ఈటల రాజేందర్: మంత్రి పదవి నాకు ఎవరో ఇచ్చిన భిక్ష కాదు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Etela-Rajender
గులాబీ జెండాకు తాము ఓనర్లమని, పార్టీలోకి అడుక్కువచ్చినవాళ్లం కాదని అంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
మంత్రి పదవి తనకు ఎవరో వేసిన భిక్ష కాదని, కులం వల్ల వచ్చింది కాదని ఈటల రాజేందర్ అన్నారు.
కొద్ది రోజులుగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై ఆయన తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.
తనకు ఎక్కడో బాధ ఉందని, అది బయటకు వచ్చే రోజు వస్తుందని అన్నారు. అప్పుడు వీరుడు ఎవరో బయటపడుతుందని హజురాబాద్‌లో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు.
''నేతలు, వ్యక్తులు చరిత్ర నిర్మాతలు కారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే. కుహనా నేతలతో జాగ్రత్త.. ప్రజాక్షేత్రంలో ఆ మూర్ఖులకు శిక్ష తప్పదు'' అని వ్యాఖ్యానించారు.
తనకు తానై వచ్చానని, సొంతంగానే నిలబడతానని ఈటల అన్నారు.
తనను ఎన్నికల్లో ఓడించేందుకు ఓ పెద్ద గ్రూపు కుట్ర చేస్తోందని, సందర్భం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
''నేను నిరంతరం వెలిగే దీపాన్ని. చంపేందుకు రెక్కీ చేసినప్పుడే చాలెంజ్ చేశా. జెండా వదలనన్నా. నాకు ఎవరైనా రూ.5 వేలు ఇచ్చానని అన్నా రాజకీయాల నుంచి వెళ్లిపోతా'' అని రాజేందర్ అన్నారు.
అయితే తన ప్రసంగంలోని మాటలను కొన్నిచానెల్స్, సోషల్ మీడియా వర్గాలు వర్గాలు వక్రీకరించాయంటూ గురువారం రాత్రి ఈటల ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను ఎప్పటికీ గులాబీ సైనికుడినని, తమ నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, twitter/YSRCParty
రాజధాని తరలిస్తామని అనలేదు
అమరావతి నుంచి మరో ప్రాంతానికి రాష్ట్ర రాజధానిని తరలిస్తామని తాము చెప్పలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలనూ అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు.
ఒక సామాజిక వర్గంపైనో, ప్రాంతం వారిపైనో తమ ప్రభుత్వానికి కక్ష లేదని బొత్స వ్యాఖ్యానించారు.
రాజధాని మారుస్తామని తాను ఎక్కడా చెప్పలేదని, ఎవరో ఏదో మాట్లాడితే తాను ఎలా బదులు చెబుతానని ఆయన ఎదురు ప్రశ్నించారు.
గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి రూ.2,800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచిందని, రూ.35 వేల కోట్ల విలువైన పనులకు ఆర్థిక ఒప్పందాలు లేకుండా టెండర్లు పిలించిందని బొత్స అన్నారు.
హ్యాపినెస్ట్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

నీళ్ల ట్యాంకులో పది రోజులు చిక్కుకుపోయిన బాలుడు
ప్రమాదవశాత్తు పెద్ద నీళ్ల ట్యాంకులో పడి, పది రోజుల పాటు అందులోనే ఉండిపోయిన ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్త రాసింది.
ఒడిశాలోని రువుర్కెలాలో ప్రీతమ్ అనే పదేళ్ల బాలుడు ఈ నెల 18న పావురాల కోసం వెతుకుతూ, కాలు జారిపోయి 30 అడుగుల లోతున్న నీటి ట్యాంకులో పడ్డాడు.
ట్యాంకులో నడుము లోతు వరకు నీరుంది. అయితే, లోపలి నుంచి బయటకు వచ్చే ఇనుప నిచ్చెన విరిగిపోయింది.
కాపాడాలని ప్రీతమ్ కేకలు పెట్టినా, ఎవరికీ వినిపించలేదు.
ఆకలి వేసినప్పుడు ట్యాంక్‌లోని నీటిని తాగుతూ ప్రీతమ్ ప్రాణాలు నిలుపుకున్నాడు.
ప్రీతమ్ కనిపించడం లేదని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అతడి ఆచూకీ దొరకలేదు.
బుధవారం రైల్వే నీటి సరఫరా సిబ్బంది బ్లీచింగ్ కలపడానికి ఆ ట్యాంకు వద్దకు వెళ్లగా లోపల ప్రీతమ్ కనిపించాడు. వారు బాలుడిని బయటకు తీసి, రవుర్కెలా ఆసుపత్రికి తరలించారు.
ప్రీతమ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు.

ఫొటో సోర్స్, twitter/trspartyonline
ఏడాదిలో పాలమూరు పూర్తిచేస్తాం
ఏడాదిలోపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.
పాలమూరు జిల్లాలో 15-20 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని కేసీఆర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, పాక్షికంగా దక్షిణ నల్లగొండ.. నాగార్జునసాగర్ ద్వారా నల్లగొండ, ప్రస్తుత వికారాబాద్ జిల్లా, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతాయని చెప్పారు.
కొన్ని ప్రగతి నిరోధకశక్తులు అడ్డుకోవడం వల్లే పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని చెప్పారు.
జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా పథకాలను వెంటనే పూర్తిచేసి నీళ్లిచ్చామని, అక్కడ మంచి ఫలితం కూడా వచ్చిందని తెలిపారు. దాదాపు 1000 నుంచి 1500 వరకు చెరువులు నింపుకొనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని వివరించారు.
గోదావరి, కృష్ణానదుల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, వచ్చే సమావేశంలో ఈ అంశం ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- కశ్మీర్‌పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








