‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’

ముగ్ధ కొడుకు మాధవ్‌తో కలిసి
ఫొటో క్యాప్షన్, ముగ్ధ కొడుకు మాధవ్ తో కలిసి
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముగ్థ కల్రాకు ఆ ఆలోచన రావడం మొదలు, ఇక "ఆటిజమ్ విలేజ్' వాతావరణంలో ఉండాలని అనుకోలేదు. అక్కడామె ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో, వారి తల్లితండ్రులతో, థెరపిస్టులు, వైద్యుల మధ్యలో గడుపుతూ ఉండేవారు.

ఆమె కొడుకు మాధవ్‌కి ఆటిజం అని తెలిసినప్పటి నుంచీ ఆ పరిసరాలే ఆమె ప్రపంచంగా మారాయి. ఆటిజం ఉన్న వ్యక్తులు ప్రపంచంతో వ్యవహరించే తీరు, మాటలు భిన్నంగా ఉంటాయి.

మాధవ్‌కి మూడేళ్లు ఉండగా, ఆ అబ్బాయి దృష్టి మాట్లాడుతున్నప్పుడు మరెక్కడో ఉండటాన్ని నానమ్మ గమనించారు. నెమ్మదిగా ఆ అబ్బాయి మాట్లాడటం తగ్గిపోయింది. సైగలకే పరిమితమయ్యాడు.

తన మాటలన్నీ అవసరానికి తగినట్లే ఉంటాయి అనే ముగ్థ చెప్పారు. " తనకు ఏమైనా తినడానికి ఇష్టం లేకపోతే వద్దని చెబుతాడు. కానీ, ఎక్కువగా మౌనంగానే ఉంటాడు" అని చెప్పారు.

"ఏదైనా నొప్పితో బాధపడుతున్నప్పుడు నా చేతిని తన పొట్ట దగ్గర పెట్టి ఆ.. ఓఓఓ...ఆ.. అంటూ శబ్దం చేస్తాడు.

ఒక తల్లిగా ఆ శబ్దం వెనుకున్న అర్థాన్ని తెలుసుకోగలగాలి" అని అన్నారు.

మాధవ్ చిన్నప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడేవాడు. "ఆగకుండా ఏడ్చేవాడు" అని కల్రా చెప్పారు.

దాంతో, ఆమె మాధవ్ ప్రవర్తన గురించి ఒక డైరీ రాయడం మొదలుపెట్టారు. ఎక్కువ శబ్దాలు వచ్చినా, ఎక్కువ రంగులు కనిపించినా ఉద్రేకంగా అయ్యేవాడు.

ఆమె ఆటిజమ్ పిల్లల తల్లితండ్రులతో కూడిన గ్రూపులను కూడా సంప్రదించారు. దాంతో, ఆమె నిలదొక్కుకోవడానికి వీలయింది. కానీ, ఆమె కొడుకుకు ఇంకేదో కావాలని అనిపించింది.

"ఆటిజం పిల్లలున్న తల్లితండ్రులందరి భయం ఒకటే. "మేం చనిపోయాక పరిస్థితి ఏంటి?" అని ఆమె అన్నారు.

"ఈ ప్రపంచం నాకూ, నా కొడుకుకూ కూడా ఇతరులకున్నట్లే ఉండాలని కోరిక. అప్పటి నుంచీ నేను తనను బయటకు తీసుకుని వెళ్లడం మొదలుపెట్టాను. అందరం కలిసేవాళ్లం. తన జీవితం ముందుకు సాగేందుకు అదొక్కటే మార్గం" అని అన్నారు.

నాట్ థట్ డిఫరెంట్ కామిక్ పుస్తకం
ఫొటో క్యాప్షన్, నాట్ థట్ డిఫరెంట్ కామిక్ పుస్తకం

కానీ, చాలా మందికి అనేక ప్రశ్నలున్నాయి. ముఖ్యంగా పిల్లలకు. మాధవ్ మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండటం స్పష్టంగా తెలిసేది. దాంతో, ఇతరులు ఇబ్బందిగా భావిస్తూ ఉండేవారు.

"ఉదాహరణకు తల కొట్టుకోవడం లేదా తనని తాను ప్రేరేపించుకునే విధంగా ప్రవర్తించడం, తనను తాను ప్రశాంతంగా చేసుకునేందుకు వేళ్ళను తరచుగా రుద్దుకోవడం లాంటివి చేసేవాడు.

"మాధవ్‌కి 11 సంవత్సరాలు. కానీ, తన బ్రెయిన్ మాత్రం ఆరేళ్ళ బాలుడిలాగే ఆలోచిస్తుంది. ఎక్కువ మాట్లాడడు. తన ప్రపంచంలో తానుంటాడు" అని వివరించారు ముగ్థ.

మాధవ్ స్పెషల్ నీడ్స్ పిల్లలుండే స్కూల్‌కి వెళ్ళేవాడు. కానీ, కోవిడ్ మహమ్మారి సమయంలో చదువు ఆన్‌లైన్ కు మారడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దాంతో, మాధవ్ తల్లితండ్రులు హోమ్ స్కూలింగ్ ఎంచుకున్నారు.

భారతీయ సమాజంలో ఆటిజం పట్ల చాలా అనుమానాలున్నాయి. దాంతో, ఆటిజంతో బాధపడేవారు ఇతరులతో కలవడం కష్టమైపోతుంది.

దీని గురించి అవగాహన లేకపోవడం కూడా ఈ విషయం పట్ల నిర్లక్ష్యాన్ని పెంచింది.

"మాతో ఎందుకు ఆడుకోడు" అని మాధవ్ కజిన్స్ అడుగుతూ ఉండేవారు. "తన చెవులను చేతులతో ఎందుకు మూసుకుంటాడు? మాధవ్ వారి కళ్ళల్లోకి చూడకపోవడం కానీ, మాట్లాడటం కానీ చేయకపోవడంతో, మాధవ్‌కి పొగరని అనేవారు" అని కల్రా చెప్పారు.

ఈ అంశానికి సంబంధించి అంతులేని ప్రశ్నలున్నాయి. దాంతో ఆ ప్రశ్నలన్నిటికీ కల్రా ఒక కామిక్ పుస్తకం ద్వారా సమాధానం చెప్పాలని అనుకున్నారు.

"నాట్ దట్ డిఫరెంట్" అనే పేరుతో వచ్చిన ఈ కామిక్ పుస్తకంలో మాధవ్ స్పెషల్ నీడ్స్ బడికి కాకుండా సాధారణ బడికి వెళ్లాలనే ఊహను చిత్రీకరించారు.

"ఈ కామిక్ పుస్తకంలో ఉన్న న్యూరో డైవర్స్ పాత్రలో మాధవ్ పాత్రను చిత్రీకరించారు".

నాట్ థట్ డిఫరెంట్ కామిక్ పుస్తకం
ఫొటో క్యాప్షన్, నాట్ థట్ డిఫరెంట్ కామిక్ పుస్తకం

"తనను ఎందుకు దాచాలి? తన అనుభవానికి ఒక గొంతునివ్వాలని అనుకున్నాను. మీరు బయటకు వ్యక్తపర్చకపోతే, సహానుభూతి కూడా లభించదు. ప్రజలు తమంతట తామే ముందుకొచ్చి కలవరు" అని ఆమె అన్నారు.

ఆటిజం కింద పరిగణించే డిస్లెక్సియా, డిస్‌ప్రాక్సియా ఏడిహెచ్ డి, ఇతర నరాల సంబంధిత సమస్యలున్న వారిని న్యూరో డైవెర్ జెన్స్ లేదా న్యూరో డైవర్సిటీ లక్షణాలతో బాధపడేవారిగా చెబుతారు.

అయితే, కల్రా రాసిన కామిక్ అర్ధం చేసుకునే స్థాయి మాధవ్ కు లేదు. "అందులో పొందుపరిచిన హాస్యం, విషయాలను గ్రహించే సామర్ధ్యం తనకు లేదు" అని కల్రా చెప్పారు.

మాధవ్ టీచర్లిద్దరు మూడక్షరాల పదాలను అర్ధం చేసుకోవడం, ప్రాధమిక కలిపివేతలు, తీసివేతలు చేయడం, ఏది మునిగిపోతుంది, ఏది కరిగిపోతుందనే లాంటి విషయాలతో పాటు కరెన్సీ నోట్లను గుర్తించడం నేర్పారు.

ఈ కామిక్ పుస్తకం కోసం కల్రా మరొక ముగ్గురు మహిళలతో కలిసి పని చేశారు. బూకోస్మియా అనే పబ్లిషింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు నిధి మిశ్రా, పిల్లల బొమ్మలు వేసే ఆయుషీ యాదవ్ అనే ఇల్లస్ట్రేటర్, పిల్లల పుస్తకాల రచయత అర్చన మోహన్‌తో కలిసి పని చేశారు

ఈ ప్రాజెక్టుకు ముందు, మాధవ్ లాంటి పిల్లలతో ఎప్పుడూ గడపలేదని ఆయుషీ యాదవ్ చెప్పారు.

సాధారణంగా ఆమె వేసే ఇల్లస్ట్రేషన్లు విషయాన్ని కాస్త ఎక్కువ చేసి చూపిస్తాయి. ఉదాహరణకు, నవ్వుతున్నట్లు చూపించేందుకు పళ్ళు అన్నీ బయటకు వచ్చినట్లు, గొంతు లోపలి నుంచి కూడా భాగాలు బయటకు వచ్చినట్లు చిత్రాలను గీస్తారు.

"కానీ, మాధవ్ చిత్రాలు వేయడం భిన్నమైన అనుభవాన్నిచ్చింది" అని యాదవ్ చెప్పారు.

అందరికీ నచ్చే పాత్రను ఎలా చిత్రీకరించాలనే ప్రశ్నను వేసుకున్నారు. చిన్న పిల్లాడు నిస్తేజంగా లేదా పొగరుగా ఎలా చిత్రికరించాలోననే ఆందోళన కలిగినట్లు ఆమె చెప్పారు.

కల్రా మాధవ్ ఫోటోలను ఆ బృందానికి పంపేవారు. జూమ్ కాల్స్‌లో అబ్బాయి గదిని చూపించేవారు. పుస్తకంలో పొందుపరిచేందుకు కొన్ని సంఘటనలను వారితో షేర్ చేసుకునేవారు.

ఉదాహరణకు, మాధవ్ కి బిగ్గరగా వినిపించే శబ్దాలు ఇష్టం లేక చెవులు మూసుకోవడాన్ని ఒక కామిక్ వివరిస్తుంది.

ఈ విషయం కల్రాకు కూడా మాధవ్ ఆరవ పుట్టిన రోజప్పుడు తెలిసింది.

దాంతో, మాధవ్ పుట్టిన రోజు నాడు సీలింగ్‌ను హీలియం బెలూన్లతో నింపడం, తనకిష్టమైన వంటలు వండటం. లేదా ఒకరిద్దరు స్నేహితులతో జూకి వెళ్లడం లాంటివి చేయడం మొదలుపెట్టారు.

కానీ, మాధవ్ కథను చెప్పడం అంత సులభం కాలేదు.

ఆమె ప్రతిపాదన చాలా సార్లు తిరస్కారానికి గురయింది. చాలా ప్రచురణ సంస్థలు ఈ ప్రచురణలో ఆసక్తి చూపించలేదు. ఇది చాలా బోర్ కొట్టే అంశంగా పరిగణించారు. ఎవరూ ఈ అంశంతో కనెక్ట్ అవ్వరని భావించారు.

కానీ, మిశ్రా మాత్రం ఒక అవకాశం తీసుకోవాలని అనుకున్నారు.

ఒక ఆటిజమ్ పిల్లాడిని పెంచడం గురించి తన అనుభవాలను పంచుకోవడం తన అభిప్రాయాలను బలపరుచుకునేలా చేసిందని కల్రా భావించారు.

ఆమె ఇంటర్నెట్, బ్లాగ్, యూట్యూబ్ చానెల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చర్చలు నిర్వహిస్తారు.

దాంతో, ఆమె ప్రతికూలతను సులభంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు.

2019లో మాధవ్‌కి మొదటి సారి ఫిట్స్ (మూర్ఛ) వచ్చాయి. దాంతో, తనను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. డాక్టర్లు ఇచ్చిన మందులతో కుదుటపడ్డాడు.

"అప్పటి నుంచీ మాధవ్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, తిరిగి ఎప్పుడైనా ఫిట్స్ వస్తాయేమోననే భయం ఉంది" అని కల్రా చెప్పారు.

కొంత సమయం పట్టింది కానీ, భయంతో కాకుండా సంతోషాన్ని ఆశిస్తూ జీవించేందుకు ఆమె తనను తాను మలచుకున్నట్లు చెప్పారు

ప్రేమించి, అర్థం చేసుకోగలిగే ప్రపంచంలో మాధవ్ ని వదిలిపెట్టేందుకు నాకు సాధ్యమైనంత చేస్తున్నాను. ప్రేమించకపోయినా, కనీసం తనను అర్థం చేసుకుని, తనను తనలా ఉండనివ్వగలిగే ప్రపంచం కావాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)