రిటైర్‌మెంట్ తరువాత నెల నెలా తగినంత ఆదాయం రావాలంటే ఏం చేయాలి?

రిటైర్‌మెంట్ ప్లాన్ ఉండటం మంచిది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి ఒక్కరికి రిటైర్‌మెంట్ ప్లాన్ ఉండటం మంచిది
    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

జనాభాలో ఎక్కువ శాతం యువత ఉండటం మిగిలిన దేశాలతో పోలిస్తే మనకు ఉపయోగకరమైన అంశం. కానీ ఒక ఇరవై, ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు యువతరంలో ఉన్న వారంతా రిటైర్‌మెంట్ వయసుకు దగ్గర్లో ఉంటారు. అప్పటి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఒక బలమైన రిటైర్‌మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి.

ఇంతకు ముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి చాలామంది ఆలోచించరు. ఇప్పటి నుంచీ పదవీ విరమణ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనేది ఎక్కువగా వినిపించే వాదన.

ఈ అవగాహన లేమి వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ముందు తరం వాళ్లు చాలామంది పెన్షన్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రిటైర్ కావడం, రెండు ప్రస్తుతం మన జనాభాలో ఎక్కువమంది యువత ఉండటం.

రిటైర్‌మెంట్ ప్లాన్ విషయంలో రెండు అంశాలు బేరీజు వేసుకోవాలి:

1. మనకు అవసరమైన రిటైర్‌మెంట్ ఫండ్ మొత్తం ఎంత ఉండాలి

2. ఆ మొత్తం సమకూరడానికి ఎలాంటి మదుపు చేయాలి

రిటైర్‌మెంట్ ఫండ్ ఎలా కనుక్కోవాలి?

ఫొటో సోర్స్, Getty Images

1. రిటైర్‌మెంట్ ఫండ్ మొత్తం - ఖర్చుకి 4% తీసుకోవడం

రిటైర్‌మెంట్ ఫండ్ అనే విషయం మీద అనేక సూత్రీకరణలు ఉన్నాయి. వాటిలో '4% మాత్రమే ఖర్చులకు తీసుకోవడం' అనే సూత్రం చాలా ప్రాచుర్యం పొందింది. చాలా సరళమైన ఈ విధానం 90లలో విలియం బెంజెన్ అనే ఫైనాన్షియల్ ప్లానర్ ప్రతిపాదించారు. 1929-1976 మధ్య అమెరికన్ మార్కెట్లను అధ్యయనం చేసి ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సూత్రం ప్రకారం రిటైర్‌మెంట్ తర్వాత ప్రతీ ఏడాది పోగు చేసుకున్న ఫండ్ నుంచీ 4% తమ ఖర్చులకు తీసుకోవాలి. బెంజెన్ ప్రకారం ఇలా చేయడం వల్ల రిటర్మెంట్ తర్వాత కనీసం 33 సంవత్సరాల పాటూ ఉండే అవసరాలకు మనం పోగు చేసుకున్న ఫండ్ సరిపోతుంది.

వీడియో క్యాప్షన్, కేజీ చికెన్ రూ.1000, పెట్రోల్ రూ.254. ఎక్కడ? ఎందుకు?

ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనకు కావలసిన రిటైర్‌మెంట్ ఫండ్ ఎలా కనుక్కోవాలో ఒక ఉదాహరణగా కింద ఇచ్చిన పట్టికలో చూద్దాం:

రిటైర్‌మెంట్ ఫండ్ ఎలా కనుక్కోవాలి?

అంటే ప్రస్తుతం నెల అవసరాలకు పాతిక వేలు ఖర్చు పెట్టుకుంటున్న కుటుంబం ఇరవై ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యి ఇదే రకమైన జీవన శైలిని కొనసాగించాలంటే కావలసిన ఫండ్ విలువ రెండు కోట్లా నలభై లక్షలు. ఇల్లు కొనుగోలు లేదా ఇతర స్థిర చరాస్తులను సంపాదించుకోవడాన్ని ఈ సిద్ధాంతం పరిగణనలోకి తీసుకోదు అన్నది ఈ సిద్ధాంతం మీద ఉండే ప్రధాన విమర్శ. విమర్శలు ఎలా ఉన్నా ఈ సూత్రం రిటైర్‌మెంట్ ఫండ్ బేరీజు వేయడంపై ఒక ఖచ్చితమైన అవగాహన కల్పిస్తుంది.

రిటైర్‌మెంట్ ఫండ్ కోసం చేయాల్సిన మదుపు

రిటైర్‌మెంట్ ఫండ్ మొత్తం ఎంత ఉండాలి అనే విషయం మీద స్పష్టత వచ్చాక, ఆ మొత్తం సమకూర్చుకోవడానికి ఎలాంటి మార్గాల్లో ఎంత మదుపు చేయాలో అర్థం చేసుకోవాలి. నెల జీతం మీద ఆధారపడ్డ ఉద్యోగులు ఈ క్రింది మదుపు మార్గాలను వాడుకోవడం చెప్పదగిన సూచన.

వీడియో క్యాప్షన్, రష్యా, అమెరికా సంఘర్షణల్లో యూరప్ ఎవరివైపు ఉంటుంది? కారణాలేంటి?

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్:

మార్కెట్ గమనానికి అనుసంధానమైన ఏ మదుపు మార్గమైనా ఎంతో కొంత రిస్క్ కలిగి ఉంటుంది. అందుకే రిస్క్ లేని ఈపీఎఫ్ నుంచీ గరిష్ఠంగా లబ్ధి పొందేలా చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వార్షిక వడ్డీ మీద ఈపీఎఫ్ ఆదాయం ఆధారపడి ఉంటుంది. గత కొనేళ్ళుగా ఈ వడ్డీ తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.

ఈపీఎఫ్ ద్వారా కలిగే ఆదాయాన్ని బేరీజువేద్దాం. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 8.1% వడ్డీని ప్రకటించింది. కానీ వచ్చే ఇరవయేళ్లకు సగటు వడ్డీ 7.1% ప్రాతిపదికన ఈపీఎఫ్ ఆదాయం ఎంత వస్తుందో పట్టికలో చూద్దాం

ఈపీఎఫ్ ఆదాయం ఎంత వస్తుంది?

నెలకు పదివేలు ఈపీఎఫ్ ఉండే ఉద్యోగి ఇరవయేళ్ల తర్వాత ఈపీఎఫ్ మొత్తం కనీసం యాభై మూడు లక్షలు ఉంటుంది. ఇది కనీస మొత్తం, ఎందుకంటే జీతం పెరిగే కొద్దీ ఈపీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది.

నేషనల్ పెన్షన్ స్కీం:

పైన చెప్పిన ఈపీఎఫ్ లాగే నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా జమ అయ్యే మొత్తం టాక్స్ పరిధిలోకి రావు. ఈ రెండు స్కీముల వల్ల కలిగే మొదటి ఉపయోగం ఇదే. నేషనల్ పెన్షన్ స్కీం కూడా రిటైర్‌మెంట్ ప్లానింగ్ విషయంలో మదుపు చేయాల్సిన ముఖ్యమైన మదుపు మార్గం. ఎందుకంటే మదుపు చేసిన మొత్తంలో 60% రిటైర్‌మెంట్ తర్వాత తీసుకోవచ్చు మిగిలిన మొత్తం నెల జీతంలాగా తీసుకోవచ్చు. ఒకేసారి మొత్తం తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ స్కీంకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈక్విటీలలో కొంత మొత్తం మళ్లించినా ఈ స్కీం తక్కువ రిస్క్ తో కూడిన మదుపు మార్గమే.

మ్యూచువల్ ఫండ్స్:

రిటైర్‌మెంట్ ఫండ్ ఏర్పరచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక ముఖ్యమైన మదుపు మార్గం. ఈపీఎఫ్, ఎన్.పి.ఎస్.లాంటి స్కీములతో పోల్చుకుంటే కొంత రిస్క్ ఎక్కువైనా కాలపరిమితి ఎక్కువ కావడం వల్ల ఆ రిస్క్ ప్రభావం పెద్దగా ఉండదు. పదిహేనేళ్లకు పైగా ఎస్ఐపీ చేస్తే ఏ రకమైన రిస్క్ మనల్ని ఇబ్బంది పెట్టదు అని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు రిటైర్‌మెంట్ ఫండ్స్ పేరిట కొన్ని ఫండ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్ సగటు మదుపరితో ఒక ఎమోషనల్ కనెక్షన్‌ను చాలా సులభంగా ఏర్పచుకుంటాయి. కానీ ఈ ఫండ్స్ అన్నీ సదరు సంస్థలు చెబుతున్న లాభాలను ఇస్తాయా లేదా అని మనం స్వతంత్రంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఎంతో కొంత రిస్క్ లేకుండా మదుపు చేసే అవకాశం మార్కెట్ మూల సిద్ధాంతాలకే విరుద్దం. కాబట్టి ప్రకటనలను నమ్మి మదుపు చేయకూడదు.

ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణకు కొనసాగింపుగా క్రింద ఇచ్చిన పట్టికను చూద్దాం. రెండు కోట్లా నలభై లక్షల రూపాయల రిటైర్‌మెంట్ ఫండ్ కోసం ప్రస్తుతం ఎంత మొత్తం ఎస్ఐపీ చేయలో ఒక క్రింద ఇచ్చిన పట్టికలో ఉంది.

సిప్ ఎలా చేయాలి?

వార్షిక లాభం 18% అయితే రెండు కోట్లా ముప్పై లక్షల ఫండ్ కోసం కేవలం పదివేల రూపాయల ఎస్ఐపీ సరిపోతుంది. కానీ అంత ఎక్కువ కాలం 18% లాభం రావడం సులభం కాదు. 12%-15% మధ్య వార్షిక లాభం ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి కనుక వాటిని అధ్యయనం చేసి మనకు తగిన ఫండ్స్ లో మదుపు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)