పార్కర్ సోలార్ ప్రోబ్: ఖగోళ చరిత్రలో తొలిసారిగా సూర్యుడి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించిన అంతరిక్ష నౌక

పార్కర్

ఫొటో సోర్స్, NASA-JHU-APL

    • రచయిత, జోనాథన్ అమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

ఖగోళ చరిత్రలో తొలిసారిగా సూర్యుడి వెలుపలి కక్షలోకి అంతరిక్ష నౌక ప్రవేశించింది. ఇది చారిత్రక ఘట్టమని నాసా పేర్కొంది.

సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని కరోనా అంటారు. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక కరోనాలోంచి కొద్దిసేపు ప్రయాణించింది.

ఇది ఏప్రిల్‌లో జరిగింది. కానీ, డాటాను విశ్లేషించి ఇప్పుడు నిర్థరించారు.

సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన వేడి, రేడియేషన్లను తట్టుకుని పార్కర్ సూర్యుడి గమనం, పనితీరు గురించి మరిన్ని కొత్త కోణాలను సేకరించింది.

"చంద్రుడి మీద కాలు మోపడం ద్వారా అది ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి వీలు పడింది. సూర్యుడి సమీపానికి వెళ్లడం ద్వారా మనకు దగ్గరగా ఉన్న అతి పెద్ద నక్షత్రం సౌరవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవచ్చు. ఈ క్లిష్ట సమాచారాన్ని సేకరించడం మానవ పురోగతిలో అతి పెద్ద మలుపు" అని నాసా హీలియోఫిజిక్స్ సైన్స్ విభాగం డైరెక్టర్ నికోలా ఫాక్స్ తెలిపారు.

సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే విస్తరించిన కరోనా వలయం భూమిపై ఉన్నవారికి కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, S R HABBAL AND M DRUCKMÜLLER

ఫొటో క్యాప్షన్, సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే విస్తరించిన కరోనా వలయం భూమిపై ఉన్నవారికి కనిపిస్తుంది.

ఏమిటీ పార్కర్ సోలార్ ప్రోబ్?

అంతరిక్షంలో నాసా చేపట్టిన అత్యంత సాహసోపేతమైన కార్యక్రమాలలో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ ఒకటి.

మూడేళ్ల క్రితం దీన్ని అంతరిక్షంలోకి పంపించారు. సూర్యుడి చుట్టూ వీలైనినన్ని సార్లు తిరుగుతూ, వీలైనంత దగ్గరగా చేరడమే దీని లక్ష్యం.

ఈ అంతరిక్ష నౌక గంటకు 5,00,000 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో కదులుతుంది.

సూర్యుడి కక్షలోకి వేగంగా వెళ్లి, వేగంగా వెనక్కి తిరిగిరావడం, మందపాటి హీట్ షీల్డ్ వెనుక అమర్చిన సాధనాలతో సౌర వాతావరణాన్ని కొలవడం దీని వ్యూహం.

ఈ ఏడాది ఏప్రిల్ 28న పార్కర్ 'ఆల్ఫ్వెన్ క్రిటికల్ బౌండరీ'ని దాటింది. ఇది కరోనాకు బయటి అంచు. గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ద్వారా సూర్యుడికి అతుక్కుని ఉండే సౌర పదార్థాలు ఈ వలయం దగ్గరే విడిపోయి విశ్వంలోకి ప్రవేశిస్తాయి.

సూర్యుడి ఉపరితలం లేదా ఫోటోస్పియర్‌కు 1.3 కోట్ల కి.మీ. ఎత్తులో పార్కర్ ఈ వలయాన్ని దాటింది.

వాస్తవానికి, అయిదు గంటల వ్యవధిలో ఈ ప్రోబ్ మూడు విభిన్న సమయాల్లో సూర్యుడి సరిహద్దు వలయానికి పైన, దిగువన ప్రయాణించినట్లు డాటా సూచిస్తోందని బెర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన స్టువార్ట్ బేల్ తెలిపారు.

"సూర్యుడి చుట్టూ వాతావరణం బాగా మారిపోయింది. కరోనా వలయం లోపల సూర్యుడి అయస్కాంత క్షేతం చాలా బలంగా పెరిగింది. అక్కడి కణాల కదలికలను ఇది నియంత్రిస్తోంది. అంటే, సూర్యుడికి దగ్గర సంబంధం ఉన్న పదార్థాల చుట్టూ ఈ ప్రోబ్ తిరిగింది."

ఇది ఒక స్ట్రీమర్, కరోనాలోని ఓ దట్టమైన భాగం సూర్యుని నుంచి దూరంగా కదులుతుంది

ఫొటో సోర్స్, NASA/NRL/PARKER SOLAR PROBE

ఫొటో క్యాప్షన్, ఇది ఒక స్ట్రీమర్, కరోనాలోని ఓ దట్టమైన భాగం సూర్యుని నుంచి దూరంగా కదులుతుంది

కరోనా వలయంపై శాస్త్రవేత్తలు ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే, అక్కడే అంతు చిక్కని కొన్ని కీలకమైన ప్రక్రియలు జరుగుతున్నాయి.

వీటిల్లో ఒకటి సూపర్‌హీటింగ్. ఫోటోస్పియర్ వద్ద సూర్యుడి ఉష్ణోగ్రత సుమారు 6,000C ఉంటుంది. కానీ, కరోనా వలయంలో అంతకన్నా కొన్ని లక్షల డిగ్రీల పైకి చేరుకోగలదు.

ఈ ప్రాంతంలోనే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, భారీ అయాన్ల బాహ్య ప్రవాహం అనూహ్యంగా సూపర్‌సోనిక్ గాలిగా మారిపోతుంది. ఇది ఎలా జరుగుతోందన్నది ఇప్పటికీ ఒక పజిల్‌గానే మిగిలిపోయింది.

"సోలార్ విండ్‌లో ఈ ప్రక్రియకు సంబంధించిన భౌతిక ముద్రలు ఉంటాయి. కానీ సమస్య ఏమిటంటే, ఆ గాలి కరోనా వలయం నుంచి భూమికి వచ్చే లోపల ఆ ముద్రలన్నీ చెరిగిపోతాయి. అందుకే పార్కర్ ఈ వలయాన్ని దాటి ప్రయాణించి, వాస్తవంలో అక్కడేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది" అని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ నుంచి నూర్ రౌవాఫీ వివరించారు.

భవిష్యత్తులో ఈ ప్రోబ్, కరోనా వలయంలో లోతుగా చేసే పరిశోధన వివరాలన్నీ పార్కర్ సైన్స్ బృందం సేకరిస్తుంది.

2025 నాటికి పార్కర్, ఫోటోస్పియర్ నుంచి 70 లక్షల కి.మీ ఎత్తులో, సూర్యుడికి దగ్గరగా చేరుకుంటుంది.

పార్కర్ చేసే పరిశోధన భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ కీలకమే.

సూర్యుడి నుంచి వచ్చే అతి పెద్ద ప్రకోపాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీయవచ్చు.

ఈ ప్రక్రియలో కమ్యూనికేషన్ పూర్తిగా నాశనం కావొచ్చు. శాటిలైట్లన్నీ బంద్ అయిపోవచ్చు. పవర్ గ్రిడ్‌లన్నీ పేలిపోయే ప్రమాదం ఉంది.

ఇలాంటి "తుఫాన్లను" అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా పార్కర్ వారికి విలువైన, నూతన సమాచారాన్ని అందించగలదని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)