పాకిస్తాన్‌లోని పురాతన హిందూ ఆలయంపై దాడి

ఆలయ ప్రధాన తలుపు, లోపల మెట్ల మార్గం ధ్వంసమయ్యాయి.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆలయ ప్రధాన తలుపు, లోపల మెట్ల మార్గం ధ్వంసమయ్యాయి.
    • రచయిత, షుమైలా జాప్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న దాదాపు వందేళ్ల పురాతన హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

రావల్పిండిలోని పురానా ఖిలా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ కోసం నిర్మాణ పనులు జరుగుతుండగా ఆదివారం సాయంత్రం దాడి జరిగినట్లు బనీ గాలా పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

పాకిస్తాన్ శిక్షాస్మృతి ప్రకారం అల్లర్లు, దైవదూషణ, అక్రమంగా గుమిగూడిన నేరాలకు గాను ఈ కేసును నమోదు చేశారు. గత 74 ఏళ్లుగా మూతపడిన ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మార్చి 24 నుంచి పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు.

నిర్మాణ పనులు మొదలైన తర్వాత ఈ చారిత్రక ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ఆక్రమణలను తొలగించినట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం తెలుస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆలయాన్ని అపవిత్రం చేశారు

ఆదివారం నిర్మాణ పనులు ఆగిపోయిన తర్వాత, సాయంత్రం ఏడున్నర సమయంలో 10-15 మంది వ్యక్తులు ఆలయంలోకి చొరపడి దానిని ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.

ఆలయం తలుపులు విరగ్గొట్టడంతో పాటూ ఆలయం మెట్లు కూడా ధ్వంసం చేశారు. ఆలయాన్ని అపవిత్రం కూడా చేశారు.

దీనిపై ఫిర్యాదు రాగానే సిటీ పోలీస్ చీఫ్ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

“ఆలయంలో మరమ్మత్తులు జరుగుతుండడం వల్ల, లోపల పూజలు ఏవీ జరగడం లేదు. ఆలయంలో విగ్రహాలు గానీ, మతపరమైన సాహిత్యం కానీ ఏవీ లేవు” అని పోలీసులు చెప్పారు.

మైనారిటీల ఆస్తులను పర్యవేక్షించే ఈటీపీబీ ట్రస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సయ్యద్ రజా అబ్బాస్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయం

ఫొటో సోర్స్, Ziauddin Ali Shah

ఫొటో క్యాప్షన్, ఆలయంలో మరమ్మతులు జరుగుతున్నందున, అందులో ప్రస్తుతం పూజలు చేయడంలేదు.

ఆలయానికి భద్రత కల్పించాలని డిమాండ్

ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించిన స్థానిక పాలనా యంత్రాంగం, మరమ్మతులు చేసే పనిని ట్రస్టుకు అప్పగించింది.

ఈ దాడితో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, ఆలయానికి తగిన భద్రత కల్పించాలని అబ్బాస్ తన ఫిర్యాదులో కోరారు.

ఆలయంలో ఇంకా పూజలు జరగకపోయినా, పరిసరాల్లో ఆక్రమణలు తొలగించడం, మరమ్మతుల పనులు మొదలవడంతో స్థానిక హిందువులు సంబరాలు చేసుకున్నారు. మార్చి 25న వారు ఆలయం దగ్గర హోలీ కూడా చేసుకున్నారు.

ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన వారు ఆలయం చుట్టు పక్కల ప్రాంతాన్నంతా వస్త్రాల మార్కెట్ లా మార్చేశారు. ఆలయం ప్రహరీ గోడ లోపల, ప్రవేశ ద్వారం దగ్గర కూడా షాపులు తెరిచారు.

నగరంలోని పురాతన ప్రాంతాన్ని మళ్లీ పూర్వం ఉన్నట్లే మార్చడానికి సుజాన్ సింగ్ హవేలీకి ఒక కిలోమీటరు పరిధిలో ఏడు చిన్న ఆలయాలకు మరమ్మతులు చేయించాలని రావల్పిండి అధికారులు నిర్ణయించారు. పురానా ఖిలా దగ్గరున్న ఈ దుర్గా ఆలయం కూడా ఆ ఏడు ఆలయాల్లో ఒకటి.

ఆలయాలపై ఇటీవల జరిగిన దాడులు

గత ఏడాది డిసెంబర్ లో ఖైబర్ పంఖ్తుంఖ్వాకరక్ జిల్లాలో ఒక హిందూ సాధువు సమాధిని ధ్వంస చేశారు.

ఈ ఘటనలో ఒక మౌల్వీ కొంత మందిని రెచ్చగొట్టడంతో వారు ఆ సమాధిని ధ్వంసం చేసి, దానిని అపవిత్రం చేశారు.

ఈ కేసులో స్వయంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు రెండు వారాల్లో ఆ సమాధికి మరమ్మతులు చేయాలని ఆదేశించింది.

ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మౌల్వీని, ఆయనతో ఉన్నవారిని అరెస్ట్ చేశారు. తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాధిని మళ్లీ కట్టించడంతోపాటూ ఒక స్థానిక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది.

హిందువులు, ముస్లింల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే పనిని ఈ సంస్థకు అప్పగించారు.

ఖైబర్ పఖ్తున్ఖ్వా జిల్లాలో హిందూ సాధువు సమాధిపై దాడి చేసిన దృశ్యం. (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, ABDUL MAJEED/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా జిల్లాలో హిందూ సాధువు సమాధిపై దాడి చేసిన దృశ్యం. (ఫైల్ ఫోటో)

మైనారిటీల హక్కులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

"మా దేశంలో నివసించే ఏ మైనారిటీ వారైనా పాకిస్తాన్ పౌరులే. అందుకే వాళ్ల భద్రత మా కర్తవ్యం" అని ఆయన ఈ ఏడాది మొదట్లో టర్కీలోని ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

తాజా ఘటన గురించి హిందూ సమాజం ప్రధాన సంరక్షకులు డాక్టర్ రమేష్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

“పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం హిందువులకు కూడా సమాన పౌర హక్కులు ఉన్నాయి. వాటి ప్రకారం హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా అరుదైన ఘటన జరిగితే , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల హక్కుల పరిరక్షణకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి వాటిని కఠినంగానే పరిగణిస్తాం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)