ఆయుష్మాన్ భారత్‌‌: ఈ చిన్నారి ఇప్పుడో సెలబ్రిటీ

వీడియో క్యాప్షన్, ఆయుష్మాన్ భారత్‌‌: ఈ చిన్నారి ఇప్పుడో సెలబ్రిటీ

వైద్యం అనేది ప్రతి భారతీయుడి మౌలిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన 23 ఏళ్ల తర్వాత, 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' ద్వారా పేదలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ దేశంలోని ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంది?

ఇటీవల రూపొందించిన 'ఆయుష్మాన్ భారత్ మిషన్' ప్రకారం 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' ప్రారంభించారు. ఈ పథకాన్ని 'మోదీ కేర్' అని కూడా అంటున్నారు. దీని కింద దేశంలోని 40 శాతం జనాభాకు బీమా లభిస్తుంది.

ఈ పథకం, గత ప్రభుత్వంలో ఉన్న జాతీయ ఆరోగ్య బీమా పాలసీని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆరోగ్య పథకాలను తనలో కలుపుకుంటుంది.

అసలేంటీ పథకం?

ఈ పథకం కింద దేశంలోని 10 కోట్ల 74 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తారు.

పథకంలోని లబ్ధిదారులను 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనగణన(ఎస్ఈసీసీ) ద్వారా గుర్తించారు.

లబ్ధిదారుల పూర్తి డేటాను ఆన్‌లైన్లో పొందుపరిచారు. దానిని ప్యానల్‌లో ఉన్న సుమారు 8 వేల ఆస్పత్రులతో షేర్ చేశారు.

ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'ఆయుష్మాన్ కేంద్రాలు' తెరుస్తారు. ఆర్థికంగా బలహీన వర్గాల గుర్తింపు కేంద్రాలతోపాటు రోగులు ఈకేంద్రాలకు కూడా వెళ్లవచ్చు. అక్కడ లబ్ధిదారుల పేరు ఎస్ఈసీసీ డేటాలో ఉందా, లేదా అనేది అధికారులు పరిశీలిస్తారు.

లబ్ధిదారుల పేరు లిస్టులో ఉంటే, వారికి ఒక గోల్డెన్ ఆయుష్మాన్ కార్డ్ అందిస్తారు. లబ్ధిదారులు ఈ పథకం కింద నగదు రహిత వైద్య సేవల కోసం తమ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ పాలసీలో సర్జరీ, కేన్సర్, ఎముకల ఇంప్లాంటేషన్ లాంటి సుమారు 1350 ఆరోగ్య సమస్యలకు బీమా లభిస్తుంది. కానీ ఆస్పత్రుల్లో అడ్మిట్ అవసరం లేని సాధారణ జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధుల ఖర్చులు ఇందులోకి రావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)