పాకిస్తాన్: వందేళ్ల హిందూ ఆలయాన్ని పునః ప్రారంభించిన చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్
తన మతాన్ని కాపాడుకునే హక్కు ప్రతి మనిషికి ఉందని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ అన్నారు.
హిందూ సన్యాసి శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ చారిత్రాత్మక సమాధి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు జస్టిస్ అహ్మద్ సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లా తేరి గ్రామానికి వచ్చారు.
ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటికీ, డిసెంబర్ 2020లో స్థానికులు కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని జస్టిస్ అహ్మద్ ఆదేశించారు.
పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు సోమవారం ఆలయానికి వచ్చి, పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించిన జస్టిస్ గుల్జార్ అహ్మద్.. ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా తన బాధ్యత అని అన్నారు.

పాక్ చీఫ్ జస్టిస్ హిందూ ఆలయాన్ని ప్రారంభించడం అసాధారణం
పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్, టేరీ కరాక్ టెంపుల్‌ని సందర్శించడం సాధారణ విషయం కాదు. దీనికి చాలా ప్రాధాన్యం ఉంది.
కొంతకాలంగా పాకిస్తాన్‌లోని మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారు. గుడి విధ్వంసం కేసులో దాని మరమ్మతులకయ్యే సుమారు 3.3 కోట్ల పాకిస్తానీ రూపాయలను చెల్లించాలంటూ 123 మంది నిందితులను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. అంటే తమకు న్యాయం జరుగుతుందని మైనారిటీలు భావించడానికి ఇదొక సంకేతంగా చూడొచ్చు.
విధించిన జరిమానాలో చాలా వరకూ సేకరించి, దేవాలయ పునురద్ధరణ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు మెచ్చుకుంటున్నారు.
2020 డిసెంబరులో దాదాపు 1500 మంది ఈ గుడిని చుట్టుముట్టి, ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. హిందువులు తమ పూజా స్థలాన్ని విస్తరించాలనుకోవడమే అందుకు కారణం. ఇది నచ్చని స్థానిక ముస్లిముల్లో కొందరు తమ పలుకుబడిని, బలాన్ని ఉపయోగించి హిందువుల మందిరంపై దాడి చేశారు.
నిందితులకు జరిమానా విధించడమే కాకుండా హిందువులకు భూమి ఇవ్వాలని కూడా పాక్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. కావాలనుకుంటే తమ పూజా స్థలాన్ని హిందువులు విస్తరించుకోవచ్చని కూడా చెప్పారు. అందుకు అవసరమైన సాయం ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నుంచి అందుతుందని కూడా తెలిపారు.
ఈ నిర్ణయంపైన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. దీనిని సమర్థించేవాళ్లు ఒక ప్రగతిశీల పాకిస్తాన్‌ను చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఇక మతాన్ని గట్టిగా నమ్మేవారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మైనారిటీలకు పాకిస్తాన్ చాలా సురక్షితమైన ప్రాంతమని మరికొందరు అంటుండగా పాక్‌లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూనే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టీ ముస్లింల సమస్యలను ముందుగా పరిష్కరించి, ఆ తరువాతే మైనారిటీల సమస్యలను పట్టించుకోవాలని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయా?
- ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారంటే..
- వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరం
- స్వస్తిక: హిట్లర్ హిందూ మత చిహ్నాన్ని తన పార్టీ గుర్తుగా ఎందుకు ఎంచుకున్నారు?
- పద్మశ్రీ హరెకల హజబ్బ: పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూలు నిర్మించి, విద్యను అందిస్తున్నాడు
- వరి పండించడం వల్ల పర్యావరణానికి ప్రమాదమా
- చైనా ఎడారిలో అమెరికా యుద్ధనౌకలను పోలిన నిర్మాణాలు, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
- పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు స్డేడియానికి వెళ్లనున్న ఇండియన్ సానియా మీర్జా ఒక్కరేనా? ట్విటర్‌లో ఏమిటీ చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


