ఆన్‌లైన్ మోసాలు: మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
విశాఖపట్నానికి చెందిన నిశాంత్‌కు (పేరు మార్చాం) రూ.14,000 పెట్టుబడి పెడితే 24 గంటల్లో రెట్టింపు డబ్బును ఇస్తామని చెబుతూ డిసెంబరు 21న ఒక కాల్ వచ్చింది. అయితే, ఆ కాల్‌ను ఆయనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి చేశారు.
ఈ పథకం వివరాలు చెప్పేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థకు చెందిన మరొక వ్యక్తిని కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నారు. ఈ వివరాలను నిశాంత్ బీబీసీకి వెల్లడించారు.
"తమ సంస్థ కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న వారికి మాత్రమే రెట్టింపు డబ్బులు ఇస్తోందని, ఇప్పటికే 200 మందికి పైగా సభ్యులకు ఇలా డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు.
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకిస్తున్నారు అనే దానికి సదరు వ్యక్తి సమాధానం చెప్పలేదని చెప్పారు.
ఒక రోజులో రెట్టింపు డబ్బునెలా ఇస్తారనే సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు ...
సంస్థ పేరును దీపక్ గార్డిన్గ్ అని చెబుతూ బ్యాగులు, విల్లాలు, జిమ్ పరికరాలు లాంటి వాటి డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని చెప్పారు. కొన్ని చిన్న సంస్థల మార్కెటింగ్ చేస్తామని చెప్పినట్లు తెలిపారు.
ఈ మార్కెటింగ్‌కు, రెట్టింపు డబ్బు ఇచ్చేందుకు సంబంధం ఏమిటని ప్రశ్నించినప్పుడు అది సంస్థ వ్యాపార రహస్యమని చెబుతూ, త్వరగా డబ్బు కడితే రెట్టింపు డబ్బు త్వరగా తీసుకోవచ్చని చెబుతూ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసినట్లు చెప్పారు
కానీ, ఆ ఒక్క ఫోన్ కాల్‌తో వారు తమ ప్రయత్నాన్ని ఆపలేదు.
డిసెంబరు 22న నిశాంత్‌కు తిరిగి ఫోన్ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రోజు డబ్బులు కడతారా అని అడిగారు. త్వరగా కడితే తమ టార్గెట్ కూడా పూర్తవుతుందని చెప్పారు.
ఇప్పటికే చాలా మందికి డబ్బును తిరిగి ఇప్పించినట్లు కొన్ని ఉదాహరణలు చెప్పి రూ.50,000 పెట్టుబడి పెడితే ఆరు లక్షలు కూడా కొంత మందికి వచ్చినట్లు చెప్పారు. వేరే వాళ్లకు డబ్బును పంపినట్లు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తామని చెప్పారు.
డబ్బులు కట్టమని ఒత్తిడి చేయడంతో పాటు, మరో వారం రోజుల తర్వాత ఈ పథకం అందుబాటులో ఉంటుందో లేదోననే సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఇందు కోసం సదరు వ్యక్తుల ఆధార్, యూపీఐ ఐడి కావాలని అడిగారు. వీటి అవసరమేమిటని అడిగినప్పుడు, ఒక వ్యక్తికి ఒకసారే ఇస్తామని, అందుకోసం ఆధార్ అవసరమని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు యూపీఐ ఐడి అవసరమని చెప్పారు.
ఇందులో మీ లాభం ఏమిటని ప్రశ్నించగా, టార్గెట్ రీచ్ అయితే కమీషన్ వస్తుందని చెప్పారు. దాంతో పాటు, రెట్టింపు డబ్బు అందగానే వారికి కూడా రూ. 5000 కమీషన్ ఇమ్మని కోరారు. ఈ విషయం కంపెనీకి చెప్పవద్దని అభ్యర్ధించారు".
నిశాంత్ అందించిన వివరాలను బీబీసీ పరిశీలించింది.
నిశాంత్‌కు ఫోన్ చేసిన వ్యక్తులు అందించిన వివరాల ప్రకారం ఆ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
అది ఆర్ధిక సేవలందించే సంస్థగా ఆన్‌లైన్‌లో కనిపించలేదు.
భారత ప్రభుత్వ కార్పొరేట్ రిజిస్ట్రీలో 2017లో హైదరాబాద్ కేంద్రంగా అధికారికంగా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, సంస్థ వ్యాపార సరళి, తీరు, యాజమాన్య వివరాలు ఆ వెబ్ సైటులో లేవు. సంస్థ స్టేటస్ అల్లోకేటెడ్ అని చూపిస్తోంది.
సంస్థకు అధికారిక వెబ్‌సైటు లేదు.
సంస్థ చేస్తున్న వ్యాపారం, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లభించలేదు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న డైరెక్టర్ల పేర్లతో వెబ్‌సెర్చ్‌లో ఎటువంటి వివరాలు లభించలేదు.
పబ్లిక్ డొమైన్‌లో లభించిన ఈ మెయిల్ ఐడీ, జీమెయిల్, యాహు లాంటి సెర్చ్ డొమైన్లతో కాకుండా వారి కంపెనీ పేరుతోనే ఉంది.
సంస్థ వివరాలను తెలుసుకునేందుకు పబ్లిక్ డొమైన్‌లో లభించిన ఈ మెయిల్ ద్వారా బీబీసీ కంపెనీని సంప్రదించింది. కానీ, ఆ ఈ-మెయిల్ బౌన్స్ అయింది.
సంస్థ అడ్రస్‌ను గూగుల్ మ్యాప్స్‌లో వెతికినప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది కానీ, ఆ అడ్రెస్‌లో నిర్దిష్టంగా ఒక కంపెనీ లేదా ఇంటిని సూచించటం లేదు.
సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మకమే ఆధారం
బీబీసీ ఈ వివరాలను గతంలో సిఐడి సైబర్ క్రైమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పని చేసిన అధికారితో చర్చించినప్పుడు, ఇదొక విధంగా చిన్న స్థాయిలో చేసే మోసమని చెప్పారు.
ఇటువంటి మోసాలకు సాధారణంగా తెలిసిన వారిని ఉపయోగించుకుని, నమ్మకం ఆధారంగా మోసాలు చేస్తారని, కొన్ని రోజుల తర్వాత వారు కూడా ఫోన్‌లకు దొరకరని వివరించారు.
"సదరు వ్యక్తులు చెబుతున్న వ్యాపార సరళి నమ్మశక్యంగా లేదని అంటూ, సాధారణంగా మోసం చేసే వ్యక్తులు ఏదైనా సంస్థ షేర్లు మరో రెండు రోజుల్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, అందులో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తూ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు" అని చెప్పారు.
కొన్ని సార్లు ఏదైనా దేశం నుంచి విలువైన కన్‌సైన్‌మెంట్ వచ్చిందని, అది విడిపించాలంటే తమ దగ్గర పూర్తి డబ్బు లేదని, డబ్బులు చెల్లిస్తే, ఆ కన్‌సైన్‌మెంట్ విడుదల అవ్వగానే రెట్టింపు సొమ్ము ఇస్తామని, అందుకు క్రౌడ్‌సోర్సింగ్ చేస్తున్నామని నమ్మదగ్గ పదజాలాన్ని వాడతారని ఆయన చెప్పారు.
ఇటువంటి సమాచారాన్ని పోలీసులకు అందచేయడం ద్వారా విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తారా? జరగబోయే మోసాన్ని అరికట్టే అవకాశం ఉందా?
ఇటువంటి సమాచారం అందచేస్తే ఫిర్యాదు నమోదు చేయకపోయినా కేసు విచారణ చేయవచ్చని చెప్పారు. నేరం చేసినా, చేయడానికి ప్రయత్నించినా కూడా కేసు నమోదు చేయవచ్చని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటువంటి నేరస్థులను ఎలా కనిపెడతారు?
బాధితులు అందించిన సమాచారాన్ని పోలీసు డేటాబేస్‌లో ఉన్న సమాచారంతో పోల్చి చూస్తాం. ఆ పేరుతో గతంలో కేసులేవైనా నమోదయ్యాయేమో అని పరిశీలిస్తాం.
పోలీసుల విచారణ చేసే టూల్స్ భిన్నంగా ఉంటాయని వివరిస్తూ, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఐపీ అడ్రెస్‌ను కూడా కనిపెట్టగలరని చెప్పారు.
పోలీసులు ముందుగా ఆన్‌లైన్ పరిశీలన చేసి డొమైన్ రిజిస్ట్రేషన్, ఇతర ఐపీ వివరాలు తీసుకుంటారు.
ఓపెన్ ఆన్‌లైన్ సోర్సెస్ మాత్రమే కాకుండా వ్యవస్థాగతంగా పోలీసులకు విచారణ నిమిత్తం మరిన్ని సాధనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
బ్యాంక్ అకౌంట్ వివరాలు లభిస్తే, వాటిని సేకరించి లబ్ధిదారుల గురించి వివరాలు సేకరిస్తాం. కానీ, చాలా సార్లు ఈ అకౌంట్ల బినామీ పేర్లతో ఉంటాయి. కానీ, అక్కడ నుంచి కూడా నేరస్థులను ట్రాక్ చేసే వీలుంటుంది. ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు కానీ, చేయవచ్చని చెప్పారు.
కొన్ని సార్లు ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా కూడా కొన్ని వివరాలు సేకరిస్తాం అని వివరించారు.
అయితే, దురదృష్టవశాత్తు, సిబ్బంది, వనరుల కొరత కేసుల పరిష్కారానికి ఆటంకంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ప్రతి 500 మందికి ఒక పోలీసు ఉండాల్సి ఉండగా, ప్రతి 20,000 కి ఒక పోలీసు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. దీంతో, కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని అన్నారు.
మోసం చేసిన వారు ఆన్‌లైన్‌లో భారతీయ సర్వర్లు ద్వారా మోసం చేస్తే, సమాచారం సేకరించవచ్చు కానీ, సర్వర్లు విదేశాల్లో ఉంటే మాత్రం కేసు ఛేదించడం కష్టమవుతుందని వివరించారు. అటువంటప్పుడే కేసులు వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆన్‌లైన్ కేసుల విచారణకు చాలా సమయం, శక్తి, ధనాన్ని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ లోపు నేరస్థుడు తమ కార్యకలాపాలను కొనసాగించే స్థానాలను కూడా మార్చేస్తారని చెప్పారు.
సాధారణంగా సైబర్ నేరాల్లో బెయిల్ సులభంగా వస్తుంది. కానీ, బెయిల్ రాకుండా ఉంటే విచారణ సాధ్యమవుతుందని చెప్పారు.
నేరస్థుల్లో చాలా మందికి తప్పు చేశామని గ్రహించే తత్త్వం ఉండదు. ఎన్ని అరెస్టులు చేసినా వాళ్లకి పునరావాసం పొంది సాధారణ జీవితం కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉండటంతో, వారు నేరాలను చేయడం ఆపరని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిర్యాదు చేయడం ఎలా?
సైబర్ క్రైమ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎవరైనా సమాచారాన్ని అందించవచ్చని చెబుతూ, ఫిర్యాదు అయితే, సంబంధిత రాష్ట్రాల అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. .
అయితే, నిరక్షరాస్యుల కోసం టోల్ ఫ్రీ 155 260 నంబర్ ఉన్నట్లు చెప్పారు.
లేదా, స్వయంగా పోలీస్ స్టేషన్‌లో సైబర్ సెల్‌కు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
జాగ్రత్తలు ఎలా?
లాటరీల్లో డబ్బులు వస్తాయంటే నమ్మడం, తక్కువ కాలంలో రూపాయికి రెండు రూపాయిల లాభం వస్తుందంటే నమ్మడం లాంటివి మానాలని సూచించారు.
అపరిచితులు ఆన్ లైన్‌లో డబ్బులు చెల్లించమని అడిగినప్పుడు, లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయమన్నప్పుడు చేయవద్దని సూచించారు.
ఆర్మీ, పారా మిలిటరీ సిబ్బంది అని చెబితే అటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు.
ఏటిఎంలో తరచుగా పిన్ నంబర్లను మార్చడం మేలని చెప్పారు.
ఒక రోజులో డబ్బులెలా రెట్టింపు ఇవ్వగలరనే ప్రశ్న వేసుకుంటే మోసపోవడం జరగదని హైదరాబాద్‌కు చెందిన ఫార్చ్యూన్ అకాడెమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మణి పవిత్ర అంటారు. కష్టపడకుండా ఎవరూ డబ్బులు ఇవ్వలేరనేది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరైనా గ్రహించాల్సిన విషయమని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'న్యూడ్ వీడియో కాల్స్' ట్రాప్‌లో పడి 24 లక్షలు పోగొట్టుకున్నాడు
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- బంగారం బిస్కెట్లు తక్కువ ధరకే అని నమ్మించి ఫేస్‌బుక్ వేదికగా మోసం: ప్రెస్ రివ్యూ
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ఉత్తరాలు రాసుకునే రోజుల నుంచి వాట్సాప్ సందేశాల వరకూ...
- వాట్సాప్ మెసేజ్‌లపై భారత ప్రభుత్వం నిఘా
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














