ఒకప్పుడు కేసీఆర్‌ కుడిభుజం.. ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం..

ఈటల రాజేందర్

ఫొటో సోర్స్, Eatala Rajendar/Facebook

ఫొటో క్యాప్షన్, ఈటల రాజేందర్

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం ఖరారు అయ్యింది.

రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలో చేరి ఎన్నికల బరిలో దిగారు.

రాజేందర్ సొంతూరు హన్మకొండ జిల్లాలోని కమలాపురం. ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది.

1984లో మసాబ్ ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో పదో తరగతి చదివారు.

57 ఏళ్ల రాజేందర్ వామపక్ష రాజకీయ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి. ముదిరాజు కులానికి చెందిన ఆయన, రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు.

వీరు ఇరువురూ పీడీఎస్‌యూలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ప్రేమించుకుని, తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు నితిన్ రెడ్డి, కుమార్తె నీతారెడ్డి సంతానం.

భార్య జమునతో ఈటల రాజేందర్
ఫొటో క్యాప్షన్, భార్య జమునతో ఈటల రాజేందర్

టీఆర్ఎస్‌లో ప్రస్థానం..

రాజేందర్‌ మొదటి నుంచీ టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కోళ్ల ఫారం, కోళ్ల హాచరీల రంగంలో రాణించారు.

ఆయనపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయిదు కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. వీటిల్లో చాలావరకు తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులే.

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కుటుంబ సభ్యుల తరువాత టీఆర్ఎస్‌లో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి.

టీఆర్ఎస్‌ శాసనసభ పక్షం నాయకుడిగానూ వ్యవహరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలుత ఆర్థిక మంత్రిగాను, తరువాత వైద్య ఆరోగ్య మంత్రిగానూ వ్యవహరించారు.

2002లో ఆయన తెరాసకు జనరల్ సెక్రటరీగా పనిచేశారు.

2004 నుంచి 2009 వరకు కమలాపురానికి ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2021 జూన్ వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యలు..

అసెంబ్లీలో తెలంగాణపై చర్చ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. 2009కి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేసి 40 చోట్ల ఓటమి పాలయ్యిందంటూ.. "తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతోందా రాజేంద్రా నీకు" అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని, వారిలో ఈటల రాజేందర్ కూడా ఒకరని, కానీ, వీళ్లు చేరలేదని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.

2004, 2008 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

2009, 2010, 2014, 2018 సంవత్సరాలలో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.

ప్రతీసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తూ వచ్చారు.

భూ ఆక్రమణ ఆరోపణలు.. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్..

2021లో రాజేందర్ స్థాపించిన సంస్థ జమునా హాచరీస్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి.

దాంతో, కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు.

తరువాత జూన్ 4న పార్టీకి, జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజేందర్.

జూన్ 14న దిల్లీలో బీజేపీలో చేరారు.

2014 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ఆ పదవికి రాజీనామా చేశారు.

కేసీఆర్‌తో ఈటల రాజేందర్

‘ఈటల నా కుడి భుజం..’ - కేసీఆర్

ఒకానొక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి నెంబర్ 2 ఈటల రాజేందర్ అని భావించేవారు.

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తెలంగాణలో, టీఆర్ఎస్ పార్టీలోని ధనవంతులైన నాయకుల్లో రాజేందర్ ఒకరు.

2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈటల తన కుడి భుజం అని అభివర్ణించారు.

కేసీఆర్‌కు, ఈటలకు సఖ్యత ఉన్నప్పుడు 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ఈటల నియోజకవర్గం నుంచే ప్రారంభించారు.

తెలంగాణ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టడానికి ఈటల కృషే కారణమని కేసీఆర్ చెప్పేవారు.

కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.

2018లో తెలంగాణ శాసనసభ ఏర్పడిన తరువాత, క్రమంగా కేసీఆర్‌కు, రాజేందర్‌కు మధ్య అంతరాలు పెరుగుతూ వచ్చాయి.

పలు సందర్భాల్లో రాజేందర్.. "టీఆర్ఎస్ జెండాలకు మేమూ ఓనర్లమే", తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం" లాంటి వ్యాఖ్యలు చేశారు.

రైతుబంధు పథకం ధనవంతులకు ఇవ్వక్కర్లేదని, దానికి గరిష్ట పరిమితి ఉండాలని ఆయన వాదించారు.

సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.

అప్పటి నుంచి కేసీఆర్‌కు, రాజేందర్‌కు మధ్య అంతరాలు పెరుగుతూ వచ్చాయి.

‘‘తెలంగాణలో చాలా అభివృద్ధి చేసినమని చెబుతుండ్రు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేసిండ్రు. దేశంలో రైల్వే లైన్లు వేసిండ్రు, రోడ్లేసిండ్రు. కానీ, భారత జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది. అభివృద్ధి అన్నది ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు ప్రాతినిధ్యం లేదు. ఏ అధికారులైనా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో చెప్పే పరిస్థితి ఉందా?’’ అని మంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఈటెల అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)