చైనా గని ప్రమాదం: ‘మేం బతికే ఉన్నాం కాపాడండి.. వారం రోజులుగా భూగర్భ గనిలో చిక్కుకున్న 12 మంది కార్మికుల సందేశం’.. మరో 10 మంది ఏమయ్యారు

ప్రవేశ మార్గానికి 600 మీటర్ల దూరంలో కార్మికులు ఉన్నట్లు అధికారుల అంచనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రవేశ మార్గానికి 600 మీటర్ల దూరంలో కార్మికులు ఉన్నట్లు అధికారుల అంచనా

వారం రోజుల కిందట చైనాలోని ఓ గనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో 12మంది ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి.

“మమ్మల్ని కాపాడే ప్రయత్నాలను ఆపొద్దు’’ అన్న సందేశాన్ని లోపలున్న వర్కర్లు పంపగలిగారని చైనా అధికార మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఈ ప్రమాదంలో మరో 10మంది కార్మికుల ఏమయ్యారో, ఎలా ఉన్నారో ఇంకా తెలియరాలేదు.

చైనాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికార సిబ్బంది విఫలమవుతోందన్న విమర్శలున్నాయి.

చైనాలో గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చైనాలో గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి

జనవరి 10న షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని హుషాన్‌ అనే గనిలో ప్రమాదం జరిగింది. భూగర్భంలో నిర్వహించిన ఒక పేలుడుతో కార్మికులు బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది.

గని లోపల ఉన్నవారితో కమ్యూనికేషన్‌ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా ధ్వంసమైంది.

అయితే అనేక ప్రయత్నాల తర్వాత లోపల ఉన్న కార్మికుల నుంచి అధికారులు సమాచారం సాధించగలిగారని చైనా అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి.

ఒక చిన్నరంధ్రం ద్వారా కార్మికులకు అవసరమైన మందులు, ఆహారం, పేపర్‌, పెన్సిళ్లను అధికారులు పంపగలిగారని, గని మధ్య భాగంలో తాము 12మంది సజీవంగా ఉన్నామని వారి నుంచి వచ్చిన తిరుగు సమాచారంలో ఉన్నట్లు మీడియా వెల్లడించింది.

ప్రమాద స్థలం

కార్మికులు ఏం చెబుతున్నారు ?

తమకు ఇంకా మందులు, ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌, ఒళ్లు మంటలను తగ్గించే ఔషధాలు, కట్లు కట్టుకోవడానికి టేప్‌లను పంపాల్సిందిగా కూడా వారు కోరినట్లు తెలుస్తోంది.

తాము ఉన్నచోట నీళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని కార్మికులు ఆ సందేశంలో తెలిపారు.

కార్మికులను రక్షించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయని, మరో 600 మీటర్లు తవ్వితే వారిని రక్షించే అవకాశం ఉంటుందని చైనా మీడియా వెల్లడించింది.

ప్రమాద ఘటన బయటకు తెలియడానికి ఒక రోజుకు పైగా పట్టడంతో వారిని రక్షించేందుకు కావలసిన విలువైన సమయం వృథా అయింది.

ఈ ప్రమాద విషయం తెలుసుకోవడంలో 30గంటల ఆలస్యానికి బాధ్యులను చేస్తూ స్థానిక కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీని, మేయర్‌ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది.

ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణం

చైనాలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా రక్షణ చర్యలు తీసుకున్నట్లు మాత్రం కనిపించదు.

గత ఏడాది డిసెంబర్‌లో ఓ బొగ్గు గనిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలై 23మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఓ గనిలో కన్వెయర్ బెల్ట్‌ అగ్నిప్రమాదానికి గురికావడంతో తీవ్రస్థాయిలో కార్బన్‌ మోనాక్సైడ్ విడుదలై 16మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 2019 డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గు గని ప్రమాదంలో 14మంది కార్మికులు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)