గుజరాత్: సోషల్ మీడియా పోస్ట్‌పై ఆగ్రహం, యువకుడి కాల్చివేత... అసలు ఏం జరిగింది

ఫొటో సోర్స్, VIDEO GRAB
- రచయిత, అర్జున్ పర్మార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో 27 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన తర్వాత, ఈ కేసు వరుసగా పతాకశీర్షికల్లో నిలుస్తూ వస్తోంది.
ఈ ఏడాది జనవరి 25న అహ్మదాబాద్ ధంధూకా తాలూకాకు చెందిన కిషన్ భార్వాడ్ సోషల్ మీడియాలో మతపరమైన వివాదాస్పద పోస్ట్ చేయడంతో తలెత్తిన గొడవతో అతడిని కాల్చి చంపారు.
కిషన్ హత్య కేసులో అదే ప్రాంతానికి చెందిన యువకులు షబ్బీర్, ఇంతియాజ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
ఈ హత్య జరిగిన తర్వాత నుంచీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందుత్వ సంస్థలు వరుస నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఆదివారం కూడా ఈ ప్రాంతంలో ప్రదర్శనలు చేశారు.
గుజరాత్ హోంమంత్రి హర్ష్ సాంఘ్వీ కూడా ఈ హత్య ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి ట్వీట్ చేశారు.
ఈ కేసును యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)కు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాన్ని కలిసిన ఆయన ఈ కేసులో వెంటనే న్యాయం లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు.
యువకుడి హత్య కేసులో పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కేసును స్పెషల్ ఆపరేషన్ టీమ్ దర్యాప్తు చేసేది. తర్వాత పోలీసులు అహ్మదాబాద్ జమాల్‌పూర్ ప్రాంతం నుంచి మౌల్వీ అయూబ్‌ను కూడా అరెస్ట్ చేశారు.
షబ్బీర్‌ను రెచ్చగొట్టాడని, హత్య చేయడానికి తుపాకీ, బుల్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాడని మౌల్వీ అయూబ్ మీద ఆరోపణలు ఉన్నాయి.
గుజరాత్ ధంధూకా హత్య కేసులో దిల్లీ పోలీసులు, గుజరాత్ ఏటీఎస్ టీమ్ ఆదివారం దిల్లీలో నాలుగో నిందితుడు మౌల్వీ కమర్ గనీ అబ్బాస్‌ను అరెస్ట్ చేశారు. బీబీసీతో మాట్లాడిన గుజరాత్ ఏటీఎస్ డీఎస్పీ బీఎస్ చావ్డా ఆయన అరెస్టును ధ్రువీకరించారు.
ఈ కేసులో మౌల్వీ అబ్బాస్ పాత్ర ఏంటి అనేదానిపై ఆయన్ను గుజరాత్ తీసుకువచ్చి విచారించనున్నట్లు ఆయన తెలిపారు.
దీనితోపాటూ హత్యకు ఉపయోగించిన తుపాకీ, బైక్‌ను నిందితులు చెప్పిన ప్రాంతం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బీబీ వాలా బీబీసీకి చెప్పారు.
మౌలానా అయూబ్, షబ్బీర్, ఇంతియాజ్.. పాకిస్తాన్ గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చే కొందరి వీడియోలు చూసేవారని విచారణలో తేలిందని, ఆ వీడియోల సాయంతో అయూబ్ తరచూ మిగతావారిని రెచ్చగొట్టేవాడని ఆయన తెలిపారు.
15 రోజుల క్రితం కిషన్ సోషల్ మీడియాలో చేసిన ఒక మతపరమైన పోస్ట్ వల్లే అతడిని హత్య చేశారని, మృతుడికి తమ్ముడి వరుసయ్యే భౌమిక్ భార్వాడ్ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన రిపోర్ట్‌లో చెప్పింది.
"వేరే మతానికి చెందిన కొందరు కిషన్ సోషల్ మీడియా పోస్ట్‌తో ఆగ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కిషన్ పోలీసు విచారణ కూడా ఎదుర్కున్నాడు. తన పోస్టుకు క్షమాపణ కూడా అడిగాడు" అని భౌమిక్ చెప్పినట్లు పత్రిక రాసింది.
మొత్తం కేసు గురించి తెలుసుకోడానికి ఈ బాధిత కుటుంబాన్ని, అధికారులను, ఇతరులను బీబీసీ సంప్రదించింది.

ఫొటో సోర్స్, SACHIN PITHHVA
మృతుడి అమ్మనాన్నలు ఏం చెబుతున్నారు
"సోషల్ మీడియాలో చెబుతున్న దాని ప్రకారం నా కొడుకును చంపిన వారు సోషల్ మీడియాలో అతడు చేసిన ఒక పోస్టుతో ఆగ్రహించారు. దానిపై అతడికి పదే పదే బెదిరింపులు కూడా వచ్చేవి. 25న కిషన్‌ను హత్య చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తామని మాకు మాట ఇచ్చారు" అని మృతుడి తండ్రి శివభాయీ భార్వాడ్ బీబీసీకి చెప్పారు.
"సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ ఆ పోస్టుపై కోపంతోనే నా కొడుకును చంపేశారు" అని ఆయన తెలిపారు.
"నా కొడుకును మొదట దారుణంగా కొట్టారు. కిషన్ దానికి క్షమాపణలు కూడా అడిగాడు. తర్వాత అతడిని మోసంతో హత్య చేశారు" అని స్థానిక మీడియాతో మాట్లాడిన కిషన్ భార్వాడ్ తల్లి చెప్పారు.
కిషన్ సోదరి కూడా అదే మాట చెప్పారు.
"మా అన్నను వీపులో కాల్చి చంపారు. వాళ్లు అతడిని దారుణంగా కొట్టారు కూడా. ఇప్పుడు నాకు అన్న లేకుండా చేశారు" అన్నారు.
"మౌలానా అయూబ్‌కు అహ్మదాబాద్ జమాల్‌పూర్‌కు చెందిన షబ్బీర్ బుల్లెట్లు, తుపాకీ తెచ్చిచ్చాడు, హత్య చేసేలా రెచ్చగొట్టాడు. అతడిని కూడా అరెస్ట్ చేశాం. వారిని ఇప్పుడు కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండు కోరుతాం" అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
"ఈ కేసులో ఇద్దరు నిందితులు షబ్బీర్, ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశాం. ఇద్దరూ వెళ్లి కిషన్ మీద కాల్పులు జరిపారు. షబ్బీర్ చేతిలో తుపాకీ ఉన్నప్పుడు, ఇంతియాజ్ బైక్ నడుపుతున్నాడు. ఇద్దరు నిందితుల్లో షబ్బీర్ మత ఛాందసవాది అని మా విచారణలో తేలింది. ఇతరుల ప్రభావంతోనే ఆయన అలా చేసినట్లు తెలిసింది" అని రూరల్ అహ్మదాబాద్ ఎస్పీ యాదవ్ చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం మతపరమైన పోస్టులకు సంబంధించి ఎలాంటి క్షమాపణలకూ ఒప్పుకోవద్దని అయూబ్ షబ్బీర్‌కు చెప్పాడు. ఈ మొత్తం కేసులో ముంబయికి చెందిన ఒక మౌల్వీ ప్రమేయం గురించి కూడా ప్రశ్నించినపుడు, నిందితులు ఆయన వివరాలు బయటపెట్టలేదు.
"సోషల్ మీడియాలో కిషన్ వివాదాస్పద పోస్టు గురించి కేసు నమోదైన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో కిషన్ తన పోస్టుపై క్షమాపణ అడిగాడు" అని యాదవ్ తెలిపారు.
కిషన్ హత్య గురించి బీబీసీతో మాట్లాడిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి హితేంద్ర సింగ్ రాజ్‌పుత్ దానిని నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం రూపొందించిన కుట్రగా చెప్పారు.
"నాకు ఏం తెలీదు. నా కొడుకును ముస్లింలు చంపారనే విషయం మాత్రమే నాకు తెలుసు" అని కిషన్ తండ్రి శివభాయ్ భార్వాడ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, SACHIN PITHHVA
వివాదాస్పద పోస్టు గురించి క్షమాపణ అడిగాడు
కిషన్ వివాదాస్పద పోస్టుపై క్షమాపణ అడుగుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేసినట్లు భౌమిక్ భార్వాడ్ చెప్పాడని రిపోర్టులు చెబుతున్నాయి.
గుజరాత్ పోలీసుల వివరాల ప్రకారం కిషన్ జనవరి 6న ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశాడు. అందులో మతపరంగా మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలతో, జనవరి 9న అతడిపై కేసు నమోదవడంతో, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కానీ ప్రతివాదులు పోలీసుల చర్యతో సంతృప్తి చెందలేదు. అందుకే వారు అతడిని హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితుల ప్రమేయం ఉండవచ్చని కేసు దర్యాప్తు చేస్తున్న అహ్మదాబాద్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బీబీ వాలా చెప్పారు. అయితే దర్యాప్తు తర్వాతే ఇందులో పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.
విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి హితేంద్ర భాయ్ రాజ్‌పుత్ ఈ ఘటనను మతంతో ముడిపెట్టారు.
"మృతుడి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేయడానికి మొత్తం గుజరాత్ అంతటా సంతాప సభలు నిర్వహిస్తాం. నిందితులను అరెస్ట్ చేసి, వారిని కఠినంగా శిక్షించేవరకూ మేం మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తాం" అన్నారు.
అయితే, కిషన్ భార్వాడ్ ఎఫ్‌బీ అకౌంట్ లాక్ అవడంతో, అతడు ఏం పోస్ట్ చేశారు అనే దానిపై, ఎలాంటి సమాచారం లభించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- భయంకరమైన హైవే జర్నీ.. విజయంతంగా డ్రైవింగ్ పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తారు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- యుక్రెయిన్ సంక్షోభం: ‘యుద్ధానికి ముందు, ఇప్పుడు నా ఊరికి పోలికే లేదు’
- పుతిన్ జీవితంలో ఆ ఒక్క సంఘటన నాటోకు విరోధిగా ఎలా మార్చేసిందంటే..
- రష్యా, యుక్రెయిన్: ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.. ఏదో జరగొచ్చని అనిపిస్తోంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














