దిలీప్ కుమార్: మధుబాలను ఆయన నుంచి ఎలా విడదీశారు?

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Twitter/@TheDilipKumar

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది 1999నాటి సంగతి. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఒక ఫోన్ వచ్చింది. అది అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి.

‘‘ఆయన మీతో వెంటనే మాట్లాడాలి అంటున్నారు’’ అని ఫోన్ గురించి నవాజ్ షరీఫ్‌కు అధికారులు చెప్పారు.

దీంతో వెంటనే షరీఫ్ ఫోన్ తీసుకున్నారు.

‘‘ఒకవైపు లాహోర్‌లో మాకు స్వాగతం పలికారు. మరోవైపు కార్గిల్‌లో మా భూమిని ఆక్రమించారు. ఇదేమీ బాగోలేదు’’ అని ఫోన్‌లో వాజ్‌పేయి చెప్పారు.

‘‘మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొంచెం సమయం ఇవ్వండి. మా సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్‌తో నేను మాట్లాడతా. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే మీకు మళ్లీ ఫోన్ చేస్తాను’’ అని వాజ్‌పేయితో నవాజ్ షరీఫ్ అన్నారు.

వాజ్‌పేయీ, నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Hindustan Times/gettyimages

ఫొటో క్యాప్షన్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్

‘‘అయితే, మీతో ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆయన మన మాటలు వింటున్నారు. నా పక్కనే కూర్చున్నారు. ఆయనకు ఫోన్ ఇస్తున్నా.. మీరు మాట్లాడండి’’ అని షరీఫ్‌తో వాజ్‌పేయి అన్నారు.

ఈ సంగతులన్నీ పాక్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమ్మద్ కసూరీ తన ఆత్మకథ ‘‘నైదర్ ఎ హాక్.. నార్ ఎ డవ్’’లో రాసుకొచ్చారు.

తనతో ఆనాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని నవాజ్ షరీఫ్‌ వెంటనే గుర్తుపట్టారు. ఆయనే కాదు.. యావత్ భారతావని ఆయన్ను గుర్తుపడుతుంది. ఆయనే మహానటుడు దిలీప్ కుమార్. భారత్, పాకిస్తాన్‌లోని సినీ ప్రియులు ఆయన్ను తరతరాలుగా ఆరాధిస్తున్నారు.

‘‘సాహెబ్.. మీ నుంచి మేం ఇలాంటివి ఆశించడం లేదు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు వస్తే, భారత ముస్లింల పరిస్థితి జటిలంగా మారిపోతుంది. ఇక్కడ వారు తమ ఇళ్లను వదిలిపెట్టి రావడం చాలా కష్టం. పరిస్థితులను అదుపు చేయడానికి ఏదోఒకటి చేయండి’’ అని ఆనాడు షరీఫ్‌తో దిలీప్ కుమార్ అన్నారు.

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Source Bloomsbury books

మౌనమే భాషగా...

తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దిలీప్ కుమార్ 63 సినిమాలే చేశారు. అయితే హిందీ సినిమాను ఆయన మరో మెట్టు పైకి ఎక్కించారు.

ముంబయిలోని ఖాల్సా కాలేజీలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్ కలిసి చదువుకున్నారు. అక్కడి పార్సీ అమ్మాయిలతో రాజ్ కపూర్ చలాకీగా మాట్లాడేవారు. కానీ దిలీప్ కుమార్‌కు కాస్త బిడియం ఎక్కువ. అమ్మాయిలతో గుర్రపు బండి ఎక్కాల్సి వస్తే, ఆయన ఒక మూలకు జరిగిపోయేవారు.

అయితే, ఆ మౌనం, ఆ బిడియంతో ఆయన భారత సినీ ప్రియులను పీకల్లోతు ప్రేమలోకి దించారు. కొన్ని వేల పదాలతో చెప్పలేని భావాలను ఆయన మౌనంతో పలికించేవారు.

దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్‌ కపూర్

ఫొటో సోర్స్, SAIRA BANO

ఫొటో క్యాప్షన్, దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్‌ కపూర్

ఎప్పుడు ఏం చేయాలో తెలుసు

1944లో దిలీప్ కుమార్ తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పట్లో సినీ పరిశ్రమపై పార్సీ ప్రభావం ఎక్కువగా ఉండేది. నటనలోనూ అది కనబడేది. ప్రతి భావానికీ నటులు పదాలు వెతుక్కునేవారు. దిలీప్ కుమార్ మౌనంతో భావాలు పలికించేవారని, వెండి తెరకు ఈ తరహా నటనను పరిచయం చేసిన తొలి వ్యక్తి ఆయనేనని ప్రముఖ రచయిత సలీమ్ వ్యాఖ్యానించారు.

‘‘ఆయన కొన్నిసార్లు కావాలనే కాసేపు మౌనంగా ఉండిపోయేవారు. ప్రేక్షకులపై ఆ మౌనం చాలా ప్రభావం చూపించేది’’

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, TWITTER/DILIP KUMAR

ఉదాహరణకు ‘‘మొగలే ఆజమ్’’ సినిమాను తీసుకోండి. దీనిలో పృథ్వీరాజ్ కుమార్ దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడుతుంటారు. కానీ దిలీప్ కుమార్ డైలాగులు చాలా మృదువుగా చెబుతుంటారు. స్వరం పెంచకుండానే దిలీప్ కుమార్ ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్నారు.

దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్.. ఈ ముగ్గురూ భారత సినీ పరిశ్రమకు త్రిమూర్తుల్లాంటివారు. అయితే, మిగతా ఇద్దరిలో కనిపించని భిన్నత్వం, విశిష్టత మనం దిలీప్ కుమార్‌లో చూడొచ్చు. ఆయన విలక్షణ నటుడు.

రాజ్ కపూర్.. చార్లీ చాప్లెన్, దేవానంద్.. గ్రెగరీ పెక్‌ల ప్రభావం నుంచి బయటకు రాలేకపోయారు అని ప్రముఖ రచయిత సలీమ్ వ్యాఖ్యానించారు.

దిలీప్ కుమార్, మధుబాలా

ఫొటో సోర్స్, MUGHAL-E-AZAM

దేవికా రాణి తీసుకొచ్చారు

నటి దేవికా రాణిని కలిసేందుకు వచ్చిన ఓ అవకాశం దిలీప్ కుమార్ జీవితాన్నే మార్చేసింది. హిందీ సినిమాలో అప్పట్లో దేవికది పెద్దపేరే. ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. అయితే, చిత్ర పరిశ్రమకు అంతకంటే విలువైన బహుమతినే ఆమె ఇచ్చారు. పెషావర్‌కు చెందిన యూసఫ్ ఖాన్‌ను దిలీప్ కుమార్‌గా మార్చి, ఆమె వెండి తెరకు పరిచయం చేశారు.

ఆనాడు బాంబే టాకీస్‌లో షూటింగ్ చూసేందుకు దిలీప్ కుమార్ వచ్చారు. షూటింగ్ అనంతరం దేవికను దిలీప్ కలిశారు. మాటల్లో మాటగా.. ‘‘నీకు ఉర్దూ వచ్చా?’’ అని దిలీప్‌ను దేవిక ప్రశ్నించారు. వెంటనే హా వచ్చని దిలీప్ తలూపారు. ఆ తర్వాత ‘‘నటనపై ఆసక్తి ఉందా’’అని దేవిక అడిగారు. ఆ తర్వాత ఆయన సినీ ప్రస్థానం అందరికీ సుపరిచితమే.

నెహ్రూతో దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, SAIRA BANO

ఫొటో క్యాప్షన్, నెహ్రూతో దిలీప్ కుమార్

దిలీప్ కుమార్ ఎలా అయ్యారంటే..

రొమాంటిక్ హీరోకు ‘‘యూసఫ్ ఖాన్’’ పేరు అంతగా బాగోదని దేవికా రాణి భావించారు.

ఏవైనా మంచి పేర్లు చెప్పమని సలహా అడగ్గా... అక్కడే ఉన్న ప్రముఖ హిందీ రచయిత నరేంద్ర శర్మ మూడు పేర్లు చెప్పారు. అవి ‘‘జహంగీర్, వాసుదేవ్, దిలీప్ కుమార్’’ వీటిలో దిలీప్ కుమార్‌నే యూసఫ్ ఎంచుకున్నారు.

మరోవైపు ఈ పేరు అయితే, తను ఏం చేస్తున్నానో తన తండ్రికి కూడా తెలియకుండా ఉంటుందని దిలీప్ కుమార్ భావించారు. ఎందుకంటే ఆయన తండ్రికి సినిమాలు అసలు నచ్చేవికాదు. నటులను చూస్తే, ‘‘నౌటంకీవాలా’’అంటూ ఆయన హేళన చేసేవారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన ప్రస్థానంలో కేవలం ఒకసారి మాత్రమే దిలీప్ కుమార్ ముస్లిం యువకుడి పాత్ర పోషించారు. అదే ‘‘మొఘల్ ఎ ఆజం’’

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, SAIRA BANO

సితార్ శిక్షణ

ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దిలీప్ కుమార్ నటించింది 63 సినిమాలే. అయితే, ప్రతి పాత్రలోనూ ఆయన జీవించేవారు.

కోహినూర్ సినిమాలో ఒక పాట కోసం ఆయన ఏకంగా ఉస్తాద్ అబ్దుల్ హలీమ్ జాఫర్ దగ్గర సితార్ వాయించడం నేర్చుకున్నారు.

‘‘అది కొంచెం కష్టంగా ఉండేది. తీగల వల్ల నా చేతి వేళ్లు కూడా కోసుకుపోయాయి’’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో దిలీప్ కుమార్ చెప్పారు.

సంగీత దర్శకుడు సలీల్ చౌధరి ఓ సినిమాలో ఓ పాటను పాడమని దిలీప్ కుమార్‌ను అడిగారు. దీని కోసం దిలీప్ కుమార్ ప్రత్యేక సంగీత శిక్షణ కూడా తీసుకున్నారు. అందుకే ఆయన ‘‘అత్యుత్తమ మెథడ్ యాక్టర్’’అని సినీ ప్రముఖుడు సత్యజిత్ రే కితాబిచ్చారు.

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Source Bloomsbury books

విషాదానికి చిరునామా

చాలా మంది నటీమణులతో రొమాంటిక్ సినిమాల్లో దిలీప్ కుమార్ నటించారు. చాలామంది నటీమణులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే, ఇవేమీ పెళ్లివరకు ఆయన్ను తీసుకెళ్లలేదు. బహుశా, తన నిజ జీవితంలో గుండె పగిలిన ఘటనలే తనను ‘‘ట్రాజిడీ కింగ్’’గా మార్చాయేమో.

తను నటించిన చాలా సినిమాల్లో దిలీప్ కుమార్ చనిపోయేవారు. కొన్నిసార్లు ఆయన నిజంగానే చనిపోయారా? అన్నట్లు ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు.

‘‘అలా ప్రతిసారీ చనిపోయే పాత్రలు చేయడంతో నాకు కుంగుబాటు వచ్చింది. దీని కోసం లండన్ వెళ్లి వచ్చా. ఆ తర్వాత కొంచెం హాస్యం ఎక్కువగా ఉండే కోహినూర్, అజాద్, రామ్ అండ్ శ్యామ్ లాంటి సినిమాలు ఎంచుకున్నాను’’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

దిలీప్ కుమార్, మధుబాలా

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN

మధుబాలతో అలా..

అత్యధికంగా నర్గీస్‌తో దిలీప్ కుమార్ ఏడు సినిమాలు చేశారు. కానీ దిలీప్‌కు సరిజోడి ఎవరంటే.. అందరూ మధుబాలా పేరే చెబుతారు.

మధుబాల అంటే తనకు చాలా ఇష్టమని తన జీవిత చరిత్ర ‘‘ద సబ్‌స్టాన్స్ అండ్ ద షాడో’’లో దిలీప్ కుమార్ వెల్లడించారు. ‘‘మధుబాలలో కళ ఉట్టిపడుతుండేది. తను చాలా చలాకీ అమ్మాయి. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలదు’’ అని ఆయన ఆయన చెప్పారు.

అయితే, మధుబాల తండ్రి ఈ ప్రేమకు అడ్డుపుల్ల వేశారు. ఆ విషయాన్ని మధుబాల చెల్లి మాధుర్ భూషన్ స్వయంగా అంగీకరించారు.

‘‘దిలీప్ తన కంటే పెద్దవాడని నాన్న చెప్పేవారు. కానీ వారిద్దరూ చూడచక్కగా ఉండేవారు. మంచి జంటలా అనిపించేవారు. కానీ దిలీప్‌ను మరిచిపోమ్మని అక్కను నాన్న వారించేవారు’’

‘‘అయితే, అక్క వినేది కాదు. తనంటే ఇష్టమని గట్టిగా చెప్పేది. ఓ సినిమా విషయంలో దిలీప్, నాన్నల మధ్య వివాదం మొదలైంది. అది కోర్టు వరకు వెళ్లింది’’ అని మధుబాల సోదరి చెప్పారు.

భార్యతో దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Twitter/@TheDilipKumar

ఫొటో క్యాప్షన్, భార్యతో దిలీప్ కుమార్

‘‘ఆ సమయంలోనే మనం పెళ్లి చేసుకుందామని అక్కని దిలీప్ అడిగారు. కానీ ముందు మా నాన్నకు సారీ చెప్పమని అక్క అంది. ఆ వివాదం బాగా ముదిరిపోయింది’’

ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లిందంటే.. మొగలై ఆజం సినిమా షూటింగ్ సమయంలో దిలీప్, మధుబాలా అసలు మాట్లాడుకునేవారు కాదు.

ఆ తర్వాత సైరా బానును దిలీప్ పెళ్లి చేసుకున్నారు. కానీ మధుబాల ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. చివరగా ఓ సారి తనను చూడటానికి రమ్మని మధుబాల.. దిలీప్‌కు సందేశం పంపారు.

ఆయన వచ్చేసరికే మధుబాల బాగా చిక్కిపోయారు. ఆమెను దిలీప్ కుమార్ అలా చూడలేకపోయారు. ఆయన్ను చూసిన తర్వాత అతి కష్టంపై మధుబాల మొహంపై చిరునవ్వు మెరిసింది.

‘‘మా యువరాజుకు యువరాణి దొరికింది. నాకదే చాలు’’ అంటూ దిలీప్ కళ్లలోకి చూసి ఆనాడు మధుబాల చెప్పారు. 1969 ఫిబ్రవరి 23న 35ఏళ్ల వయసులో ఆమె చనిపోయారు.

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, VIMAL THAKKER

ఆ స్టైలే వేరు...

దిలీప్ కుమార్ నదుటిపై రింగులా ఓ జుట్టు పోగు ఉండేది. అప్పట్లో ఈ స్టైల్ అంటే కుర్రకారు పిచ్చేక్కిపోయేవారు. ‘‘ఆయనలానే చాలా మంది జుట్టు రింగులు తిప్పేవాళ్లు. ఆయనలానే బట్టలు వేసుకునేవాళ్లు. చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ఆయన్ను అభిమానులు అనుకరించేవారు’’ అని దిలీప్ కుమార్ జీవిత చరిత్ర రాసిన మేఘ్‌నాథ్ దేశాయ్ చెప్పారు.

దిలీప్ కుమార్‌కు సాహిత్యంపైనా ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఉర్దూ సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, పష్తో, పంజాబీ భాషలపై ఆయనకు మంచి పట్టుంది. ఆయనకు మరాఠీ, భోజ్‌పురి, పర్షియన్‌లతోనూ పరిచయముంది.

దిలీప్ కుమార్‌కు మొదట్లో ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఖాల్సా కాలేజీ ఫుట్‌బాల్ జట్టులో ఆయన సభ్యుడు కూడా. ఆ తర్వాత క్రికెట్‌పైనా ఆయనకు ఇష్టం పెరిగింది. బాడ్మింటన్ కూడా ఆడతారు. ప్రముఖ సంగీత విద్వాంసులు నౌషద్‌తో ఆయన ఎక్కువగా బాడ్మింటన్ ఆడేవారు.

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Source Bloomsbury books

చాలా అవార్డులు వచ్చాయి

1991లో దిలీప్ కుమార్‌ను పద్మ భూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. 2016లో ఆయనకు పద్మ విభూషణ్ వచ్చింది. ముంబయిలో ఆయన ఇంటికి వెళ్లి అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అవార్డును అందించారు.

1995లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు దిలీప్ కుమార్‌ను వరించింది. 1997లో పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఇ-ఇమ్తియాజ్ ఆయనకు దక్కింది. దీన్ని తీసుకునేందుకు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి ఆయన అనుమతి కూడా తీసుకున్నారు.

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, Hindustan Times/gettyimages

దిలీప్ కుమార్‌కు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘‘మొగలై ఆజమ్’’. ఈ సినిమాను తను అలహాబాద్‌లో చదువుకున్నప్పుడు చూశానని అమితాబ్ బచ్చన్ చెప్పారు.

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌తో ఎలాంటి సంబంధంలేని ఆయన ఇక్కడి యాసలో మాట్లాడటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది’’అని అమితాబ్ చెప్పారు. వీరిద్దరూ కలిసి శక్తి సినిమాలో నటించారు.

ఈ సినిమాను చూసిన రాజ్‌ కపూర్.. "ఎప్పటికీ నువ్వే మహానటుడివి’’ అంటూ దిలీప్ కుమార్‌కు కితాబిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)