బంగారం బిస్కెట్లు తక్కువ ధరకే అని నమ్మించి ఫేస్‌బుక్ వేదికగా మోసం: ప్రెస్ రివ్యూ

బంగారు బిస్కెట్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫేస్‌బుక్‌ వేదికగా ఆన్‌లైన్‌ మోసాలే కాదు, ఆఫ్‌లైన్‌ మోసాలు కూడా చేయొచ్చని ఈ ముఠా కొత్త అర్థం చెప్పింది. తక్కువ ధరకే కిలో బంగారం ఇస్తామని ఆశపెట్టి రూ. 38.5 లక్షలు దోచుకుందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌, ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేశ్‌లు కేసు వివరాలు వెల్లడించారు.

మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ అఫ్రోజ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌. నెలన్నర క్రితం ఢిల్లీకి చెందిన గౌతమ్‌ తక్కువ ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఆశపడిన అఫ్రోజ్‌ సదరు వ్యక్తికి ఫోన్‌ చేయగా, కేజీ బంగారం రూ. 42లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికోసం అతను సూచించిన ముంబైకి చెందిన అమిత్‌పటేల్‌ (గుల్జార్‌)తో, ఆ తర్వాత హైదరాబాద్‌ ఏజెంట్‌ రెడ్డి పాండురంగారావుతో మాట్లాడాడు.

రెండు వారాల చర్చల అనంతరం బంగారాన్ని ముఖేశ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ తీసుకొస్తాడని, అతనికి డబ్బు చెల్లించాలని రెడ్డి పాండురంగారావు సూచించాడు.

ఆ తర్వాత ముఖేష్‌, అన్వేష్‌ అలియాస్‌ కిరణ్‌లు మెహిదీపట్నం, నాచారం ప్రాంతాల్లో రెండుసార్లు అఫ్రోజ్‌ను కలిసి బంగారు బిస్కెట్లు చూపించి నమ్మించారు.

గత నెల 25న ముఖేష్‌ నేరుగా బాధితుడితో మాట్లాడి రెడ్డి పాండురంగారావు, కిరణ్‌లకు డబ్బులు చెల్లించి బంగారం తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత నింబోలి అడ్డాలో ఉన్న బాధితుడి ఫ్లాట్‌ వద్దకు వారిద్దరూ రెండు బ్రీఫ్‌ కేసులతో వచ్చారు.

బాధితుడు వారికి రూ. 42 లక్షలు ఇవ్వగా అతనికి డిస్కౌంట్‌ ఇస్తున్నామని చెప్పి రూ.3.5లక్షలు తిరిగి ఇచ్చేశారు. మిగతా డబ్బు రూ. 38.5లక్షలను రెడ్డి పాండురంగారావు లెక్కపెట్టి ఓ బ్రీఫ్‌కే‌స్‌లో పెట్టుకున్నాడు.

బాధితుడిని మాటల్లో మభ్యపెట్టి డబ్బున్న బ్రీఫ్‌కేసును కిందకు, డబ్బులేని బ్రీఫ్‌కేసును పైకి తారుమారు చేశారు.

ఆ తర్వాత బంగారు బిస్కెట్లకు సంబంధించిన బ్రీఫ్‌కేసు కాకుండా పొరపాటున వేరే బ్రీఫ్‌కేసు తెచ్చామని, ఇప్పుడే బంగారు బిస్కెట్లు తెస్తామని బాధితుడిని నమ్మించి ఖాళీ బ్రీఫ్‌ కేస్‌ను అతనికి ఇచ్చేసి వెళ్లారు.

మాటల్లో ఇది గమనించని బాధితుడు ఆ తర్వాత మోసం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహమ్మద్‌ రఫీక్‌ (45) అలియాస్‌ రెడ్డి (కాలాబురాగీ, గుల్బర్గా), ముఖేశ్‌ (55) (థానె, మహారాష్ట్ర), రెడ్డి పాండురంగారావు (53) (పశ్చిమ గోదావరి), అన్వేష్‌ కుమార్‌(32)లను అరెస్ట్‌ చేశారు.

వికాస్‌ గౌతమ్‌, అమిత్‌ పటేల్‌లు పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. వారి నుంచి రూ.20 లక్షలు నగదు, 13 రెగ్జిన్‌ బ్యాగులతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని ఈ కథనంలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

ఆర్థిక వృద్ధిలో ఏపీ పదకొండో స్థానం

పబ్లిక్‌ ఎఫైర్స్‌ సంస్థ 2021 నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో ఉందని ఈనాడు పత్రిక తెలిపింది.

వనరులు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో వృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రాల్లో ఏపీ పదకొండో స్థానంలో నిలిచింది.

వివిధ పథకాలు, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్న తీరు, రాష్ట్రాల పని తీరు ఆధారంగా పబ్లిక్‌ ఎఫైర్స్‌ సంస్థ 2021 సంవత్సరానికి నివేదిక విడుదల చేసింది.

అన్ని విభాగాల్లో చూస్తే కేరళ ప్రథమ స్థానంలో, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

వృద్ధి రంగంలో తెలంగాణ 1.380 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, -0.101 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో నిలిచింది.

సీజేఐ ఎన్‌వీ రమణ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సీజేఐ ఎన్‌వీ రమణ

జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో ఆ ఊరికి బస్సు

సీజేఐ ఎన్వీ రమణ చొరవతో ఓ ఊరికి బస్సు వచ్చిందటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆ వివరాల ప్రకారం.. ఎనిమిదో తరగతి చదువుతున్న వైష్ణవి కరోనా ముందు వరకు బస్సులో చక్కగా స్కూలుకు వెళ్లివచ్చేది. కోవిడ్‌తో కొన్ని గ్రామాలకు బస్సులు నిలిచిపోయాయి.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కొన్ని ఊళ్లకు బస్సులు ఇంకా మొదలుకాలేదు. రంగారెడ్డి జిల్లా మాచారం మండలం చిదేడు గ్రామం అందులో ఒకటి.

ఇదే గ్రామానికి చెందిన వైష్ణవి.. స్కూలుకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నది.

దీంతో తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ వైష్ణవి.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఉత్తరం రాసింది.

తన తండ్రి కరోనా తొలి దశలో గుండెపోటుతో చనిపోయారని, తల్లి చిన్న ఉద్యోగంతో తమను పోషిస్తున్నదని పేర్కొన్నది. చిదేడుకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేసింది.

చిన్నారి లేఖపై జస్టిస్‌ రమణ స్పందించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాలతో చిదేడుకు బస్సు సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించారు.

"వైష్ణవి తమ గ్రామానికి బస్సు సౌకర్యం అవసరం ఉన్న విషయాన్ని ధైర్యంగా వెలుగులోకి తీసుకువచ్చి స్ఫూర్తిని నింపింది. వైష్ణవిని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలి. రాష్ట్రంలో దాదాపు 30 గ్రామాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాం. పిల్లల విద్యాహక్కు ప్రాధాన్యం గుర్తించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు బస్‌ కనెక్టివిటీ ఇస్తాం" అని సజ్జనార్‌ తెలిపారు.

కొల్లేరు సరస్సు, పక్షులు

ఫొటో సోర్స్, BBC/Getty Images

కొల్లేరులో సారా తయారీ గుట్టు రట్టు

సారా తయారీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో కిక్కిస పొదల మాటున సాగుతున్న సారా తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారుఅని సాక్షి పత్రిక తెలిపింది.

ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్, పలువురు పోలీసులు బుధవారం పడవలపై వెళ్లి ఆ స్థావరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కొల్లేరు కిక్కిస పొదలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.

కైకలూరు రూరల్‌ ఎస్‌ఐ చల్లా కృష్ణ పందిరిపల్లిగూడెం పరిధిలో కొల్లేరు సరస్సు మధ్యలో సారా తయారీ కేంద్రాన్ని మంగళవారం గుర్తించి దాడి చేశారని చెప్పారు.

అక్కడ వెయ్యి లీగర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 50 వేల లీటర్ల బెల్లపు ఊటను స్వా'దీనం చేసుకుని పందిరిపల్లిగూడెంకు చెందిన భలే సుబ్బరాజు (40), ఘంటసాల రాంబాబు (35), భలే కోటశివాజీ(35), ఆకివీడుకు చెందిన పన్నాస కృష్ణ (35) అనే వారిని అరెస్ట్‌ చేశారని వివరించారు.

నిందితుల నుంచి సారా తయారీకి ఉపయోగించే రూ.6.80 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)