సెల్ఫ్ మెడికేషన్: డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి మందులు వాడటం ఆరోగ్యానికి మేలేనా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
వనజకు (పేరు మార్చాం) 48 సంవత్సరాలు. ఆమె గత 20 సంవత్సరాలుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఆమె ఒక డెంటిస్ట్ కూడా.
అయితే, ఆమె మైగ్రేన్ చికిత్స కోసం డాక్టర్‌ను ఒకటి రెండు సార్లు మాత్రమే సంప్రదించారు. ఆమె కూడా డాక్టర్ కావడంతో మందులు తనకు తెలుసని అనుకున్నారు.
ఆమెకు తెలిసిన పెయిన్‌కిల్లర్స్‌ను తలనొప్పి వచ్చిన ప్రతిసారీ తీసుకుంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతూ ఉండేవారు. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లినా అవే మందులు రాస్తారనే ఉద్దేశ్యంతో ఒకే రకమైన పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ ఉండేవారు.
ఈ విషయాన్ని ఆమె ఇంట్లో కూడా పెద్దగా చర్చించలేదు. మైగ్రేన్‌ను ఆమె చిన్నపాటి సమస్యగా భావించారు. కానీ, ఆ చిన్నపాటి సమస్య ఒక రోజుకు ప్రాణాంతకంగా మారింది. తెలుసుకునేసరికి, ఆమె కిడ్నీల పని తీరు 5 శాతానికి పడిపోయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఈ విషయాన్ని ఆమెకు చికిత్స నిమిత్తం సూచనలందించిన యూకేలో జనరల్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్న డాక్టర్ కన్నెగంటి చంద్ర బీబీసీతో చెప్పారు.
ఏదైనా అనారోగ్యానికి వైద్యుని సంప్రదించకుండా స్వీయ చికిత్స చేసుకోవడం, సొంతంగా ఔషధాలను తీసుకోవడాన్నిసెల్ఫ్ మెడికేషన్ అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సెల్ఫ్-మెడికేషన్ వల్ల జరిగే అనర్ధాలేంటి?
వనజ లాంటి చాలా మంది తలనొప్పి, జ్వరం, నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలకు డాక్టర్ ను సంప్రదించకుండానే మందులు వాడేస్తూ ఉంటారు.
చిన్న చిన్న సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకోని వారు నగరాల్లో 37% ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 17% మంది ఉన్నట్లు న్యూదిల్లీ లోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ వైద్యుల బృందం 2015లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
స్వీయ చికిత్సలు చేసుకుంటున్న వారిలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు.
సొంత అనుభవాల ద్వారా గానీ డాక్టర్ రాసిన పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా గానీ చాలా మంది స్వీయ చికిత్స చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
జలుబు, జ్వరం లాంటి సమస్యలకు ఎక్కువగా సొంతంగా మందులు తీసుకుంటున్నట్లు కూడా తెలిసింది. ఇలా స్వీయ చికిత్స తీసుకునేవారిలో కొంత మంది యాంటీబయాటిక్స్ కోర్స్‌ను పూర్తిగా తీసుకోవడం లేదని కూడా వెల్లడైంది.
డాక్టర్ సలహా లేకుండా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్‌లాంటి వాటిని తీసుకోవడం ప్రాణానికే ప్రమాదం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఈ అధ్యయనంలో వెలువడిన ఫలితాలను డాక్టర్ చంద్ర సమర్ధించారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రాథమిక వైద్య సదుపాయాలను మెరుగుపరచాలనే అంశం పై వివిధ నగరాల్లో వైద్య రంగ నిపుణులతో కలిసి ఆయన చర్చలు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, CHANDRA KANNEGANTI/FACEBOOK
వనజ ఉదాహరణనే ప్రస్తావిస్తూ అనారోగ్యం తలెత్తినప్పుడు చిన్న సమస్యే కదా అనుకుని స్వీయ చికిత్స చేసుకోవడం ఒక్కొక్కసారి ప్రాణానికే ముప్పు తెస్తుందని డాక్టర్ చంద్ర అన్నారు.
20 సంవత్సరాల పాటు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడమే ఆమె కిడ్నీలు పోవడానికి కారణమని వైద్యులు తేల్చారు. ఆమె భర్త ఆమెకు కిడ్నీ దానం చేయడంతో ఆమెకు కిడ్నీ మార్పిడి జరిగింది.
అయితే, "ఎంత మందికి కిడ్నీ దాతలు దొరుకుతారు? కిడ్నీ లాంటి ఇతర అవయవాలు పోయిన తర్వాత వైద్యం చేయించుకునే స్థితిలో ఎంత మంది ఉంటారు" అని డాక్టర్ చంద్ర ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నెట్ చూసి ప్రసవాలు
కేరళలో గత వారం 17 సంవత్సరాల అమ్మాయి యూట్యూబ్ వీడియో చూసి ఎవరి సహాయమూ లేకుండానే బిడ్డను కన్నట్లు వార్తలొచ్చాయి. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇలా సొంతంగా ప్రసవాలకు పాల్పడటం చాలా ప్రమాదకరమని బీబీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ దాక్షాయిణి పూరిణి చెప్పారు.
2018లో తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఓ మహిళ తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది.

ఫొటో సోర్స్, DR DAKSHAYANI PURINI
సాధారణంగా గ్రామాల్లో ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల , వైద్యపరమైన అవగాహన లేకపోవడం వల్ల ప్రసవాలు చేసేందుకు స్థానికంగా ఉండే మంత్రసానులు లేదా కుటుంబ సభ్యులపై ఆధారపడుతూ ఉంటారని చెప్పారు.
వారికి అనుభవమే తప్ప వైద్యపరమైన శిక్షణ కానీ, నైపుణ్యం కానీ ఉండవని చెప్పారు.
ఈ పరిస్థితి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తుందని, ఒక వారం రోజుల క్రితమే లంబాడీ తెగకు చెందిన మహిళను తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు.
ప్రసవ సమయంలో బిడ్డను బలవంతంగా బయటకు తీయడం వల్ల గర్భసంచి పూర్తిగా చిట్లిపోయి, రక్తస్రావం ఎంతకీ ఆగకపోవడంతో చివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు.
అదృష్టవశాత్తూ ఆమె గర్భసంచిని కుట్టి చికిత్స చేసి పంపినట్లు చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని అన్నారు.
"కొన్ని సార్లు నగరాల్లో కూడా కొంత మంది పెళ్లి కాని అమ్మాయిలు గర్భం దాల్చినప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియకూడదనే ఉద్దేశ్యంతో సొంతంగా గర్భస్రావానికి పిల్స్ వాడటం లేదా నాటు వైద్యులను సంప్రదించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు" అని డాక్టర్ దాక్షాయిణి అన్నారు. "పరువు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా" అని ప్రశ్నించారు.
"ఈ సమస్య నగరాలకు మాత్రమే పరిమితం కాదు. ఏజెన్సీ ప్రాంతంలో మహిళలు కూడా వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలో మరణించిన ఘటనలను గుర్తు చేశారు.
"ఇప్పటికీ విద్య, వైద్యం వారికి అందని ద్రాక్షే" అని ఆమె అన్నారు. ఆమె కొన్నేళ్ల పాటూ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పని చేశారు.

ప్రసవ సమయంలో సాధారణ బ్లేడుతో బొడ్డు తాడును కోయడం వల్ల అది ఇన్ఫెక్షన్ గా మారి శిశువులు మరణిస్తూ ఉంటారని చెప్పారు.
అబార్షన్లు చేసుకునేటప్పుడు, పిల్లల్ని కనే సమయంలో వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంత వైద్యం చేసుకోవడం వల్ల -
- ఆస్టియోపొరోసిస్ రావడం (ఈస్ట్రోజన్ తగ్గడం వలన, ఎముకల్లో కాల్షియం తగ్గి, అవి గుల్లబారి తొందరగా విరిగి పోతుంటాయి).
- గర్భసంచిని తొలగించాల్సి రావడం
- ఎముకల పటుత్వం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పారు.
చిన్న వయసులోనే తమ పని తామే చేసుకోలేకపోవడం లాంటి పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు.
"స్వీయ చికిత్స చేసుకోవడం, వైద్య పర్యవేక్షణ లేకుండా ప్రసవాలకు పాల్పడటం లేదా అబార్షన్లు చేయించుకోవడం తల్లీ, బిడ్డలకు మాత్రమే కాకుండా కుటుంబం మొత్తానికి నష్టమే" అని డాక్టర్ దాక్షాయిణి అన్నారు.
భారతదేశంలో 2014-16 మధ్యలో ప్రతీ 100,000 జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి130 ఉండగా, 2016-18 నాటికి అది 113కు తగ్గినట్లు యూనిసెఫ్ పేర్కొంది.
భారతదేశంలో 2016లో 33,800 ఉన్న ప్రసూతి మరణాల సంఖ్య, 2018 నాటికి 26,437 కు తగ్గినట్లు తెలిపింది.
15-19 సంవత్సరాల వయసులో చోటు చేసుకునే మరణాల్లో అధికంగా ప్రసూతి మరణాలే ఉన్నట్లు యూనిసెఫ్ నివేదిక చెబుతోంది.
2016-18 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ 100,000 జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి 65 ఉండగా, తెలంగాణాలో ఆ నిష్పత్తి 63 ఉన్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
సెల్ఫ్ మెడికేషన్ భారతదేశంలో ఎందుకెక్కువ?
రాగిణికి పీరియడ్స్ రావడంలో జాప్యం జరిగింది. మూడు నెలల తర్వాత పీరియడ్స్ వచ్చాయి. కానీ, ఆమెకు రక్తస్రావం మాత్రం 20 రోజులయినా ఆగలేదు. ఇన్ని రోజులు రక్తస్రావం జరగడంతో ఆమె డాక్టర్ ను సంప్రదించారు.
రాగిణికి గతంలో ఎటువంటి గైనిక్ సమస్యలూ లేవు. ఆమె వయసు కూడా మెనోపాజ్‌కు దగ్గరగా ఉంది.
కానీ, డాక్టర్ మాత్రం స్కానింగ్ తో సహా అన్ని వైద్యపరీక్షలు చేయించమని సలహా ఇచ్చారు. కానీ, ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు ఎటువంటి సమస్య ఉన్నట్లు తేలలేదు. వైద్య పరీక్షల నిమిత్తం అయిన ఖర్చులు మాత్రం ఆమె పర్సును ఖాళీ చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యపరీక్షలే డాక్టర్ దగ్గరకు వెళ్లడాన్ని ఆపుతున్నాయా?
కొన్ని రోజుల పాటు రోగి ఆరోగ్య పరిస్థితిని గమనించకుండానే, ప్రతీ విషయానికీ టెస్ట్‌లు చేయించుకోమని చెప్పడం సరైంది కాదని డాక్టర్ చంద్ర కన్నెగంటి అంటున్నారు.
"దురదృష్టవశాత్తూ భారతదేశంలో ప్రతీ చిన్నఅనారోగ్య సమస్యకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లడం ముఖ్యం అనే ప్రచారం ఎక్కువగా ఉంది" అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
చిన్న నడుం నొప్పికి కూడా రోగిని పరిశీలించకుండానే ఎంఆర్‌ఐ స్కాన్ లు చేయించడం లాంటివి చేస్తూ ఉండటంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజల్లో భయం నెలకొందని చంద్ర అన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన వెంటనే రాసే 'ఫుల్ బాడీ మెడికల్ చెక్ అప్స్', బిల్లుల గురించి కూడా చాలా మందికి భయం ఉండటంతో ఆసుపత్రిలో అడుగు పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని డాక్టర్ చంద్ర అన్నారు.
వైద్యానికయ్యే ఖర్చు సామాన్యునికి భారంగా మారుతోందని ఆయన అన్నారు.
"ఇంటర్ నెట్, గూగుల్ లాంటి సాధనాలు ప్రజలకు సమాచారం తెలుసుకునేందుకు చాలా సౌలభ్యాన్ని కల్పించాయి. కానీ, సెల్ఫ్ మెడికేషన్ వల్ల కలిగే పరిణామాలు మాత్రం చాలా భయపెడుతున్నాయి" అని డాక్టర్ చంద్ర అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టాలేంటి?
సెల్ఫ్ మెడికేషన్ వల్ల తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు కానీ దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని డాక్టర్ చంద్ర హెచ్చరించారు.
యూకే లాంటి దేశాల్లో అయితే, స్వీయ చికిత్స నిషేధం. ఆ దేశాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల్లో మందులు కూడా ఇవ్వరని, ఇండియాలో అటువంటి విధానం అమలులో లేకపోవడమే చాలా సమస్యలకు మూలమని ఆయన అంటున్నారు.
మెడికల్ షాపుకు వెళ్లి సొంతంగా మందులు కొనుక్కోవడాన్ని ఆపాలని, స్వీయ చికిత్సల వల్ల హార్ట్ ఎటాక్ రావడం, కిడ్నీలు పోవడం, అవయవాలు దెబ్బ తినడం లాంటివి జరుగుతాయని హెచ్చరించారు.
డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దని ఆయన సూచించారు. "తప్పు గ్రహించే లోపు సరిదిద్దుకోలేని నష్టం వాటిల్లుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ కాలంలో పెరిగిన సెల్ఫ్-మెడికేషన్
ఇండియాలో కోవిడ్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన సమయంలో సెల్ఫ్ మెడికేషన్ మరింత ఎక్కువయినట్లు వార్తా కథనాలు కూడా వచ్చాయి.
దాంతో పాటు, కోవిడ్ సమయంలో విపరీతమైన తప్పుడు సమాచారం సోషల్ మీడియా వేదికలపై షేర్ అయింది. ఇంటి చిట్కాలు, నాటు వైద్యాలు, ప్రకృతి వైద్యాలు సూచిస్తూ వీడియోలు, సమాచారం వైరల్ అయింది.
కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక డాక్టర్‌కు డెంగీ సోకితే, కోవిడ్‌కు స్వీయ చికిత్స తీసుకోవడం మొదలుపెట్టి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దని , స్వీయ చికిత్స ప్రమాదకరమని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జి శ్రీనివాసరావు ప్రజలను హెచ్చరించారు.
కోవిడ్ సమయంలో ఆసుపత్రుల్లో తలెత్తిన ఆక్సిజన్, బెడ్స్ కొరతతో పాటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బిల్లులు కూడా చాలా మందిని ఆసుపత్రికి వెళ్లేందుకు భయపెట్టాయి.
భారతదేశ వైద్యరంగంలో ఉన్న లోపాలను కోవిడ్ ఎత్తి చూపిందని అంటూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగం నిధులు, వనరులు, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత నెలకొని ఉందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇటీవల ‘ది హిందూ’ పత్రికకు రాసిన వ్యాసంలో చెప్పారు.

ఫొటో సోర్స్, abnhpm.gov.in
దీనికి పరిష్కారమేంటి?
"రోగి ఆసుపత్రికి వెళ్లకపోవడానికి తప్పు కేవలం రోగిది కాదు, ప్రాథమిక వైద్య విధానం విఫలమవ్వడమే దీనికి కారణం అని డాక్టర్ చంద్ర అంటారు.
దేశంలో 2021-22 బడ్జెట్ లో ప్రాధమిక వైద్య రంగానికి 2.23 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 137 శాతం ఎక్కువ. అయితే, ప్రాధమిక వైద్యానికి కేటాయించాల్సిన నిధులు మరింత పెంచాలని డాక్టర్ చంద్ర అన్నారు.
ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (ఏబిహెచ్‌ఐఎం) లో పొందుపరిచిన వివిధ పథకాలు భారతదేశంలో ప్రాథమిక వైద్య రంగ విస్తృతిని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పథకం ద్వారా ప్రతిపాదించిన చర్యల వల్ల గ్రామీణ, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వం ప్రాథమిక వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టి వైద్య రంగంలో విధానపరమైన మార్పులు తెచ్చినప్పుడే పరిష్కారాలు సాధ్యమని చంద్ర అంటారు.
రోగికి వీలైనంత దగ్గర్లో ప్రభుత్వ వైద్యశాలలు, తగినంత మంది ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉంటే.. ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు
- ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులు
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- ‘‘నెలలో పదిహేను రోజులు దేవతలా వుంటుంది... మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది...’’: పీఎంఎస్ అంటే ఏమిటి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












