మియన్మార్ నిరసనలు: నిర్బంధానికి గురైన బీబీసీ జర్నలిస్ట్ ఆంగ్ థురా విడుదల

ఆంగ్ థురా
ఫొటో క్యాప్షన్, ఆంగ్ థురా

మియన్మార్‌లో నిర్బంధానికి గురైన బీబీసీ జర్నలిస్ట్ ఆంగ్ థురా విడుదలయ్యారు.

దేశ రాజధానిలోని ఓ కోర్టు వెలుపల వార్తలను కవర్ చేసే పనిలో ఉన్న బీబీసీ బర్మీస్ సర్వీస్‌కు చెందిన ఆంగ్‌ను మార్చి 19న సాధారణ దుస్తుల్లోనే వచ్చిన కొందరు తీసుకెళ్లారు.

ఫిబ్రవరి 1న పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన ప్రారంభమైన తరువాత ఇంతవరకు నలభై మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు.

అయిదు మీడియా సంస్థల లైసెన్సులనూ సైనిక పాలకులు రద్దు చేశారు.

శుక్రవారం స్థానిక మీడియా సంస్థకు మిజ్జిమాకు చెందిన ఓ రిపోర్టర్‌ థాన్ ఆంగ్, బీబీసీ రిపోర్టర్ ఆంగ్ థురాలను గుర్తు తెలియని వాహనంలో వచ్చిన వ్యక్తులు తీసుకెళ్లారు.

ఆ తరువాత వారి గురించి ఎలాంటి సమాచారమూ తెలియలేదు.

అయితే, సోమవారం ఆంగ్ థురా విడుదలైనట్లు బీబీసీ తెలిపింది.

బీబీసీ జర్నలిస్ట్ ఆంగ్ థురా

సైనిక కుట్ర తరువాత ప్రజాగ్రహం వెల్లువెత్తగా దాన్ని అదుపు చేసేందుకు మిలటరీ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో 149 మంది మరణించినట్లు ఐరాస లెక్కలు చెబుతున్నాయి. అయితే, వాస్తవంగా అంతకంటే చాలా ఎక్కువ మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు.

ఒక్క మార్చి 14నే ఏకంగా 38 మంది కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

గుర్తింపు పొందిన జర్నలిస్ట్

ఆంగ్ కనిపించకుండా పోయిన తరువాత బీబీసీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆయన ఆచూకీ తెలుసుకోవటానికి సాయం చేయాలని మియన్మార్ అధికారులను కోరింది.

నిర్బంధానికి గురైన తరువాత ఆంగ్ థురాను బీబీసీ సంప్రదించ లేకపోయింది.

''మియన్మార్‌లోని తమ సిబ్బంది అందరి భద్రతను బీబీసీ చాలా సీరియస్‌గా పట్టించుకుంటోంది. ఆంగ్ థురా ఆచూకీ తెలుసుకోవటానికి మేం శాయశక్తులా పనిచేస్తున్నాం'' అని బీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

''ఆయన ఆచూకీ తెలుసుకోవటానికి సాయం చేయాలని, ఆయన సురక్షితంగా ఉన్నారని నిర్ధరించాలని మేం అధికార సంస్థలను కోరుతున్నాం. ఆంగ్ థురా గుర్తింపు పొందిన బీబీసీ జర్నలిస్ట్. నే పీ టాలో సంఘటనలపై చాలా ఏళ్లుగా వార్తా కథనాలు అందిస్తున్నారు'' అని పేర్కొంది.

మియన్మార్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో సైనిక కుట్ర సందర్భంగా ఆంగ్ సాన్ సూచీ సహా ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధించారు.

అప్పటి నుంచి 40 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో 16 మంది ఇంకా కస్టడీలో ఉన్నారు.

సైనిక కుట్ర అనంతరం మియన్మార్‌లో తలెత్తిన హింసలో కనీసం 232 మంది బర్మా ప్రజలు చనిపోయారని ఉద్యమ సంస్థ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)