పేకాట ఆడుతున్న 8 మంది మహిళల అరెస్ట్... భారీగా డబ్బు, ఫోన్లు స్వాధీనం : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Eenadu
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఇంట్లో పేకాడుతున్న ఎనిమిది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారని ‘ఈనాడు’ ఒక వార్తా కథనంలో తెలిపింది.
''గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాడేపల్లి సీతానగరంలోని పట్టాభి సీతారామయ్య కాలనీలో పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.36లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ ఇదే కేసులో అరెస్టయ్యార''ని అందులో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రూ. 100కి చేరిన కిలో ఉల్లి ధర
తెలంగాణలో ఉల్లి మళ్లీ ఘాటెక్కిందని 'సాక్షి' పత్రిక తన కథనంలో తెలిపింది.
''పొరుగు రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, ధరలపై నియంత్రణ లేకపోవడంతో వంటింట్లో ఉల్లి మంటెక్కిస్తోంది. వారం రోజుల కిందటి వరకు మేలురకం కిలో ఉల్లి ధర రూ.50 పలుకగా అది ప్రస్తుతం ఏకంగా రూ.100కి చేరింది.
సాధారణ రకం ఉల్లి ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గడం, మరో ఇరవై రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ధరల కళ్లేనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంద''ని అందులో పేర్కొంది.

అప్పు దొరికితేనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు?
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయని, తీవ్ర నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, బ్యాంకులు రుణమిస్తేనే పనులు సాగే దుస్థితి నెలకొందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సమీక్ష జరిపేవరకూ పనులు ముందుకు సాగనీయవద్దంటూ జలవనరుల శాఖకు ఆదేశాలు వచ్చాయి. దీంతో కమిటీ నివేదిక కోసం కొంతకాలంగా ఆ శాఖ పనులన్నీ ఆపేసింది. హంద్రీనీవా, గాలేరు నగరి సుజల స్రవంతుల్లో అక్రమ చెల్లింపులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టులోనూ అదనపు చెల్లింపులు జరిగాయని కమిటీ తేల్చడంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రివర్స్ టెండర్‌కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రాలు ఒకే ప్యాకేజీగా రివర్స్ టెండర్‌కు వెళ్లారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడ్డంకులూ లేనప్పటికీ జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జలవనరుల శాఖ మూడుసార్లు సీఎంతో ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించినా ఎలాంటి స్పష్టత రాలేదు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ ఏడాది రూ.7,687కోట్లు అవసరమని సీఎం ఈనెలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ నివేదిక ఇచ్చింది. అయితే.. ఈ రూ.7,687కోట్ల విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం భారీ సాగునీటి ప్రాజెక్టులకు స్కెచ్ వేసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను పంపి రాయలసీమకు సాగు, తాగునీరందించే భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ పథకానికి దాదాపు రూ.1.60లక్షల కోట్లు వ్యయమవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై ఇరురాష్ట్రాల సీఎంలు సమావేశాలు నిర్వహించినా చివరకు నిధుల లేమి కారణంతోనే ఈ భారీ ప్రణాళికకు దాదాపు ఫుల్‌స్టాప్ పెట్టినట్లుగా జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బానకచర్ల వరకూ గోదావరి జలాలను ఎత్తిపోసే మరో పథకానికి కార్యచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి రూ.80వేల కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనా వేసినా ఈ పథకం ప్రారంభించేనాటికి వ్యయం రెండింతలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఇంత పెద్దమొత్తంలో నిధుల సేకరణ సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయ''ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్ 26న సూర్యగ్రహణం
మరికొన్ని రోజుల్లో ముగియనున్న 2019లో మరో సూర్యగ్రహణం ఏర్పడనుందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది. ''2019 సంవత్సరం ఇప్పటికే రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు, ఒక సంపూర్ణ చంద్రగ్రహణం, ఒక పాక్షిక చంద్రగ్రహణానికి సాక్షిగా నిలిచింది. డిసెంబర్ 26న ఏర్పడే సూర్యగ్రహణం సందర్భంగా అరుదైన రింగ్ ఆఫ్ ఫైర్ ఆవిష్కృతం కానున్నది. మన దేశంలో కేరళలోని కాసర్‌గోడ్‌లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అయితే, సౌదీ అరేబియాలో దీన్ని సంపూర్ణంగా వీక్షించవచ్చు. డిసెంబర్ 26న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.06 గంటల నుంచి 11.13 గంటల వరకు సూ ర్యుడు, భూమికి మధ్య చంద్రుడు ప్రవేశిస్తాడు.
ఈ సందర్భంగా చంద్రుడు అడ్డుగా ఉండటంతో సూర్యుడి చివరలు ఎరుపు రం గులో కనిపిస్తూ వేలి ఉంగరం మాదిరిగా రింగ్ ఆఫ్ ఫైర్ ఆవిష్కృతమవుతాయి. గ్రహణం రెండున్నర గంటలపాటు కొనసాగనుంది. కానీ సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోయేది ఉదయం 7.35 గంటల నుంచి 7.38 గంటల వరకు.. రెండునిమిషాల 47 సెకన్లు మా త్రమే.
సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం కండ్లకు మంచిది కాదని పరిశోధకులు హెచ్చరించారు. గ్రహణం సందర్భంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో 13 గంటలపాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయాన్ని నాలుగు గంటలపాటు మూసి ఉంచాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) నిర్ణయించింద''ని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- 'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








