కేరళ: లాటరీలో రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఆటో డ్రైవర్‌కు ఊహకందని కష్టాలు

500 రూపాయల నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్, కొచ్చి

''నా కొడుకు కోసం ఒక బ్యాగ్ కొనడానికి వెళ్లాను. షాపు వాడు నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని నాకు చిల్లర తిరిగి ఇవ్వలేదు. నాకు ఆ చిల్లర డబ్బులు అవసరం లేదని వాళ్లు అనుకుంటున్నారు.''

రెండు నెలల కిందట కేరళలో ప్రభుత్వ లాటరీలో జాక్‌పాట్ కొట్టిన అనూప్ బి.. ఇలాంటి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

లాటరీ వరించిన తర్వాత ఈ 32 ఏళ్ల ఆటో డ్రైవర్ జీవితం ఆయన ఊహకందని రీతిలో మారిపోయింది.

ఆయన ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే గుర్తుపట్టని వాళ్లు ఎవరూ లేరు. చాలా మంది స్నేహితులు, బంధువులు ఆయన మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎవరిని కలిసినా దాదాపు ప్రతి ఒక్కరూ తమకు డబ్బులు కావాలని అడుగుతున్నారు.

''ఒకప్పుడు నాకు సన్నిహితులైన వాళ్లు ఇప్పుడు నాతో మాట్లాడటం మానేశారు'' అంటున్నారాయన.

అనూప్‌ సెప్టెంబర్ నెలలో 25 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు. దీంతో ఆయన దేశమంతటా పతాక శీర్షికల్లోకి ఎక్కారు. కేరళలో ఇప్పటివరకూ అతి పెద్ద లాటరీ మొత్తం ఇదే.

తిరువనంతపురంలో ఓ లాటరీ టికెట్ దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో లాటరీని నిషేధించారు. అయితే కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో కఠిన నియంత్రణలతో లాటరీకి అనుమతి ఉంది.

అనూప్ తనకు లాటరీ తగిలిన మరికొన్ని రోజుల తర్వాత కూడా వైరల్ అయ్యారు. ఈసారి.. 'డబ్బుల కోసం నన్ను, నా కుటుంబాన్ని వేధించటం ఆపండి' అంటూ వీడియోలో కోరటం దీనికి కారణం. అసలు తనకు ఆ జాక్‌పాట్ తగలకుండా ఉంటే బాగుండేదని తనకు అనిపించిందని అప్పుడు ఆయన చెప్పారు.

బీబీసీ ఈ వారంలో అనూప్‌ను సంప్రదించినపుడు ఆయన మాట్లాడటానికి మొదట విముఖంగా ఉన్నారు.

తన ఫొటోను ప్రచురించవద్దని, ప్రతి కొత్త వార్తా కథనంతో తన మీద జనం దృష్టి మరోసారి వెల్లువెత్తుతోందని కూడా ఆయన కోరారు.

''మీరు ఇది అనుభవిస్తే గానీ ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సినిమాలో దృశ్యంలా ఉంటుంది. అకస్మాత్తుగా మీకు తెలిసిన వాళ్లందరూ మీ ఇంటి ముందు ఉంటారు'' అని ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

తిరువనంతపురం జిల్లాకు చెందిన అనూప్ పదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నారు. గతంలోనూ చిన్న మొత్తాల్లో లాటరీలు గెలిచుకున్నారు.

లాటరీ సెల్లర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లాటరీ గెలిచిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను కట్టాల్సి ఉంటుంది

కానీ, సెప్టెంబర్‌లో తగిలిన జాక్‌పాట్ ఆయన జీవితాన్ని ఎంతగా మార్చేసిందంటే.. తేరుకోవడానికి ఇంకా కష్టపడుతున్నారు.

''మీ పట్ల జనం వైఖరి రాత్రికి రాత్రి మారిపోతుంది'' అంటున్నారాయన.

అనూప్‌కు జాక్‌పాట్ తగిలిందన్న ప్రకటన తర్వాత వారాల్లో ఆయన ఇల్లు, పరిసర ప్రాంతాలు.. సాయం కోరుతూ వస్తున్న వందలాది మందితో కిటకిటలాడింది.

''నిద్ర లేచేసరికి బయట పెద్ద గుంపు ఉండేది. పొద్దున 5 గంటలకే మొదలయ్యేది. రాత్రి పొద్దుపోయే వరకూ వాళ్లు అలాగే ఉండేవాళ్లు'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఒకసారి డబ్బులు తమ చేతికి వచ్చాక జనానికి సాయం చేసే అవకాశం గురించి తమ భార్యాభర్తలం చర్చించుకున్నామని అనూప్ భార్య మాయ స్థానిక న్యూస్ చానల్‌కు చెప్పారు.

దీంతో సాయం కోసం రాష్ట్రం నలుమూలల నుంచీ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కొంతమంది తమ తనఖా రుణాలు చెల్లించటానికి సాయం కోరితే, కొందరు తమ కూతుర్ల పెళ్లి ఖర్చులకు సాయం చేయాలని అడిగారు.

లాటరీ టికెట్లు

ఫొటో సోర్స్, Getty Images

''బ్యాంకులు, బీమా ఏజెంట్ల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక సినిమాకు డబ్బులు పెట్టాలని అడుగుతూ చెన్నై నుంచి ఒక బృందం వచ్చింది'' అని అనూప్ తెలిపారు.

సాయం కోసం ఇలాంటి వినతులే కాకుండా.. ఆ డబ్బులో తమకూ వాటా వస్తుందనే వారితో కూడా తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని అనూప్, మాయ చెప్పారు.

''ఒక వ్యక్తి తనకు మేము ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కొనిపించాలని డిమాండ్ చేస్తూ మా ఇంట్లో రోజంతా కూర్చున్నాడు'' అని అనూప్ తెలిపారు.

''ఈ డబ్బు నాకు ఉచితంగా, అప్పనంగా వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి తమకు కొంత ఎందుకు ఇవ్వరని వాళ్లు ప్రశ్నిస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో వ్యాపించిన వదంతులు కూడా తమ మనశ్శాంతికి భంగం కలిగించాయని ఈ దంపతులు చెప్తున్నారు.

''నేను లాటరీ గెలవకుండా అబద్ధం చెప్తున్నానని, నా దగ్గర ముందే చాలా డబ్బు ఉందని, నేను గెలిచాననేది మోసమని చెప్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి'' అని అనూప్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆమె అకౌంట్లోకి 50 కోట్లు వచ్చి పడ్డాయి, ఇల్లు కూడా కొన్నారు... తరువాత డబ్బంతా కట్టమన్నారు

ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే తనకు ఇంకా భయంగానే ఉందన్నారు.

''నా ముఖం చాలా న్యూస్ చానళ్లు, వెబ్‌సైట్లు, వార్తాపత్రికల్లో ఉంది. దీంతో నేను ఎక్కడికి వెళ్లినా జనం నన్ను గుర్తుపడతారు'' అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అయిన తన భార్య, ఇంకా పారాడుతున్న తన కొడుకు భద్రత గురించి కూడా అనూప్ ఆందోళన చెందుతున్నారు.

అయితే తనకు ఎదురైన అనుభవం తన ఒక్కడికే ప్రత్యేకమైన అనుభవం కాదని తెలుసుకోవటం ఆయనకు కొంత ఊరటనిచ్చింది.

అనూప్ అక్టోబర్ నెలలో ఒక స్థానిక టీవీ చానల్‌లో ఓ గేమ్ షోలో పాల్గొన్నపుడు.. గత ఏడాది ఇదే జాక్‌పాట్ గెలిచుకున్న జయపాలన్ (59)ను కలిశారు.

అప్పుడు 12 కోట్ల జాక్‌పాట్ కొట్టిన జయపాలన్ కూడా ఇదే తరహాలో మీడియా దృష్టిని ఆకర్షించారు. , ఆర్థిక సాయం కోసం కోరుతూ ఆయననూ జనం ముంచెత్తారు.

''ఎవరికి నిజంగా సాయం అవసరమో, ఎవరు కేవలం డబ్బు కోసమే వచ్చారో చెప్పటం కష్టం'' అని ఆయన ఆ షోలో పేర్కొన్నారు. ఆయన ఇంకా ఆటో నడుపుతూ ఉన్నారు.

''స్నేహితులు శత్రువులవుతారు. నేను డబ్బులు ఇవ్వలేదని చాలా మంది ఇంకా కోపంగా ఉన్నారు'' అని తెలిపారు.

లాటరీ టికెట్లు

ఫొటో సోర్స్, Getty Images

జయపాలన్ తనకు బెదిరింపు లేఖలు రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. తన ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలని అనూప్‌కు ఆయన సలహా ఇచ్చారు.

''లాటరీ గెలవటంతో డబ్బుకు సంబంధించి నా కష్టాలన్నీ చెరిగిపోతాయని జనం అనుకుంటారు. కానీ, ప్రతీదీ ఇంకా అనిశ్చితంగానే ఉంది. పన్నులు పోయిన తర్వాత నాకు ఎంత మిగులుతుందో నాకు తెలియదు'' అని అనూప్ పేర్కొన్నారు.

లాటరీ గెలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ అందుతందనే లెక్కలు 'సంక్లిష్టమైనవ'ని అనూప్, జయపాలన్‌లు ఆ టీవీ షోలో చెప్పారు.

గెలిచిన మొత్తాన్ని అందించే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 30 శాతం పన్నుతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి సెస్, సర్‌చార్జీలు, టికెట్ ఏజెంట్ కమిషన్‌ను విజేతలు చెల్లించాల్సి ఉంటుంది.

అనూప్ లాటరీ గెలుపుతో గందరగోళం తలతెత్తటంతో.. ఆయన ఆ డబ్బును సరిగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆయనకు ఒక రోజు ఆర్థిక నిర్వహణ శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

లాటరీలో గెలిచిన డబ్బుతో ఏం చేయాలనేదానిపై కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనూప్ భావిస్తున్నారు.

''ఆ డబ్బు ఒక వరం అనటంలో సందేహం లేదు. కానీ ఎవరికైనా సాయం చేయడానికి, ఏదైనా చేసే ముందు... నా కుటుంబం, వారి భవిష్యత్తు భద్రంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం నాకుంది'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)