Money Transfer: పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ తమిళ్ ప్రతినిధి

ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కోసారి పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌కు పంపుతుంటాం.

ఇలా వేరే అకౌంట్‌కు పంపిన డబ్బును తిరిగి మనం పొందగలమా? మన డబ్బును తిరిగి పొందాలంటే ఏం చేయాలి?

దీని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ సౌత్ జోన్ మేనేజర్‌ మణియన్ కళియమూర్తిని బీబీసీ సంప్రదించింది. ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

''సాధారణంగా ఇలాంటి కేసులకు బ్యాంకులు బాధ్యత వహించవు. పొరపాటున డబ్బు పంపిన వ్యక్తిదే పూర్తి బాధ్యత ఉంటుంది. కాకపోతే, ఆ వ్యక్తి తిరిగి డబ్బు పొందేందుకు బ్యాంకులు సహకరిస్తాయి'' అని ఆయన చెప్పారు.

''ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి నేరుగా డబ్బు పంపినప్పుడు బ్యాంకు ఉద్యోగులు అకౌంట్ వివరాలను, పేరును తనిఖీ చేస్తారు. ఒకవేళ అకౌంట్ నంబర్‌లో ఒకట్రెండు అంకెలు తప్పుగా ఉంటే రికార్డుల్లో ఉన్న పేరుతో ఆ అకౌంట్ నంబర్ సరిపోలదు. దీంతో బ్యాంక్ వెంటనే ఆ నగదు బదలాయింపును తాత్కాలికంగా నిలిపేసి, సదరు వ్యక్తికి దీని గురించి సమాచారం అందిస్తుంది.

కానీ అధికారిక నెట్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్రౌజర్ ఆధారిత నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐల ద్వారా డబ్బు పంపిస్తున్నప్పుడు బ్యాంకులు ఆ లావాదేవీల వివరాలను ధ్రువీకరించలేవు. డబ్బులు పంపించే వ్యక్తి స్వయంగా అకౌంట్ వివరాలను నమోదు చేసి, దాన్ని ధ్రువీకరించి డబ్బును పంపుతారు.

ఒకవేళ అతను డబ్బును పొరపాటున వేరొకరి ఖాతాను పంపిస్తే, దానికి మొత్తం బాధ్యత అతనే వహించాల్సి ఉంటుంది. కానీ, వారు తమ డబ్బును తిరిగి పొందడంలో బ్యాంకులు సహాయం చేస్తాయి'' అని ఆయన వివరించారు.

2000 నోటు, కరెన్సీ డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంక్ ఏం చేస్తుంది?

ఆన్‌లైన్‌లో డబ్బు పంపడం కోసం ఒక అకౌంట్‌ను రిజిస్టర్ చేసే సమయంలో, మరోసారి అకౌంట్ వివరాలను ధ్రువీకరించాల్సిందిగా బ్యాంక్ కోరుతుంది. అప్పుడు నమోదు చేసిన అకౌంట్ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో మనం ధ్రువీకరించాలి. ఆ తర్వాత కూడా మరో 30 నిమిషాల వరకు డబ్బును ఇతరులకు పంపలేం. అరగంట అనంతరం 'మీరు రిజిస్టర్ చేసిన ఖాతాకు ఇప్పుడు డబ్బు పంపించవచ్చు' అనే సందేశం వస్తుంది.

ఆ తర్వాత మనం డబ్బును ఇతరులకు పంపవచ్చు. అయితే, మీరు పంపిన డబ్బు సదరు వ్యక్తికి చేరలేదనుకోండి. వెంటనే ట్రాన్జాక్షన్ వివరాలను తనిఖీ చేయాలి. ఒకవేళ అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు చేసినట్లు తేలితే, మీరు ఎంటర్ చేసిన అకౌంట్ నంబర్ ఉనికిలో లేకపోతే వెంటనే ఆ నగదు బదలాయింపు క్యాన్సిల్ అవుతుంది. మీకు మెసేజ్ వస్తుంది.

కానీ, మీరు ఎంటర్ చేసిన అకౌంట్ నంబర్‌ను మరో వ్యక్తి వాడుతున్నట్లయితే ఆ డబ్బు అతని ఖాతాలోకి వెళ్లిపోతుంది. అలాంటి పక్షంలో వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ ట్రాన్జాక్షన్ గురించి సమాచారం ఇవ్వాలి.

బ్యాంకు ఉద్యోగులు ఆ అకౌంట్ నంబర్ వివరాలు తనిఖీ చేసి సదరు అకౌంట్ ఏ బ్యాంకులో ఏబ్రాంచిలో ఉందో దాని వివరాలను అందజేస్తారు. ఈ సమాచారాన్ని పొందడం కోసం మనం ట్రాన్జాక్షన్ చేసినట్లు రుజువును బ్యాంకులో సమర్పించాలి. దానితో పాటు తప్పుడు అకౌంట్‌కు డబ్బు పంపించినట్లు పేర్కొంటూ రాసిన పత్రాన్ని కూడా బ్యాంకులో అందజేయాలి.

తర్వాత సదరు అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లి ఇదే ప్రక్రియను అనుసరించాలి. డబ్బును తిరిగి మన అకౌంట్‌లో జమ చేయాలంటూ అభ్యర్థన పత్రాన్ని వారికి అందజేయాలి.

అప్పుడు బ్యాంక్ వారు ఆ అకౌంట్‌లోని ట్రాన్జాక్షన్లను పరిశీలిస్తారు. రిసీవర్ డబ్బును విత్‌డ్రా చేశారో లేదో తనిఖీ చేస్తారు.

ఒకవేళ మనీ, అకౌంట్‌లో అలాగే ఉంటే వెంటనే సదరు ఖాతా యజమానికి ఫోన్ చేసి తప్పుడు ట్రాన్జాక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. వెంటనే డబ్బును తిరిగి అకౌంట్‌కు పంపించాలని కోరతారు.

ఒకవేళ వారు డబ్బును తిరిగి చెల్లిస్తే సమస్య అక్కడితో ముగుస్తుంది. అలా కాకుండా వారు ఆ డబ్బును ఖర్చు చేసి ఉంటే, వారంతట వారు డబ్బును తిరిగి ఇచ్చే వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.

పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images

ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి?

అకౌంట్‌లోని డబ్బులు తనకు చెందినవే అని భావించి సదరు వ్యక్తి వాటిని తీసుకొని వాడుకొని, తిరిగి చెల్లించడానికి కాస్త సమయం కోరితే మనం చేసేదేమీ ఉండదు.

ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు కాపీని బ్యాంకులో సమర్పించి అతని అకౌంట్‌ను స్తంభింపచేయవచ్చు. వారు డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఖాతాను ఫ్రీజ్ చేయవచ్చు.

ఒకవేళ సదరు వ్యక్తికి ఆ బ్యాంక్ అకౌంట్ అంత ప్రాధాన్యమైనది కాని పక్షంలో అతను వేరే బ్యాంకులో మరో ఖాతా తెరుచుకొని తన కార్యకలాపాలు అందులో కొనసాగించవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులతో సహా ఎవరైనా సదరు వ్యక్తిని కేవలం డబ్బు తిరిగి ఇవ్వమని మాత్రమే అడగవచ్చు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోలేరు. ఎందుకంటే ఇంకా అలాంటి చట్టాలు రాలేదు. కాబట్టి వారు డబ్బు ఇచ్చే వరకు ఓపికగా ఎదురు చూడాల్సిందే.

ప్రధానమంత్రి డబ్బు పంపించారని పొరబడి...

ఉదాహరణకు, మహారాష్ట్రకు చెందిన ఒక రైతు స్థానిక బ్యాంక్‌లో జన్‌ధన్ ఖాతాను కలిగి ఉన్నాడు. ఒకరోజు అతని ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ అయ్యాయి. ఎన్నికల హామీలో భాగంగా ప్రధానమంత్రి ఆ డబ్బును పంపించాడని భావించిన ఆ రైతు అందులో 9 లక్షలతో ఒక ఇంటిని నిర్మించుకున్నారు.

డబ్బులు పంపించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన ప్రధానికి లేఖ కూడా రాశారు.

ఆరు నెలల తర్వాత, 'పొరపాటున మీ అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ అయ్యాయి. వాటిని తిరిగి ఇవ్వండి' అని పేర్కొంటూ బ్యాంక్ వారి నుంచి ఆయనకు ఒక లేఖ వచ్చింది.

పింపల్‌వాడీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన నగదును పంచాయతీ పాలక వర్గానికి చెందిన ఖాతాకు పంపే సమయంలో పొరపాటున మీ అకౌంట్‌లోకి పంపించామంటూ బ్యాంకు అధికారులు ఆ రైతుకు చెప్పారు.

ఇక్కడ రైతు తప్పేమీ లేదు. డబ్బు పంపినవారే పొరపాటు చేశారు. ఆ డబ్బు తన కోసమే పంపించారని భావించిన రైతు దాన్ని ఖర్చు పెట్టాడు కూడా. తర్వాత బ్యాంకు అధికారులు, రైతుపై ఫిర్యాదు నమోదు చేశారు. ఆ డబ్బును ఎలా పొందాలో ఇరు వర్గాలకు తెలియడం లేదు.

పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images

గూగుల్ పే, పేటీఎం చెల్లింపులకు కూడా ఇదే వర్తిస్తుందా?

బ్యాంకు లావాదేవీలు జరపాలంటే అకౌంట్ నంబర్ అవసరం. కానీ, యూపీఐ లావాదేవీలకు అకౌంట్ నంబర్‌తో పని లేదు. ఫోన్ నంబర్ ఆధారంగా యూపీఐ లావాదేవీలు జరుపవచ్చు. ఒకవేళ ఫోన్ నంబర్‌ను తప్పుగా ఎంటర్ చేసి డబ్బును పంపిస్తే మనం థర్డ్ పార్టీ యాప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

అక్కడ కూడా ఇదే ప్రక్రియను అనుసరించాలి. బ్యాంక్‌కు వెళ్లి సదరు వ్యక్తికి చెందిన బ్యాంక్ వివరాలు కనుక్కోవడంతో పాటు లావాదేవీకి సంబంధించిన రుజువులు, అభ్యర్థన పత్రాన్ని బ్యాంక్ వారికి సమర్పించాలి.

తర్వాత బ్యాంక్ వారు సదరు వ్యక్తిని డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా కోరతారు. ఒకవేళ వారు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి, అతని అకౌంట్‌ను ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ కూడా అదే పరిస్థితి. సదరు వ్యక్తి డబ్బు చెల్లిస్తే సమస్య తీరుతుంది. లేకపోతే వారు ఇచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

వీడియో క్యాప్షన్, క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

బ్యాంకులు వ్యక్తి వివరాలు ఇవ్వకుండా కేవలం బ్రాంచ్ వివరాలు మాత్రమే ఎందుకు ఇస్తాయి?

బ్యాంకులు ఒక నిర్దిష్ట వ్యక్తికి చెందిన వ్యక్తిగత వివరాలు, అకౌంట్ నంబరు తదితరాలను ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పవు. డబ్బులు పొందిన వ్యక్తి వివరాలు తెలిస్తే, డబ్బు కోసం అతన్ని కలిసి గొడవ చేసే అవకాశం ఉంటుంది. ఇది వివిధ సమస్యలకు దారి తీస్తుంది.

అందుకే బ్యాంకుల సహాయంతో మాత్రమే మనం ఈ విషయంలో ముందుకు వెళ్లగలం. బ్యాంకు అధికారులే సదరు వ్యక్తితో మాట్లాడతారు. డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరతారు. వారు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి వారి అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేం.

ఇలాంటి కేసులకు చట్టపరమైన నిబంధన లేకపోవడంతో కేవలం డబ్బులు ఇవ్వమని అడగడం తప్ప చట్టపరంగా చర్య తీసుకోలేరు.

ఇలాంటి తప్పుడు లావాదేవీల విషయంలో బ్యాంకులు కూడా ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే సహాయపడతాయి. డబ్బులు ఇవ్వాలా? వద్దా? అనేది అవి పొందిన వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే సమయంలో ఒకటికి రెండుసార్లు వివరాలన్నింటినీ ధ్రువీకరించుకోవాలి.

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)