హిందూ మతాన్ని స్వీకరించిన ముస్లిం నాయకుడు వసీం రిజ్వీ

ఘజియాబాద్‌లోని దస్నా దేవి ఆలయంలో తంతు జరిగింది

ఫొటో సోర్స్, YOGENDRA SAGAR

ఫొటో క్యాప్షన్, ఘజియాబాద్‌లోని దస్నా దేవి ఆలయంలో తంతు జరిగింది
    • రచయిత, షాబాజ్ అన్వర్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఆయన పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి.

"యతి నరసింహానంద గిరి జీ పెట్టిన పేరుతో నాకు శక్తి వచ్చింది. ఈరోజు ఈ పవిత్ర దేవాలయంలో ఉన్నాను. నాకు ఎంతో శక్తి లభించింది" అని ఆయన చెప్పారు.

వసీం రిజ్వీ సోమవారం ఉదయం ఘజియాబాద్‌లోని దస్నా దేవి ఆలయంలో హిందూ మతాన్ని స్వీకరించారు. ఆలయంలోని శివలింగానికి క్షీరాభిషేకం చేసి, వేద మంత్రోచ్ఛరణల మధ్య హిందూ మతాన్ని స్వీకరించారు.

జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మారిన వసీం రిజ్వీ

ఫొటో సోర్స్, YOGENDRA SAGAR

ఫొటో క్యాప్షన్, జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మారిన వసీం రిజ్వీ

హిందూ మతాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే..

జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మారిన తరువాత వసీం రిజ్వీ మీడియాతో మాట్లాడారు.

"ఇస్లాం నన్ను పదే పదే బహిష్కరిస్తూ ఉంది. ప్రతీ అంశంపై బహిష్కరిస్తూనే ఉంది. సరే బహిష్కరించింది కదా, ఇప్పుడు నేను స్వతంత్రుడిని. ఎక్కడ నాకు స్వేచ్ఛ లభిస్తుందో, ఎక్కడ ప్రేమ దొరుకుతుందో, ఎక్కడ మానవత్వం ఉంటుందో అక్కడకు వెళ్తాను. హిందూ మతాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఇది ప్రపంచంలోనే పురాతనమైన ధర్మం. హిందూ సమాజంపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముస్లింలు ఈ పని చేస్తునే ఉన్నారు. నేటికీ ఇళ్లు తగలబెట్టాలన్న ఆలోచనలోనే ఉన్నారు."

"ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు హిందువులను చంపాలనుకుంటున్నాయి. కానీ, హిందువులు ఏం పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్లు ఎవరికీ భయపడక్కర్లేదని చెప్పాలి. యుద్ధం చేయమని చెప్పట్లేదు కానీ, తమను తాము రక్షించుకోడానికి సిద్ధంగా ఉండాలి. పొరుగువారు మీ ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో హిందువులను హెచ్చరించాలి. మేం గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదు. కానీ, మమ్మల్ని చంపడానికి ఎవరైనా వస్తే సహించేది లేదు" అని వసీం రిజ్వీ అన్నారు.

వసీం రిజ్వీ

ఫొటో సోర్స్, Yogendra Sagar

డిసెంబర్ 6న ఈ కార్యక్రమం ఎందుకు జరిపించారు?

డిసెంబర్ 6కు ప్రత్యేకత ఉందని వసీం రిజ్వీ చెప్పారు.

"ఇదే రోజు శ్రీరాముడిని అవమానిస్తూ బాబర్ మసీదు నిర్మించాడు. ఇదే రోజు హిందువులు తమ సాధు బలాన్ని ఉపయోగించి ఆ దురాక్రమణను తరిమికొట్టారు. అందుకే ఈ రోజు హిందువులకు గర్వకారణం. ఈరోజు నేను హిందూ మతాన్ని ఎందుకు స్వీకరించానంటే, నా కథ కూడా రామమందిరం సంఘర్షణతోనే మొదలైంది."

"నన్ను మొదటిసారి ఇస్లాం నుంచి బహిష్కరించినప్పుడు, ప్రతి శుక్రవారం నమాజు తరువాత నా తల, యతీష్ జీ తల నరకడంపై బహుమతి పెంచుతూ ఉండేవారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేసేవారు. ఇదేం మతం? ఒకరిని సజీవంగా దహనం చేస్తున్నావు, ఒకరి తల నరకడానికి బహుమతి ప్రకటిస్తున్నావు. నువ్వు మనిషివా? తోడేలువా?"

వసీం రిజ్వీ

ఫొటో సోర్స్, Yogendra Sagar

కుటుంబం, రాజకీయాల గురించి..

"కుటుంబంలో నన్ను ఇష్టపడేవాళ్లు నాతో వస్తారు. నేను చేసిన పనిని అంగీకరించనివాళ్లు కుటుంబ సభ్యులైనా, మిత్రులైనా.. మతపరంగా వారిని త్యజిస్తాను."

"ముస్లింల ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నవారు తమ దృష్టి కోణం నుంచి ఈ విషయాన్ని చూస్తున్నారు. కానీ, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు.. దీనికి, రాజకీయాలకు ఏ సంబంధం లేదు. రాజకీయాల కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాం. రాజకీయం ఒక బలం" అని వసీం రిజ్వీ వివరించారు.

ఇస్లాం మతానికి సంబంధించి రిజ్వీ చాలాకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.

మదరసాలను మూసివేయాలని, అక్కడ నుంచి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రిజ్వీ.

మహ్మద్ ప్రవక్త జీవితంపై పుస్తకానికి సంబంధించి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.

అలాగే, ఖురాన్‌లో 26 శ్లోకాలను తొలగించాలంటూ రిజ్వీ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 6న రిజ్వీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించారు

ఫొటో సోర్స్, YOGENDRA SAGAR

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 6న రిజ్వీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించారు

జపాన్, అమెరికాలలో ఉద్యోగం

మీడియా కథనాల ప్రకారం, రిజ్వీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు.

తోబుట్టువులలో ఆయనే పెద్ద. రిజ్వీ తండ్రి ఒక రైల్వే ఉద్యోగి. రిజ్వీ 6వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఆయన తండ్రి మరణించారు.

సౌదీ అరేబియాలోని ఒక హోటల్‌లో రిజ్వీ కొన్నాళ్లు పనిచేశారని మీడియా కథనాలు తెలిపాయి. అలాగే, జపాన్, అమెరికాలలో కొన్నాళ్లు పనిచేశారు.

ఆ తరువాత, భారతదేశం వచ్చి వక్ఫ్ బోర్డులో సభ్యుడు అయ్యారు. క్రమంగా ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవికి ఎదిగారు.

'మనోభావాలతో ఆడుకోవద్దు '

వసీం రిజ్వీ హిందూ మతాన్ని స్వీకరించడంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ యాసూబ్ అబ్బాస్ స్పందించారు.

"వసీం రిజ్వీ ఇప్పుడు ఒక హిందువు. కానీ, మతం మార్చుకున్న తరువాత ఖురాన్‌పై లేదా ఇస్లాంపై వేలెత్తి చూపే హక్కు ఆయనకు లేదు. ఏ మతంలోకి మారడానికైనా ఆయనకు అధికారం ఉంది."

"స్వేచ్ఛ అంటే మతపరమైన భావనలతో ఆడుకోవడం కాదు. మా మనోభావాలతో ఆడుకుంటే, ఆయనపై మా పోరాటం కొనసాగిస్తాం" అని అబ్బాస్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)