ఆరోగ్య బీమా: హెల్త్ పాలసీ తీసుకునే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలేంటి?

హెల్త్ పాలసీ

ఫొటో సోర్స్, getty images/Peter Dazeley

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

ఆరోగ్య బీమా ప్రధాన లక్ష్యం కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వైద్యానికి అయ్యే ఖర్చు భారం కాకుండా కాపాడటం.

పళ్లకు చేసే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ నుంచి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సల దాకా అన్ని రకాల వైద్య ఖర్చులకు సిద్దంగా ఉండటానికి ఆరోగ్య బీమా పాలసీ సహాయపడుతుంది.

కేవలం రుగ్మతలకే కాకుండా వాహన ప్రమాదాలకు కూడా బీమా ఇచ్చే పాలసీలు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియానికి పన్ను మినహాయింపు పొందవచ్చు.

గతంలో కంటే ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

దీనికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.

మొదటిది మెట్రోలు కానీ నగరాలలో కూడా మల్టీ స్పెషాలిటి లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రావడం.

రెండోది మధ్య తరగతి వర్గం క్రమంగా పెరుగుతుండటం.

ఇక కోవిడ్ పరిస్థితుల వల్ల ఆరోగ్య బీమా పాలసీలకు మరింత గిరాకీ ఏర్పడింది.

వీడియో క్యాప్షన్, డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు ఎలా తీసుకోవాలి?

ఆరోగ్య బీమా చరిత్ర ఏంటి?

ఈ ఆరోగ్య బీమా వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అమెరికాలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళ్లకుండా ఆపడానికి చవకైన మార్గంగా ఆరోగ్య బీమాను ఎంచుకున్నారు.

క్రమంగా ఆరోగ్య బీమా అనేది ఉద్యోగి, కంపెనీ మధ్య చర్చల్లో ఒక భాగం అయ్యింది.

ఇటీవల FRACTL కంపెనీ సర్వేలో కూడా మంచి ఆరోగ్య బీమా కవరేజ్ ఉన్న కంపెనీలో చేరేందుకు ఉద్యోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది.

అమెరికన్ లేబర్ డిపార్ట్‌మెంట్ సర్వే ప్రకారం సగటున ప్రతీ కంపెనీ ఉద్యోగి కుటుంబానికి ఆరోగ్య బీమా కోసం ఏడాదికి 14,000 డాలర్లు ఖర్చు పెడుతోంది.

వీడియో క్యాప్షన్, లబ్..డబ్బు: టర్మ్ ఇన్‌స్యూరెన్సు పాలసీ

ఇక ప్లానింగ్ విషయానికి వస్తే మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఎక్కువగా నిర్లక్ష్యం చేసే అంశం ఆరోగ్య బీమా అనటం తప్పు కాదు.

ఫైనాన్షియల్ ప్లానింగ్ పరమైన ముఖ్య సూత్రాలలో ఒకటి మనం తప్పించుకోలేని ఖర్చులకు తయారుగా ఉండటం. ఆ ఖర్చుల భారం నెలజీతం లాంటి సాధారణ సంపాదన మీద పడకూడదు.

ఆ ప్రకారంగా చూస్తే ఆరోగ్య బీమా అనుకోకుండా వచ్చే ఉపద్రవాలను ఎదుర్కొనే ఒక రక్షణ వలయం.

కానీ, అరోగ్య బీమా అవసరం లేదని, ఈ బీమా వల్ల అదనంగా కలిగే ప్రయోజనం లేదనే వాదనలు వినిపిస్తుంటాయి.

ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, getty images/Peter Dazeley

ఈ వాదనల వెనుక మూడు కారణాలు

1. ఉద్యోగులకు కంపెనీ కల్పించే ఆరోగ్య బీమా:

ప్రస్తుతం మన దేశంలో ఉండే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు ఎంతో కొంత ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుంది. కానీ ఇది ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న పాలసీ కనుక మన అవసరలకు తగినట్టుగా ఉండే అవకాశం తక్కువ.

ఉదాహరణకు చాలా కంపెనీలలో వాహన ప్రమాదానికి బీమా సౌకర్యం ఉండదు. అలాగే కేటరాక్ట్ చికిత్స లేదా రూట్ కెనాల్ లాంటివి కంపెనీ బీమా కవరేజ్‌లో ఉండవు.

ఇవి కాకుండా, కుటుంబం మొత్తానికి కవరేజ్ ఉండక పోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కవరేజ్ ఉండకపోవచ్చు. ఇవన్నీ క్షుణ్ణంగా బేరీజు వేసుకుని తగిన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి.

ఆరోగ్య బీమా చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, boonchai wedmakawand

2. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలు:

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలలో వైద్య ఖర్చులు భరిస్తున్నాయి. ఈ పథకాల వల్ల కొంత వరకూ ఉపయోగం ఉన్నా అన్ని వేళలా ఈ పథకాలు మన అవసరాలకు సరిపోవు.

ముందుగా ఈ పథకాలు అల్పాదాయ వర్గాలకు తప్ప అందరికీ వర్తించవు. ఒకవేళ ఆదాయం తక్కువగా ఉన్న ఉద్యోగులకు వర్తించినా, అందులో ఎన్నో షరతులు ఉంటాయి.

అలాగే, అన్ని రకాల చికిత్సలకు ఈ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం లేదు.

మరోవైపు ఈ పథకాల వల్ల లబ్ది పొందటానికి ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్లాలనే నియమాలు కూడా ఉండచ్చు. మనకు అవసరమైన చికిత్స మనకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకపోవచ్చు.

అందువల్ల ప్రతీ ఒక్కరు తమ అవసరాలకు తగినట్టుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి.

వీడియో క్యాప్షన్, మీకు షుగర్ ఉందా?

3. ఆరోగ్యంగా ఉన్నవారికి బీమా అవసరం లేదన్న వాదన సరైనదా?

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న వారికి బీమా అవసరం లేదనే వాదన కూడా వింటూ ఉంటాం. ఇది సరైన ఆలోచనా ధోరణి కాదు. సహజంగా నలభై లోపు వయసు ఉన్నవారికి వైద్య ఖర్చులు తక్కువగానే ఉంటాయి.

కాబట్టి ఆరోగ్య బీమా, జీవిత బీమా అవసరం ఈ సమయంలో తక్కువగానే ఉంటుంది.

కానీ, వయసు పెరిగేకొద్దీ అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ. మధుమేహం, రక్తపోటు లాంటివి వంశపారపర్యంగా వస్తున్న రుగ్మతలు. వీటి బారిన పడే అవకాశం వయసుతో పాటూ పెరుగుతుంది.

అందువల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా తీసుకోవాలి.

ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, getty images/sukanya sitthikongsak

ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

1. బీమా కవరేజ్

అన్ని బీమా పాలసీల్లాగే ఇందులో కూడా కవరేజ్ చాలా ముఖ్యమైన విషయం. మెట్రో నగరాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక మెట్రోలలో ఉండేవారు అందుకు తగినట్టుగా కొంత ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలి.

అలాగే, కుటుంబం మొత్తానికి గరిష్టంగా కవరేజ్ దొరికే పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం.

2. ముందుగా ఉన్న రుగ్మతలు

పాలసీ తీసుకునే సమయానికి ఏవైనా రుగ్మతలు ఉంటే వాటికి సంబంధించిన కవరేజ్ కొన్ని పాలసీల్లో వెంటనే అమల్లోకి రాదు.

రుగ్మతలను బట్టి ఏడాది నుంచి మూడేళ్ల సమయం దాటాక ఆ రుగ్మతలకు కవరేజ్ వస్తుంది. ఈ విషయం నిర్దారణ చేసుకోవడానికే కంపెనీలు వైద్య పరీక్షల తర్వాతనే పాలసీ ఇస్తాయి.

ఒకవేళ మనల్ని పీడిస్తున్న రుగ్మతలకు ప్రత్యేకమైన పాలసీ ఏదైనా ఉంటే అది తీసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు కొన్ని కంపెనీలు మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైన పాలసీలు అందిస్తున్నాయి.

ఆ పాలసీ ద్వారా మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రయోజనం పొందవచ్చు.

వీడియో క్యాప్షన్, ఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం

3. ఆసుపత్రి ఖర్చులు

ఆసుపత్రి ఖర్చులు అంటే రూము అద్దె, మందులకు అయ్యే ఖర్చులు, వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులు కొన్ని పాలసీల బీమా కవరేజ్‌లో భాగంగా ఉండవు.

దురదృష్టకర పరిస్థితుల వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అది భారంగా మారుతుంది. అందువల్ల ఈ విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4. ఏ వయసులో ఆరోగ్య బీమా తీసుకోవాలి

ఆరోగ్య బీమా విషయంలో వయసుతో పాటు ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవడం లాభదాయకం. ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగ ఆలోచిస్తే ఆరోగ్య బీమా ద్వారా గరిష్ట లబ్ది పొందటానికి 30 ఏళ్ల వయసు సరైనది.

వీడియో క్యాప్షన్, లబ్‌డబ్బు: వైద్య బీమా ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి?

5. కార్పొరేట్ పాలసీ కవరేజ్

ఉద్యోగులకు తాము పనిచేసే కంపెనీల ద్వారా దొరికే కవరేజ్ ఎంత, దానికి వర్తించే నియమాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి.

చాలా కంపెనీ పాలసీలలో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు ఉద్యోగి చెల్లించకుండా ఉండే వెసులుబాటు ఉంటుంది.

అలాగే కొన్ని పాలసీలలో 80% లేదా 90% ఖర్చులు కంపెనీ పాలసీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉద్యోగి పనిచేసే కంపెనీ మీద ఆధారపడి ఉంటాయి.

అందువల్ల ఈ వివరాలన్నీ బాగా అర్థం చేసుకుని ఆ పాలసీ కవరేజ్‌లో భాగంగా లేని అంశాలకు ఉపయోగపడేలా ఆరోగ్య బీమా తీసుకోవాలి.

6. క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్

క్లెయిం సెటిల్మెంట్ రేట్ 90% కంటే ఎక్కువ ఉన్న కంపెనీలో పాలసీ తీసుకోవడం అందరికీ చెప్పదగిన సలహా. వివిధ కంపెనీలకు చెందిన ఈ వివరాలన్నీ వెబ్‌సైట్లలో సులభంగా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)