ఇవాంకాకు ఆతిథ్యమిచ్చేందుకు ఫలించని ఆంధ్రా ప్రయత్నాలు

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కి అంతా సిద్ధమైంది. ఇవాంకా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అయితే ఈ సదస్సును నిర్వహించే అవకాశం దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ అది సఫలం కాలేదు.
ఈ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం తమకు గర్వకారణంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తమ నగరాల్లో ఎక్కడైనా ఈ సదస్సును నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కూడా అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కృష్ణకిషోర్ నేతృత్వంలోని బృందం అమెరికా అధికారులను కలసి దీనిపై కోరినా... వారు ఒప్పుకోలేదని పీటీఐ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడి కుమార్తె పాల్గొనే సదస్సు తమ రాష్ట్రంలో నిర్వహిస్తే నవ్యాంధ్ర ప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం భావించింది. తద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చనుకుంది.
విశాఖ లేదా అమరావతిలో సదస్సు నిర్వహణకు తగిన సదుపాయాలన్నీ ఉన్నాయని అమెరికా కాన్సులేట్ అధికారులకు ఏపీ వివరించింది.
"ఇవాంకా జీఈఎస్, ఆ తర్వాత దిల్లీలో జరిగే కార్యక్రమాల్లో తప్ప మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు" అని యూఎస్ అధికారులు స్పష్టంచేశారు. అందుకే ఏపీకి అవకాశం దక్కలేదు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




