నిద్రలోకి జారే ముందు క్షణాల్లో అసలేం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
మనం నిద్రలోకి ఎలా వెళతాం? ఇది మనకు రోజూ జరిగేదే కావచ్చు. కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ ఇది ఇంకా అంతుచిక్కని లోతైన ప్రక్రియే.
మెలకువ నుంచి నిద్రలోకి జారటానికి మధ్య మగతగా ఉండే క్షణాల్లో నిజంగా ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని కనుగొనటానికి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
సచేతనంగా, నియంత్రణతో మెలకువగా ఉన్నఒక వ్యక్తి.. అచేతనంగా, కలలుకనే నిద్రపోయే వ్యక్తిగా ఎలా మారతారు అనేది లెక్కించటానికి, విశ్లేషించటానికి, అర్థం చేసుకోవటానికి వారు ప్రయత్నిస్తున్నారు.
అసలు ఈ మగత క్షణాలే రోజులో అత్యంత సృజనాత్మకమైన సమయమా? అనేది తెలుసుకోవాలని వారు భావిస్తున్నారు.
నిద్రలో మెదడు కార్యకలాపాలపై న్యూరోసైంటిస్టులు (నాడీ శాస్త్రవేత్తలు) పెద్ద ఎత్తున పరిశోధనలు చేసినప్పటికీ.. నిద్రలోకి ప్రవేశించటానికి ముందు క్షణాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువని కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంటున్నారు.
"కొందరు చాలా త్వరగా నిద్రపోతారు. కొందరికి చాలా చాలా సమయం పడుతుంది" అని చెన్నైకి చెందిన పరిశోధకుడు శ్రీధర్ రాజన్ జగన్నాథన్ అంటారు. కేంబ్రిడ్జ్‌లో గేట్స్ స్కాలర్లలో ఒకరైన ఆయన ఉద్యోగం.. మనుషులు నిద్రలోకి జారుకోవటాన్ని పరిశీలిస్తుండమే.
బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్లకు నిధులు సమకూరుస్తోంది.

ప్రమాదాల ముప్పు...
ఈ "మార్పు"కు మామూలుగా 5 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని జగన్నాథన్ చెప్తారు.
అయితే.. ఈ సమయంలో ప్రవర్తన చాలా విభిన్నంగా ఉండొచ్చు. కొందరికి నిద్రలోకి జారుకోవటం సజావుగా, నిరాఘాటంగా జరుగుతుంది. కానీ మరికొందరికి ఈ ప్రయాణం చాలా ఒడుదొడుకులతో సాగుతుంది.
"ఇతరులు మగతలోకి వెళ్లటం మొదలుపెడతారు. కానీ అంతలోనే అప్రమత్తతకు తిరిగొస్తారు" అని ఆయన చెప్తారు. నిద్ర పోవాలనే వాంఛకు, మెలకువగా ఉండాలనే కోరికలకు మధ్య "ఊగిసలాడుతున్నట్లు" వారు కనిపిస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే నిద్రలోకి ఆగి ఆగి వెళుతున్నట్లుగా ఉంటారు.
కొందరు నిద్రలోకి వెళ్లే తొలి దశల నుంచి తమకు తాముగా పదేపదే బయటకు రాగలుగుతుంటారని.. కేంబ్రిడ్జ్ న్యూరోసైన్స్ బృందం పనిచేస్తున్న పరిశోధనశాల సారథి డాక్టర్ ట్రిస్టన్ బెకన్‌స్టైన్ పేర్కొన్నారు.
నిద్రకు - మెలకువకు మధ్య గల ఈ దశలను "సచేతన తుషారాలు"గా ఆయన అభివర్ణిస్తారు. కళ్లు మూతపడుతూ, ధ్యానం పరిభ్రమిస్తూ, మెలకువలోని ఆలోచనలు కరిగిపోవటం మొదలయ్యే సమయమది.
నిద్ర ముందు గల ఈ దశకు, ప్రమాదాలకు గల సంబంధం ఎలాంటిది? ఈ దశకు - మనుషులు ప్రమాదకర పొరపాట్లు చేయటానికి ఏదైనా సంబంధం ఉందా? అనే అంశంపై జగన్నాథన్ పరిశోధన దృష్టి సారిస్తోంది.
ఎవరైనా ఒక వ్యక్తి పగటిపూట పనిచేస్తున్నపుడు కూడా ఇది జరగొచ్చు. వారు మెలకువగా ఉండి పనిచేస్తున్నట్లు కనిపించొచ్చు. కానీ వారు నిద్ర వాకిట్లోకి ప్రవేశించటం మొదలైనపుడు గణనీయమైన ప్రమాదాలు పొంచివుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
"చిన్న కునుకు.. పెద్ద సమస్యలు..."
"మనం ఏదైనా విసుగుపుట్టే పనిచేస్తున్నపుడు మనం నిజంగా గాఢ నిద్రలోకి వెళ్లకపోవచ్చు. కానీ మనం ఒక మగత పరిధిలో ఉంటాం. మనం అప్రమత్తంగా లేమని, కళ్లు తేలిపోతున్నాయని మనకు తెలుస్తుంది" అంటారు జగన్నాథన్.
"ఈ చిన్న కునుకులు పెద్ద సమస్యలను పుట్టించగలవు" అని ఆయన చెప్తారు. ఈ పరిస్థితి డ్రైవింగ్ వంటి పనుల్లోనే కాదు.. ఏకాగ్రత, నిర్ణయాత్మకత ప్రధానమైన ఏ పనుల్లోనైనా భద్రతకు ముప్పుకాగలదు.
మనుషులు ఈ దశలోకి ప్రవేశించినపుడు ప్రతిస్పందన సమయాలు ఎలా మారతాయనే దాన్ని కేంబ్రిడ్జ్ పరిశోధనశాలల్లో వీరు అధ్యయనం చేస్తున్నారు.
నిద్ర మొదలయ్యే దశ గురించి హెచ్చరించే మార్గాలను కనుక్కోవటానికి, కళ్ల కదలికల్లో లేదా మెదడు కార్యకలాపాల్లో మార్పులను గుర్తించటానికి పరిశోధనలు జరుగుతున్నాయని జగన్నాథన్ చెప్పారు.
ఈ మగత దశలో కుడిచేతి వాటం ఉన్న వారిలో ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు ఉన్నట్లు కనిపిస్తున్నాయో తెలుసుకోవాలని కూడా ఆయన భావిస్తున్నారు.
నిద్రలోకి వెళ్లేటపుడు, మెలకువలోకి వచ్చేటపుడు మెదడు కార్యకలాపాలపై చేస్తున్న పరిశోధనలు.. పక్షవాత బాధితులకు పడిపోయిన శరీర అవయవాల మీద తిరిగి నియంత్రణ సాధించేందుకు చేస్తున్న కృషికి దోహదపడతాయన్న ఆశలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పగటికలల విశ్వాసి...
నిద్ర సరిహద్దుల్లోని ఈ అంతుచిక్కని క్షణాలకు సానుకూల కోణాలూ ఉన్నాయి. ఈ సమయంతో సృజనాత్మకతకు, కల్పనాశక్తికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది.
"ఈ మార్పు స్థితిలో ఉన్నపుడు మన సంశయాలు తక్కువగా ఉంటాయి. అది మనల్ని మరింత సృజనాత్మకంగా చేస్తుంది" అంటారు జగన్నాథన్.
"మన ఆలోచనల్ని వ్యక్తీకరించటానికి మరింత స్వేచ్ఛ ఉంటుంది. తప్పులు చేయటానికి ఎక్కువ సంసిద్ధంగా ఉంటాం" అని ఆయన చెప్తారు.
చిత్రకారులు, సంగీతకారులు, రచయితలు ఇటువంటి క్షణాల్లో స్ఫూర్తి పొందారనే భావనను ఇది బలపరుస్తోంది.
మనం నిద్రలోకి జారిపోతున్నపుడు బయటి ప్రపంచంతో ఎలా అనుసంధానమై ఉంటామనే అంశం మీద కూడా ఈ పరిశోధన దృష్టి సారిస్తోంది.
నిద్రలోకి వెళుతున్నవారి నుంచి శబ్దాలకు, పదాలకు స్పందన ఉండకపోవచ్చు కానీ.. సదరు వ్యక్తి పేరు పలికినపుడు ఆ వ్యక్తి మెలకువలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని జగన్నాథన్ అంటారు.
ఒక వ్యక్తి నిద్రలో తన పేరును వినటాన్ని పరిశీలించటం "చాలా చిత్రంగా" ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
సమయపాలన...
మెదడు ఎలా పనిచేస్తుందనే ఆనవాళ్లను ఇది పరిశోధకులకు అందిస్తుంది. శబ్దాలను పసిగట్టే యంత్రంలాగా కాకుండా.. నిద్రలో సైతం వ్యక్తిగతంగా అర్థవంతమైన దానికి ప్రతిస్పందించే.. ఇతర శబ్దాల నుంచి పేరును వేరు చేసి గుర్తించగలిగే మెదడు పనితీరు గురించి అది తెలియజేస్తుంది.
"దేనికి సంబంధించినదైనా దాని అర్థం చాలా చాలా ముఖ్యం" అని జగన్నాథన్ చెప్తారు.
మనుషులు నిద్రపోతున్నపుడు వారికి గడుస్తున్న కాలం గురించి ఏమాత్రం తెలియదని అనుకోవటం కూడా తప్పేనని డాక్టర్ బెకన్‌స్టైన్ అంటారు.
తెల్లవారుజామునే విమానం ఎక్కవలసివున్న ఒక వ్యక్తి.. తన అలారం మోగటానికి కొన్ని నిమిషాల ముందుగానే నిద్ర నుంచి మేల్కొనగలగటాన్ని ఆయన దీనికి ఉదాహరణగా చూపుతారు.
"సమయ పాలన కచ్చితత్వం చాలా అధికంగా ఉంటుంది. నిద్రలో ఉన్నప్పటికీ ఎంత సమయం గడిచిపోయిందనే దానిని జనం మనం అనుకున్న దానికంటే అధికంగానే నిర్ణయించగలరని కనిపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
నిద్రకు గల గొప్ప క్రూరత్వం గురించి కూడా డాక్టర్ బెకన్‌స్టైన్ చెప్తారు. అదేమిటంటే.. మనం నిద్రపోలేని ఒకే ఒక్క సమయం.. మనం నిద్రపోవాలని బలంగా అనుకున్నపుడు.
సాధ్యమైనంత త్వరగా నిద్రపోతే నగదు ప్రోత్సాహమిస్తామంటూ కొందరు విద్యార్థులపై ప్రయోగాలు చేశారు. కానీ త్వరగా నిద్రపోవాలనే ఒత్తడి ప్రతికూల ప్రభావం చూపింది.
ఒత్తిడిని వదిలేసి నిద్రపోవటం ఎలా అనేదాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని జగన్నాథన్ చెప్తారు.
"ఎవరైనా నిద్రలేమితో బాధపడుతున్నట్లు చెప్తున్నారంటే.. అది నిద్ర నాణ్యత గురించి వారు అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లు. ఎంత సేపు నిద్రపోతారు? మెలకువ వస్తుందా? అనే అంశాలన్నమాట" అని ఆయన వివరించారు.
"కానీ ఎంత బాగా నిద్రలోకి వెళ్లారు అనేదాన్ని వారు అసలు పట్టించుకోరు. అది చాలా ముఖ్యం. అది ఇతర సమస్యల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది" అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








