RRB: గ్రూప్-డి పరీక్ష ఒకే దశలో నిర్వహించడానికి సిద్ధమన్న రైల్వే మంత్రి, మరి అభ్యర్థులు ఏం కోరుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివాదంపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేస్తే గ్రూప్ సి-లెవెల్ 1 పరీక్షను ఒకే దశలో నిర్వహించడానికి సిద్ధమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. బీబీసీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
గ్రూప్ సి-లెవెల్ 1 పరీక్షనే అభ్యర్ధులు గ్రూప్-డి టెస్ట్‌గా పిలుస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో ఇటీవల జరిగిన ఆందోళనలు ప్రధానంగా ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించినవే. రెండు దశల ఈ పరీక్షను ఒకేసారి నిర్వహించాలని ఉద్యోగార్థులు ఇటీవల డిమాండ్ చేశారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన ఉద్యోగార్థులు ప్రధానంగా రెండు డిమాండ్లను వినిపించారు. అందులో మొదటిది ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 20 మంది అభ్యర్ధులను ఎంపిక చేయాలి. రెండోది గ్రూప్ -డి పరీక్షను రెండు దశల్లో కాకుండా ఒక్కసారే నిర్వహించాలి.

ఫొటో సోర్స్, Reuters
గ్రూప్ 'సి' - లెవెల్ 1 పరీక్ష
విద్యార్థుల అసంతృప్తి, ఆందోళనల కారణంగా రైల్వేశాఖ గ్రూప్ 'సి'-లెవల్ 1 పరీక్ష తేదీని వాయిదా వేసింది. రెండు దశల్లో జరిగే ఈ పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించాలని మొదట భావించారు.
2019 సంవత్సరంలో, గ్రూప్ 'సి'-లెవల్ 1లో లక్ష ఉద్యోగాల కోసం రైల్వే శాఖ దరఖాస్తులను కోరింది. దీనికి దాదాపు 1.25 కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, పలు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే ట్రాక్‌లపై ఆందోళనలు చేశారు.
తక్కువ జీతాలుండే ఈ పోస్టుల ప్రకటన విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రెండు దశల్లో నిర్వహిస్తామని ముందే చెబితే, తాము అందుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధమయ్యేవారమని ఉద్యోగార్ధులు వాదించారు.

ఫొటో సోర్స్, PTI
ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ టెస్ట్
ఈ టెస్టు విషయంలో కూడా అభ్యర్ధులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఒక్కో పోస్టులకు 20మంది అభ్యర్ధులను అర్హులుగా ప్రకటించాలని, ఒక అభ్యర్ధి ఎన్ని కేటగిరీలకు రాసినా, అతన్ని ఒక అభ్యర్ధిగా మాత్రమే పరిగణించాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం మొదటి డిమాండ్‌కు సరిపడేలా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పినా, ఒక్కో రోల్ నంబర్‌ను ఒక్కో అభ్యర్ధిగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఉద్యోగార్ధులు అసహనంతో ఉన్నారు. వన్ క్యాండిడేట్-వన్ రిజల్ట్ కావాలని వారు పట్టుబడుతున్నారు.
ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ అంటే 'రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ' పరీక్షలో దాదాపు 35 వేల ఉద్యోగాలు వివిధ పే-గ్రేడ్‌లలో ఖాళీగా ఉన్నాయి.
విద్యార్థుల ఆగ్రహాన్ని గుర్తించిన రైల్వే శాఖ జనవరి 26న ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 4 నాటికి ఈ కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది. అభ్యర్ధుల నుంచి కూడా సలహాలు, సూచనలను ఈ కమిటీ స్వీకరిస్తుంది
గత ఐదు రోజుల్లో లక్ష మంది విద్యార్థులు తమ సూచనలను కమిటీకి అందించారని రైల్వే మంత్రి బీబీసీతో మాట్లాడుతూ వెల్లడించారు. విద్యార్థులు తమ సూచనలను ఫిబ్రవరి 16 లోగా ఈ కమిటీకి పంపవచ్చని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: సైనిక పాలనపై సామాన్యుల పోరాటం సివిల్ వార్‌గా మారుతోందా
- కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు: నదుల అనుసంధానం, కిసాన్ డ్రోన్లు, డిజిటల్ రూపీ
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను: బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఇండియాలో ఇక ఈ లావాదేవీలు లాభదాయకం కాదా
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













