డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి.. వైద్య సేవల నుంచి ప్రజాసేవలోకి

డాక్టర్ సుధ

ఫొటో సోర్స్, ysrcp

కడప జిల్లా బద్వేలు శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయం సాధించారు. ఆమె సమీప అభ్యర్థి పి. సురేశ్‌పై 90,089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 1,11,710 ఓట్లు రాగా, బీజేపీ పార్టీకి 21,621 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6,205 ఓట్లు లభించాయి. 'నోటా' ఖాతాలో 3,635 ఓట్లు పోలయ్యాయి.

ఆమె, దివంగత శాసన సభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య.

బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చింది.

దాంతో, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ ఎన్నికల బరిలోకి దిగారు. భారీ మెజారిటీతో సునాయాసంగా విజయం సాధించారు.

డాక్టర్ సుధ

ఫొటో సోర్స్, ysrcp

కడప నగరానికి చెందిన 49 ఏళ్ల డాక్టర్ సుధ వృత్తి రీత్యా గైనకాలజీ నిపుణులు.

1999లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఆమె ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే కావడం విశేషం. కడపలో ప్రముఖ ఆస్పత్రిలో వారివురు సేవలందించేవారు.

2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి, విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంకట సుబ్బయ్య గత మార్చిలో అనారోగ్యంతో మరణించారు.

దాంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో డాక్టర్ సుధ మూడో వైద్యురాలు.

అంతకుముందు, డాక్టర్ వెంకట సుబ్బయ్య, 1978లో జనతా పార్టీ తరుపున డాక్టర్ శివరామకృష్ణయ్య గెలిచారు.

డాక్టర్ శివరామకృష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.

డాక్టర్ సుధ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.

తనకు రూ. 1,11,72,175 విలువ చేసే చరాస్తులు, మరో రూ. 48 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు ఆమె ఈసీకి తెలిపారు.

డాక్టర్ సుధ, భర్త మరణానంతరం రాజకీయ ప్రవేశం చేసి, ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం పొందారు.

దాసరి పద్మ

ఫొటో సోర్స్, YSRCP

వైద్య సేవలకే పరిమితం

గతంలో ఎన్నడూ రాజకీయాల్లో కనిపించని డాక్టర్ సుధ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు.

తన భర్త పోటీలో ఉన్న సమయంలో కూడా ఆమె వైద్య సేవలకే పరిమితమయ్యారు. కానీ అనూహ్యంగా భర్తను కోల్పోయిన తర్వాత ఆమె బరిలోకి వచ్చారు.

గడిచిన మూడు నెలలుగా బద్వేలులోనే ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

భర్త స్థానంలో తనకు అవకాశం ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.డాక్టర్ సుధకి తోడుగా వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ఈ ఎన్నికల బాధ్యతల్లో పాలుపంచుకున్నారు.

టీడీపీ పోటీలో లేనప్పటికీ బీజేపీ తరపున కేంద్ర మంత్రులు, ఎంపీలు రంగంలో దిగి ప్రచారం చేస్తుండడంతో వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

డాక్టర్ సుధని గెలిపించడమే కాకుండా భారీ మెజార్టీ సాధించాలని సీఎం జగన్ ఆదేశించడంతో దానికి తగ్గట్టుగా నేతలు ప్రయత్నాలు చేశారు.పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులు, పోలీసుల తీరు మీద విమర్శలు వచ్చాయి.

ఇతర ప్రాంతాల నుంచి తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా, పోలీసులు స్పందించడం లేదని బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ కూడా అవే ఆరోపణలు చేసింది.

ఇక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఏకపక్ష తీర్పు వచ్చినట్టు కనిపిస్తోంది. సమీప ప్రత్యర్థితో పోలిస్తే సుమారు 90వేల ఓట్ల ఆధిక్యం దక్కడంతో డాక్టర్ సుధ సంతృప్తి వ్యక్తం చేశారు.రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. పార్టీ పెద్దలు, ప్రజల ఆశీర్వాదాలు దక్కాయి. భర్తను కోల్పోయిన మా కుటుంబానికి ముఖ్యమంత్రి అండగా ఉన్నారు.

ప్రజల అండదండలు దక్కాయి. బద్వేలు అభివృద్ధికి నా భర్త ఎంతో తపనపడ్డారు. ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు జరిగింది. మరింత అభివృద్ధి చేస్తాను.

డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆశయాల కోసం ప్రయత్నిస్తాను. సీఎం జగన్ బాటలో నడుస్తాను అని ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డాక్టర్ సుధ బీబీసీతో అన్నారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సుధ గెలుపుతో ఆమె అనుచరులు, వైసీపీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)