ఆస్ట్రేలియా: 18 రోజుల తర్వాత తాళం వేసి ఉన్న ఇంట్లో దొరికిన నాలుగేళ్ల చిన్నారి

నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్

పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో తప్పిపోయిన నాలుగేళ్ల పాప, 18 రోజుల తరువాత క్షేమంగా దొరికింది.

తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో పాప దొరికిందని అధికారులు తెలిపారు.

అక్టోబర్ 16న కార్నర్వన్ పట్టణానికి సమీపంలో ఉన్న క్యాంప్‌సైట్‌లో తమ గుడారం నుంచి తప్పిపోయింది నాలుగేళ్ల క్లియో స్మిత్.

అప్పటి నుంచి పాప కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ కేసులో 36 ఏళ్ల ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఫోరెన్సిక్ ఆధారాలను అనుసరించి పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్నర్వన్‌లోని ఓ ఇంట్లో గాలించారు.

"ఒక గదిలో చిన్నారి క్లియో కనిపించింది. అధికారుల్లో ఒకరు పాపను ఎత్తుకుని 'నీ పేరేమిటి?' అని అడిగారు. 'నా పేరు క్లియో' అంది ఆ పాప" అని డబ్ల్యూఏ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కల్నల్ బ్లాంచ్ ఒక ప్రకటనలో తెలిపారు.

పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

"మా కుటుంబం పరిపూర్ణమైంది" అంటూ పాప తల్లి ఎల్లీ స్మిత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

పాపకు వైద్య సహాయం అందుతోందని కమిషనర్ క్రిస్ డాసన్ తెలిపారు.

కస్టడీలో ఉన్న వ్యక్తికి స్మిత్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై ఇప్పటివరకు కేసు పెట్టలేదని అధికారులు వెల్లడించారు.

"ఇది చాలా అద్భుతమైన, ఉపశమనం కలిగించే వార్త. ఆస్ట్రేలియా ప్రజలు ఎంతో సంతోషిస్తుంటారు" అని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు.

"అంత చిన్న పాప తప్పిపోయి 18 రోజుల పాటు కనిపించలేదంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ, పాప దొరుకుతుందన్న ఆశ వీడలేదు" అని కమిషనర్ అన్నారు.

క్లియో తల్లి ఎల్లీ స్మిత్, తన భాగస్వామి జేక్ గ్లిడన్‌

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, క్లియో తల్లి ఎల్లీ స్మిత్, తన భాగస్వామి జేక్ గ్లిడన్‌

ఈ కేసులో ఇప్పటివరకు తెలిసిన విషయాలేంటి?

సెలవులు గడపడానికి క్లియో కుటుంబం క్వాబా బ్లోహోల్స్‌కు వెళ్లారు. అక్కడ క్యాంపింగ్ గ్రౌండ్‌లో ఉన్న గుడారాల్లో బస చేశారు.

అక్టోబర్ 16న అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 నుంచి తెల్లారి 6.00 మధ్యలో పాప తప్పిపోయింది.

మాక్లియోడ్‌లో ఉన్న ఈ మారుమూల ప్రాంతం, పెర్త్ నుంచి దాదాపు 900 కి.మీ దూరంలో ఉంది.

సముద్ర గుహలు, మడుగులు, కోరల్స్‌తో నిండి ఉన్న ఈ ప్రాంతం పర్యటకులను ఆకర్షిస్తుంది.

ఆ రాత్రి తమ గుడారంలో సోదరి కాట్ పక్కనే క్లియో నిద్రపోయింది. అదే గుడారంలో మరో గదిలో నిద్రిస్తున్న క్లియో తల్లి తెల్లవారుజామున లేచి చూసేసరికి పాప కనిపించలేదు. గుడారం తలుపు తెరిచి ఉంది.

క్లియో తనంతట తాను బయటకు వెళ్లలేదని, తనను ఎవరో అపహరించారని పాప తల్లి బలంగా వాదించారు.

దాంతో అక్కడి అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పెర్త్ నుంచి వంద మంది పోలీసు అధికారులు కూడా వచ్చి పాప కోసం వెతికారు. నిఘా విమానాలను ఉపయోగించి మూల మూలలా వెతికారు.

క్వాబ్బా బ్లోహోల్‌

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, క్వాబా బ్లోహోల్‌ తీర ప్రాంతం

పాప ఆచూకీ చెప్పిన వారికి 5.6 కోట్ల రివార్డ్

క్లియో ఆచూకీ తెలియజేసినవారికి 5 కోట్ల 60 లక్షల రూపాయల నగదు బహుమతిని అధికారులు ప్రకటించారు.

ఈ కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నగదు బహుమతిని ప్రకటించిన తరువాత అనేకమంది ఔత్సాహికులు పాప జాడ వెతికేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఒక సూది అంత సమాచారం కోసం ఎంతో గాలించాల్సి వచ్చిందని కమిషనర్ తెలిపారు.

చివరకు, ఒక చిన్న ఆధారం దొరకడంతో పాపను వెతికి పట్టుకోగలిగామని నెట్‌వర్క్ సెవెన్ మీడియాతో చెప్పారు.

పాప దొరికిన ఇంట్లో ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న దుకాణంలో డైపర్లు కొంటుండగా చూశామని పొరుగున ఉన్నవారు చెప్పారు.

డైపర్లు ఎందుకు కొంటున్నారన్న విషయం ఆలోచించలేదని అన్నారు.

"18 రోజుల పాటు చాలా కంగారు పడ్డాం" అని కార్నర్వన్ షైర్ ప్రెసిడెంట్ ఎడీ స్మిత్ టుజీబీ రేడియోకు తెలిపారు.

"ఎంతో అనుభవం ఉన్న గూఢచారులు కూడా ఆందోళన చెందారు. పాప దొరికాక ఊపిరి పీల్చుకున్నారు. ఇదో అద్భుతం" అని డిప్యూటీ కమిషనర్ 6పీఆర్ రేడియోకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)