వాట్సాప్ స్కాములతో జాగ్రత్త - డిజిహబ్

వాట్సాప్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

వాట్సాప్ అటు ఎస్ఎమ్ఎస్‌లను.. ఇటు నెట్వర్క్ కాల్స్‌ని మరిపించేసింది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ మెసేజింగ్ యాప్‌కు అలవాటుపడిపోయారు.

ఈమధ్యే ఒక 6 గంటల సేపు ఈ యాప్ పనిచేయకపోతే ప్రపంచం గగ్గోలుపెట్టింది. రోజువారీ కబుర్లు సులభతరం చేయడమే కాకుండా వ్యాపారులకూ ఆసరాగా నిలిచిన ఈ యాప్, ఎప్పటికప్పుడు స్కాములకు వేదికవుతోంది.

కాబట్టి వాట్సాప్ వాడేవాళ్లంతా దానికి సంబంధించిన కొన్ని సెట్టింగులు తెలుసుకుని జాగ్రత్తతో వ్యవహరించాలి.

వాట్సాప్ వీడియో కాల్

ఫొటో సోర్స్, Getty Images

వీడియో కాలింగ్ స్కామ్

మనకు తెలియని ఒక నెంబరు నుంచి వీడియో కాల్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేస్తే అవతలివారు నగ్నంగా కనిపిస్తారు. మనం డిస్కనెక్ట్ చేసే ఒకటిరెండు నిముషాల్లోనే వాళ్లు స్క్రీన్ షాట్ తీసుకుంటారు. వాళ్ళు అడిగినంత డబ్బు పంపించకపోతే ఆ స్క్రీన్ షాట్‌లను బయటపెడతామని బెదిరిస్తారు. అసభ్యకరమైన ఫోటోల్లో కనిపించడం ఇబ్బందికరం కాబట్టి, చాలా మంది వాళ్లు అడిగినంత డబ్బు చెల్లించేస్తున్నారు.

ఆ నంబరుని మన ఫోను నుంచి డిలీట్ చేయడం వంటివాటి వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు సాధారణంగా బృందాలుగా పనిచేస్తుంటారు.

ఒక నంబరు డిలీట్ చేసినా వేరే నంబరు నుంచి బెదిరింపులు కొనసాగిస్తారు.

జాగ్రత్తలు

1. అవసరమైతే తప్ప వీడియో కాల్స్‌ని తగ్గించడం మంచిది. ఉచితంగా వస్తుంది కదా అని, సులువు కదా అని, పైగా కోవిడ్ నేపథ్యంలో మనుషులకి దూరంగా ఉన్నాం కాబట్టి వీడియో కాల్స్ ఉపయోగం బాగా పెరిగిపోయింది. బాగా పరిచయస్థుల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ వీడియో కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేయడం మంచిది. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఆన్సర్ చేయద్దు.

2. చిన్నచిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళకి వాట్సాప్ చాలా ముఖ్యం. వాళ్లకు తెలియని నంబర్ల నుంచి ఆర్డర్లు/ఇంక్వైరీలు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అసలు ఎప్పుడూ చాట్ చేయని, మాట్లాడని నంబర్ల నుంచి వీడియో కాల్స్ ఎత్తకపోవడం మంచిది. కావాలంటే, వాళ్ళతో ఒకసారి ఆడియో కాల్ మాట్లాడి నమ్మకం కుదిరాకే వీడియో కాల్‌కి మారాలి.

3. మనం వీడియో కాల్స్ చేసేటప్పుడు మన ఫోనులోని ఫ్రంట్ కెమరా యాక్టివేట్ అవుతుంది. వీడియో కాల్స్ తరచూ వాడాల్సిన అవసరం ఉన్న వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్నవారు, ఫ్రంట్ కెమెరాని కవర్ చేసుకోవడం మంచిది. ఏదో ఒక స్టికర్ పెట్టడమో, లేదా కాల్ ఆన్సర్ చేస్తున్నప్పుడే ఫ్రంట్ కెమెరాకి ఒక వేలిని అడ్డుపెట్టడమో చేయాలి.

whatsapp

ఫొటో సోర్స్, Getty Images

ఓటీపీ అకౌంట్ హాకింగ్ స్కామ్

ఇది కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న స్కాముల్లో ఒకటి. మనకి ఒక వాట్సాప్ అకౌంట్ ఉండగా, మనం ఏదన్నా కొత్త డివైజ్ నుంచి లాగిన్ అయినప్పుడు, లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నది మనమో కాదో నిర్ధరించుకోవడానికి వాట్సాప్ మన ఫోనుకి ఎస్ఎమ్ఎస్ ద్వారా ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీ సరిగ్గా ఇస్తేనే లాగిన్ అవుతుంది.

దీన్ని ఆసరాగా చేసుకుని స్కామర్లు అకౌంట్లు హాక్ చేస్తున్నారు. మన నంబర్ వారికి ఎలాగైనా తెలిసిందనుకోండి, ఆ నంబరుతో మన వాట్సాప్ లాగిన్ కావడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఓటీపీ మన ఫోన్‌కు వస్తుంది. ఆ ఎస్ఎమ్ఎస్ వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్లు మనల్నే పింగ్ చేసి మనతోనే ఓటీపీ ఇప్పించుకుంటారు.

ఒక్కోసారి అపరిచిత నంబరు నుంచి ఇలాంటివి వస్తే మనం ఇగ్నోర్/బ్లాక్ చేస్తాం. కానీ మన కాంటాక్ట్స్‌లో ఎవరి నంబరైనా అప్పటికే హాక్ అయ్యుంటే, వాళ్ల పేరు/నంబరుతో మనకి మెసేజ్ వస్తుంది.

"నా వాట్సాప్ బ్లాక్ అయింది. అందుకని మీ నంబరుకు ఓటీపీ పంపాను. మీరు అది పంపిస్తే నేను అన్‌లాక్ చేసుకుంటాను" అని కట్టుకథలు అల్లేసరికి, మనం "అయ్యో! టెక్నాలజీతో ఎంత చికాకు. సహాయం చేద్దాం!" అని అనిపించి స్పందిస్తాం. ఒక్కసారి ఓటీపీ వాళ్ళ చేతికి వెళ్లాక, ఏం చేసినా మన అకౌంట్ మన చేతికి రాదు. కొందరు స్కామర్లు డబ్బులిస్తే, అకౌంట్ వదిలేస్తామంటారు (ఇస్తారని నమ్మకం లేదు.) ఇంకొందరు, మన అకౌంట్ నుంచి మన కాంటాక్ట్స్‌కి అసభ్యకర, బెదిరింపు మెసేజులు పెడతారు. అలా, ఇదో పెద్ద విషవలయంలా మారుతోంది.

జాగ్రత్తలు

1. ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మనం రిక్వెస్ట్ చేయకుండా మన ఫో‌నుకి ఓటీపీ వస్తే దాన్ని నెగ్లక్ట్ చేయాలి.

2. మన కుటుంబ సభ్యులో, స్నేహితులో టెక్ సాయం అందించమంటూ కాస్త కంగారు పెట్టగానే మనం ముందూ వెనుకా ఆలోచించం. అది మానుకుని, మన వివరాలు ఎవరికీ ఇవ్వకపోవడం, ఎవరి వివరాలు మనం తీసుకోకపోవడం ఉత్తమం.

whatsapp

ఫొటో సోర్స్, Getty Images

మెరుగైన యాప్ అంటూ బూటకపు వాట్సాప్ డౌన్లోడ్

వాట్సాప్ పనిచేసే తీరుతెన్నులు కొన్ని ఉంటాయి. ఎవరన్నా ప్రైవసీ కోసం "రీడ్ రిసీప్ట్" డిజేబుల్ చేస్తే మనకి వాళ్లు మెసేజ్ చదివారో లేదోనని తెలిపే బ్లూ టిక్స్ కనిపించవు. లేదా, ఎవరన్నా మనల్ని బ్లాక్ చేశారో, లేక వాళ్ళకి మెసేజులు వెళ్ళడం లేదో తెలీదు. సరిగ్గా, ఇలాంటి వాటి వల్ల పుట్టే చిరాకుని, విసుగుని కాష్ చేసుకోడానికి "ఈ కొత్త వర్షన్ వేసుకుంటే ఎక్కువ వివరాలు తెలుస్తాయి" అని చెప్పి, ఆ దొంగ యాప్ ఇన్స్టాల్ అయ్యాక దాని నుంచి మన అకౌంటు వివరాలు, మన కాంటాక్ట్స్ వివరాలు దొంగలిస్తారు. FMWhatsApp అనే పేరుతో గూగుల్ స్టోర్‌లో చేరిన యాప్ నిజానికి మాల్‌వేర్.

జాగ్రత్తలు:

1. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచే ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు లోగో మాత్రమే కాకుండా ఏ కంపెనీ, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, కామెంట్స్ ఎలాంటివి వస్తున్నాయి లాంటి వివరాలు ఒకసారి చూసుకోవడం మంచిది.

2. ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్‌మెంట్, లింక్స్‌లో వచ్చే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోకూడదు. ప్లే స్టోర్లో లేకపోతే అది ఆఫీషియల్ యాప్ కాదని అర్థం.

whatsapp

ఫొటో సోర్స్, Getty Images

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సైబర్ స్పేస్‌లో ఎవరైనా మోసపోవచ్చు కానీ, బాధితుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడం చూస్తుంటాం.

* మాయమయ్యే మెసేజులు: తెలియనివారితో చాట్ చేసేటప్పుడు ఆడవాళ్లు ఎదుర్కొనే ప్రధానమైన ఇబ్బంది.. ఆ మెసేజ్‌లను అవతలివారు తమను బ్లాక్‌మెయిల్ చేయడానికి వాడుకుంటారేమోనని.

మనం పంపిన మెసేజులు ఏడు రోజుల తర్వాత వాటంతట అవే మాయమైపోడానికి, వాట్సాప్ లో డిస్అపయరింగ్ మెసేజ్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో, వాళ్ల పేరు మీద క్లిక్ చేసి, కాంటాక్ట్‌కి వెళ్లి కిందకి స్క్రోల్ చేస్తే, స్క్రీన్‌షాట్‌లో చూపించినట్టు ఆన్-ఆఫ్ బటన్ కనిపిస్తుంది. అవసరమైన చోట దాన్ని వాడుకోవచ్చు.

వాట్సాప్ సెటింగ్స్

ఫొటో సోర్స్, PurnimaT

* 2 స్టెప్ వెరిఫికేషన్: అకౌంట్ హాక్ కాకుండా ఉండడానికి 2-step verification mode ఎనేబుల్ చేయండి. (WhatsApp > Settings > Account > Two-step verification > Enable)

* కాంటాక్ట్ బ్లాకింగ్: ఒకట్రెండు సార్లు ఏదో పని మీద మాట్లాడి ఆ తర్వాత అవసరం లేని కాంటాక్టులని బ్లాక్ చేయడం మంచి పని. ఇంట్లో ఏదన్నా రిపేర్ చేయడానికి వచ్చినవారో, లేదా ఏదో కొనడానికి ఆ స్టోర్ మానేజరుతో చాట్ చేసినా, పని పూర్తయ్యాక బ్లాక్ చేస్తే వారి నుంచి ఇబ్బందికరమైన చాట్స్ రాకుండా ఉంటాయి.

* ప్రైవసీ సెట్టింగ్స్: మన ఫోటో, పేరు, స్టేటస్‌లో ఎవరికి కనిపించవచ్చో మనం సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు. Account > Privacy > Profile photo/Status/Groups లలో "మై కాంటాక్ట్స్" అని ఇవ్వడం బెటర్. అంటే, మీరు ఎవరినైతే కాంటాక్ట్స్‌లో ఆడ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ వివరాలు కనిపిస్తాయి. "ఎవ్రీ వన్" అని పెట్టుకుంటే మీ వివరాలు బయటవారికి కూడా అందుబాటులో ఉండి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది.

అలానే లైవ్ లొకేషన్ కూడా అత్యవసర పరిస్థితుల్లో, అది కూడా సన్నిహితులతో తప్పించి ఇతరులతో షేర్ చేసుకోకూడదు.

* ఒకటే నెంబర్ నుంచి కానీ, వేర్వేరు నెంబర్ల నుంచి కానీ అనవసరపు మెసేజులు వస్తుంటే ఆ నెంబర్లని బ్లాక్ చేయడమే కాకుండా, ఆ మెసేజిలని స్పామ్ అని కూడా రిపోర్ట్ చేస్తే మనకీ అవి మళ్లీ రావు, వేరేవాళ్ళకి వెళ్ళే అవకాశమూ తగ్గుతుంది.

whatsapp

ఫొటో సోర్స్, Reuters

పిల్లల విషయంలోనూ జాగ్రత్త

అసలుకైతే వాట్సాప్‌లో 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు అకౌంట్ క్రియేట్ చేసుకోడానికి వీలు లేదు. అయితే, ఆ నిబంధనని ఉల్లంఘించే అవకాశాలు బోలెడు. ఏదో మార్గంలో పిల్లలు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని రిజస్టర్ కావచ్చు. పైగా గత రెండేళ్ళల్లో కోవిడ్ వల్లా ఆన్‌లైన్ క్లాస్ అప్డేట్స్ అన్నీ వాట్సాప్ గ్రూపులలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. వాట్సాప్ ఏంటి, అదెలా పనిజేస్తుంది, దాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఏవి ఉన్నాయి లాంటి విషయాలు పిల్లలు అర్థమయ్యేలా వివరించాలి.

2. పిల్లలు ఉన్న గ్రూప్స్‌లో ఎలాంటి కంటెంట్ ఫార్వార్డ్ అవుతుంది, ఎలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నారన్న విషయమై జాగ్రత్త వహించాలి. పిల్లలని అడిగి గ్రూప్స్ లో జరుగుతున్నవి తెలుసుకోవాలి.

3. పిల్లల స్క్రీన్ టైమ్ మానిటర్ చేయడం, ఏయే యాప్స్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకోవడం మంచిది.

4. ముఖ్యంగా ప్రీ-టీన్స్, టీనేజర్స్ ఉన్న గ్రూపులలో బుల్లీయింగ్ కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. అపరిచితులతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి.

5. అత్యవసరమైతే తప్పించి పిల్లల వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వద్దు.

వాట్సాప్ ని గుడ్డిగా నమ్మక, దాని వల్ల నష్టకష్టాలకి లోనవ్వకుండా ఉండాలంటే అవగాహన ముఖ్యం. ఏ కారణం చేతనైనా ఎవరన్నా ఏదైనా ఇబ్బందుల్లో పడితే, వెంటనే వారిని బ్లాక్ చేయడం, అంతకన్నా ఎక్కువ హాని/వేధింపులకి గురవుతుంటే పోలీసుల సాయం తీసుకోవడం తప్పనిసరి. స్కామర్లకి, మోసగాళ్ళకి ఎంత భయపడితే అంతగా ఆ ఊబిలో చిక్కుకుపోతాం.

(అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)