ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష: అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలు విడుదల

ఫొటో సోర్స్, Reuters
2017 తర్వాత తమ అతిపెద్ద క్షిపణి ప్రయోగానికి సంబంధించినవిగా చెబుతున్న కొన్ని ఫొటోలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది.
అంతరిక్షం నుంచి తీసినట్లు ఉన్న ఈ ఫొటోల్లో కొరియా ద్వీపకల్పం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కనిపిస్తున్నాయి.
ఈ బాలిస్టిక్ మిసైల్ హ్వాసాంగ్-12 అని ఉత్తర కొరియా చెప్పింది.
ఈ క్షిపణి 2వేల కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లిందని దక్షిణ కొరియా, జపాన్ చెప్పాయి.
క్షిపణిని ప్రయోగించడాన్ని ఈ రెండు దేశాలూ ఖండించాయి.
ఉత్తర కొరియా మిసైల్ పరీక్షించడం ఈ నెలలో ఇది ఏడోసారి.
ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా ఏజెన్సీ కేసీఎన్ఏ విడుదల చేసిన ఈ ఫొటోలను క్షిపణితో టెస్ట్ చేసిన వార్‌హెడ్‌కు బిగించిన కెమెరా ద్వారా తీసినట్లు చెబుతున్నారు.
కేసీఎన్ఏ విడుదల చేసిన ఫొటోల్లో రెండింటిలో క్షిపణి లాంచ్ చేస్తున్న దృశ్యాలు, మిగతా వాటిలో అది ఆకాశంలో దూసుకెళ్తూ పైనుంచి తీసినట్లు కనిపిస్తున్నాయి.
ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో చేరిందని జపాన్, దక్షిణ కొరియా అధికారులు అంచనా వేశారు.
బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలు పరీక్షించకుండా ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాను నిషేధించింది. దానిపై కఠిన ఆంక్షలు విధించింది.

ఫొటో సోర్స్, Reuters
కానీ, ఉత్తర కొరియా ఈ నిషేధాన్ని పదే పదే ధిక్కరిస్తూ వస్తోంది. దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్ కూడా తమ దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నానని చెబుతూ వస్తున్నారు.
ముందస్తు షరతులేవీ లేకుండా ఆ దేశ అణు, క్షిపణి కార్యక్రమాలపై ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి ఉత్తర కొరియాకు పిలుపునిచ్చారని రాయిటర్స్ చెప్పింది.
"దీనిపై సీరియస్‌గా చర్చలు ప్రారంభించడం పూర్తిగా సముచితమని, పూర్తిగా సరైనదేనని మేం భావిస్తున్నాం" అని ఆ అధికారి తెలిపారు.
మరింత అస్థిరపరిచే చర్యలను మానుకోవాలని అమెరికా గతంలో ఉత్తర కొరియాను హెచ్చరించింది.
ఉత్తర కొరియా చేసే క్షిపణి పరీక్షల గురించి ఆ దేశ అధికార మీడియా సాధారణంగా తర్వాత రోజే ప్రకటిస్తుంటుంది.
క్షిపణి కచ్చితత్వాన్ని పరిశీలించడానికే ఈ ప్రయోగం చేశామని కేసీఎన్ఏ సోమవారం చెప్పింది. దీనిని పరీక్షించినపుడు కిమ్ హాజరు కాలేదని చెబుతున్నారు.
పొరుగు దేశాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ క్షిపణిని వాయవ్య ప్రాంతంలోని హయ్యస్ట్ యాంగిల్ ఫైరింగ్ సిస్టమ్ నుంచి కొరియా తూర్పు సముద్రం వరకూ ప్రయోగించినట్లు ఏజెన్సీ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఈ ప్రయోగానికి కిమ్ గైర్హాజరవడం, దీనిని వర్ణించడానికి ఉపయోగించిన భాషను బట్టి చూస్తుంటే, ఉత్తర కొరియా తమ కొత్త టెక్నాలజీని ప్రదర్శించడానికి బదులు, ఈ క్షిపణి వ్యవస్థ అనుకున్నవిధంగా పనిచేస్తోందా అనేది తెలుసుకునే ఉద్దేశంతోనే దీనిని పరీక్షించినట్టు తెలుస్తోంది" అని ఉత్తర కొరియా విశ్లేషకులు అంకిత్ పాండే చెప్పారు.
తాము ఒక ఇంటర్మీడియట్ రేంజ్ హ్వాసాంగ్-12 క్షిపణిని పరీక్షించినట్టు కేసీఎన్ఏ చెప్పింది. 2017 తర్వాత అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఈ సైజు క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి.
2017లో ఇదే క్షిపణిని ఆరుసార్లు పరీక్షించారు. ఆ సమయంలో దానిని రెండుసార్లు జపాన్‌కు చెందిన హొక్కాయిడో దీవి మీదుగా ప్రయోగించారు.
హ్వాసాంగ్-12 భారీగా ఉండే హెవీ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను కూడా మోసుకెళ్లగలదని ఉత్తర కొరియా గతంలో చెప్పింది.
ఈ నెలలో ఇది ఏడోసారి
ఆదివారం జరిగిన బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం ఉత్తర కొరియా ఈ ఏడాది ప్రారంభం నుంచీ జరిపిన ఏడో క్షిపణి పరీక్ష.
ఉత్తర కొరియా వరుస ప్రయోగాల వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ప్రపంచ, ప్రాంతీయ శక్తులకు ఆ దేశం తన బలం గురించి సంకేతాలు ఇవ్వడంతోపాటూ , చాలాకాలంగా ఆగిపోయిన అణు చర్చల్లో తిరిగి పాల్గొనేలా అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలనే కిమ్ జోంగ్ ఉన్ లక్ష్యం, కొత్త ఇంజనీరింగ్, మిలిటరీ కమాండ్ సిస్టమ్స్‌ను పరీక్షించాల్సిన వారి అవసరాలు లాంటివి ఉన్నాయని తెలిపారు.
చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరగబోయే ముందు, మార్చిలో దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరీక్షను నిర్వహించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అమెరికా ఆంక్షలు, మహమ్మారి సంబంధిత సమస్యలు, దశాబ్దాల పాలనాపరమైన లోపాలతో ఉత్తర కొరియా ఆర్థికవ్యవస్థ తల్లడిల్లుతున్న సమయంలో కూడా దేశంలో క్షిపణి పరీక్షలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- నాటో అంటే ఏమిటి? రష్యా దానిని ఎందుకు నమ్మట్లేదు?
- గుజరాత్: సోషల్ మీడియా పోస్ట్‌పై ఆగ్రహం, యువకుడి కాల్చివేత... అసలు ఏం జరిగింది
- దళితులు మాయావతి బీఎస్పీకి దూరమయ్యారా? దళితుల ఓట్లు కోరుకుంటున్న పార్టీలు వారికోసం ఏం చేస్తున్నాయి?
- కేంద్ర బడ్జెట్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న సవాళ్లు ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














