భూమిలో 650 అడుగుల లోతులో చిక్కుకుపోయారు.. 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు

ఫొటో సోర్స్, NEWS1
దక్షిణ కొరియాలో కూలిపోయిన ఒక జింక్ గనిలో 9 రోజుల పాటు చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులను ఎట్టకేలకు రక్షించారు.
వారు ఈ 9 రోజులు కేవలం కాఫీ పొడి తిని ప్రాణాలు కాపాడుకున్నరు.
కూలిన గనిలో చిక్కుకుపోయిన కార్మికులలో ఒకరి వయసు 62 ఏళ్లు కాగా మరొకరి వయసు 56 ఏళ్లు.
తమకు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్‌తో చిన్న టెంట్ వేసుకుని అక్కడ దొరికినవాటితో మంట రాజేసి వాతావరణాన్ని వెచ్చగా మార్చుకుని వారు ఎముకలు కొరికే చలి నుంచీ కాపాడుకున్నారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని అధికారులు తెలపారు.
దక్షిణ కొరియాలోని తూర్పు ప్రాంతం బొంగ్వాలో అక్టోబర్ 26న వీరు పనిచేస్తున్న జింక్ గనిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో భూగర్భంలో 200 మీటర్లు (సుమారు 650 అడుగులు) లోతున వీరు చిక్కుకుపోయారు.
గనిలో చిక్కుకుపోయిన తొమ్మిది రోజుల తరవాత చివరకు వారిని నవంబర్ 4న రక్షించగలిగారు.
గని నుంచి బయటకు తెచ్చిన తరువాత వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరిని సురక్షితంగా బయటకు తేవడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు స్పందిస్తూ 'ఇదో అద్భుతం' అన్నారు.
'జీవన్మరణాల మధ్య కూడలి నుంచి బయటపడి సురక్షితంగా బయటకు రాగలిగినందుకు మీకు ధన్యవాదాలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గని పైకప్పు నుంచి కారిని నీటి తాగుతూ... తమ వద్ద ఉన్న ఇన్‌స్టంట్ కాఫీ మిక్స్ పౌడర్ తింటూ వారు ప్రాణాలు నిలపుకొన్నారని అధికారులు చెప్పారు.
దక్షిణ కొరియాకు చెందిన యాన్‌హాప్ వార్తాఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం... గనిలో కార్మికులు చిక్కుకున్న తరువాత డ్రిల్ చేసి ఒక చిన్న కెమేరాను లోనికి పంపించారు. దాని సహాయంతో వీరు ఎక్కడ చిక్కుకున్నారో గుర్తించి సహాయ చర్యలు ప్రారంభించారు.
గనిలోని షాఫ్ట్స్ కలిసే చోట ఉన్న ఖాళీలో ఇద్దరూ దగ్గరదగ్గరగా కూర్చున్నట్లు కెమేరా సహాయంతో గుర్తించారు. లోపల చలి నుంచి రక్షించుకునేందుకు ఇద్దరూ దగ్గరదగ్గరగా కూర్చున్నారు.
అధికారులు రక్షించిన ఇద్దరిలో ఒకరి బంధువు మీడియాతో మాట్లాడుతూ.. తన మామ గని నుంచి బయటకు వచ్చిన తరువాత తనను గుర్తించలేకపోయారని... దాదాపు పది రోజులు గనిలో చీకట్లో ఉన్న ఆయన్ను బయటకు తెచ్చిన తరువాత కళ్లకు మాస్క్ వేశారని చెప్పారు.
ఆయన్ను రక్షించడం గొప్ప విషయమని, ఇదంతా కలలా ఉందని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఔట్
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- లాటరీలో రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఆటో డ్రైవర్‌కు ఊహకందని కష్టాలు
- చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు10 జాగ్రత్తలు ఇవే...
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













