ఏపీ కేబినెట్ నిర్ణయం: కాపులకు 5 శాతం రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, FACEBOOK
కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయించింది.
ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి మండలి సమావేశానంతరం విలేకర్లతో చెప్పారు.
''కాపుల రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. శనివారం ఉదయం 8.30కి కేబినెట్ సమావేశం జరుగుతుంది. అక్కడ దీన్ని ప్రత్యేకంగా ఆమోదించాక 9 గంటలకు అసెంబ్లీలో ఈ బిల్లు పెడతాం'' అని గంటా వెల్లడించారు.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ (ఎఫ్) కేటగిరీ కింద 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK
రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయి కదా.. అని విలేకర్లు ప్రశ్నించినపుడు.. ప్రొసీజర్ ప్రకారం 9వ షెడ్యూల్లో పెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని గంటా తెలిపారు.
ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప 'బీబీసీ'తో మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పూర్తి వివరాలతో శనివారం సాయంత్రం జీవో విడుదల చేస్తామని తెలిపారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల అంశాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎలాంటి రాజకీయ పదవులకు రిజర్వేషన్లు వర్తించవు.
ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న బీసీల ప్రయోజనాలకు తాజా రిజర్వేషన్ల వల్ల ఎలాంటి భంగం వాటిల్లదు.

ఫొటో సోర్స్, FACEBOOK
కాపులను బీసీలుగా చేర్చాలన్న అంశంపై నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తిస్తారు.
కొత్తగా బీసీ-ఎఫ్ కేటగిరి సృష్టించి వీరిని అందులో చేరుస్తారు.
శనివారం శాసనసభలో ఈ అంశంపై చర్చించి ఆ బిల్లును గవర్నర్‌కు పంపిస్తారు.
రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతం మించడంతో ఆమోదం కోసం కేంద్రానికి కూడా ఈ బిల్లును పంపుతారు.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








