Saree: బ్లౌజ్ లేకుండా చీర కట్టుకోవడం స్వేచ్ఛకు ప్రతీకా?

ఫొటో సోర్స్, Seetu Tiwari
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ కోసం..
సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో నవంబరు 24న thanos_jatt అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఒక యువతి జాకెట్ లేకుండా చీర కట్టుకొని నడుస్తున్నారు.
జాకెట్ అనిపించేలా ఆమె తన శరీరంపై మెహందీ పెట్టుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ డిజైన్ బాగుందని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ‘‘ఇది భారతీయ సంస్కృతికి సిగ్గుచేటు’’అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌కు చాలాదూరంగా బిహార్‌లోని దర్భంగా జిల్లా మధుబని లిటరేచర్ ఫెస్టివల్‌లో భాగంగా ‘‘ఏకవస్త్ర’’ ఫ్యాషన్ షోను నిర్వహించారు.
దర్భాంగా నగరంలోని కామేశ్వర్ సింగ్ సంస్కృత యూనివర్సిటీ దర్బార్ హాల్‌లో ఇది జరిగింది. ఈ షోలో పాల్గొన్న మోడల్స్.. జాకెట్ లేదా పెటీకోట్ లేకుండా చీర కొట్టుకుని నడిచి వచ్చారు. అయితే, అక్కడకు వచ్చిన జనం ఆ మోడల్స్‌కు చప్పట్లతో ఆహ్వానం పలికారు.

ఫొటో సోర్స్, Seetu Tiwari
మిథిలా నిఖండ్ చీరలు..
బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో నిఖండ్ చీరల సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించే మహిళలు కేవలం చీర మాత్రమే కట్టుకుంటారు. పెటీకోట్ కానీ జాకెట్ కానీ వేసుకోరు.
‘‘మన దగ్గర మహిళలు మొదట్లో చీర మాత్రమే కట్టుకునేవారు. టైలరింగ్ అనే కాన్సెప్ట్ ముస్లింల నుంచి వచ్చింది. మా చిన్నప్పుడు గిరిజన సంథాల్ మహిళలు సాధారణంగా తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకునేవారు కాదు. పూజల్లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు రొమ్ములను చీరతో కప్పుకునేవారు. మిగతా సందర్భాల్లో వారు కప్పుకున్న చీర అలా గాలికి ఎగురుతూనే ఉండేది’’అని ప్రముఖ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ చెప్పారు.
ఆ తర్వాత కాలంలో కొందరు మహిళలు పెటీకోట్ వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పెటీకోట్ జాకెట్లు వచ్చాయి. అలా నిఖండ్ చీర సంప్రదాయం కనుమరుగైంది.
‘‘అప్పట్లో మహిళలు తమ శరీరం గురించి సిగ్గు పడేవారు కాదు. తాము ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో వారే నిర్ణయించుకునేవారు. వేరొకరు ఈ విషయంలో వేలు పెట్టేందుకు వారు అంగీకరించేవారు కాదు. ఇక్కడ మహిళ అంటే శరీరానికి అతీతంగా చూడాలని మిథిల ఫిలాసఫీ చెబుతోంది. ఉదాహరణకు సీతను తీసుకోండి. ఆమెను వైదేహి అని పిలుస్తారు. అంట దేహానికి అతీతమైనదని అర్థం’’అని మధుబనీ లిటరేచర్ ఫెస్టివల్ ఆర్గనైజర్లలో ఒకరైన సవిత ఝా ఖాన్ వివరించారు.

ఫొటో సోర్స్, Seetu Tiwari
మహిళా సాధికారతతో దీనికి సంబంధం ఉందా?
నిఖండా చీరలకు మహిళల సాధికారతతో ముడిపెట్టలేమని మిథిల పెళ్లి సంప్రదాయాలపై ‘‘గోత్రాధ్యాయ్’’ పేరుతో పుస్తకం రాసిన మిథిల భారతి ఎడిటర్ భైరవ లాల్ దాస్ వివరించారు.
‘‘మన సంప్రదాయంలో కుట్టుపనితో సంబంధం లేకుండా ఉండే వస్త్రాలను మహిళలతోపాటు పురుషులు కూడా వేసుకునే వారు. ఈ సంప్రదాయం మారడం వెనుక, సాంస్కృతిక-మతపరమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడకు దండెత్తిన ముస్లిం పాలకులు తమతోపాటు కుట్టుపని సంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు. దీంతో సాధారణ ప్రజలు కూడా బట్టలను కుట్టడం నేర్చుకున్నారు. ఉదాహరణకు వేదాల్లో మిథిల మహిళల ప్రస్తావన ఉంది. అప్పుడు కూడా మహిళలు కుట్టిన వస్త్రాలు వేసుకునేవారు కాదు. అందుకే నిఖండ చీరలు లేదా ఏకవస్త్రాలను మహిళల సాధికారతతో ముడిపెట్టకూడదు. ఇక్కడ పేదరికమూ ఈ సంప్రదాయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. విద్యాపతి రచనల్లో ఇక్కడి పేదరికం గురించి సవివరంగా చర్చించారు. బెంగాలీ పెయింటింగ్స్‌లోనూ ఇక్కడి మహిళలు జాకెట్ లేకుండా కనిపించేవారు’’అని ఆయన అన్నారు.
ఈ సంప్రదాయం కేవలం మిథిలాంచల్‌కు మాత్రమే పరిమితం కాదు. ఉదాహరణకు బ్రహ్మో సమాజ్‌కు వచ్చే మహిళలు మొదట్లో జాకెట్లు వేసుకునే వారు కాదు. కానీ తర్వాత కాలంలో వారు కూడా జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు.
‘‘జాకెట్ వేసుకోలేదని రబీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానదనందిని ఓ ఇంగ్లిష్ క్లబ్‌లోకి అనుమతించలేదు. దీంతో క్లబ్‌కు వచ్చేటప్పుడు ఆమె జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది’’అని బెహార్ హెరాల్డ్ పత్రిక ఎడిటర్ విద్యుత్ పాల్ వివరించారు.

ఫొటో సోర్స్, Seetu Tiwari
చీరలు ఎప్పుడు వచ్చాయి?
భారత సంప్రదాయంలో ప్రత్యేక స్థానమున్న ఈ చీర.. భారత ఉప ఖండానికి గ్రీకుల ప్రభావంతో వచ్చింది.
‘‘మౌర్యుల కాలంలో గ్రీకుల ప్రభావం చాలా ఉండేది. చంద్రగుప్త మౌర్య గ్రీకు రాకుమారిని పెళ్లి చేసుకున్నారు. 2వ శతాబ్దంనాటి శుంగ సామ్రాజ్యంలోనూ మహిళలు చీరలు కట్టుకున్నట్లు టెర్రకోట శిల్పాలు చెబుతున్నాయి. అప్పట్లో జాకెట్ అనేది లేదు’’అని పురాతత్వ శాస్త్రవేత్త జలజ్ కుమార్ వివరించారు.
‘‘తొమ్మిదో శతాబ్దంలో మహిళలు మహారాష్ట్ర సంప్రదాయంలో చీర కట్టుకొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ పనైనా హాయిగా చేసుకునేలా ఈ చీరకట్టు ఉంటుంది. తారా, దుర్గ లాంటి దేవతల విగ్రహాలను చూస్తే, ఇది అర్థమవుతుంది.’’
అయితే, మహిళలు తమ పనిని తాము చేసుకునేందుకు వీలుగా ఉండే చీరల నుంచి ఇలానే కట్టుకోవాలనే కట్టుబాట్ల వరకు ఈ సంప్రదాయం ఎలా మారింది?
‘‘ఒకానొక సమయంలో మహిళలు యుద్ధాలకు వెళ్లేవారు, వ్యవసాయం చేసేవారు, వేటకు వెళ్లేవారు. ఆ తర్వాత వారిని ఇంటికి పరిమితం చేశారు. ఈ ప్రభావం వారి వస్త్రధారణపైనా కనిపిస్తుంది’’అని జలజ్ వివరించారు.

ఫొటో సోర్స్, Seetu Tiwari
రొమ్ము పన్ను
నేటి ఆధునిక ప్రపంచంలో మనం వేసుకునే దుస్తులను ఇదివరకటిలానే చూస్తున్నామా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.
‘‘దుస్తులు మన జీవితంలోకి వచ్చినప్పటి పరిస్థితులు పూర్తిగా వేరు. అప్పట్లో సిగ్గు అనే మాటే లేదు. శరీరంలో పై, కింద భాగాలను ఒకే వస్త్రంతో మొదట్లో కప్పుకొనేవారు. శరీర అవసరాలకు అనుగుణంగా మన దుస్తులు ఉండేవి’’అని విద్యుత్ వివరించారు.
వస్త్రాల విషయంలో మహిళలు కొన్ని ప్రాంతాల్లో చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది.
కేరళలో 150ఏళ్ల కిందట దిగువ కులాలకు చెందిన మహిళలు తమ రొమ్ములను కప్పుకోరాదని ఆదేశాలు ఉండేవి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారు ‘‘రొమ్ము పన్ను’’ కట్టాల్సి వచ్చేది. దీనికి నిరసనగా ఎళవ కులానికి చెందిన నంగేలి అనే మహిళ తన రొమ్ములను కోసేసుకున్నారు.
ఝార్ఖండ్‌లో మహిళలు రొమ్ములను కప్పుకోకుండా జీవిస్తుంటే, కేరళలో మాత్రం రొమ్ములను వస్త్రాలతో కప్పుకునేందుకు పోరాటాలు చేయాల్సి వచ్చేది.
‘‘ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఇద్దరు మహిళల వస్త్రాలు ఒకేలా ఉండేవి కాదు. ఇక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలు ప్రభావితం చేస్తుండేవి. అదే సమయంలో ఐరోపాలో పూర్తిగా శరీరాన్ని కప్పుకోవడానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేపట్టేవారు’’ అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డైరెక్టర్, ప్రొఫెసర్ పుష్పేంద్ర కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Seetu Tiwari
మిథిలలో మహిళలు..
మిథిలాంచల్ మహిళలను తీసుకుంటే, బిహార్‌లో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇక్కడి మహిళల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాముడి భార్య సీతతోపాటు గార్గి, మైత్రేయి, భారతి లాంటి వారు ఈ ప్రాంతానికి చెందినవారే. జైన తీర్థంకరుడు మల్లినాథ్ కూడా ఇక్కడి వారే.
‘‘అయితే, తంత్రాయణ బౌద్ధం, కౌలాచార వ్యవస్థల ప్రభావం వల్ల ఇక్కడి బాలికలను మంత్ర, తంత్రాల కోసం ఉపయోగించడం మొదలుపెట్టేవారు. దీంతో వారి విద్యపై చాలా ప్రభావం పడేది. ఆ సమయంలోనూ మహిళలు మిథిల పెయింటింగ్స్ రూపంలో తమ భావాలను బయటపెట్టేవారు’’అని ఉషా కిరణ్ వివరించారు.
‘‘ఈ ప్రాంతంపై నేరుగా మొఘల్ చక్రవర్తులు దండెత్త లేదు. అయితే, వారి పాలన పరోక్షంగా ఇక్కడ కూడా కొనసాగేది. ఇంటి నిర్మాణం, కిటికీల పరిమాణం లాంటి వాటిపై మొఘల్ పాలన ప్రభావం కనిపించేది. మహిళలను ఎక్కువగా డేరాల వెనుకే ఉంచే పద్ధతి ఇక్కడ కూడా ఉండేది’’అని రచయిత భైరవ్ లాల్ దాస్ చెప్పారు.
దర్భంగా లాంటి చిన్నపట్టణంలో ఏకవస్త్ర మోడల్స్‌ను అక్కడి ప్రజలు ఎలా చూస్తారు? అనే ప్రశ్నకు టీవీ నటి, స్టేజ్ ఆర్టిస్ట్ సోనాల్ ఝా స్పందించారు. ఈ ఫ్యాషన్ షోలో ఆమె కూడా పాలుపంచుకున్నారు.
‘‘చరిత్రలో ఇలాంటి వస్త్రాలు వేసుకోవడానికి కారణాలు వేరై ఉండొచ్చు. కానీ నేడు మాత్రం, శరీరంపై దృష్టి కేంద్రీకరించడం బాగా ఎక్కువైంది. ఇలాంటి సందర్భాల్లో ఏకవస్త్ర లాంటి షోలు చర్చలను సరైన మార్గంలో నడిపిస్తాయి’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దేశంలో కండోమ్‌ల వాడకం ఎందుకు పెరిగింది? - జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5
- CRPF: అమర జవాను సోదరి పెళ్లి.. తోటి జవాన్లే తోడబుట్టినోళ్లయ్యారు
- మనిషి విశ్వాన్వేషణ ప్రారంభించిన ఈ రహస్య అంతరిక్ష స్థావరాన్ని రష్యా వదులుకుంటోందా?
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్‌లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- క్యాన్సర్ చికిత్స తరువాత సెక్స్ సమస్యలు వస్తాయా? కెమికల్ మెనోపాజ్ అంటే ఏమిటి
- ‘కరోనా’లో ప్రవేశించిన అంతరిక్ష నౌక.. ఖగోళ చరిత్రలో తొలిసారి
- ‘కరోనా’లో ప్రవేశించిన అంతరిక్ష నౌక.. ఖగోళ చరిత్రలో తొలిసారి
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









