ఆన్‌లైన్‌లో రమ్మీ (పేకాట) ఆడుతూ పోలీసులకు పట్టుబడితే ఏమవుతుంది? దీనికి ఎలాంటి శిక్షలు విధిస్తారు?

గ్యాంబ్లింగ్

ఫొటో సోర్స్, Fanatic Studio via getty images

    • రచయిత, పెదగాడి రాజేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ కర్నాటక అసెంబ్లీ తాజాగా ఒక బిల్లును ఆమోదించింది. ఇంటర్నెట్, మొబైల్ యాప్స్‌లో గ్యాంబ్లింగ్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ‘‘కాగ్నిజబుల్ అఫెన్స్’’గా దీనిలో పేర్కొన్నారు. అంటే ఎలాంటి వారెంటూ లేకుండానే పోలీసులు అరెస్టు చేయొచ్చు. అంతేకాదు ఇది ‘‘నాన్ బెయిలబుల్ అఫెన్స్’’ కూడా.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుందని చెబుతూ గత డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని ఆమోదించింది. తెలంగాణలోనూ గ్యాంబ్లింగ్‌పై ఆంక్షలు విధిస్తూ 2017లో తెలంగాణ గేమింగ్ చట్టాన్ని సవరించారు.

దీంతో అసలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఏమిటి? రమ్మీ, పోకర్ లాంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం నేరమా? ఇవి ఆడుతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు విధిస్తారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

గ్యాంబ్లింగ్

ఫొటో సోర్స్, Rasi Bhadramani via getty images

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే?

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఇంటర్నెట్‌లో బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం లేదా పోగొట్టుకోవడం. నిజానికి క్యాసీనోకు వెళ్లి బెట్టింగ్ కాయడానికి దీనికి పెద్ద తేడా లేదు. అక్కడ నేరుగా మనం వెళ్లి ఆడితే, ఇక్కడ ఆన్‌లైన్‌లో ఆడతాం.

రమ్మీ, పోకర్, స్పోర్ట్ గేమ్స్, క్యాసీనో గేమ్స్ తదితర రకరకాల గేమ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానాలను ఉపయోగించి వీటిలో బెట్టింగ్ కాస్తుంటారు.

భారత్‌లో ఎక్కువగా ఆడే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌లో తీన్ పత్తీ, రమ్మీ ప్రధానమైనవని ఆల్ ఇండియా గేమ్స్ ఫెడరేషన్‌కు (ఏఐజీఎఫ్)కు చెందిన తాన్య శాండిల్య చెప్పారు.

రమ్మీని ఆన్‌లైన్ పేకాటగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇది సుపరిచితమే. యూట్యూబ్‌లో వీడియోలను చూసేటప్పుడు మధ్యమధ్యలో ‘‘ఖేలో రమ్మీ’’అంటూ సినీనటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌ల జంగ్లీ రమ్మీ యాడ్ అప్పుడప్పుడూ వస్తుంటుంది.

‘‘అడ్డా 52 రమ్మీ, క్లాసిక్ రమ్మీ, రమ్మీ ప్యాషన్, తాజ్ రమ్మీ, రమ్మీ సర్కిల్, ఇండిగో రమ్మీ, రమ్మీ విల్లా, డెక్కన్ రమ్మీ, ఖేల్‌ప్లే రమ్మీ పేర్లతో పలు వెబ్‌సైట్లు కూడా రమ్మీకి ప్రాచుర్యం పొందాయి.

ఇక రెండోది తీన్‌ పత్తి. దీన్ని వర్చువల్ క్యాసినోగా చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ డీలర్స్ దీనిలో డీల్స్‌ను నడిపిస్తుంటారు.

బ్లాక్ జాక్, రూలెట్, బరాక్ట్, ఇండియన్ ఫ్లష్, అందర్ బాహర్ తదితర గేమ్స్‌ కూడా భారతీయులు ఎక్కువగా ఆడే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ జాబితాలో ఉన్నాయి’’అని తాన్య వివరించారు.

రమ్మీ

ఫొటో సోర్స్, Thinkstock

గేమింగ్‌కు గ్యాంబ్లింగ్‌కు తేడా ఏమిటి?

గేమింగ్, గ్యాంబ్లింగ్‌ల మధ్య తేడాపైనా బీబీసీతో తాన్య మాట్లాడారు. ‘‘ఆన్‌లైన్ గేమ్స్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. స్నేహితులతో కలిసి లేదా ఒంటరిగా సరదాగా ఆడుకునే గేమ్స్‌ను ఆన్‌లైన్ గేమ్స్‌గా చెప్పుకోవచ్చు. గ్యాంబ్లింగ్‌ డబ్బులతో ముడిపడి ఉంటుంది. ఆటలో గెలిస్తే డబ్బులు వస్తాయి. ఓడిపోతే డబ్బులు పోతాయి.

చాలావరకు ఆన్‌లైన్ గేమ్స్‌ ఫ్రీగానే ఉంటాయి. గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే, మొదట డబ్బులు కట్టి మనం ఆడాల్సి ఉంటుంది’’అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్ పేకాట ఆడుతూ పట్టుబడితే ఏ శిక్ష పడుతుంది?

గ్యాంబ్లింగ్ నేరమా? సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

నిజానికి భారత్‌లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ చట్టాల విషయంలో చాలా గందరగోళం నెలకొనిఉంది.

‘‘ఇక్కడ నైపుణ్యంతో ఆడే ఆటలు (గేమ్స్ ఆఫ్ స్కిల్స్‌)ను ఆడొచ్చు. అయితే, లక్‌మీదే ఆధారపడే గేమ్స్ (గేమ్స్ ఆఫ్ ఛాన్స్)ను ఆడకూడదు. ఇవి చట్టవ్యతిరేకమైనవి’’అని 1957లో సుప్రీం కోర్టు తెలిపింది.

అయితే, ఇక్కడ గేమ్స్ ఆఫ్ స్కిల్స్ ఏవో.. గేమ్స్ ఆఫ్ ఛాన్స్ ఏవో స్పష్టంగా చెప్పడం కష్టం.

ఫ్లష్, బ్రాగ్‌ లాంటి మూడు ముక్కలాటల్లా రమ్మీ.. ‘‘గేమ్స్ ఆఫ్ ఛాన్స్’’ కాదని 1968లో సుప్రీం కోర్టు స్పష్టీకరించింది.

‘‘రమ్మీ ఆడేందుకు నైపుణ్యం కావాలి. వీటిలో కొన్ని విషయాలను గేమర్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా లక్‌పై ఆధారపడే ఆటకాదు’’అని చెబుతూ సుప్రీం కోర్టు వివరించింది.

Casino

ఫొటో సోర్స్, Reuters

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చట్టాలు ఏం చెబుతున్నాయి?

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ సహా కొన్ని ప్రభుత్వాలు కొన్ని రకాల ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లపై నిషేధం విధిస్తూ చట్టాలకు సవరణలు చేశాయి.

బెట్టింగ్ వల్ల చాలా మంది యువత అప్పుల్లో కూరుకుపోతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెబుతూ 2020 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974ను సవరించారు.

‘‘ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లపై ఆంక్షలు విధించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని సవరించాం. జాబితాలో పొందుపరిచిన ఈ 132 వెబ్‌సైట్లను పూర్తిగా బ్యాన్ చేయండి’’అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అక్టోబరులో అప్పటి కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా పలువురు పేరొందిన క్రికెటర్లు, క్రీడాకారులు అంబాసిడర్లుగా ఉన్న పేటీఎం ఫస్ట్ గేమ్, మొబైల్ ప్రీమియర్ లీగ్, అడ్డా52తోపాటు రమ్మీ వెబ్‌సైట్లు కూడా సీఎం జగన్ బ్యాన్ చేయాలని కోరిన జాబితాలో ఉన్నాయి.

‘‘కొత్త చట్టం ప్రకారం.. మొదటిసారి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడితే ఏడాది వరకు జైలు శిక్షతోపాటు రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా ఇలానే పట్టుబడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఈ గేమ్స్ ఆడేవారికి కూడా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు ’’అని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.

తెలంగాణలో 2017లోనే ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై ఆంక్షలను విధించారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలోనే శిక్షలు, జరిమానాలు ఉన్నాయి.

అయితే, తెలంగాణలో బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

రమ్మీ

ఫొటో సోర్స్, Getty Images

సంస్థలు ఏం అంటున్నాయి?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో డబ్బులు పెట్టి ఆన్‌లైన్ రమ్మీ ఆడటంపై నిషేధానికి అనుగుణంగా కొన్ని రమ్మీ సంస్థలు తమ విధానాల్లో మార్పులు కూడా చేశాయి.

యూట్యూబ్‌లో ప్రధానంగా కనిపించే రమ్మీ యాడ్లలో ఒకటైన ‘‘జంగ్లీ రమ్మీ’’ టెర్మ్స్ ఆఫ్ సర్వీస్‌ను బీబీసీ పరిశీలించింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అస్సాం, ఒడిశా, సిక్కిం, నాగాలాండ్‌లలో డబ్బులు పెట్టి రమ్మీ ఆడటంపై నిషేధం అమలులో ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో డబ్బులుపెట్టి ఆడే సేవలను నిలిపివేసినట్లు పేర్కొంది.

అయితే, ఇక్కడ డబ్బులతో సంబంధం లేకుండా ఫ్రీగా ఆడే రమ్మీని ఆడుకోవచ్చు.

మరోవైపు కథానాయిక రెజీనా యాడ్‌లో కనిపించే ‘‘ఏస్2త్రీ’’ రమ్మీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది.

అస్సాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ యూజర్లను తమ వెబ్‌సైట్లో ఆడేందుకు అనుమతించడంలేదని స్పష్టంచేసింది.

రమ్మీ

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడులో ఏమైంది?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలోనే తమిళనాడు కూడా గత ఫిబ్రవరిలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను బ్యాన్‌చేస్తూ గేమింగ్ అండ్ పోలీస్ లాస్ (సవరణ) చట్టాన్ని సవరించింది.

‘‘అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు, సైబర్ స్పేస్‌లో బెట్టింగ్ నియంత్రణకు తాజా చట్టాన్ని తీసుకొచ్చాం’’అని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు.

అయితే, తమిళనాడు తీసుకొచ్చిన చట్టాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల పిటీషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది.

‘‘1968లో రమ్మీ గేమ్ ఆఫ్ ఛాన్స్‌ కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. కాబట్టి ఆన్‌లైన్ రమ్మీ నేరం కాదు’’అని మద్రాస్ హైకోర్టు చెప్పింది.

రమ్మీ

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో..

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై ఆంక్షలను ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబరులో సంకేతాలను ఇచ్చింది.

‘‘ఆన్‌లైన్ గేమ్స్‌పై సంపూర్ణ నిషేధంతో ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే సామర్థ్యం ఈ రంగానికి ఉంది. దీని ద్వారా కొత్త ఉద్యోగాలను కూడా కల్పించొచ్చు’’అని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సదస్సులో తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రధాన కార్యదర్శి జయేశ్ రాజన్ అన్నారు.

‘‘ముఖ్యంగా గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్‌ల మధ్య తేడాలను మనం స్పష్టంగా గుర్తించగలగాలి’’అని ఆయన అన్నారు.

మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే రీతిలో సరికొత్త ఆన్‌లైన్ గేమింగ్ విధానాన్ని తెలంగాణలో తీసుకురాబోతున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)