Investment: మ్యూచువల్ ఫండ్స్ వాడుకుని ఇల్లు కొనుక్కోవచ్చా?

ఇల్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

మన దేశంలో చాలా మందికి పింఛను సౌలభ్యం అందుబాటులో లేదు. మరోవైపు ఖర్చులు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నెల జీతానికి పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు మీద భరోసా ఉండాలంటే మదుపు చేయక తప్పదు. మదుపరిగా మన ప్రయాణంలో వచ్చే ఎన్నో సందేహాలు, ఆందోళనలను ఎలా ఎదుర్కోవాలో ఒకసారి చూద్దాం.

నేను ఆర్థిక లక్ష్యాన్ని సాధించగలనా?

ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవడంతో మదుపరిగా మన ప్రయాణం మొదలవుతుంది. ఒక్కోసారి నిర్దేశించుకున్న లక్ష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన ప్రస్తుత సంపాదనతో పోలిస్తే అందుకోలేనంత ఎక్కువగా అనిపిస్తుంది. ఇది చాలా సహజంగా వచ్చే సమస్య. ఎందుకంటే మన అదుపులో లేని ద్రవ్యోల్బణం మన భవిష్యత్ ఖర్చులను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో సదరు ఆర్థిక లక్ష్యాల గురించి కొన్ని విషయాలు ఆలోచించాలి:

  • ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామో లేదో చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు వెన్నెముక లాంటిది. కొన్ని విలాసవంతమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మదుపు చేసే మొత్తాన్ని పెంచుకునే అవకాశం ఉంటే వెంటనే దాన్ని అమలులో పెట్టాలి.
  • సదరు ఆర్థిక లక్ష్యానికి మనం తగినంత ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఉదాహరణకు పిల్లల చదువు అనే ఆర్థిక లక్ష్యానికి అవసరం అయినంత మదుపు చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి.
  • ఆర్థిక లక్ష్యానికి మనం అనుసరిస్తున్న మదుపు మార్గం సరిపోతుందా? మన స్థాయిని మించిన రిస్క్ ఉన్న మదుపు మార్గాలలో ఎప్పుడూ మదుపు చేయకూడదు.
  • ఒకవేళ మన ఆర్థిక లక్ష్యాన్ని అందుకోలేకపోతే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? ఏదైనా రుణ సదుపాయం ద్వారా ఆ ఆర్థిక అవసరం తీర్చుకుని ఆ తర్వాత సదరు రుణం తీర్చే వీలు ఉందేమో చూసుకోవాలి.
ఇల్లు

ఫొటో సోర్స్, Getty Images

మ్యూచువల్ ఫండ్స్ - హోం లోన్

మధ్య తరగతి ఉద్యోగి సొంత ఇంటి కల కోసం.. రకరకాల మార్గాల ద్వారా పొదుపు చేసిన మొత్తాన్ని వాడుకోవడం తరచుగా చూస్తూ ఉంటాం. మనం చెల్లించే మొత్తం కాకుండా బ్యాంక్ నుంచీ రుణం తీసుకుని ఇల్లు కొనడం సర్వసాధారణం. ఇలాంటి తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన మొత్తాన్ని వాడుకుని గృహరుణం తీసుకోవడం మంచిది అనే వాదన వినిపిస్తుంది. ఇలాంటి విషయాన్ని తప్పు/కరెక్ట్ అని వర్గీకరించడం కుదరని పని. కానీ అన్ని కోణాలను పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం ముఖ్యం. ఇప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు తావు లేకుండా హేతుబద్ధంగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం.

  • గృహరుణాల వడ్డీ ప్రస్తుతం 7%-8% మధ్య ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల చేసిన రెపోరేట్ మార్పుల వల్ల 7% దాటింది. అంతకు మునుపు గరిష్ఠంగా 7% ఉండేది.
  • మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియో నుంచీ వార్షిక రాబడి ఎంత ఉంది. దీర్ఘకాలిక దృష్టితో నిర్మించిన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియో 15% దాకా వార్షిక వృద్ధిని అందిస్తుంది. మనం చెల్లించాల్సిన LTCG పరిగణలోకి తీసుకుంటే ఎంత వార్షిక వృద్ధి వస్తుందో చూసుకోవాలి.
  • మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియో రిస్క్ ఎలా ఉంది. అంటే మన పోర్ట్ ఫోలియోలో రిస్క్ ఎక్కువగా ఉండే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయా లేక తక్కువ రిస్క్ ఉండే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి.
  • ఇప్పుడు పైన చెప్పిన అంశాల ఆధారంగా మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలో తక్కువ వృద్ధిని ఇస్తున్న ఫండ్స్ ఉంటే వాటిని అమ్మేసి గృహ రుణ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లాంటి మదుపు మార్గాలలో సహజంగా ఉండే రిస్క్ నుంచీ మనం బయటపడవచ్చు.
కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్నెట్ సలహాలు లేదా వ్యక్తిగత ఫైనాన్షియల్ సలహాదారు

ఈ ఇంటర్నెట్ యుగంలో ఎంతో సమాచారం సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఇందుకు పర్సనల్ ఫైనాన్స్ కూడా మినహాయింపు కాదు.

కానీ పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ మాత్రం ఎవరికి వారు ప్రత్యేకంగా ఆలోచించుకోవలసిన విషయం. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉండే సమాచారాన్ని కాకుండా వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సేవలు పొందటం మేలు అనే ఒక వాదన ఉంది.

ఈ వాదనలో నిజం ఉంది ఎందుకంటే అరకొర పరిజ్ఞానంతో మదుపు చేసి చేతులు కాల్చుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. సెబి సర్టిఫికేషన్ చేసిన అడ్వైజర్ సలహా సహజంగానే వ్యక్తిగత పరిస్థితులకు తగినట్టుగా ఉంటుంది. కాబట్టి నష్టభయం తక్కువగా ఉంటుంది.

కానీ అడ్వైజర్ సేవలకు చెల్లించాల్సిన రుసుము కూడా ఎక్కువగా ఉండచ్చు. కాబట్టి నేరుగా అడ్వైజర్ సేవల కంటే మన అవగాహన పెరిగే అవకాశం ఉన్న ఆన్‌లైన్ కోర్స్ చేయడం చెప్పదగిన సూచన. ఈ విధంగా మనల్ని మనం భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా మార్చుకోవచ్చు.

పెట్టుబడి

ఫొటో సోర్స్, Getty Images

గతంలో మంచి ఫలితాలిచ్చిన కంపెనీలు ఆ ఫలితాలు పునరావృతం చేయగలవా?

స్టాక్ మార్కెట్లో నేరుగా కంపెనీల షేర్లు కొనేవారినీ ఎప్పుడూ వేధించే ప్రశ్న ఇది. గతంలో ఎంతో లాభాలు అర్జించిన కంపెనీ భవిష్యత్తులో కూడా అలాంటి లాభాలనే అర్జిస్తుందా అంటే చెప్పడం చాలా కష్టం. ఇదే అంశం మీద వివిధ విశ్వవిద్యాలయాలలో పీహెచ్‌డీ చేసినవారున్నారు. కానీ ఇంకా ఈ ప్రశ్నకు సులువైన సమాధానం లేదు.

టాటా, రిలయన్స్ లాంటి కంపెనీలు ఎప్పటికప్పుడు తమ ఫలితాతలను పునరావృతం చేస్తుంటే ఇంకొన్ని కంపెనీలు కొంత కాలం తర్వాత చతికిలపడుతున్నాయి. అందుకే ఈ విషయంలో వారెన్ బఫెట్ గారి సూత్రాన్ని పాటించాలి. ఆయన సూత్రం ప్రకారం మనం చేసే మదుపు వ్యాపారంలో ఉండాలి కానీ కంపెనీలో కాదు. అంటే సదరు కంపెనీ చేసే వ్యాపారానికి తగినంత అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి.

బఫెట్ పోర్ట్ ఫోలియోలో రీటెయిల్ రంగానికి ఎప్పుడూ స్థానం ఉంది ఎందుకంటే జనాభా పెరుగుదలకు అనుగుణంగా రీటెయిల్ వస్తువుల ఉత్పత్తి జరగాల్సిందే.

ఈ రకంగా ఆ కంపెనీల వ్యాపారానికి ఎలాంటి ఢోకా లేదు. మరోవైపు అదే బఫెట్ సాఫ్ట్‌వేర్ రంగంలో మదుపు చేయలేదు. ఎందుకంటే ఆ వ్యాపారానికి ఎంత గిరాకీ ఉంటుంది అనే విషయం ఆయనకు అర్థం కాలేదు.

వీడియో క్యాప్షన్, క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

ఆర్థిక అంశాలపై అవగాహన ఎలా కలిగించాలి

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్థులైనప్పటికీ మదుపు చేసే విషయం మాత్రం ఒకరే చూసుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరిలో ఒకరే ఉద్యోగస్థులైతే కూడా చాలాసార్లు ఇదే పరిస్థితి చూస్తుంటాం. ఇది అంత ముఖ్యమైన విషయం లాగా కనిపించకపోవచ్చు. కానీ ఈ పద్ధతి వల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్యంగా ఏదైనా అనుకోని దుష్పరిణామాలు సంభవించినప్పుడు ఈ విధానం కుటుంబానికి చాలా నష్టం కలిగిస్తుంది. మదుపు వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి ఏదైనా కారణంతో ఆ పని చేయలేకపోతే ఆ కుటుంబానికి ఉండే ఆర్థిక లక్ష్యాల మీద అది తీవ్ర ప్రభావం చూపుతుంది.

వీడియో క్యాప్షన్, హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతే ఏం చేయాలి?

ఇలాంటి పరిస్థితి రాకుండా తీసుకునే జాగ్రత్తను ‘‘యాక్టివ్ ఇన్సురెన్స్’’ అని కొందరు ఫైనాన్షియల్ ప్లానింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఏం చేయాలో ఒకసారి చూద్దాం.

  • ముందుగా అన్ని మదుపు/బీమా పత్రాలలో నామినీ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మైనర్ అయితే దానికి సంబంధించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
  • మనం చేస్తున్న మదుపు మార్గాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒక చీట్ షీట్ తయారు చేసుకుని దాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవాలి. ఒక ఎక్సెల్ ఫైల్ లాగా చేసుకుని దాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం సులువైన పద్ధతి. ఇందులో మనం చేసిన మదుపు తాలుకు ఫలితం మనకు అందే సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
  • ఏ మదుపు మార్గాన్ని ఏ ఆర్థిక లక్ష్యం కోసం చేస్తున్నాము అనే అవగాహన జీవిత భాగస్వామికి కలిగించాలి.
  • మన వ్యక్తిగత ఫైనాన్షియల్ సలహాదారు వివరాలు మన జీవిత భాగస్వామికి తప్పకుండా తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)