పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయంపై దాడి, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, హుమైరా కన్వల్, ఉమర్‌దరాజ్ నంగియానా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ దేవాలయంపై కొందరు దాడి చేసి, విగ్రహాలు ధ్వంసం చేశారు.
రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ షరీఫ్‌లో ఆగస్ట్ 4, బుధవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పరిస్థితులను అదుపు చేసేందుకు భారీ పోలీసుల బలగాలను, రేంజర్లను మోహరించారు.
ఈ సంఘటన అనంతరం అక్కడ ఉన్న హిందువులు ఆ ప్రాంతం విడిచి పారిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కొద్దిమంది వ్యక్తులు మతపరమైన ఘర్షణలకు పాల్పడి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసులు తెలిపారు.
వీరిని ప్రేరేపించి, దాడులకు ప్రోత్సహించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ ఘటనలో మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. పోలీసులను మందలించడంతో పాటు ఆలయ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని, దోషులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Pakistan Hindu Council
భయంతో తరలి పోతున్న హిందూ కుటుంబాలు
ఇదిలా ఉండగా, భోంగ్‌లో ఉన్న హిందూ కుటుంబాలు భయంతో ఆ ఊరు విడిచిపెట్టి వెళిపోతున్నారని ఎంపీ, మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ మల్హి ట్వీట్ చేశారు. అలా వదిలి వెళిపోయినవారి గృహాలకు, వస్తువులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం దాడి జరుగుతున్నప్పుడు భయంతో హిందువులు తమ తమ ఇళ్లల్లో దాక్కున్నారని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఓ హిందూ కుటుంబం బీబీసీకి చెప్పింది.
"దాడికి పాల్పడ్డవారు మా దుకాణాలను కూడా ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు కొంతమేరకు వారిని అడ్డుకోగలిగారు. కానీ, వారు కూడా పెద్దగా ఏం చేయలేకపోయారు. రేంజర్లు వచ్చిన తరువాత మేం ఊపిరి పీల్చుకున్నాం. మాకు కొంత ధైర్యం వచ్చింది. మా పిల్లలకు కూడా భద్రత లేదు" అంటూ వారిలో ఒకరు వివరించారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది వ్యక్తులు కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేసి దేవాలయం కిటికీలు, తలుపులు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నట్లు ఈ వీడియోలలో కనిపిస్తోంది.
ఈ ఘటనపై శుక్రవారం పాకిస్తాన్ కోర్టులో విచారణ జరగనుంది.

ఫొటో సోర్స్, GHULAM HASAN MEHER
అసలేం జరిగింది?
ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మొదలైందని జాతీయ అసెంబ్లీ సభ్యుడు, హిందూ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వాంక్వానీని బిబీసీకి చెప్పారు.
"హిందువులు, ముస్లింలు ఇక్కడ కలిసి భోంచేస్తారు. ఈ పద్ధతిని ఆపాలి" అంటూ ఈ ప్రాంతంలో నివసించే ఓ ఆభరణాల వ్యాపారి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారని భోంగ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చెప్పారు.
దాంతో, అక్కడ గొడవ మొదలైంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అసాంఘిక శక్తులు వచ్చి చేరాయి.
కోపంతో ఊగిపోయిన కొందరు దేవాలయంపై దాడికి తెగబడ్డారు. వారిని నిరోధించేంచుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు.

ఫొటో సోర్స్, ANI
దాడిని ఖండించిన భారత్
జరిగిన సంఘటనను భారతదేశం తీవ్రంగా ఖండిస్తోందని, మైనారిటీలకు భద్రత కల్పించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అనంతరం, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, దేయాలయంపై దాడిని ఖండిస్తున్నామని, ఆలయ మరమ్మత్తు బాధ్యతలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు.
"నేరస్థులందరికీ అరెస్ట్ చేయాలని, పోలీసుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ఐజీకి చెప్పాం. ప్రభుత్వం ఆలయాన్ని బాగు చేయిస్తుంది" అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ అధికారిని కలిసి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
దేవాలయంపై, చుట్టుపక్కల ఇళ్లపై దాడులు జరిగినట్లు సోషల్ మీడియాలో చూశామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఇటువంటి దాడులు ప్రమాదకర స్థాయిలో జరుగుతున్నాయని, మైనారిటీలపై, వారి ప్రార్థనా స్థలాలపై దాడులను నిరోధించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతున్నట్లు ఈ సంఘటన నిరూపిస్తోందని ఆయన అన్నారు.
ఘటనపై దర్యాప్తు, విచారణ
సాదికాబాద్‌లోని భోంగ్ షరీఫ్ ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని, ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రహీమ్ యార్ ఖాన్ డీపీఓ అసద్ సర్ఫరాజ్ తెలిపారు.
పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ గురువారం ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్‌ను కలుసుకుని, ఆలయంపై జరిగిన దాడిపై చర్చించారు.
అనంతరం, ఈ విషాద సంఘటన ఆందోళన కలిగిస్తోందంటూ సుప్రీం కోర్టు నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆగస్ట్ 6, శుక్రవారం ఇస్లామాబాద్ కోర్టులో దీనిపై విచారణ జరగనుందని చీఫ్ జస్టిస్ తెలిపారు. కేసు నివేదికతో పాటు విచారణకు హాజరుకావాలని పంజాబ్ ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు. డాక్టర్ వాంక్వానీని కూడా విచారణకు హాజరు కమ్మని పిలిచారు.
భోంగ్‌లో దేవాలయం చుట్టుపక్కల సుమారు 80 హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే, ఆ ప్రాంత జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.
ఇంతకుముందు ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటన వెలుగులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, DR RAMESH
దైవదూషణకు సంబంధించిన కేసు
ప్రస్తుత దాడి, జూలై 23న జరిగిన ఓ సంఘటనతో ముడిపడి ఉందని డాక్టర్ వాంక్వానీ తెలిపారు.
ఒక ఎనిమిదేళ్ల చిన్నారి లైబ్రరీకి వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు స్థానిక మదరసా ఆరోపించింది.
జూలై 24న, 295ఏ కింద ఆ బాలుడిపై కేసు నమోదు చేసామని పోలీసులు చెబుతున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత పోలీసులు ఆ పిల్లాడిని అరెస్ట్ చేశారు.
మైనర్ అయినందువల్ల 295ఏ కింద ఆ పిల్లాడికి కఠిన శిక్ష విధించలేమని, తనను బెయిల్‌పై విడుదల చేయాలని జూలై 28న మేజిస్ట్రేట్ ఆదేశించారు.
బాలుడిని విడుదల చేసిన తరువాత, అక్కడ వాతావరణం తేలికపడిందని, మళ్లీ ఆగస్ట్ 4 సాయంత్రం ఉద్రిక్తతలు నెలకొనడంతో దేవాలయంపై దాడికి దిగారని డాక్టర్ వాంక్వానీ తెలిపారు.
ఈ ఘటనకు పాల్పడినవారిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లో హిందూ యువతుల బలవంతపు మతమార్పిడి
- ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? అసలు ఆ ప్రయత్నాలేమైనా జరిగాయా
- పాకిస్తాన్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టినప్పుడు... 'అపరాధం, పాపం' అని ఆగ్రహించారు
- దిలీప్ కుమార్: మధుబాలను ఆయన నుంచి ఎలా విడదీశారు?
- జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- 'అణ్వాయుధాలు భారత్ కంటే చైనా, పాకిస్తాన్ల దగ్గరే ఎక్కువున్నాయి'
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









