ఓబీసీ: కులాలవారీ జనగణను ప్రతిపక్షాలు ఎందుకు కోరుతున్నాయి, బీజేపీ ఎందుకు వద్దంటోంది

ఓబీసీ కులాల జనాభా గణన జరిగితే బీజేపీ ఇబ్బందుల్లో పడుతుందని ఆ పార్టీ విమర్శకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓబీసీ కులాల జనాభా గణన జరిగితే బీజేపీ ఇబ్బందుల్లో పడుతుందని ఆ పార్టీ విమర్శకులు అంటున్నారు.
    • రచయిత, అపర్ణ అల్లూరి, జోయా మాటీన్
    • హోదా, బీబీసీ న్యూస్

కులాలవారీగా జనగణన చేపట్టాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకులు కోరారు.

''కులాలవారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది పేదలకు వరంగా మారుతుంది'' అని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారని పీటీఐ వెల్లడించింది.

హిందూ మతంలో అగ్ర, నిమ్న కులాల భావన శతాబ్దాలుగా కొనసాగుతోంది. కుల వ్యవస్థలో బ్రాహ్మణులు పైన, దళితులు, ఆదివాసీలు దిగువన ఉండేవారు. ఈ రెండు వర్గాల మధ్యలో అనేక కులాలు ఉన్నాయి. కానీ, అన్ని కులాలకు సంబంధించి సరైన గణాంకాలు లేవు.

అయితే, వెనకబడిన కులాలుగా పిలిచే వీరంతా సుమారు 52 శాతం మంది వరకు ఉంటారని ఒక అంచనా. వీరినే ఇతర వెనుకబడిన కులాలుగా(ఓబీసీ) గుర్తించారు.

ప్రతి పదేళ్లకోసారి భారతదేశంలో జనాభా లెక్కిస్తున్నా, అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపైన మాత్రమే స్పష్టమైన సమాచార సేకరణ ఉంటుంది కానీ, ఓబీసీలు ఎందరున్నారనే లెక్కలు మాత్రం లేవు.

అయితే, ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలు సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది.

భారతదేశపు కుల వ్యవస్థలో దళితులు అత్యంత అణగారిన వర్గాల జాబితాలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశపు కుల వ్యవస్థలో దళితులు అత్యంత అణగారిన వర్గాల జాబితాలో ఉన్నారు

కులాలవారీగా జనాభా గణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేనమని అధికార పార్టీ చెబుతుండగా, దీని వెనక ప్రభుత్వానికి వేరే ఆలోచనలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లేందుకు పాలక బీజేపీ సిద్ధంగా లేదు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధాన్యముందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కులపరంగా అత్యంత సున్నితమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడంలో ఓబీసీల పాత్ర కీలకం.

కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఉంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న భారతీయ జనతాపార్టీ, ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడటం లేదు.

కులాలవారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని, సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి.

బీజేపీ విముఖతకు మరో కారణం ఉందని విమర్శకులు అంటున్నారు.

ఓబీసీలను లెక్కించడం ద్వారా జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారు.. దశాబ్దాలుగా సంపదలో, విద్యలో, రాజకీయాలలో అగ్రకులాలు ఎంత శాతం ఉన్నాయో తేలిపోవడం వల్ల తమకు ఇబ్బందులు వస్తాయని అధికార బీజేపీ భావిస్తున్నట్లు ఆ పార్టీని విమర్శించేవారు అంటున్నారు.

మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి

కులాల జనగణన భారత్‌కు అవసరమా?

జనాభా లెక్కలలో మతం, భాష నుంచి సామాజిక-ఆర్ధిక స్థితి వరకు అనేక వివరాలను రికార్డు చేస్తారు. దళితులు, ఆదివాసీల సంఖ్యను కూడా సేకరిస్తారు. అయితే, ఓబీసీ జనాభా గణన వల్ల పెద్దగా ఉపయోగం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో అతి పెద్ద రాజకీయ సమీకరణలకు, విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలలో కోటాకు ఓబీసీలు లక్షిత జనాభా. దేశంలోని సగం కంటే ఎక్కువమంది వీరే ఉన్నారు.

ఓబీసీ జనాభాను లెక్కించడం వల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలు చేయొచ్చని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు వాదిస్తున్నారు.

పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఇలాంటి గణనను నిర్వహించడం కొత్తేమీ కాదు. అమెరికాలో ప్రజలను జాతుల వారీగా లెక్కిస్తారు. ప్రజల మూలాల ఆధారంగా బ్రిటన్ జనాభాను లెక్కిస్తుంది.

భారతదేశంలో కులాలవారీగా జనాభా గణనను 1872లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టింది. 1931 నుంచి ఈ తరహా గణన ఆగిపోయింది.

1951 నుంచి జరుగుతున్న జనాభా లెక్కల్లో కేవలం దళితులు, ఆదివాసీల జనాభాను మాత్రమే లెక్కిస్తూ వచ్చారు. మిగిలిన జనాభాను జనరల్‌ కేటగిరీగా పేర్కొన్నారు.

భారతదేశపు జనాభా లెక్కల్లో ఓబీసీల గణన ఇంత వరకూ జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశపు జనాభా లెక్కల్లో ఓబీసీల గణన ఇంత వరకూ జరగలేదు.

ఓబీసీ జనాభాను ఇంత వరకు లెక్కించ లేదా?

ఇప్పటి వరకు జరగలేదు. అంచనాలే తప్ప అధికారికంగా ప్రచురించిన డేటా లేదు.

భారతదేశంలోని ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌ల అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ 1980ల నుంచి అనేక ప్రాంతీయ పార్టీల రాక పెరిగింది. వీటిలో చాలా పార్టీలు కులాల ఓటు బ్యాంకులను ఏర్పాటుచేసుకున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్ల కోటా కోసం దేశవ్యాప్తంగా దిగువ కులాల డిమాండ్లు పెరిగాయి.

దళితులు, ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాలను సరిదిద్దే క్రమంలో 1950ల నుంచి దేశంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలు, ఎన్నికలు తదితర అంశాలలో రిజర్వేషన్లు కల్పించారు.

అయితే, ఓబీసీలను రాజ్యాంగంలో ఇతర వెనకబడిన తరగతులు అని పేర్కొన్నారు తప్ప, వారు ఎవరు అనే స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు.

1979లో ఈ ఇతర వెనకబడిన కులాలను గుర్తించడానికి అప్పటి ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ గుర్తింపు ద్వారా వారికి ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాలనేది ప్రధాన ఉద్దేశం.

ఈ కమిషన్‌కు నేతృత్వం వహించిన బిందేశ్వరి ప్రసాద్ ఇంటి పేరైన మండల్ పేరుతోనే ఈ కమిషన్ సుపరిచితం. ఓబీసీ జనాభాకు రిజర్వేషన్లు కల్పించడమే ఈ కమిషన్ ఏర్పాటు వెనక ఉద్దేశం.

అయితే, 1990లలో వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్‌ ప్రభుత్వం ఈ నివేదికను అమలు పరిచేందుకు సిద్ధమయ్యేవరకు ఈ కమిషన్ రిపోర్టును ఎవరూ పట్టించుకోలేదు.

ఈ నివేదిక అమలు ప్రయత్నం అగ్రవర్ణాల నుంచి, ముఖ్యంగా విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అప్పటికి దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి రాలేదు. విద్యాసంస్థల్లో సీట్లకు, ప్రభుత్వ ఉద్యోగాలకు అధికంగా డిమాండ్ ఉన్న కాలం అది.

బీజేపీ ఒక్కటే వ్యతిరేకిస్తోందా?

అయితే, ఓబీసీ జనాభా గణనను నిరాకరించిన వారిలో బీజేపీ మొదటి పార్టీ ఏమీ కాదు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.

2010లో అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు కుల గణనకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చివరకు ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ, 2011లో ప్రారంభించిన సామాజిక-ఆర్థిక, కుల జనాభా లెక్కల వివరాలు ఇప్పటికీ విడుదల కాలేదు.

కొత్తగా కులాల గణనను చేపడితే, గతంలో మండల్ కమిషన్ చెప్పిన 52శాతం కంటే ఎక్కువగానే ఓబీసీ జనాభా ఉండొచ్చని, దీనివల్ల కోటా కోసం మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని విమర్శకులు అంటున్నారు. ఇది బీజేపీకి ఇబ్బంది కలిగించవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో ప్రత్యేకించి యూపీలో బీజేపీ ఓబీసీల కారణంగా బాగా లాభపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు కోటా కోసం జరిగే ఆందోళనలు ఆ పార్టీకి ఇబ్బంది కలిగించవచ్చు.

బీజేపీకి ఇప్పటికీ అగ్రవర్ణ పార్టీగానే పేరుంది. ఓబీసీలను ఆ పార్టీ దూరం చేసుకుంటే, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలకు అది బాగా కలిసి వచ్చే అంశం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)