Money Transfer: ఆమె ఖాతాలోకి రూ. 55 కోట్లు వచ్చిపడ్డాయి.. 10 కోట్లతో ఇల్లు కొన్నారు.. ఏడు నెలల తర్వాత...

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దేవమనోహరి మణివేల్ అనే మహిళ అకౌంట్‌లోకి అనుకోకుండా రూ. 55.79 కోట్లు జమ అయ్యాయి. తన ఖాతాలో భారీగా డబ్బులు పడినట్లు తెలుసుకున్న ఆమె, ప్రపంచంలో తనకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని సంతోషపడ్డారు.

కానీ, ఇప్పుడు ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా షాక్‌లో ఉన్నారు.

అకౌంట్‌లో పడిన డబ్బు అంతటినీ తిరిగి ఇచ్చేయాలని ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా దానికి వడ్డీతో పాటు లీగల్ యాక్షన్ ఫీజులను కూడా ఇవ్వాలని ఆమెను ఆదేశించింది.

2021 మే నెలలో క్రిప్టో.కామ్ చేసిన పొరపాటు వల్ల ఇదంతా జరిగింది.

మణివేల్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో నివసిస్తారు. మణివేల్‌కు చెల్లించాల్సిన 100 డాలర్లకు బదులుగా క్రిప్టో. కామ్ ఆమె ఖాతాలోకి 1,04,74,143 ఆస్ట్రేలియా డాలర్లు (70 లక్షల అమెరికా డాలర్లు) బదిలీ చేసింది.

ఈ లావాదేవీ నిర్వహించిన వ్యక్తి చేసిన పొరపాటు ఇది అని ఆస్ట్రేలియా మీడియా చెప్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాల్సిన స్థానంలో మణివేల్‌ అకౌంట్ నంబరును ఎంటర్ చేశారు. దీంతో ఆ మేరకు డబ్బులు ఆమె ఖాతాలో పడిపోయాయి.

డాలర్లు

ఫొటో సోర్స్, Getty Images

తప్పిదాన్ని ఎప్పుడు గుర్తించారంటే...

ఈ దెబ్బతో మణివేల్‌ కోటీశ్వరురాలు అయ్యారు. దాన్ని ఖర్చు చేయడం మొదలుపెట్టారు.

ఈ మొత్తంలో అధిక భాగాన్ని ఆమె మరో ఉమ్మడి ఖాతాకు బదిలీ చేశారు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆ ఖాతాను మణివేల్‌ నిర్వహిస్తున్నారు.

ఇందులో దాదాపు 3 మిలియన్ డాలర్ల (రూ. 2.3 కోట్లు)ను మణివేల్‌ ఫ్రెండ్, తన కూతురి అకౌంట్‌లోకి పంపించారు. అంతేకాకుండా మెల్‌బోర్న్‌లో మణివేల్‌ ఒక ఇల్లు కూడా కొన్నారు. ఆ ఇల్లును మలేసియాలో నివసిస్తోన్న తన సోదరి థిల్‌గావథీ గంగాదరీ పేరు మీద కొన్నారు.

వీడియో క్యాప్షన్, మొత్తం రూపాయి కాయిన్లే ఇచ్చి, రూ.2.6 లక్షల బైక్ కొన్నారు

500 చదరపు మీటర్ల ఆ ఇంటిలో నాలుగు గదులు, నాలుగు బాత్రూమ్‌లు, సినిమా రూమ్, జిమ్, డబుల్ గ్యారేజ్ ఉన్నాయి. దీని కోసం రూ. 10 కోట్లు వెచ్చించారు.

అదే సమయంలో క్రిప్టోకరెన్సీ కంపెనీ తన తప్పును గుర్తించడానికి చాలా నెలల సమయం పట్టింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రావిన్సుకు చెందిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ జేమ్స్ ఇలియాట్ శుక్రవారం ఈ కేసును విచారిస్తూ.. ''పిటిషనర్‌కు తాను చేసిన పెద్ద తప్పును గుర్తించడానికి ఏడు నెలల సమయం పట్టినట్లు కనిపిస్తోంది'' అని అన్నారు.

నటుడు మ్యాట్ డెమియన్, క్రిప్టో.కామ్‌కు ప్రచారకర్తగా ఉన్నారు

ఫొటో సోర్స్, CRYPTO.COM

ఫొటో క్యాప్షన్, అమెరికా నటుడు మ్యాట్ డెమియన్, క్రిప్టో.కామ్‌కు ప్రచారకర్తగా ఉన్నారు

కోర్టు తీర్పు

ఈ కేసు విషయంలో కోర్టు, పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మొత్తం డబ్బుతో పాటు వడ్డీ, చట్టపరమైన చర్యల ఖర్చును కూడా చెల్లించాలని ఆదేశించింది.

పొరపాటున ఖాతాలోకి వచ్చిన డబ్బుతో ఇంటిని కొన్నట్లు రుజువు కావడంతో, దాన్ని విక్రయించి నగదును ముట్టజెప్పాలని మణివేల్‌ సోదరిని కూడా కోర్టు ఆదేశించింది.

మణివేల్‌కు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రిప్టో కరెన్సీ కంపెనీ చట్టపరమైన చర్యను ప్రారంభించింది. ఆమె బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసింది.

అయితే, అప్పటికే ఆమె డబ్బు అంతటినీ ఇతర అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేశారు.

మణివేల్‌ సోదరి అకౌంట్లను కూడా స్తంభింపచేయాలని క్రిప్టో కంపెనీ డిమాండ్ చేసింది.

వీడియో క్యాప్షన్, ఆమె అకౌంట్లోకి 50 కోట్లు వచ్చి పడ్డాయి, ఇల్లు కూడా కొన్నారు... తరువాత డబ్బంతా కట్టమన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)