టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తే జైల్లో పెడతారా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, రజినీ వైద్యనాథన్
- హోదా, బీబీసీ సౌత్ ఆసియా కరస్పాండెంట్
పాకిస్తాన్‌తో భారత్ ఆడిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూసేందుకు అందరిలానే నఫీసా అట్టారీ కూడా టీవీకి అతుక్కుపోయారు.
ఈ మ్యాచ్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను ఆస్వాదించిన వారిలో ఉదయ్‌పుర్‌కు చెందిన స్కూల్ టీచర్ నసీఫా కూడా ఒకరు.
అయితే, ఆ తర్వాత ఆమెను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాక్ విజయంపై సంబరంగా వాట్సాప్ స్టేటస్ పెట్టడమే ఆమె చేసిన నేరం.
మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన కొందరు ముస్లింలను భారత్‌లో అరెస్టుచేశారు. వారిలో నసీఫా కూడా ఒకరు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈ అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయంటూ పలువురు మానవ హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ముస్లింలను లక్ష్యంగా చేసుకునేందుకు హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉపయోగిస్తున్న అస్త్రాల్లో ఈ అరెస్టులు కూడా ఒకటని మరికొందరు ధ్వజం ఎత్తుతున్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ప్రభుత్వం ఖండిస్తోంది.

‘‘గెలిచేశాం.. మనం గెలిచాం’’అని నఫీసా తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారు. కొందరు క్రికెటర్ల ఫోటోలను కూడా ఆమె స్టేటస్‌లో పెట్టారు.
ఆమె విద్యార్థుల్లోని ఒకరి తల్లిదండ్రులు ఈ పోస్ట్ చూశారు. ఆ తర్వాత దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది.
దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను నేరాలుగా పరిగణించే ఐపీసీ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేశారు.
స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బాగా కుంగిపోయినట్లు కనిపించారు. తను చేసిన నేరానికి క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘ఒకరు వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. నువ్వు పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నావా? అని అడిగారు. అయితే, ఆ మెసేజ్‌లో ఎమోజీలు ఉన్నాయి. సరదాగా అనిపించి నేను కూడా అవునని చెప్పాను’’అని ఆమె వివరించారు.
‘‘దీని అర్థం నేను పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు కాదు. నేను భారతీయురాలిని. నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను.’’
బెయిల్‌పై విడుదలైన ఆమె ప్రస్తుతం ఇంటికి వచ్చేశారు. తన పాప, భర్తతో కలిసి ఈ అభియోగాలపై పోరాడతానని ఆమె చెప్పారు.
‘‘పోలీసులు చేసింది పూర్తిగా తప్పు. ఎవరైనా తప్పుచేస్తే లేదా వారితో ఏకీభవించకపోతే.. నేరం చేసినట్లు కాదు. వారిపై దేశ వ్యతిరేకులని ముద్ర వేయకూడదు. ఇది మన రాజ్యాంగం, చట్టాలకు పూర్తి వ్యతిరేకం’’అని ఆమె న్యాయవాది రాజేశ్ సింఘ్వి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఆమెపై అతివాద హిందూ జాతీయవాద సంస్థ బజ్‌రంగ్ దళ్‌కు చెందిన రాజేంద్ర పర్మార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
‘‘ఇలాంటి వారిని పాకిస్తాన్ పంపించేయాలి. ఇక్కడే ఉంటారు, ఇక్కడే జీవిస్తారు, ఇక్కడే పనిచేసుకుని డబ్బులు సంపాదిస్తారు... కానీ అక్కడి వారికి మద్దతు తెలుపుతారు’’అంటూ బీబీసీతో ఆయన అన్నారు.
ఫిర్యాదు విషయంలో తను ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడంలేదని అన్నారు. ‘‘ఇది ఆమెకు ఒక గుణపాఠం కావాలి. ఆమె ఒక స్కూల్ టీచర్. ఆమె పిల్లలకు ఎలాంటి పాఠాలు బోధిస్తారు?’’అని ఆయన ప్రశ్నించారు.
1947లో దేశ విభజన అనంతరం రెండు దేశాలుగా విడిపోయిన భారత్, పాకిస్తాన్‌లలో.. చాలా మందిలో ఒకరిపై మరొకరికున్న విరోధ భావానికి ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి.
ఈ ఉద్రిక్తతలు కశ్మీర్‌లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1980ల నుంచీ జమ్మూకశ్మీర్‌లో భారత్ పాలనకు వ్యతిరేకంగా కొన్ని మిలిటెంట్ సంస్థలు కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపిన కొందరు కశ్మీరీ వైద్య విద్యార్థులపై కూడా తాజా కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. దీనిలో బీజేపీ మాజీ చట్టసభ సభ్యుడు విక్రమ్ రంధావా మాట్లాడుతూ కనిపించారు. ‘‘భారత గడ్డపై పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన.. ఆ విద్యార్థుల తోలు వలిచేయాలి. వారి డిగ్రీలు, పౌరసత్వాన్నికూడా రద్దు చేయాలి’’అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కూడా ఆయనపై చర్యలు తీసుకుంది. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆయనకు ఆదేశించింది.
ఇలాంటి విద్వేష వ్యాఖ్యలను ఖండిస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌కు మద్దుతు తెలపడాన్ని సీనియర్ బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఇలాంటి చర్యలను నేరంగానే పరిగణించాలని వారు అంటున్నారు.
బీజేపీ నాయకుడిగా మారిన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయంపై స్పందించారు. పాకిస్తాన్ విజయాన్ని వేడుకగా చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
‘‘పాకిస్తాన్ విజయంపై బాణసంచా కాలుస్తూ వేడుకలు చేసుకున్నవారు అసలు భారతీయులే కాదు. మేం మన జట్టుకు అండగా నిలబడతాం’’అని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని ఆయన అన్నారు.
బ్రిటిష్ కాలంనాటి దేశద్రోహం చట్టం.. ప్రభుత్వంపై విమర్శలను నేరంగా పరిగణిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను కట్టడి చేసేందుకు దీన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారని చాలామంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను ఏకం చేసేందుకు బీజేపీ అనుసరిస్తున్న విధానాల్లో ఈ చర్యలు కూడా ఒకటి’’అని ద సీన్ అండ్ ద అన్ సీన్ పాడ్‌కాస్ట్ హోస్ట్ అమిత్ వర్మ చెప్పారు.
‘‘దశాబ్దాలపాటు ఎలాంటి వివాదాలు లేని గోవధ, హిందు-ముస్లింల వివాహాలు లాంటి అంశాలను మళ్లీ వారు ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేవారిపై అణచివేత కూడా ఆ విధానాల్లో భాగం చేశారు.’’
‘‘నిజానికి ఈ అంశాల్లో పెద్ద విషయం లేదు. కానీ, వీటిని హిందు-ముస్లింలను విభజించేందుకు అస్త్రాలుగా మలుచుకుంటున్నారు.’’
అయితే, ఇలాంటి ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికార ప్రతినిధి చెప్పారు. ఎవరో కొంతమందిపై తీసుకునే చర్యలను చూపిస్తూ.. ఒక మతానికి చెందినవారిని లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పడం సరికాదని అన్నారు.
‘‘భారత్ పరాజయాన్ని వారు వేడుకగా చేసుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తే ముప్పుంది. వీటిని ఎలాగైనా అడ్డుకోవాలి’’అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా బీబీసీతో చెప్పారు. ఈ అరెస్టులు సరైనవేనని ప్రభుత్వానికి ఆయన మద్దతు పలికారు.
‘‘ఇద్దరు విద్యార్థులు, లేదా ఐదు మంది లేదా ఒక టీచర్ చర్యలు రెచ్చగొట్టేలా ఉంటే, దానితో చాలా పెద్ద సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలాంటివాటిని మనం ఎలాగైనా అడ్డుకోవాలి. వీటిపై దర్యాప్తు చేపట్టాలి’’అని ఆయన అన్నారు.
అయితే, అనవసరంగా తమ కుటుంబ సభ్యులపై చర్యలు సుకుంటున్నారని అరెస్టైన వారి బంధువులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్ ప్రదేశ్‌లోనూ పాక్ విజయంపై వేడుకలు చేసుకున్నారని ఏడుగురిపై కేసు నమోదైంది.
‘‘వారు అగౌరవకరమైన పదాలు ఉపయోగించారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇవి శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు’’అని పోలీసులు చెప్పారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆగ్రాలోని ఓ కాలేజీలో చదువుతున్న అర్షద్ యూసెఫ్, ఇనాయత్ ఆల్తాఫ్, షౌకత్ అహ్మద్ ఉన్నారు. ఇప్పుడు వీరు జైలులో ఉన్నారు. వీరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. లాయర్‌ను నియమించుకోవడం కోసం వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
‘‘మేం ఇలాంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయపరమైన సాయం అందించం. ఎందుకంటే వీరు భారత్‌లో జీవిస్తూ పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నారు’’అని ఆగ్రా యాంగ్ లాయర్స్ అసోసియేషన్‌కు చెందిన నితిన్ వర్మ వ్యాఖ్యానించారు.
‘‘ఇవి దేశ వ్యతిరేక చర్యలు. వీటిని మేం వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించకూడదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ మ్యాచ్‌తో ఇలాంటి వివాదాలు, అరెస్టులు చోటుచేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు.
2014లో భారత్-పాక్ మ్యాచ్‌లో పాక్‌కు మద్దతు పలికిన 60 మంది కశ్మీరీ యువకులపై కేసు పెట్టారు. అయితే, న్యాయ మంత్రిత్వ శాఖ సూచనలపై ఈ ఆరోపణలను కొట్టివేశారు.
భారత్ జాతీయవాదంలో క్రికెట్ మొదట్నుంచీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం, నిజమైన భారతీయులంతా భారత క్రికెట్ జట్టుకు మద్దతు తెలపడం ముఖ్యమని 56 శాతం మంది భారతీయులు అభిప్రాయపడుతున్నారు.
‘‘ప్రత్యర్థుల క్రికెట్ జట్టుకు మద్దతు తెలపడం నేరమని ఏ చట్టం చెబుతోంది’’అని క్రికెట్ జర్నలిస్టు, సోషల్ కమెంటర్ శారద ఉగ్ర అన్నారు.
‘‘బ్రిటన్, ఆస్ట్రేలియాలలో ఉంటున్న భారత సంతతి ప్రజలు.. భారత జట్టుకు మద్దతు తెలపడం నేరమా?’’అని ఆమె అన్నారు. ఇలాంటి చర్యలకు మతం పేరుతో ప్రజలను విభజించడమే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ఘటనలు పాకిస్తాన్‌లోనూ చోటుచేసుకున్నాయి.
2016లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా పాక్‌లో భారత జెండాను ఎగురవేసిన పాకిస్తానీని అరెస్టు చేశారు.
క్రికెట్ విషయానికి వస్తే, రెండు దేశాల్లోనూ ఉద్వేగాలు పతాక స్థాయిలో కనిపిస్తాయి. అయితే, భారత్‌లో తాజా అరెస్టుల వల్ల చాలా మంది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని భావిస్తున్నారు.
(కునాల్ సెహగల్ ఈ కథనానికి అదనపుసమాచారం అందించారు)
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













