‘కర్నూలు’లో వెలివేత: నక్కలదిన్నెలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

బాధితులతో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్, పోలీసులు

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్ బాధితులతో మాట్లాడారు
    • రచయిత, డీఎల్ నరసింహ
    • హోదా, బీబీసీ కోసం

కర్నూలు జిల్లాలో దళితుల బహిష్కరణ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామంలో దళితులను సాంఘికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 'అగ్ర'వర్ణాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్‌, మంగళవారం నక్కలదిన్నె గ్రామాన్ని సందర్శించారు.

సామాజిక బహిష్కరణపై ఇతర అధికారులతో కలిసి విచారణ జరిపారు. దళితవాడలో పర్యటించి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

గ్రామంలో పర్యటిస్తున్న నరహరి, ఇతర అధికారులు

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, అధికారులతో కలిసి నక్కలదిన్నె గ్రామంలో నరహరి పర్యటించారు

ఇకపై ఎట్టి చేయం

మృతదేహాల ఖననానికి సంబంధించి ఎట్టి పనిని కొనసాగించేందుకు దళిత కుటుంబాలు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక ఆ పనిని మానేస్తామని కమిషన్ సభ్యునికి దళితులు చెప్పారు. తమకు జీవనోపాధి కల్పించాలని వారు విన్నవించుకున్నారు.

ప్రాణహాని ఉంది

తమకు ప్రాణహాని ఉందని నరహరికి దళితులు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు దళిత వాడలో పోలీసులను పహారా పెట్టారు.

కఠినంగా శిక్షిస్తాం

దళితవాడలోని బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని నరహరి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తమ వంతు సహాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

"దళితులను వేధింపులకు గురి చేసినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసాం. నీటి సరఫరా నిలిపి వేయడంతోపాటు సామాజికంగా బహిష్కరించడం కూడా నేరమే. ఇందుకు పాల్పడిన 11 మందిని అరెస్టు చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. దళితులపై ఎటువంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసుల రక్షణ కల్పించాం" అని నరహరి తెలిపారు.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి పర్యటించారు.

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, నక్కలదిన్నె గ్రామంలో పర్యటించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి

జిల్లా ఎస్పీ పర్యటన

నక్కలదిన్నె గ్రామంలో సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి పర్యటించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారకులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. పౌరహక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహాన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామస్తులందరూ సోదరభావంతో మెలగాలని కోరారు.

డీఎస్పీ కె చక్రవర్తి

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, డీఎస్పీ కె చక్రవర్తి

ఆళ్లగడ్డ కోర్టుకు

బాధిత దళితుల నుంచి రుద్రవరం మండల పోలీసులకు ఫిర్యాదు అందింది. పలు చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కె.చక్రవర్తి తెలిపారు.

బాధితుల ఫిర్యాదు మేరకు సగిలి శివశంకరెడ్డి, సిద్ది పెద్ద సుబ్బారెడ్డి, పల్లె రాజారెడ్డి, గొల్ల తిరుపాలు, పల్లె గోపాల్‌రెడ్డి, పల్లె వెంకట రామిరెడ్డి, బోయ మల్లికార్జున, గొల్ల చిన్ని సుబ్బరాయుడు, గొల్ల మౌలాలి, గొల్ల ఊశానితోపాటు మరొకరి పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వీరిని ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచామని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చక్రవర్తి వెల్లడించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)