వాట్సాప్: స్మార్ట్ ఫోన్ వాడకుండానే మెసేజ్‌లు పంపొచ్చు

మొబైల్‌తో పని లేకుండా మెసేజ్‌ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొబైల్‌తో పని లేకుండా మెసేజ్‌ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇది విజయవంతమైతే ఫోన్‌ను ముట్టుకోకుండానే మెసేజ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ప్రస్తుతం వాట్సాప్, యూజర్ ఫోన్‌తో లింక్ అయి ఉంది. డెస్క్‌ టాప్, వెబ్ యాప్స్ లలో వాట్సాప్‌ను వినియోగించాలంటే కచ్చితంగా యూజర్ ఫోన్‌ను ఆ పరికరాలతో అనుసంధానించి ఉంచాలి.

కానీ, కొత్త ఫీచర్ ప్రకారం ఫోన్ బ్యాటరీ డెడ్ అయిన సందర్భంలో కూడా యూజర్లు తమ ఫోన్ నుంచి సందేశాలు పంపించవచ్చు, మెసేజ్‌లను స్వీకరించవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌లో గరిష్టంగా ఒకేసారి 4 (టాబ్లెట్, పీసీలు) పరికరాలలో యూజర్లు తమ మెసేజింగ్ యాప్‌ను వాడుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వర్షన్‌గా కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. దీని పని తీరును సమీక్షించి మరింత మెరుగు పరిచిన తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వాట్సాప్ బృందం తెలిపింది.

వాట్సాప్ కీలక సాంకేతికత అయిన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు కూడా ఈ కొత్త ఫీచర్‌కు అనుకూలంగా ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది.

వాట్సాప్ వెబ్‌ యాప్‌లలో తరచూ డిస్కనెక్షన్ సమస్యలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, వాట్సాప్ వెబ్‌ యాప్‌లలో తరచూ డిస్కనెక్షన్ సమస్యలు వస్తున్నాయి.

ఇప్పుడే ఎందుకు?

ఇతర మెసేజింగ్ యాప్‌లు ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమల్లోకి తెచ్చాయి. వాట్సాప్ ప్రత్యర్థి అయిన 'సిగ్నల్' కూడా ఈ తరహా ఫీచర్‌ను ఉపయోగిస్తోంది.

సిగ్నల్ యాప్‌ యూజర్ కేవలం సైన్ అప్ చేసే సమయంలో మాత్రమే ఫోన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సందేశాలు పంపించేందుకు ఫోన్‌తో పని లేదు.

200 కోట్ల వాట్సాప్ ఖాతాదారులు చాలా కాలంగా ఈ ఫీచర్ కావాలంటూ యాజమాన్యానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ఇక వాట్సాప్ సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో చేయాల్సిన మార్పులపై ఆలోచన చేయాలని ఫేస్‌బుక్ ఇంజినీర్లు అన్నారు. ఈ కొత్త ఫీచర్ గురించి వివరిస్తూ చేసిన పోస్టులో వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ డిజైన్ యూజర్ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే ప్రైమరీ డివైస్‌గా పరిగణిస్తుంది. యూజర్ డేటా అంతటినీ ఈ ఫోన్‌ యాప్ ఆధారంగానే తీసుకుంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం కూడా ఈ ఫోన్‌కు మాత్రమే వర్తింప చేస్తుంది’’ అని కంపెనీ పేర్కొంది.

వాట్సాప్ తీసుకురాబోయే కొత్త టెక్నాలజీ పై హ్యాకర్లు ఇప్పటికే అవగాహన తెచ్చుకుని ఉంటారని టెక్ నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాట్సాప్ తీసుకురాబోయే కొత్త టెక్నాలజీ పై హ్యాకర్లు ఇప్పటికే అవగాహన తెచ్చుకుని ఉంటారని టెక్ నిపుణులు అంటున్నారు.

లోపాలను సరిదిద్దాలి

ఈ కంపానియన్ యాప్‌ ఏదో ఒక చోట మాత్రమే యాక్టివ్‌ గా ఉంటుంది. మరో డివైస్‌లో యాక్టివేట్ చేయగానే ఆటోమేటిగ్గా మొదటి డివైస్‌లో డిస్కనెక్ట్ అవుతుంది. ఈ వ్యవస్థలో ఇదే పెద్ద లోపం. ఇది చాలామంది వినియోగదారులకు అనుభవమే.

‘‘వాట్సాప్ తెస్తోన్న మల్టీ డివైస్ ఆర్కిటెక్చర్ ఫీచర్ ఈ లోపానికి స్వస్తి పలుకుతుంది. వాట్సాప్ విండోతో అనుసంధానమై ఉండటానికి ఇక స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. కానీ స్మార్ట్ ఫోన్, యూజర్ డేటాను సజావుగా, సురక్షితంగా ఉంచుతుంది. యూజర్ డేటా ప్రైవసీని కాపాడుతుంది’’ అని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త ఫీచర్‌లో వాట్సాప్ వాడుతోన్న ప్రతీ డివైస్‌కు సొంత ఐడెంటీటీని ఇస్తుంది. ఒకే వినియోగదారుని ఖాతాకు చెందిన అన్ని ఐడెంటిటీల రికార్డును వాట్సాప్ భద్రపరుస్తుంది.

అయితే, అన్ని మెసేజ్‌లను సొంత సర్వర్‌లో భద్రపరచదు. ఇది గోప్యతా సమస్యలకు దారి తీస్తుంది.

ఎక్కువ డివైస్‌లలో యాప్‌ను వినియోగిస్తే ఎంత పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ గోప్యతా సమస్యలు ఎదురవుతాయని ఈసెట్ యాంటీ వైరస్ కంపెనీ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జేక్ మూరే అన్నారు.

‘‘పలు డివైస్‌లలో వాట్సాప్ వినియోగించినప్పుడు సైబర్ నేరాలు జరిగే అస్కారముంది’’ అని మూరే వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ నుంచి ప్రయోజనాన్ని పొందేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని హ్యాకర్లు సంపాదించి ఉంటారు. ప్రైవేట్ కమ్యూనికేషన్లను కాజేయడానికి అదనపు ఎండ్ పాయింట్లను తయారు చేసుకొని ఉంటారు’’ అని మూరే వివరించారు.

సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతోన్న ముప్పు అని మూరే చెప్పారు. దీని దుర్వినియోగం నుంచి బయటపడే బాధ్యత వినియోగదారుడి పైనే ఉందని అన్నారు.

‘‘తమ ఖాతాకు అనుసంధానమై ఉన్న అన్ని డివైస్‌ల గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం’’ అని మూరే హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)