ఆంధ్రప్రదేశ్: బీజేపీ నాయకుల అసహనం, ఆగ్రహం ఎవరిమీద? ఎందుకు?

ఫొటో సోర్స్, Nara chandrababu naidu/Facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ మీద.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కొద్ది రోజులుగా మండిపడుతున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ సమ్మతితో కొనసాగుతున్న గవర్నర్ మీద.. రాష్ట్రంలో అదే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
నిజానికి.. గవర్నర్ నరసింహన్ తెలంగాణకు సానుకూలంగానూ, ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగానూ పనిచేస్తున్నారని ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. భూవినియోగ మార్పిడి పన్ను తగ్గించటానికి ఉద్దేశించిన 'నాలా' బిల్లు విషయంలో గవర్నర్ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపించటం వివాదాన్ని పెంచింది.
ఈ బిల్లు విషయంలోనే బీజేపీ నేతలు కూడా గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ''ఈ గవర్నర్ మాకొద్దు.. బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్ కావాలి'' అని కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు.
''గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అంటే ప్రేమ ఎక్కువ. ఏపీలో నాలా పన్ను తగ్గించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపినా గవర్నర్ ఇప్పటికీ ఆమోదించలేదు. కానీ తెలంగాణ వారికి మాత్రం వెంటనే ఆమోదించి పంపారు'' అని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శాసనసభా పక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు జనవరి 2వ తేదీన వ్యాఖ్యానించారు. గవర్నర్ తీరు మార్చుకోవాలని, లేకుంటే తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తాననీ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Telangana CMO/Facebook
ఇంతకీ ఏమిటీ నాలా బిల్లు?
ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్-అగ్రికల్చరల్ పర్పస్) యాక్ట్ - 2006 చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చేటపుడు విధించే పన్నును.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధుల్లో 5 శాతం నుంచి 2 శాతానికి.. ఇతర ప్రాంతాల్లో 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గించటం ఈ బిల్లులోని ప్రధానాంశం. ఈ బిల్లునే 'నాన్-అగ్రికల్చర్ ల్యాండ్' - 'నాలా' బిల్లుగా వ్యవహరిస్తున్నారు.
వ్యవసాయ భూములను పరిరక్షించటానికి, వాటిని ఇతర అవసరాలకు మళ్లించటాన్ని నియంత్రించటానికి 2006 నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'నాలా' చట్టాన్ని అమలు చేస్తున్నారు. భూ వినియోగ మార్పిడి కోసం ఆర్‌డీఓ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. సదరు భూమి వినియోగ మార్పిడికి అనువైనదేనా కాదా అని రెవెన్యూ అధికారులు నిర్ధారించిన తర్వాత తుది ఆమోదం ఇస్తారు. వినియోగ మార్పిడి కోసం భూమి విలువలో కొంత శాతాన్ని పన్నుగా చెల్లించాలి.
ఈ వినియోగ మార్పిడి పన్ను రేటును తగ్గించటానికి తెలంగాణ ప్రభుత్వం కూడా నాలా చట్టానికి సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే.. భూ వినియోగ మార్పిడికి ఎవరైనా దరఖాస్తు చేసుకున్నపుడు దానిని ఆమోదించేముందు భౌతికంగా తనిఖీ చేయటం తప్పనిసరిగా ఆ బిల్లులో పేర్కొన్నారు. అదే ఏపీ నాలా బిల్లు విషయంలో భూవినియోగ మార్పిడికి దరఖాస్తు చేసి పన్ను కట్టిన వెంటనే.. ఆ భూమి వినియోగం మారిపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ నాలా బిల్లును సత్వరమే ఆమోదించిన గవర్నర్ నరసింహన్.. ఏపీ బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, సూచనలు చేస్తూ రెండు పర్యాయాలు తిప్పిపంపించారు. పన్ను తగ్గిస్తే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుందన్న వాదనలు, వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసిన భూముల తనిఖీలపై స్పష్టతనివ్వటం వంటి అంశాలు ఆయన సూచనల్లో ఉన్నాయి. వీటిపై సవివరంగా చట్టం చేస్తామని ఏపీ సర్కారు చెప్తోంది. అయితే.. ఈ బిల్లు ఆమోదంలో జాప్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి జాప్యం జరుగుతోందని టీడీపీ, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, governor.tsap.nic.in
'ఇవి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలే'
తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా గవర్నర్ తీరుపై మండి పడుతున్నాయి. గవర్నర్ కేవలం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని విమర్శించాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశం మీద ఏకంగా రాజభవన్‌లో నేరుగా గవర్నర్‌తోనే వాగ్వాదానికి దిగారు.
గవర్నర్ మీద తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రపప్రదేశ్‌లో బీజేపీ నాయకుల విమర్శల గురించి మంగళవారం ఢిల్లీ పర్యటనలో నరసింహన్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ''కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మామూలే. కుటుంబంలో పెద్దలు, పిల్లల మధ్య మనస్పర్థలు రావటం సహజమే. కోపతాపాలు నెమ్మదిగా సర్దుకుంటాయి.'' అని ఆయన స్పందించారు.

ఫొటో సోర్స్, Youtube
ఏపీకి ప్రత్యేక గవర్నర్ కావాలి: విష్ణుకుమార్ రాజు
గవర్నర్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీద ఏపీ బీజేపీ నేతలు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''గవర్నర్ ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఆయన ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్‌కు పెద్దదిక్కులా వ్యవహరించారా?'' అని ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు బుధవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
''గవర్నర్ ఏపీలో కనీసం నాలుగు రోజులైనా గడిపారా? నాలా బిల్లును ఆరు నెలల నుంచి పెండింగ్‌లో పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక గవర్నర్ కావాలి'' అని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గవర్నర్ కోసం పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కేంద్రాన్ని కోరాలని, తాము కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని, బీజేపీ అధిష్టానాన్ని కోరతామని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, archivepmo.nic.in
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండీ గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారింది. 2009 చివర్లో.. ఆనాడు ఏపీలో నెలకొని ఉన్న అనూహ్య, ఉద్రిక్త పరిస్థితుల్లో గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను నియమించింది అప్పడు కేంద్రంలో గల కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.
ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసి 2006లో పదవీ విరమణ చేశారు. ఆ మరుసటి ఏడాది ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009 డిసెంబరు 28న ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అదనపు విధులు స్వీకరించారు. 2010 జనవరి 22న పూర్తి స్థాయి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అనంతర పరిణామాల్లో 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన తర్వాత.. రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌నే కొనసాగించారు.
విభజన అనంతర పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించటంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, governor.tsap.nic.in
బీజేపీ రాష్ట్ర నేతల డిమాండ్ మీద కేంద్రం ఎలా స్పందిస్తుంది?
నిజానికి.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హయాంలో నియమితులైన గవర్నర్లు మారారు. ఏపీ, తెలంగాణలకు మాత్రం యూపీఏ సర్కారు నియమించిన నరసింహన్‌నే కొనసాగించటం అప్పట్లోనే ఆసక్తిని రేకెత్తించింది.
అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన చట్టానికి సంబంధించిన సమస్యలు తలెత్తినపుడు కూడా గవర్నర్ మీద ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచీ.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు నుంచి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తమైంది.
ఇక తమిళనాడు లాంటి పలు రాష్ట్రాల్లో స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా గవర్నర్లను నియమించటమో, వేరే రాష్ట్ర గవర్నర్లకు అదనపు బాధ్యతలు అప్పగించటమో చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఏపీ, తెలంగాణలకు మాత్రం గవర్నర్‌గా నరసింహన్‌నే కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో.. ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలన్న ఆంధ్రప్రదేశ్ నాయకుల డిమాండ్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.

ఫొటో సోర్స్, ap.gov.in
టీడీపీ - బీజేపీ మధ్య దూరం ఇంకా పెరుగుతోందా?
ఒకవైపు గవర్నర్ మీద విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ నాయకులు.. మరోవైపు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ మీద విమర్శలను ఉధృతం చేస్తుండటం కూడా రాష్ట్ర రాజకీయాలపై ఉత్కంఠ రేపుతోంది.
నిజానికి.. బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీచేశాయి. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరగా.. రాష్ట్రంలోనూ టీడీపీ సారథ్యంలోని ప్రభుత్వంలో బీజేపీ చేరింది. కానీ కొంత కాలంగా ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్న సంకేతాలు ప్రస్ఫుటమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కేంద్ర బిందువుగా ఇరు పార్టీల నుంచి వస్తున్న ప్రతిస్పందనలు ఈ సంకేతాలను బలపరుస్తున్నాయి.
పరిపాలన విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తోందని.. ఆ తప్పులను కేంద్రంపైకి నెట్టోస్తోందని ఏపీ బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కొద్ది రోజుల కిందట విమర్శించారు. టీడీపీ వైఖరి మార్చుకోకుండా ఇదే తీరులో కొనసాగితే 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ ఒంటరిగా పోటీ చేస్తుందనీ ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Somu Veerraju/Facebook
అంతకు కొన్ని రోజుల ముందు బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా మిత్రపక్షమైన టీడీపీపై ఇదే తరహాలో మండిపడ్డారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ పొత్తును బీజేపీ ఎంతో గౌరవించిందని.. కానీ ఆ పార్టీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలకు ఇళ్లు, పింఛన్లు కూడా ఇప్పించుకోలేని అసహాయ స్థితిలో తాము ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా గెలిచే సత్తా బీజేపీకి ఉందని.. అన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజాగా బుధవారం నాడు.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు ఏకంగా తన ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘నేను ప్రశ్నిస్తే చాలా మందికి బాధ కలుగుతోంది. నన్ను నిలదీసే పరిస్థితి వస్తే.. ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను పక్కకు తప్పించాలని చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాకుండా కట్ చేస్తా.. ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన తాడేపల్లిగూడెం పరిధిలోని రామన్నగూడెంలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలోనే మంత్రి ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు మొదలుకుని.. ఏకంగా మంత్రి కూడా మిత్రపక్షంపైనా, తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం పైనా ఈ విధంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతుండటం.. ఇరు పార్టీల మధ్య అగాధం మరింతగా పెరుగుతోందనేందుకు నిదర్శనమా? రాబోయే ఎన్నికల సమయానికి ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయి? అనే అంశాలు రాష్ట్రంలో ఆసక్తికరంగా మరాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








