస్ట్ చేస్తున్న దేశాలేవి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








