దిలీప్ కుమార్: 'మనం నటుల్ని ఆరాధిస్తాం, నటులు దిలీప్‌ను ఆరాధిస్తారు'

సాంఘిక సినిమాలలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన నిస్సహాయుడైన నిరుద్యోగి, బిడియస్తుడు, భగ్నప్రేమికుడు వంటి పాత్రల ద్వారా వన్నె కెక్కాడు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దిలీప్ కుమార్
    • రచయిత, ఎమ్బీఎస్ ప్రసాద్
    • హోదా, బీబీసీ కోసం

దిలీప్ కుమార్ వెళ్లిపోయారు. మనం నటుల్ని ఆరాధిస్తాం, నటులు దిలీప్‌ను ఆరాధిస్తారు. ఆయన నటులకు నటుడు. అశోక్ కుమార్, మోతీలాల్, సొహ్రాబ్ మోదీ, పృథ్వీరాజ్ వంటి మనకెందరో ఉత్తమ నటులున్నారు. వారెవ్వరినీ ఇలా వర్ణించకుండా దిలీప్‌నే యిలా అనడానికి కారణం అతను స్టార్ కూడా.

నటనతో స్టార్‌డమ్ అందుకున్న దిలీప్‌ను అనుకరించని, అనుసరించని, కనీసం అధ్యయనం చేయని భారతీయ (పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా కలుపుకోవచ్చు) సినీనటుడెవ్వడూ మొన్నమొన్నటి దాకాఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో

ఇక్కడ 'సినీ' అని నొక్కి వక్కాణించాలి. ఎందుకంటే భారతీయ సినిమాలో తొలి తరం తారలు నాటకరంగం నుంచి వచ్చినవారే. తారలే కాదు, సాంకేతిక గణమూ అక్కడివారే. అందుచేత సినిమా అంటే తెర మీద చూపే నాటకం అన్నట్లుగా అయిపోయింది. హావభావాలు, వాచికం అంతా అధిక మోతాదులోనే వుండేది.

దిలీప్ నాటకాల్లోంచి రాలేదు. పౌరాణిక చిత్రాల్లో వేయలేదు. సాంఘిక సినిమాలలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన నిస్సహాయుడైన నిరుద్యోగి, బిడియస్తుడు, భగ్నప్రేమికుడు వంటి పాత్రల ద్వారా వన్నె కెక్కాడు.

''ఆన్'', ''కోహినూర్'', ''ఆజాద్'' వంటి జానపద చిత్రాల్లో తప్ప అతను ప్రత్యర్థిని చావగొట్టి తన ప్రేమను సఫలం చేసుకున్న సందర్భాలు తక్కువ. మొహమాటానికి, మర్యాదకు పోయి తన ప్రేయసిని వదులుకుని, ఆమెను మరవలేక నిరంతరం బాధతో కుమిలే పాత్రలకు అతను పెట్టింది పేరయ్యాడు.

సాధారణంగా ఇలాంటి పాత్రల్లో తెగ మెలోడ్రామా గుప్పించేయవచ్చు. కానీ, అతను హాలీవుడ్ నటుల ధోరణిలో 'అండర్‌ప్లే' చేశాడు. అది ఆనాటి యువతరాన్ని వెర్రెక్కించింది. విమర్శకులను మెప్పించింది.

అతని పాత్రలకు, ఆ పాత్రలను అతను పోషించిన విధానానికి ముగ్ధులైన నారీ ప్రేక్షకులే కాదు, తనతో నటించిన హీరోయిన్లు కూడా దాసోహమన్నారు.

నటనలో ప్రొఫెషనల్‌గా ఉండటంలో దిలీప్‌ను మించిన వారు కనిపించరు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెషనల్‌గా ఉండటంలో దిలీప్‌ను మించిన వారు కనిపించరు

నటనకు ప్రతిరూపం

దిలీప్ పాతికేళ్ల పాటు హిందీ సినిమాను ఏలాడు. నువ్వేమైనా పెద్ద హీరోవా? అనాలంటే నువ్వేమైనా దిలీప్ కుమార్‌ని అనుకుంటున్నావా? అనడం పరిపాటిగా వుండేది. ఎవరైనా నటుడు కాస్త సీరియస్‌గా నటిస్తే 'అదిగో దిలీప్‌ను అనుకరించబోయి భంగపడ్డాడు' అని సినీసమీక్షకులు ఎద్దేవా చేసేవారు.

అతన్ని దృష్టిలో పెట్టుకునే కథలు తయారయ్యేవి. అతని హెయిర్‌స్టయిల్, డైలాగ్ డెలివరీ, నడిచే తీరు, దించిన తలను క్రమంగా పైకి ఎత్తే పద్ధతి, సిగ్గుపడుతూ చిందించే మందహాసం - ఇలా ప్రతీదీ లెజెండరీ అయిపోయాయి.

దీని కోసం అతను ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ వేసుకోలేదు. వైవిధ్యం కోసమంటూ రకరకాల మేకప్‌లలో కనబడలేదు. జస్ట్ బయట ఎలా వుంటాడో, తెర మీదా అలాగే వున్నాడు. జనాలు అతన్ని అలాగే ఆరాధించారు.

ఇది అహంకారానికి దారి తీసి, మనిషి పతనానికి కారణమవుతుందని గ్రహించగలిగిన వివేకి అతను. అందువలన తరచుగా మానసిక వికలాంగ బాలల నిలయాలకు వెళ్లి వాళ్ల మధ్య కూర్చునేవాడు. వాళ్లకు ఇతనో స్టార్ అని వాళ్లకు తెలియదుగా, ఒకడు ముక్కు పట్టుకుని లాగేవాడు, మరోడు చెవి పీకేవాడు. 'నువ్వు మామూలు మనిషివే' అని వాళ్లు చెపుతున్నట్లు ఇతను ఫీలయ్యేవాడు.

వ్యక్తిగతంగా దిలీప్ కుమార్ సంస్కారవంతుడు. వృత్తిపరంగా అతనికి అనేకమందితో పేచీలు వచ్చాయి. కథలో మార్పులు చేయమనేవాడు. చేయకపోతే తప్పుకునేవాడు. డైరక్షన్‌లో వేలు పెట్టేవాడు. అతను వేసిన సినిమాల కంటె వదులుకున్న సినిమాలు అయిదారు రెట్లుంటాయి.

'ఫలానా పాత్ర దిలీప్ వేయాల్సింది, అతను నిరాకరించడంతో ఫలానావారికి దక్కి ఎంతో పేరు తెచ్చింది.' అని అనేక సందర్భాల్లో వినబడుతుంది.

మధ్యలో ఆగిపోయిన సినిమాలూ వున్నాయి. సాధారణంగా అతని సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. అందువలన పర్‌ఫెక్ట్‌గా వుండాలని, ఫ్లాపయితే నిర్మాత దెబ్బ తింటాడని దిలీప్ తపించేవాడు. ఈ సందర్భంగా వాదోపవాదాలు సహజం.

అయితే గుర్తించవలసిన దేమిటంటే ఈ వృత్తిపరమైన వివాదాలు అతను వ్యక్తిగతంగా తీసుకోలేదు. వాళ్లందరితోనూ సత్సంబంధాలు కొనసాగించాడు. సాటి నటీనటులకు కూడా గౌరవమిచ్చి గౌరవం పుచ్చుకున్నాడు.

నిర్మాతకు నష్టం కలగ కూడదని దిలీప్ భావించే వారు

ఫొటో సోర్స్, TWITTER@THEDILIPKUMAR

ఫొటో క్యాప్షన్, నిర్మాతకు నష్టం కలగ కూడదని దిలీప్ భావించే వారు

హుందాతనానికి మారు పేరు

ఇదే కాదు, తనతో ప్రేమలో పడిన హీరోయిన్లతో పొరపొచ్చాలు వచ్చినా ఎప్పుడూ అల్లరి పడలేదు. తర్వాత కూడా హుందాగానే వ్యవహరించాడు. ''నయా దౌర్'' సినిమాకు తొలి హీరోయిన్ మధుబాల. ఔట్‌డోర్‌లో షూటింగు చేయడం గురించి మధుబాల తండ్రి పేచీ పెడితే, నిర్మాత బిఆర్ చోప్రా కేసు పెట్టాడు.

మధుబాల తన ప్రేయసి అయినా న్యాయం నిర్మాత పక్షాన ఉంది కాబట్టి దిలీప్ అతనికి అనుకూలంగానే సాక్ష్యం చెప్పాడు. దాంతో ''మొఘలే ఆజం'' సినిమా షూటింగు టైములో హీరోహీరోయిన్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అయినా తెరపై ఎంతటి వలపు కురిపించారో చూడండి. అదీ దిలీప్ (మధుబాలది కూడా) ప్రొఫెషనలిజం.

తమ వలన సినిమా, తద్వారా నిర్మాత నష్టపోకూడదని అతని ఫిలాసఫీ.

మరి అటువంటి నటుడు తన 54 ఏళ్ల కెరియర్‌లో 60 ప్లస్ సినిమాలు మాత్రమే వేయడమేమిటి? ఎందుకంటే దిలీప్‌తో వేగడం కష్టం. హాలీవుడ్ నటుల్లా నటించడమే కాదు, వాళ్ల పద్ధతులు కూడా అలవర్చుకున్నాడితను. సెట్స్‌కి ఆలస్యంగా వచ్చేవాడు. వచ్చినా మూడ్ రాలేదంటూ గంటలు గడిపేసేవాడు. తనతో పాటు వున్న నటీనటులు ఎలా నటించాలో సూచించేవాడు. సీన్లు ఇంప్రొవైజ్ చేద్దామంటూ షూటింగు కాన్సిల్ చేయించి, డిస్కషన్ అనేవాడు. ఇవన్నీ తట్టుకున్నవాళ్లే అతనితో సినిమాలు తీసేవారు.

పరాయి వాళ్ల సినిమాకే ఇంత చేసినవాడు తన సొంత సినిమాకు ఎంత చేస్తాడు? ''గంగా జమునా'' సినిమాకు డైరక్టరుగా నితిన్ బోస్ పేరు కనబడినా, నిజానికి అతన్ని పక్కకు తోసేసి, ఇతనే డైరక్టు చేసేశాడు.

సినిమా సూపర్ హిట్ అయినా దర్శకత్వం, నిర్మాణం వంటి రెండు భారీ బాధ్యతలు నిర్వహించడం కష్టమని అర్థమై ఆ తర్వాత దిలీప్ సొంత సినిమా తీయలేదు.

అయినా వేరే వాళ్ల కోసం దర్శకత్వం నిర్వహిస్తానంటూ చాలా ఏళ్ల క్రితం ''చాణక్య'' అని తలపెట్టాడు. అది మూలపడిన చాన్నాళ్లకు ''కళింగ'' అని మొదలుపెట్టి ఆపేశాడు.

అతని పాత్రలకు, ఆ పాత్రలను అతను పోషించిన విధానానికి ముగ్ధులైన నారీ ప్రేక్షకులే కాదు, తనతో నటించిన హీరోయిన్లు కూడా దాసోహమన్నారు.

ఫొటో సోర్స్, TWITTER@NFAIOFFICIAL

ఫొటో క్యాప్షన్, పాతికేళ్లపాటు దిలీప్ హిందీ సినిమాను ఏలారు.

ట్రాజెడీ కింగ్

అతని సాటి నటులు రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ దర్శకనిర్మాతలుగా పేరు తెచ్చుకున్నా ఆ రంగంలో దిలీప్ రాణించకపోవడానికి యీ విధమైన స్వభావమే కారణం.

అయితే అతను నటుడిగా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు. తనపై 'ట్రాజెడీ కింగ్' ముద్ర పడిపోయి, తనకు వచ్చే పాత్రలు పరిమితమై పోతున్నాయని గ్రహించి, ''కోహినూర్'' లో హాస్యం రంగరించిన పాత్ర తీసుకున్నాడు.

''లీడర్''లో కూడా హాస్యనటన ప్రదర్శించాడు కానీ సినిమాకు హైప్ మరీ ఎక్కువై పోయి, ఫ్లాపయింది.

సాధారణంగా నటులలో ఒక లక్షణాన్ని మనం గమనిస్తూంటాం. తొలి దశలో ఆత్మవిశ్వాసంతో అండర్ ప్లే చేస్తారు. కానీ వయసు వస్తున్నకొద్దీ, కొత్తతరం వాళ్లతో పోటీ పడలేకపోతున్నామని భయం వేసి, తమపై తమకు నమ్మకం సడలి, ఓవరాక్టింగు చేస్తూ వుంటారు.

కానీ దిలీప్‌లో అటువంటి మార్పు రాలేదు. తనతో కమ్మర్షియల్ దర్శకనిర్మాతలు పెద్ద సినిమాలు తీసే రోజుల్లో తపన్ సిన్హా వంటి విభిన్న దర్శకుడు తక్కువ బడ్జెట్లో ''సగినా మహతో'' (1970) బెంగాలీ సినిమా ఆఫర్‌తో వస్తే ఆదరించాడు. తన ఏకైక పరభాషా చిత్రంలో నటించాడు.

సగినా అనే గిరిజన తేయాకు కార్మికుడు ఎలా కార్మిక నాయకుడయ్యాడో, టీ ఎస్టేటు యజమానుల మోసానికి ఎలా గురయ్యాడో చూపే ఆ సినిమాలో దిలీప్ అద్భుతమైన నటన కనబర్చాడు. దాని హిందీ వెర్షన్ ''సగినా'' 1974లో విడుదలైంది. పెద్దగా ఆడలేదు.

1976లో వచ్చిన ''బైరాగ్''లో దిలీప్ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం వేసి నటనకు పేరు తెచ్చుకున్నాడు. కానీ సినిమా ఫ్లాపయింది. హీరోగా తన రోజులు ముగిశాయి అని గ్రహించి, ఐదు సంవత్సరాల పాటు తెరమరుగై 1981లో తన 59వ ఏట కారెక్టరు యాక్టరుగా ''క్రాంతి''తో పునఃప్రవేశం చేశాడు.

అక్కణ్నుంచి చివరి సినిమా ''ఖిల్లా'' (1998) వరకు 17 ఏళ్ల పాటు అలాటి పాత్రల్లో రాణించాడు. కారెక్టరు యాక్టరంటే రామూ కాకా వంటి పాత్రలు కావు. జితేంద్ర, ఋషి కపూర్, అమితాబ్, రాజ్ బబ్బర్, సంజయ్ దత్, అనిల్ కపూర్, గోవిందా.. వంటి యువహీరోలతో పోటీ పడే ప్రధాన పాత్రలు!

''పైగామ్'' (1959) సినిమాలో అన్నదమ్ములుగా పోటీ పడి నటించిన దిలీప్, రాజ్ కుమార్ మళ్లీ ''సౌదాగర్'' (1991)లోనే కలిసి నటించారు. వాళ్లు ప్రత్యర్థులుగా తెరపై విశ్వరూపం చూపడంతో తారాగణమంతా కొత్తదే అయినా సినిమా సూపర్ హిట్ అయింది. అదీ స్టార్ పవర్!

దిలీప్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు తయారయ్యేవి

ఫొటో సోర్స్, TWITTER@AAPKADHARAM

ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్

శివసేన వివాదం

1998లో పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి నిశాన్ ఎ ఇమ్తియాజ్ అవార్డు ఇవ్వబోయింది. అది తీసుకుంటే నీకు దేశభక్తి లేదన్నట్లే అంది శివసేన.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్లు, కళాకారుణ్ని అన్ని దేశాల వాళ్లూ నెత్తిన పెట్టుకుంటారు. ముస్లింగా పుట్టినా దిలీప్ హిందూ పేరుతోనే చలామణీ అయ్యాడు. ఫిరోజ్ ఖాన్ సోదరుడు సంజయ్ అసలు పేరు అబ్బాస్ ఖాన్. సంజయ్ అనే పేరుతో సినిమాల్లో పేరు తెచ్చుకుని ఆ తర్వాత దాన్ని సంజయ్ ఖాన్‌గా మార్చుకున్నాడు. దిలీప్ అలాటి పనేమీ చేయలేదు.

ఈ వ్యాసానికి శీర్షికగా దిలీప్ అసలు పేరు యూసఫ్ ఖాన్ అని పెట్టుంటే ఎవరికీ తెలిసేది కాదు. అంతగా హిందూ పేరుతో మమేకమయ్యాడు దిలీప్. సినిమాల్లో వేసిన పాత్రల్లో రామభక్తుడిగా, శివభక్తుడిగా వేసినవి చాలా ఉన్నాయి. సొంతంగా తీసిన సినిమాకు కూడా గంగా-జమునా అనే పెట్టాడు.

1947లో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ తరలిపోయి వుంటే అక్కడ ఏకచ్ఛత్రాధిపత్యం వుండేది. ఇక్కడైతే అనేక మంది హీరోలతో పోటీ పడాల్సి వచ్చింది. భారత ప్రభుత్వానికి ఎప్పుడూ అండగానే నిలిచి విరాళాలు సేకరించాడు.

నెహ్రూ, ఇందిరలకు అభిమానిగా కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చాడు. శివసేన పేచీతో అపుడు వద్దనుకున్నాడు. పై ఏడాది పాకిస్తాన్ మళ్లీ ఆఫర్ చేసినపుడు ప్రధాని వాజపేయి చొరవతో అంగీకరించాడు.

పెద్దగా చదువుకోకపోయినా, దిలీప్ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. కవిత్వమన్నా, సంగీతమన్నా చాలా ఇష్టం. అతని సినిమాలన్నీ సంగీత ప్రాధాన్యత వున్నవే.

దక్షిణాది సినిమాల రీమేక్‌లు చాలా వాటిల్లో నటించాడు. దక్షిణాది నిర్మాతలతో సన్నిహితంగా వుండేవాడు. తెలుగు దర్శకులు ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు, తాపీ చాణక్య, భీమ్ సింగ్, రాఘవేంద్రరావు, బి. గోపాల్, కె. బాపయ్యల దర్శకత్వంలో నటించాడు.

98 ఏళ్ల ఫలవంతమైన జీవితం గడిపి, వృద్దాప్య సమస్యలతో మరణించిన మహా కళాకారుడు దిలీప్ కుమార్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)