భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాస్‌ లీడర్లను ఎందుకు తయారు చేసుకోవట్లేదు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ నిలదొక్కుకోలేకపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ నిలదొక్కుకోలేకపోతోంది.
    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

పెరటి మొక్కలు వైద్యానికి పనికి రావంటారు. తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ ఈ విషయాన్ని బాగా నమ్ముతున్నట్లుంది. పార్టీకి పుష్టి కలిగించేందుకు పెరటి మొక్కల్ని కాకుండా బయటి మొక్కలను వాడుతూ ఉంది.

ఈ విషయం తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గం స్పష్టంగా చెబుతుంది.

ఎన్నాళ్లయినా, భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద శక్తిగా ఎదగలేక పోతున్నది, ఎందుకు?

బీజేపీ మహామహులు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీల నాయకత్వంలో కూడా బీజేపీ తెలుగు నాట బలమయిన రాజకీయ శక్తి కాలేక పోయింది.

బీజేపీ దేశంలోనే నెంబర్ పార్టీగా మారిన వారిద్దరి కాలంలోనూ, దేశ రాజకీయ సంస్కృతిని మార్చేసిన నరేంద్ర మోదీ కాలంలో కూడా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ మరుగుజ్జు పార్టీలాగే ఉండిపోతున్నది.

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలం జాతీయ స్థాయిలో విపరీతంగా పెరిగినా, తెలుగు రాష్ట్రాల మీద దాని ప్రభావం ఏ మాత్రం పడలేదు. ఎందుకిలా జరిగింది?

బీజేపీ ఇటీవల జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.

ఫొటో సోర్స్, bjp.org

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఇటీవల జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.

అసెంబ్లీ, పార్లమెంటులలో పార్టీ బలగం పెరగకపోయినా, ఈ పార్టీ నుంచి రాజకీయాలను ప్రభావితం చేసే ఒక చంద్రబాబు, ఒక కేసీఆర్, ఒక జగన్, ఒక నవీన్ పట్నాయక్ వంటి మాస్ లీడర్లు ఎందుకు తయారుకావడం లేదు?

భావజాలమే ఈ పార్టీకి అడ్డంకిగా తయారయిందా? భావజాలాన్ని కాస్త పలచబరిస్తే ప్రయోజనం ఉంటుందా?

పార్టీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గం జాబితాను చూస్తే, సిద్ధాంతాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి, ఏదో విధంగా పార్టీని ముందు బలీయం చేసి, అధికారంలోకి రావాలనుకునే తపన కనిపిస్తుంది.

ముందు అధికారంలోకి వస్తే, అయోధ్యంలో రామమందిరం కట్టినట్లు, కాశ్మీర్లో 370 అర్టికిల్ రద్దు చేసినట్లు, ఆ తర్వాత పార్టీ ఎజండా అమలు చేయవచ్చనే నిర్ణయానికి కాషాయ పార్టీ వచ్చినట్లు ఈ జాబితాలోని తెలుగు పేర్లు చూస్తే అర్థమవుతుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత స్థాయిలోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఫిరాయింపుదారులే ఉన్నారు.

పార్టీలోనే పుట్టి పెరిగి దానికే అంకితమై పనిచేస్తున్న పదహారాణాల బీజేపీ కార్యకర్తలకు, నేతలకు రాని గౌరవం బీజేపీలోకి ఇటీవల ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి లభించింది.

మోదీ పాలనలో కూడా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఎదగలేకపోయింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మోదీ పాలనలో కూడా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఎదగలేకపోయింది

భావజాలాన్ని మర్చిపోయారా?

ఆర్‌ఎస్‌ఎస్ తో దశాబ్దాల అనుబంధం ఉండి, పార్టీకి సైద్ధాంతిక వెన్నెముకగా నిలబడిన సీనియర్ నేతలను ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గం జాబితా కలవరపెడుతూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి నియమితులయ్యారు. ఆమె బీజేపీ కార్యకర్త కాదు. ఆమె సొంత వూరు కాంగ్రెస్. ఆంధ్ర నుంచి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న మరొక ఆంధ్రా నేత కన్నా లక్ష్మినారాయణ. ఆయనదీ కాంగ్రెస్ రక్తమే.

ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈ రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గంలో కూర్చునే వారి సంఖ్య పదిమందికి పైగానే ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన బీజేపీ వాళ్లు మైనారిటీ, ఇతర పార్టీలనుంచి వాళ్లదే పై చేయి. వీళ్లకి బీజేపీ భావజాలానికి సంబంధం లేదు.

ఉదాహరణకు ఈ ఏడాదే బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకాహ్వానితుడు. కార్యవర్గంలో సభ్యులైన జి.వివేక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, అక్కడి నుంచి బీజేపీకి వచ్చారు.

విజయశాంతి బీజేపీతో ప్రారంభించి, తర్వాత సొంత పార్టీ, దానిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి, తదుపరి కాంగ్రెస్, ఇపుడు బీజేపీ. ఇదే విధంగా జితేందర్ రెడ్డి మొదట బీజేపీ తర్వాత టీఆర్‌ఎస్, మళ్లీ ఇపుడు బీజేపీ. మరొక సభ్యుడు గరికపాటి మోహన్ రావు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సుధాకర్ రెడ్డి తమిళనాడు ఇన్‌ఛార్జిగా కార్యవర్గ సమావేశంలో కూర్చుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ ఇపుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. వీళ్లంతా గత్యంతరం లేక బీజేపీలో చేరిన వాళ్లే.

దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ

ఫొటో సోర్స్, Daggubati Purandeswari/Kanna Lakshmi Narayana/fb

ఫొటో క్యాప్షన్, దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ

‘ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే సరే.. పార్టీలో గుండెకాయలోనూ వారికే చోటా?’

మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు (మధ్య ప్రదేశ్ ఇన్‌ఛార్జ్) డాక్టర్ లక్ష్మణ్ (బీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు), రాజాసింగ్ (బీజేపీఎల్‌పీ నేత) బండి సంజయ్ (పార్టీ అధ్యక్షుడు) లే బీజేపీ ఇంటి మనుషులు.

బీజేపీ సీనియర్ నాయకుడు, నాలుగు దశబ్దాల పాటు ఆర్‌ఎస్‌ఎస్ లో పని చేసి, ఇపుడు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న పేరాల శేఖర్ రావు ఈ ఏర్పాటు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శేఖర్జీగా పార్టీ సర్కిల్స్ లో అపారమైన గౌరవమున్న సైద్ధాంతిక పండితుడాయన. పార్టీ సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి.

"ఇది ఆలోచించదగ్గ పరిణామం. దీని పర్యవసానాలెలా ఉంటాయో ఇపుడే చెప్పలేం’’ అని శేఖర్జీ వ్యాఖ్యానించారు.

‘‘ఇలాంటి ప్రయోగం పశ్చిమ బెంగాల్‌లో పని చేయలేదు. అక్కడ ఆ మధ్య పార్టీలో చేరిన ముకుల్ రాయ్‌‌ని జాతీయ ఉపాధ్యక్షుడిని చేస్తే ఆయన మళ్లీ తృణమూల్ పార్టీకి వెళ్లిపోయారు. మరొక బీజేపీ మాజీ మంత్రి , ఎంపీ బాబుల్ సుప్రియో పార్టీని వదిలేసి తృణమూల్ లో చేరిపోయారు. ఈ అనుభవం ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రయోగం జరగుతూ ఉంది. పార్టీ పెద్దల ఆలోచన ఏమిటో తెలియడం లేదు" అని అన్నారాయన.

శేఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్ తరఫున, పార్టీ తరఫున చాలా కాలం ఈశాన్య రాష్ట్రాలలో పని చేశారు. ఆయన దృష్టిలో జాతీయ కార్యవర్గం అనేది పార్టీ గుండెకాయ వంటిది. అందువల్ల కార్యవర్గ కమిటీ సభ్యులను ఎంపిక చేసేటప్పుడు పార్టీ సిద్దాంతమే కొలబద్ద కావాలని అన్నారు

"ఎంపీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించేటపుడు పార్టీ సైద్ధాంతిక నిబద్దతకు కొంత సడలింపు ఇవ్వవచ్చు. అయితే, జాతీయ కార్యవర్గం అనేది పార్టీ పాలసీని రూపొందించే యంత్రాంగం. ఈ విషయంలో పార్టీకి కమిట్‌మెంటు, సిద్ధాంతాల అవగాహన, పనితీరు కొలబద్ద కావాలి. మరి తెలుగు రాష్ట్రాల విషయంలో పార్టీ ధోరణిలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఇది ఆలోచనీయం'' అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలయ్యారు

ఫొటో సోర్స్, @aruna_dk/twitter

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలయ్యారు

ఎంత వరకు కలిసొస్తుంది?

అయితే, తెలంగాణ బీజేపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ , న్యాయవాది ఎన్.రామచంద్ర రావు మాత్రం ఇదొక కొత్త ప్రయోగం అన్నారు. పార్టీ విస్తృతికి ఇంత వరకు కొన్ని సమస్యలుండేవని ఫలితంగా పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమయిందని చెబుతూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత గౌరవమిచ్చి, వారు పార్టీలో పూర్తిగా, సైద్ధాంతికంగా విలీనం అయ్యేందుకు జాతీయ కార్యవర్గం హోదా పనికొస్తుందని ఆయన బీబీసీతో అన్నారు.

''తెలంగాణ నుంచి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నవాళ్లంతా రాజకీయాల్లో అనుభవం ఉన్నవాళ్లు, వీళ్లంతా ఇతర పార్టీల నుంచి వచ్చారని దూరంగా పెట్టకుండా హోదా ఇచ్చి గౌరవించడం అవసరం. దీనితో వాళ్లు పార్టీని పల్లెల్లోకి తీసుకువెళ్తారు. జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, వివేక్, ఈటల రాజేందర్ వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు. వీళ్లని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడమంటే, పార్టీ బేస్ (పునాది)ని విస్తరింపచేయడమే'' అని రామచంద్ర రావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ కూడా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రయోగాలు చేస్తూ ఉందని, ఇప్పుడది చారిత్రక అవసరమంటూ ఒక ఆసక్తికరమైన వాదన చేశారు.

''ప్రధాని మోదీ వంటి జాతీయ నేతల ప్రభావం రాష్ట్రాలలో కనిపించాలంటే, మొదట ఇక్కడ కొంతైనా స్థానిక బలం చేకూర్చుకోవాలి. మనం ఎగరగలిగే స్థాయికి పెరిగినపుడు, జాతీయ స్థాయి నాయకుల చేయూత పనికొస్తుంది. ఈ కనీస 'థ్రెష్ హోల్డ్ బలం' మనం సమకూర్చుకోవాలి. కార్యవర్గం కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా ముందు చూపుతో చేసిన పని'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అమిత్ షాతో కిషన్ రెడ్డి, విజయశాంతి, బండి సంజయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అమిత్ షాతో కిషన్ రెడ్డి, విజయశాంతి, బండి సంజయ్ (ఫైల్ ఫొటో)

బీజేపీలో ఈ మార్పుకు కారణం ఏంటి?

ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ నుంచి మేధావులు, మృదు స్వభావులు మాత్రమే వచ్చారు. వాళ్ల యుగం అయిపోయింది. ఇపుడు రాజకీయాలు బాగా రోడ్డేక్కాయి. ఖరీదయ్యాయి. బీజేపీ అధికారంలోకి రావాలంటే స్ట్రీట్ పాలిటిక్స్ లోకి రావాలి.

ఈ పాలిటిక్స్ నుంచి వచ్చే స్థానిక నేతలే బీజేపీని ముందుకు తీసుకుపోతారు. బలమైన ప్రాంతీయ ఎన్నికల రాజకీయ నాయకులు బీజేపీ నుంచి రెండు రాష్ట్రాలలో తయారు కానేలేదు. అలాంటి నేతలు కాంగ్రెస్ లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.

అంతేకాదు, వాళ్లు రోడ్డెక్కి అరవగలరు, జబ్బలు చరచగలరు. ఓట్ల రాజకీయాల్లో అనుభవం వాళ్లకే ఉంది. పేరు, ప్రతిష్టలతో పాటు, డబ్బు కూడా వాళ్ల దగ్గర దండిగా ఉందని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల రాష్ట్రాలలో బీజేపీ వరుసగా ఎదురుదెబ్బలు తినేందుకు కారణం, అక్కడ పార్టీకి ప్రాంతీయ ఎలక్షన్ యోధులు లేకపోవడమేనని పార్టీ గుర్తించింది. ఇలాంటి ప్రాంతీయ పాలెగాళ్లు బీజేపీలో లేరు. అక్కడ తయారుకావడం కష్టం.

అందువల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకి పెద్ద పీట వేసి హోదా ఇచ్చి వాళ్లు 'సొంతగూడు, గతం' మర్చిపోయేలా చేయాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఏకంగా జాతీయపదవులిచ్చేందుకు కారణమిదే ననిపిస్తుంది. వీళ్లలో ఎందరుంటారు, ఎందరు వెళ్లిపోతారో 2024 ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

''ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బీజేపీ వ్యూహమిదే. అనుమానం లేదు. సిద్ధాంతం పక్కన పెట్టి ఏదో విధంగా పవర్‌లోకి రావాలనే ధోరణి పార్టీలో కనిపిస్తూ ఉంది'' అని పేరు రాసేందుకు అంగీకరించని బీజేపీ సానుభూతిపరుడు ఒకాయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)