Myanmar: సైనిక పాలనపై సామాన్యుల పోరాటం సివిల్ వార్‌గా మారుతోందా

స్థానిక తెగల నుంచి సాయుధ పోరాటంలో శిక్షణ తీసుకుంటున్న పీడీఎఫ్ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్థానిక తెగల నుంచి సాయుధ పోరాటంలో శిక్షణ తీసుకుంటున్న పీడీఎఫ్ కార్యకర్తలు
    • రచయిత, సో విన్, కొకొ ఆంగ్, నన్సోస్ స్టిలియానౌ
    • హోదా, బీబీసీ బర్మీస్, బీబీసీ డేటా జర్నలిజం

మియన్మార్‌లో పాలకులైన సైనికులకు, వారిని వ్యతిరేకిస్తున్న పౌరులు ఏర్పాటు చేసుకుంటున్న సాయుధ గ్రూపులకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి అందుతున్న డేటా వెల్లడిస్తోంది.

ఏడాది కిందట సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజలు వారికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతున్నారు. వారిలో యువకులు ఎక్కువగా ఉన్నారు. వారు ఏడాదికాలంగా తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నారు.

అయితే, ఈ రెండు వర్గాల మధ్య పెరుగుతున్న సాయుధ ఘర్షణ సివిల్ వార్‌కు దారితీస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాన్‌ఫ్లిక్ట్ మోనిటరింగ్ గ్రూప్ అయిన ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్‌ (ఏసీఎల్ఈడీ) ప్రకారం మియన్మార్‌లో హింస దేశమంతటికీ పాకింది.

పోరాటం వ్యవస్థీకృతంగా మారుతోందని, గతంలో పట్టణ ప్రాంతాలలో సైనిక పాలనకు పెద్దగా వ్యతిరేకత ఉండేది కాదని, ఇటీవలి కాలంలో అది పెరుగుతోందని ఈ డేటా సూచిస్తోంది.

కచ్చితమైన మరణాల సంఖ్యను తేల్చి చెప్పడం కష్టమే అయినప్పటికీ, స్థానిక మీడియా, ఇతర నివేదికల ఆధారంగా ఏసీఎల్ఈడీ సిద్ధం చేసిన ఈ డేటా ప్రకారం 2021 ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12వేలమంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

సైనిక తిరుగుబాటు జరిగిన వెంటనే వెల్లువెత్తిన నిరసన ప్రదర్శనల అణచివేత సందర్బంగా చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవలి కాలంలో పౌరులు సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న సాయుధపోరాటంలో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఏసీఎల్ఈడీ నివేదికలో వెల్లడైంది.

మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా మియన్మార్‌లో కదంతొక్కిన మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా మియన్మార్‌లో కదంతొక్కిన మహిళలు

మియన్మార్‌లో ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని అంతర్యుద్ధంగా పేర్కొనడం సబబని ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ చీఫ్ మిషెల్లీ బాషెల్లెట్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కఠిన చర్యలు తీసుకోవాలని బాషెల్లెట్ సూచించారు.

మియన్మార్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతిచ్చే విషయంలో అంతర్జాతీయంగా నిర్లిప్తత వ్యక్తమవుతోందని, దీనిని ఒక విపత్తుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. లేకపోతే ఇది ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందని బాషెల్లెట్ వ్యాఖ్యానించారు.

మియన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవర్గాలన్నీ ఏకమై పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్)గా ఏర్పడ్డాయి. పౌరులే సభ్యులుగా ఉన్న ఈ గ్రూపులో యువత ఎక్కువమంది ఉన్నారు.

వీడియో క్యాప్షన్, మియన్మార్ పోలీసులు: ‘నిరసనకారులపై కాల్పులు జరపాలనే ఆదేశాలను ధిక్కరించి పారిపోయి వచ్చాం’

18 సంవత్సరాల హెరా (పేరు మార్చాం) మియన్మార్ సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సెంట్రల్ మియన్మార్ పీడీఎఫ్ కమాండర్‌గా మారేందుకు ఆమె తన యూనివర్సిటీ చదువును పక్కనబెట్టారు.

2021 ఫిబ్రవరిలో తాను చదువుతున్న యూనివర్సిటీ విద్యార్ధిని ఒకరు సైనికుల కాల్పుల్లో మరణించిన తర్వాత ఆమె తాను కూడా పీడీఎఫ్‌లో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆమె పీడీఎఫ్ కంబాట్ ట్రైనింగ్ కోర్సులో చేరడంపై మొదట్లో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందినా, తర్వాత ఆమెలోని సీరియస్‌నెస్‌ను చూసి అంగీకరించారు.

''నువ్వు పోరాడాలని నిర్ణయించుకుంటే కడదాకా పోరాడు అని వారు నాకు సూచించారు'' అని హెరా తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు.

సైనిక తిరుగుబాటుకు ముందు వరకు హేరా వంటి యువత, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తూ పెరిగారు. సైనిక కుట్ర తర్వాత దానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దేశ సరిహద్దుల్లో దశాబ్దాలుగా సైన్యంతో పోరాడుతున్న కొన్ని తెగల నుంచి వారు సాయుధ పోరాటంలో శిక్షణ పొందుతున్నారు.

మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా యువకులు ఎక్కువమంది ఉద్యమంలోకి దిగుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా యువకులు ఎక్కువమంది ఉద్యమంలోకి దిగుతున్నారు

డేటా ఎలా సేకరించారు?

సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళన, సాయుధ ఘర్షణల కారణంగా సంభవిస్తున్న మరణాలను ఏసీఎల్‌ఈడీ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి బీబీసీ సేకరించింది.

వివిధ మీడియా సంస్థలు, హక్కుల సంఘాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సేకరించిన సమాచారాన్ని ఏసీఎల్‌ఈడీ ఒక నివేదికగా రూపొందించింది.

అయితే, తనకు అందిన నివేదికలను ఏసీఎల్ఈడీ స్వయంగా ధృవీకరించలేదు. తమకు అందుబాటలోకి వచ్చిన సమాచారాన్ని ఇందులో పొందు పరిచామని ఆ సంస్థ తెలిపింది.

సంక్షోభ ప్రాంతంలో ఇలాంటి సమాచారాన్ని సేకరించడం కష్టమన్న ఆ సంస్థ, అందిన సమాచారంలో వీలైనంత తక్కువ అంచనాలనే నివేదికలా రూపొందించినట్లు వెల్లడించింది.

మియన్మార్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రంగా జరుగుతున్న తరుణంలో కచ్చితమైన సమాచారం సేకరించడం కష్టం. జర్నలిస్టుల రిపోర్టింగ్‌ మీద కూడా అనేక ఆంక్షలున్నాయి.

Please upgrade your browser to see this visualisation

2021 మే నుంచి జూన్ వరకు మియన్మార్ ప్రభుత్వం, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలపై బీబీసీ సేకరించిన డేటాను, ఏసీఎల్ఈడీ నివేదికలతో పోల్చి చూసినప్పుడు అవి ఆ ట్రెండ్‌కు అనుగుణంగానే ఉన్నట్లు తేలింది.

పీడీఎఫ్ దళాలలో రైతులు, డాక్టర్లు, గృహిణలు నుంచి అన్ని వర్గాల ప్రజలున్నారు. సైనిక ప్రభుత్వాన్ని పారదోలడమే లక్ష్యంగా వారు ఉద్యమిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పీడీఎఫ్ దళాలున్నప్పటికీ, సెంట్రల్ మియన్మార్‌కు చెందిన యువత ఎక్కువగా ఇందులో భాగస్వాములై ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

వారు తమతోపాటు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెగలను కూడా కలుపుకుపోతున్నారు. సాయుధులైన యువ తిరుగుబాటుదారులను ఎదుర్కోవాల్సి రావడం మియన్మార్ సైన్యానికి ఇటీవలి కాలంలో ఇదే మొదలు.

వీడియో క్యాప్షన్, ‘‘నా కళ్ల ముందే అతని తల పేలిపోయింది’’

ఈ మిలిషియా గ్రూప్‌లో అనేకమంది సామాన్య ప్రజలు చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని బాషెలెట్ అన్నారు. ''ఇది ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే ఇది మరొక సిరియాలాగా మారుతుంది'' అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

''ఇది ఇద్దరు సమాన బలం ఉన్నవారి మధ్య జరుగుతున్న పోరాటం కాదు. మొదట్లో మేం చిన్నచిన్న బాంబులు ఉపయోగించేవాళ్లం. కానీ, మిలిటరీ వాళ్ల దగ్గర వాళ్లకు మద్ధతిస్తున్న రష్యా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న బాంబులు ఉన్నాయి'' అని సెంట్రల్ మియన్మార్‌లోని సగాయింగ్ రీజియన్ లో అనేక పీడీఎఫ్ గ్రూపులను సమన్వయం చేస్తున్న మాజీ వ్యాపారవేత్త నగార్ బీబీసీ తో అన్నారు.

ఇటీవలే రష్యా నుంచి యాంగాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి అయ్యిందంటూ మియన్మార్ విట్నెస్ అనే ఓపెన్ సోర్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తనకు లభించిన సమాచారాని బీబీసీతో పంచుకుంది.

గత అక్టోబర్‌లో ఓ మారుమూల గ్రామంపై మిలిటరీ దాడి అనంతర దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత అక్టోబర్‌లో ఓ మారుమూల గ్రామంపై మిలిటరీ దాడి అనంతర దృశ్యాలు

స్థానిక ప్రజల మద్ధతు తప్ప పీడీఎఫ్‌కు వేరే బలం లేదు. కిందిస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పీడీఎఫ్ నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రూప్ బలపడుతున్న కొద్దీ దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఘర్షణ కూడా బలపడుతోంది.

పదవి కోల్పోయిన నేషన్ యూనిటీ గవర్నమెంట్(ఎన్‌యూజీ) పీడీఎఫ్ దళాలకు అనధికారికంగా సాయపడుతోంది.

రక్షణ తక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లు, సిబ్బంది లేని అవుట్ పోస్టులను టార్గెట్ చేసుకుకుని పీడీఎఫ్ దాడులు నిర్వహిస్తుంది. ఆయుధాలు స్వాధీనం చేసుకుని టెలీకాం టవర్లు, బ్యాంకుల్లాంటి సైనిక పాలకుల చేతిలో ఉన్న వ్యవస్థలపై తిరుగుబాటుదారులు దాడులు నిర్వహిస్తారు.

''దేశంలో సైనిక పాలనను కూలదోయడం తప్ప మరో మార్గం లేదు. చర్చలతో పనికాదు. ప్రపంచం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే మేం ఆయుధాలు పట్టాం'' అని నగార్ అన్నారు.

''మిలిటరీ పాలనను తరిమి కొట్టడమే మా లక్ష్యం. సైనికులు అమాయకులను చంపుతున్నారు. వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నారు. ఆస్తులు లాక్కుంటున్నారు. మేం దీన్ని కొనసాగనివ్వం '' అన్నారు హెరా. ఆమె పెద్దక్క కూడా ఈ ఉద్యమంలో పని చేస్తున్నారు.

ఆందోళనల సమయంలో అనేకమంది సామాన్య ప్రజలు కూడా మరణించారు. ఒక్క జులై నెలలోనే 40మంది, డిసెంబర్‌లో దాదాపు 35 మంది మరణించారు.

మియన్మార్ పోరాటం రానురాను హింసాత్మకంగా మారుతోంది

చనిపోయినట్లు నటించి సైన్యం దాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.

''సైనికులు మా గ్రామంలో ప్రవేశించినప్పుడు పారిపోలేని వారు కాల్పుల్లో మరణించారు. మా ఊళ్లో చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు వృద్ధులు కాగా, ఇద్దరు మానసిక స్థితి సరిగాలేని వారు'' అని ఆ వ్యక్తి వెల్లడించారు.

తిరుగుబాటుదారుల కోసం సైన్యం తమ గ్రామంలో జల్లెడపడుతూ కాల్పులకు దిగిందని ఆయన వెల్లడించారు.

తన భర్త ఒంటిపై తీవ్రగాయాలను తాను చూశానని చనిపోయిన ఓ వ్యక్తి భార్య వెల్లడించారు.

''సైన్యం క్రూరత్వానికి అంతులేదు. మాట్లాడలేని వృద్ధుడిని కూడా చంపేశారు. ఆ సంఘటన గుర్తుకు వస్తేనే నాకు ఏడుపు ఆగదు'' అని ఆమె బీబీసీతో అన్నారు.

నిరసనల్లో మరణించిన వారికి సంఘీభావంగా యాంగాన్ గత మార్చిలో సెల్‌ఫోన్ లైట్‌తో సంఘీభావం తెలుపుతున్న ఆందోళనకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనల్లో మరణించిన వారికి సంఘీభావంగా యాంగాన్ గత మార్చిలో సెల్‌ఫోన్ లైట్‌తో సంఘీభావం తెలుపుతున్న ఆందోళనకారులు

మిలిటరీ అధికారులు చాలా అరుదుగా మీడియాతో మాట్లాడతారు. 2021 చివరలో జుంటా ప్రతినిధి జా మిన్ టున్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పీడీఎఫ్‌ను తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు. వారిపై చర్యలను సమర్ధించారు.

ఇరువర్గాల బలాబలాలు స్పష్టంగా తెలియవు. అధికారికంగా మియన్మార్ దగ్గర 370,000 మంది సైనికులు ఉన్నారు. కానీ వాస్తవానికి ఇది చాలా తక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎక్కువగా రిక్రూట్‌మెంట్‌లు జరగలేదు.

మియన్మార్ సంక్షోభం

తిరుగుబాటు మొదలైన తర్వాత చాలామంది తమ పదవులను వదిలిపెట్టారు. ఇక పీడీఎఫ్‌లో ఎంతమంది సభ్యులున్నారో అంచనా వేయడం చాలా కష్టం.

గతంలో కొన్ని తెగలు దేశాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సైన్యం విమర్శలు చేసేది. అయితే, తాము వారిని తప్పుగా అర్ధం చేసుకున్నామని, సైన్యం మాటలను నమ్మామని పీడీఎఫ్ దళాలు అభిప్రాయపడుతున్నాయి.

మిలిటరీకి వ్యతిరేకంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న సిస్టర్ రోజ్

ఫొటో సోర్స్, Myitkyinar News Journal via Reuters

ఫొటో క్యాప్షన్, మిలిటరీకి వ్యతిరేకంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న సిస్టర్ రోజ్

సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సరిహద్దుల్లోని ఆ తెగల నుంచి పీడీఎఫ్ సభ్యులు శిక్షణ పొందుతున్నారు. గతంలో తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నట్లు పీడీఎఫ్ ప్రకటించింది.

సైనిక తిరుగుబాటు సమయంలో దానికి వ్యతిరేకంగా నిరసనకారులతో కలిసి ఉద్యమించిన రోజ్ ను తవాంగ్ అనే ఓ నన్, మార్చి 2021లో పోలీసు బలగాలను ధిక్కరిస్తూ వారికి అడ్డంగా మోకాళ్లపై కూర్చున్నారు.

సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆమె బీబీసీతో అన్నారు.

''పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదు. ఆరోగ్య వ్యవస్థ నాశనమైంది. ఆర్ధికరంగం దెబ్బతింది. ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితులను చూసి కొందరు పిల్లలు వద్దనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను పోషించలేమని వారు భావిస్తున్నారు'' అన్నారు రోజ్.

యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ''ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్ కోసం, సైనిక పాలన నుంచి విముక్తి కోసం వాళ్లు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు. త్యాగాలు చేస్తున్నారు'' అన్నారామె.

అదనపు సమాచారం: రెబెకా హెన్షెక్, బెకీ డేల్. డిజైన్: జనా టవుషిన్‌స్కి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)