క్రికెట్ వరల్డ్ కప్: భారత్-పాకిస్తాన్ ఆడిన 5 మరపురాని మ్యాచ్‌లు

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌లు రెండూ సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్‌తో తలపడుతుంది. పాకిస్తాన్, న్యూజీలాండ్‌తో ఆడుతుంది. ఒకవేళ పాకిస్తాన్, భారత్ కనుక సెమీస్‌లో గెలిస్తే జరగబోయే ఫైనల్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేం.
ఇప్పటికే, సూపర్-12లో పాకిస్తాన్-భారత్‌ల మ్యాచ్ విరాట్ కోహ్లీ వీరవిహారంతో సంచలనం రేపింది. ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడితే అది క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ అవుతుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారిగా 2007లో తలపడ్డాయి. ఆ ఫైనల్లో విజయం భారత్‌ను వరించింది.
ఈ నేపథ్యంలో, భారత్-పాకిస్తాన్ జట్లు గతంలో ఫైనల్లో తలపడిన సందర్భాలేంటో ఒకసారి చూద్దాం.
ప్రధాన టోర్నమెంట్లు మినహాయిస్తే, భారత్-పాక్ జట్లు రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చాలా అరుదుగా తలపడుతున్నాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ ఏడు సార్లు తలపడగా, అన్నింటా భారత్ ఘనవిజయం సాధించింది.
రెండు జట్ల మధ్య జరిగిన టాప్-5 మ్యాచ్‌ల వివరాలివీ...

ఫొటో సోర్స్, Getty Images
1996 ప్రపంచ కప్
బెంగళూరులో జరిగిన ఈ క్వార్టర్-ఫైనల్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ 93 పరుగులతో రాణించగా, అజయ్ జడేజా 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
ఓపెనర్లు అమీర్ సోహైల్, సయీద్ అన్వర్‌లు 10 ఓవర్లలో 84 పరుగులు చేయడంతో పాకిస్తాన్‌కు చక్కటి శుభారంభం లభించింది.
ఇక ఆ తర్వాత జరిగిన ఓ ఘటన అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న సోహైల్ బంతిని బౌండరీకి పంపించి, ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ వద్దకు వెళ్లి, తన బ్యాట్‌ను బౌండరీ వైపు చూపించి, ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు.
ఆ తర్వాత ప్రసాద్ ఓ చక్కటి బంతితో సోహైల్‌ని క్లీన్ బౌల్డ్ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రసాద్ వేసిన బంతికి ఆఫ్ స్టంప్ ఎగిరిపడుతుంది. దీంతో సంబరాలు చేసుకుంటూ ప్రసాద్ పిచ్‌పై పరుగెత్తడంతో ప్రేక్షకుల ఆనందం ఆకాశాన్ని తాకింది.
ఈ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించడంతోపాటూ పాకిస్తాన్‌ను టోర్నమెంట్ నుంచి వైదొలగేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
2003 ప్రపంచ కప్
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ను ఇరు జట్ల మధ్య జరిగిన మరపురాని పోటీల్లో ఒకటిగా గుర్తుపెట్టుకుంటారు.
సయీద్ అన్వర్ సెంచరీతో పాకిస్తాన్ 273 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
పాకిస్తాన్ భీకర పేస్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌లు ఛేజింగ్‌లో భారత్‌కు ఒక పెద్ద సవాలుగా మారారు.
కానీ, సచిన్ తెందూల్కర్ బౌండరీలతో హోరెత్తించాడు. కండరాలు పట్టేసినా, 75 బంతుల్లో 98 పరుగులు సాధించాడు.
యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్ 26 బంతులు మిగిలివుండగానే విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్
14 సంవత్సరాల క్రితం, దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత్ గెలుచుకుంది.
టోర్నీలో భారత్ ఫేవరెట్ కాదు. పైగా అప్పటికి ఈ ఫార్మాట్ కొత్తది. భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ జట్టులో లేరు.
అదే సంవత్సరం ప్రారంభంలో జరిగిన ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో భారత్ ఓటమి చెందడం, అనంతరం జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకోవడంతో ధోనిపై ఒత్తిడి ఉంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగులు చేసింది. కానీ మ్యాచ్ చివరి ఓవర్‌ను అంతగా ప్రాచుర్యం లేని బౌలర్ జోగిందర్ శర్మకు ఇవ్వాలని ధోని తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను ఊపిరిబిగబట్టేలా చేసింది.
మిస్బా ఉల్ హక్ స్ట్రైక్‌లో ఉన్నాడు. చివరి ఓవర్‌లో విజయం కోసం పాకిస్తాన్‌కు 6 బంతుల్లో 13 పరుగులు అవసరం.
మొదటి రెండు బంతుల్లో శర్మ సిక్సర్ రూపంలో ఆరు పరుగులిచ్చాడు. దీంతో భారత జట్టులో ఆశలు ఆవిరయ్యాయి. అయినా కానీ, శర్మను ప్రశాంతంగా బౌలింగ్ వేయమని ధోనీ ప్రోత్సహించాడు.
గెలవడానికి నాలుగు బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే కావాలి. మిస్బా బంతిని వెనకవైపుగా భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. ఆ బంతిని శ్రీశాంత్ ఒడిసిపట్టడంతో భారత్ మరపురాని విజయాన్ని కైవసం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
2011 ప్రపంచకప్
క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత, భారత్ మొహాలీలో పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌ల్లో తలపడింది.
2008 ముంబయి ఉగ్రదాడులతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండు జట్లు తలపడటం అదే తొలిసారి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది.
"మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్"గా పరిగణించే ఈ మ్యాచ్‌కు, రెండు దేశాల ప్రధానులు హాజరయ్యారు.
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించారు.
ఆరో ఓవర్లో సెహ్వాగ్ ఔటయ్యాడు. తెందూల్కర్ ఇచ్చిన క్యాచ్‌లను పాకిస్తాన్ ఫీల్డర్లు నాలుగు సార్లు జార విడిచారు. తెందూల్కర్ 85 పరుగులు చేశాడు. 36 పరుగులు చేసిన సురేశ్ రైనా జట్టు స్కోరుని 261కి చేర్చాడు.
పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ హఫీజ్ 43 పరుగులు చేశాడు. అయితే, భారత్ తన బౌలింగ్ వ్యూహాలు, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత్, విశ్వవిజేతగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
2019 ప్రపంచ కప్
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ముందు 336 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 57 పరుగుల వద్ద ఔటయ్యాడు.
రోహిత్ శర్మ పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడి 113 బంతుల్లో 140 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 65 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
పాకిస్తాన్‌కు చెందిన జమాన్ 62(75), బాబర్ ఆజం 48(57) పరుగులు చేసి పోరాడారు.
కుల్దీప్ యాదవ్ ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. వరుణుడు చాలా సార్లు అడ్డుపడిన ఈ మ్యాచ్, చివరకు ఇండియా ఘన విజయంతో ముగిసింది.
ఇవి కూడా చదవండి:
- భారత్ పరీక్షించిన అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఢీకొట్టగలిగే ఆయుధాలు పాకిస్తాన్ వద్ద ఉన్నాయా?
- పుట్టగొడుగులతో డిప్రెషన్ తగ్గిపోతుందా... తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు10 జాగ్రత్తలు ఇవే...
- ఉత్తరాఖండ్: జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్
- భూమిలో 650 అడుగుల లోతున 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు - ప్రాణలతో ఎలా బయటకు వచ్చారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








