ఆర్టీసీ బస్సులో ప్రసవం, కవలల జననం -ప్రెస్‌రివ్యూ

ఆర్టీసీ బస్సు

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వైద్య పరీక్షల కోసం డాక్టర్‌ వద్దకు వెళ్లి వస్తున్న ఓ గర్భిణి ఆర్టీసీ బస్సులోనే ప్రసవించారని 'సాక్షి' కథనం తెలిపింది.

''వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన లక్ష్మి ఏడు నెలల గర్భవతి.

మంగళవారం కడుపులో నొప్పి రావడంతో తల్లితో కలిసి కోస్గి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు.

దాంతో గర్భిణి, ఆమె తల్లి కలిసి రాత్రి 9.15 గంటలకు ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు.

బస్సు కోస్గి పరిధిలోని సంపల్లి శివార్లలో ఉండగా లక్ష్మికి పురిటినొప్పులు వచ్చాయి.

తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వగా.. 108 సిబ్బంది అబ్దుల్‌ అసద్, దేవేందర్‌ నాయక్‌ వెంటనే అక్కడికి చేరుకుని.. బస్సులోనే కాన్పు చేశారు.

కవల ఆడపిల్లలు జన్మించారు. తర్వాత తల్లీబిడ్డలను 108 వాహనంలో కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపార''ని ఆ కథనంలో రాశారు.

జ్వరంతో బాధపడుతున్న బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో జ్వరాల తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని 'ఈనాడు' కథనం తెలిపింది.

''ఓవైపు కరోనా, మరోవైపు జ్వరాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా, డెంగీ లక్షణాలు ఒకేలా ఉండడంతో ప్రజలలో ఆందోళన తీవ్రంగా ఉంది.

రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా, గన్యా కేసులు నమోదవుతున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరులోనూ కేసులు పెరుగుతున్నాయి.

జ్వర పీడితుల సంఖ్యకు తగ్గట్లుగా ఆసుపత్రులలో సేవలు అందడం లేదు.

రక్తపరీక్షలకు ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చి రూ. వేలల్లో ఖర్చవుతోంది.

మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి భారీగా రోగులు వస్తున్నా జ్వర నిర్ధరణ కిట్లు లేవు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

బండి సంజయ్

ఫొటో సోర్స్, Bandi Sanjay

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం

తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''ఈ చట్టం ద్వారా ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

యూపీలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే.. కేసీఆర్‌ మాత్రం మత పరమైన రిజర్వేషన్‌ బిల్లు తేవాలని చూశారని విమర్శించారు.

ఎంఐఎంను గెలిపించేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం ఇస్తూ చట్టం తీసుకురావాలని చూశారని.. బీజేపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారన్నారు.

కేసీఆర్‌కు దమ్ముంటే ఇలాంటి బిల్లు పెట్టాలని.. తాము ఎక్కడ అడ్డుకోవాలో అక్కడే అడ్డుకొని తీరుతామని అన్నారు. బీజేపీ సత్తా ఏంటో పాతబస్తీలో సభ పెట్టి చూపించామన్నారు.

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మంత్రి హరీశ్‌ ఉపన్యాసాలకే పరిమితమయ్యాడే తప్ప చేసిందేమీ లేదని విమర్శించార''ని ఆ కథనంలో రాశారు.

తిరుమల

తిరుమలలో ప్రారంభమైన సర్వదర్శనాలు

తిరుమలలో సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది. అయితే ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించింది.

ఉదయం 6 నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు రెండు వేల చొప్పున టికెట్లు ఇస్తున్నారు. శ్రీనివాసం కౌంటర్లలో టికెట్లు జారీచేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాల వారికి కూడా టికెట్లు జారీ చేయనున్నారు.

కరోనా దృష్ట్యా ఏప్రిల్‌ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. కేవలం రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతించారు. గతంలో నిత్యం 8 వేల సర్వదర్శనం టికెట్లను జారీచేసేవార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)